• facebook
  • whatsapp
  • telegram

పేద విద్యార్థులకు ప్రామాణిక సాంకేతిక డిగ్రీ

ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ - ఏపీ ఆర్‌జీయూకేటీ సెట్‌ 2021 ప్రకటన విడుదల

కనీస అర్హత పదో తరగతి

 

 

పదో తరగతి తర్వాత కొందరు విద్యార్థులు ఆసక్తి మేరకు లేదా వెంటనే ఉద్యోగాలు సాధించుకోవాలనే లక్ష్యంతో సాంకేతిక విద్యా కోర్సుల్లో చేరుతుంటారు. కానీ ఇంజినీరింగ్ కోర్సును డిగ్రీ స్థాయిలో చేయాలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దీంతో ప్రతిభావంతులైన గ్రామీణ పేద విద్యార్థులు ఆ దిశగా చదువులు కొనసాగించేందుకు సాహసించడం లేదు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆర్జీయూకేటీ-ట్రిపుల్ ఐటీలను నెలకొల్పింది. ఆర్థిక స్థోమత లేని గ్రామీణ అభ్యర్థుల సాంకేతిక విద్య కలను సాకారం చేయడమే ఈ విద్యాసంస్థల ఏర్పాటు లక్ష్యం. టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్‌తో పాటు ఇంజినీరింగ్‌ విద్యను ఇంటిగ్రేటేడ్ విధానంలో రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ (ఆర్‌జీయూకేటీ) కింద ఉన్న ట్రిపుల్ ఐటీ (ఇంట‌ర్నేష‌న‌ల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)లు అందిస్తున్నాయి. ఇందులోకి అడ్మిషన్లను ఈ సంవత్సరం ఆర్‌జీయూకేటీ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌- 2021 కల్పిస్తున్నారు. ఈ మేరకు ప్రకటన వెలువడింది. ఈ పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా నూజివీడు, ఆర్‌కే వ్యాలీ-ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళంలో ఉన్న సంస్థల్లోని కోర్సుల్లోకి చేర్చుకుంటారు. 

 

తెలంగాణ నిర్మల్ జిల్లా బాసరలోని ట్రిపుల్ ఐటీ అడ్మిషన్ల ప్రక్రియ ముగిసింది. ఈ సంవత్సరానికి పాలీసెట్ ర్యాంకులతో అభ్యర్థుల ఎంపిక పూర్తి చేశారు. ప్రస్తుతం నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్‌లోని సంస్థల్లో ప్రవేశాల కోసం మాత్రమే విడుదలైంది. 

 

కోర్సు ప్రధాన ఉద్దేశం

పది తర్వాత ఇంజినీరింగ్‌ డిగ్రీ వరకు మధ్యలో ఎక్కడా ఆగకుండా విద్యార్జన వరుసగా కొనసాగేలా చూడటం. కేవలం థియరీ మాత్రమే కాకుండా ప్రాక్టికల్‌గా విద్యార్థిని ప్రతిభావంతుడిగా తీర్చిదిద్దడం. పరిశోధనా రంగాల్లో విద్యార్థులను ప్రోత్సహిస్తూ శాస్త్ర సాంకేతిక రంగాల్లో వారిని మేధావులుగా రూపొందించడం.

 

ప్రయోజనం

ఒకేసారి కోర్సులో సీటు సంపాదిస్తే ఇంటర్మీడియట్‌, ఇంజినీరింగ్‌ డిగ్రీ వరకు అవిచ్ఛిన్నంగా చదువుకోవచ్చు. దీనివల్ల సబ్జెక్టులపై పట్టు కుదురుతుంది. అధ్యాపకులు, తోటి విద్యార్థులతోనూ దీర్ఘకాల అనుబంధం వల్ల వారిసాయంతో కోర్సును విజయవంతంగా పూర్తిచేయవచ్చు.

 

ప్రోగ్రాం స్వరూపం...

ఇంటిగ్రేటెడ్ బీటెక్‌ ప్రోగ్రాం వ్యవధి 6 ఏళ్లు ఉంటుంది. అందులో మొదటి రెండు సంవత్సరాలు ప్రీ యూనివర్సిటీ కోర్సు, మరో నాలుగేళ్ల బీటెక్‌ కోర్సు అందిస్తారు. 

ప్రీ యూనివర్సిటీ కోర్సు: మ్యాథమెటిక్స్‌, కెమిస్ట్రీ, ఇంగ్లిష్‌, తెలుగు/ సంస్కృతం, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, బయోలజీ అంశాలను నేర్పిస్తారు. 

బీటెక్‌: కెమికల్‌ ఇంజినీరింగ్‌(నూజివీడు, ఆర్‌కే వ్యాలీ), సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ అండ్‌ మెటీరియల్స్ ఇంజినీరింగ్ (నూజివీడు, ఆర్‌కే వ్యాలీ), మెకానికల్ ఇంజినీరింగ్ బ్రాంచిల్లో బోధన అందిస్తారు.

 

అర్హత ప్రమాణాలు.. ఎంపిక ప్రక్రియ

రాష్ట్ర గుర్తింపు కలిగిన ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల నుంచి పదో తరగతి ఉత్తీర్ణత సాధించాలి. అభ్యర్థులు డిసెంబర్‌31, 2021 నాటికి 15 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ పేపర్‌ ఆధారిత పరీక్ష. ఓఎంఆర్‌లో సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. టెన్త్ లో సాధించిన జీపీఏ, ప్రవేశ పరీక్షలో వచ్చిన మెరిట్‌ద్వారా తుది ఎంపిక చేస్తారు.

 

పరీక్ష విధానం...

రెండు గంటల సమయంలో మొత్తం 100 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. మొత్తం 100 మార్కులు. రుణాత్మక మార్కులు లేవు. పదో తరగతి స్థాయి మ్యాథమెటిక్స్‌ నుంచి 40 ప్రశ్నలు, ఫిజికల్‌సైన్స్‌40 ప్రశ్నలు, బయోలజీ నుంచి మరో 20 ప్రశ్నలు ఇస్తారు.

 

దరఖాస్తు విధానం...

సంస్థలో ప్రవేశాలు కోరే అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా సెప్టెంబర్‌ 06, 2021 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలి. ఆలస్య రుసుం రూ.1000తో సెప్టెంబర్‌ 11, 2021లోపు దరఖాస్తులు పంపేందుకు అవకాశం కల్పిస్తున్నారు. దరఖాస్తు ఫీజు కింద ఓసీ అభ్యర్థులు రూ.400, బీసీలు రూ.250, ఎస్సీ/ ఎస్టీ విద్యార్థులు రూ.150 చెల్లించాలి.

 

పరీక్ష కేంద్రాలు..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రతి మండలానికి కనీసం ఒక పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో కేంద్రంలో కనీసం 100 మంది విద్యార్థులు పరీక్ష రాసేలా తెలంగాణలో 10 ఎగ్జామ్‌ సెంటర్లను అందుబాటులోకి తీసుకురానున్నారు.

 

సిలబస్‌

మ్యాథమెటిక్స్‌: రియల్‌నంబర్స్‌, సెట్స్‌, పాలినమియల్స్‌, పెయిర్‌ఆఫ్ ఈక్వేషన్స్‌, క్వాడ్రటిక్‌ ఈక్వేషన్స్‌, ప్రొగ్రెషన్స్‌, కోఆర్డినేట్‌ జియోమెట్రీ, త్రిభుజాలు, టాంజెట్స్‌, కొలతలు, త్రికోణమితి, సంభావ్యత, స్టాటిస్టిక్స్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు.

ఫిజికల్‌సైన్సెస్‌: ఉష్ణం, ఆమ్లాలు-క్షారాలు, కాంతి, ఉపరితలాలు, పరమాణ నిర్మాణం, మూలకాలు, ఆవర్తణ పట్టిక, రసాయన బంధం, విద్యుత్తు, విద్యుదయస్కాంతం, మెటలార్జీ, కర్బన సమ్మేళనాలు నుంచి ప్రశ్నలు ఇస్తారు.

బయోలజికల్‌సైన్సెస్‌: న్యూట్రిషన్‌, రెస్పిరేషన్‌, ట్రాన్స్‌పొర్టేషన్‌, ఎక్స్‌క్రేషన్‌, కోఆర్డినేషన్‌, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, పరిసరాల విజ్ఞానం తదితరాల నుంచి ప్రశ్నలు వస్తాయి. 

 

సన్నద్ధత మెలకువలు

పరీక్ష నాటికి అన్ని సబ్జెక్టులను వీలనన్ని ఎక్కువసార్లు చదవాలి. ఒకవేళ ఏదైనా సబ్జెక్టు అంశాన్ని పూర్తి చేయకపోతే నిరాశ పడకూడదు. అప్పటికే చదివిన అంశాలను పునశ్చరణ చేసుకోవాలి. తగిన ఆత్మవిశ్వాసంతో ఉండాలి. 

సన్నద్ధత మొదలుపెట్టినప్పటి నుంచి పరీక్ష సమయం వరకూ ఏ పరిస్థితుల్లోనూ ప్రేరణను కోల్పోకూడదు. 

నెగెటివ్‌మార్కులు లేనందువల్ల అన్ని ప్రశ్నలకు సమాధానం రాయవచ్చని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి.

చదివేటప్పుడు ఎదురయ్యే సందేహాలను ఉపాధ్యాయులు లేదా సీనియర్ల సాయంతో వెంటనే నివృత్తి చేసుకోవాలి.  

 

ఉద్యోగావకాశాలు

ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు పూర్తిచేసుకున్న వారికి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థలతోపాటు ప్రభుత్వ అనుబంధ, ప్రైవేట్‌ విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. అభ్యర్థులు ఎంచుకున్న విభాగం అనుసరించి కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌, రసాయనాలు తయారుచేసే కెమికల్‌ ఇంజినీర్‌, రియల్‌ఎస్టేట్‌ ప్రాజెక్టుల్లో పని చేసే సివిల్‌ ఇంజినీర్‌, ఆటోమెబైల్‌ ఇండస్ట్రీలో విధులు నిర్వర్తించే మెకానికల్‌ ఇంజినీర్‌, రైల్వే, వైమానిక రంగం వంటి వాటిలో పని చేసే కమ్యూనికేషన్‌ ఇంజినీర్‌గా భాద్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఏదైనా సంస్థలో ట్రెయినీ స్థాయి ఉద్యోగంతో చేరి ఉన్నత స్థానాన్ని చేరుకోవచ్చు.

 

పరీక్ష హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌: సెప్టెంబర్‌ 18, 2021 నుంచి ప్రారంభం.

 

పరీక్ష తేదీ: సెప్టెంబర్‌ 26, 2021

 

వెబ్‌సైట్‌: https://www.rgukt.in/Institute.php?view=RGUKTCET

Posted Date: 03-09-2021


 

టెన్త్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌