• facebook
  • whatsapp
  • telegram

చేనేత డిప్లొమాతో చక్కని ఉపాధి

పదో తరగతి పాసైతే చాలు, మూడేళ్ల హ్యాండ్‌లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ టెక్నాలజీ డిప్లొమాలో చేరి విజయవంతంగా పూర్తిచేస్తే ఆకర్షణీయమైన ఉద్యోగావకాశం పొందవచ్చు. మరి వివరాలేమిటో చూద్దామా?

చేనేత వస్త్ర పరిశ్రమ కొత్తపుంతలు తొక్కుతూండటంతో ఈ రంగంలో అవకాశాలు పెరుగుతున్నాయి. దీనిలో రాణించాలంటే నాణ్యమైన కొత్తకొత్త ఉత్పత్తులు, సృజనాత్మకంగా ఆలోచించే మానవ వనరులే కీలకం. ఔత్సాహికులైన యువతకు ప్రామాణిక శిక్షణ ఇస్తూ ఈ రంగంలో అగ్రగాములుగా తీర్చిదిద్దుతోంది భారతీయ చేనేత శిక్షణ కేంద్రం. హ్యాండ్‌లూమ్‌ అండ్‌ టెక్నాలజీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది!

తెలుగు రాష్ట్రాల్లో చేనేతకు సంబంధించి ప్రగడ కోటయ్య భారతీయ చేనేత శిక్షణ కేంద్రం తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఉంది. 1992లో ఈ సంస్థను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 10 హ్యాండ్‌లూమ్‌ టెక్నాలజీ సంస్థలు ఉండగా చేనేతకు సంబంధించి పరిశోధన, ప్రయోగాలు చేసి నాణ్యమైన ఉత్పత్తులు అందించడానికి వీటిని నెలకొల్పారు. ఈ సంస్థలన్నీ మినిస్ట్రీ ఆఫ్‌ టెక్స్‌టైల్స్‌ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. వెంకటగిరిలో డిప్లొమా ఇన్‌ హ్యాండ్లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ టెక్నాలజీ కోర్సులో మొత్తం 77 సీట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో చదివిన విద్యార్థులకు 53 సీట్లు కేటాయించగా మిగిలినవి తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు కేటాయించారు. ఈ ఏడాది ప్రవేశాల ప్రక్రియ ప్రస్తుతం పురోగతిలో ఉంది. 

శిక్షణ ఇలా.. 

మూడేళ్ల డిప్లొమాలో స్పిన్నింగ్, డైయింగ్, ప్రింటింగ్, ఫినిషింగ్, డిజైన్, క్వాలిటీ పరీక్షలు, మార్కెటింగ్‌ తదితర అంశాలపై శిక్షణ ఇస్తారు. మూడో సంవత్సరం కోర్సులో అదనంగా అపరెల్‌ గార్మెంట్‌ మేకింగ్‌ టెక్నాలజీ శిక్షణ ఇస్తున్నారు. పలురకాల వస్త్రాల తయారీలో మెలకువలు నేర్పుతారు. బ్యాగుల, ఇతర వస్తువుల తయారీలోనూ తర్ఫీదు అందిస్తారు. కోర్సు పూర్తిచేసిన విద్యార్థి నేరుగా బీటెక్‌లో ఫ్యాషన్‌ డిజైన్, టెక్స్‌టెల్స్‌ టెక్నాలజీ కోర్సులు చదివేందుకు అవకాశం ఉంది. 

ఉపకార వేతనం  

ఇక్కడ చేరిన విద్యార్థులకు మొదటి ఏడాది రూ.1,000, రెండో సంవత్సరం రూ.1,100, మూడో ఏడాది రూ.1,200 చొప్పున ఉపకార వేతనం అందిస్తారు. బాలురకు వసతి గృహం అందుబాటులో ఉంది. 

ఉపాధి అవకాశాలు 

డిప్లొమా పూర్తి చేసుకున్న వారికి చేనేత, జౌళి శాఖలో ప్రభుత్వ ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంలోని జౌళి శాఖలో టెక్నికల్‌ సూపరింటెండెంట్, కోఆర్డినేటర్, ఏడీ స్థాయి ఉద్యోగాలు పొందవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో చేనేత, జౌళి శాఖలో సహాయ అభివృద్ధి అధికారి, టెక్నికల్‌ అధికారి ఉద్యోగావకాశాలు ఉన్నాయి. ఇవే కాకుండా జైళ్లశాఖ, తితిదే విభాగంలో అవకాశాలు ఉన్నాయి. కోర్సు పూర్తికాగానే ప్రాంగణ ఎంపికలు ఉంటాయి. తమిళనాడులోని కరూర్, ఈరోడ్, సేలం, కాంచీపురంలో పెద్దఎత్తున ఉన్న పరిశ్రమలతోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్‌ల) పరిధిలో ఉన్న పరిశ్రమలు ఇక్కడి విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తున్నాయి. వీరికి ప్రారంభ వేతనం రూ.18 వేలు అందిస్తున్నారు. అనుభవం ఆధారంగా రూ.లక్షల్లో వార్షిక వేతనాలు ఉంటున్నాయి. 

కోర్సు అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత

వయసు: జులై 1, 2022 నాటికి బీసీ, జనరల్‌ కేటగిరీ అభ్యర్థుల వయసు 15 - 23 మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 25 ఏళ్లు.. 

దరఖాస్తు: వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని నింపాలి.

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: జులై 15, 2022

వెబ్‌సైట్‌: www.iihtvgr.com 

- శ్యామ్‌ కుమార్, న్యూస్‌టుడే, వెంకటగిరి 

Posted Date: 11-07-2022


 

టెన్త్ తర్వాత

మరిన్ని