• facebook
  • whatsapp
  • telegram

పదితో.. త్వరగా స్థిరపడదాం!

పదో తరగతి తర్వాత ఇంటర్, పాలిటెక్నిక్‌ వంటి ఆప్షన్లు చాలామంది తీసుకునేవే.  కానీ త్వరగా స్థిరపడాలనుకునే విద్యార్థులు మాత్రం జాబ్‌ ఓరియంటెడ్‌ కోర్సుల వైపు  చూస్తున్నారు. వీటి వల్ల కెరియర్‌ను ఎంచుకోవడం, సబ్జెక్టు నేర్చుకోవడం, ఉద్యోగంలో చేరడం ఇవన్నీ రెండేళ్లలోపే అయిపోతున్నాయి. అటువంటి కోర్సుల వివరాలేంటో మనమూ తెలుసుకుందాం.

కారణాలేవైనా గానీ కొన్నిసార్లు విద్యార్థులకు తొందరగా స్థిరపడాల్సిన అవసరం తలెత్తుతుంది. ఇంటి పరిస్థితులు, ఆర్థిక సమస్యలు... ఇలా ఏవైనా సరే, సంవత్సరాలపాటు ఫీజు కట్టి చదువుకునే పరిస్థితి ఉండదు. అలాంటి వారికి కొన్ని షార్ట్‌టెర్మ్‌ కోర్సులు ఆహ్వానం పలుకుతున్నాయి. అలా అని వీటిని తక్కువగా చూడాల్సిన పని లేదు.

ఎందుకంటే నేటి సామాజిక అవసరాలకు తగ్గట్టుగా సరికొత్త టెక్నాలజీతో ముడిపడి, అయిదంకెల జీతాన్ని ఇచ్చేవే ఇవన్నీ!

అగ్రికల్చర్‌లో... 

వ్యవసాయంలో రాణించాలనుకునే గ్రామీణ ప్రాంత విద్యార్థులకూ కొన్ని కోర్సులున్నాయి. సెరీకల్చర్, పౌల్ట్రీ ఫార్మింగ్, బీ కీపింగ్, అగ్రికల్చర్‌ సైన్స్‌ వంటి సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులు చేయడం ద్వారా ఉద్యోగాలే కాకుండా సొంతంగా వ్యాపారాలూ చేసుకునే అవకాశం ఉంటుంది. 

కాలవ్యవధి: 6-24 నెలలు

బ్యూటిఫికేషన్, హెయిర్‌ డ్రెస్సింగ్‌

మేకప్, పార్లర్‌కు సంబంధించి ఈ కోర్సులు చాలా కీలకం. తక్కువ వ్యవధిలోనే సెటిల్‌ అయ్యేలా బేసిక్స్‌ అన్నీ నేర్పిస్తారు. ప్రముఖ కాస్మొటిక్‌ కంపెనీల ద్వారా కూడా వీటిని నేర్చుకోవచ్చు. హెర్బల్, ఆయుర్వేదిక్, కాస్మొటాలజీ వంటి విభాగాలు ఉంటాయి. హెయిర్‌ స్టైలింగ్‌లో బేసిక్, అడ్వాన్స్‌డ్‌ అనే రెండు రకాలుంటాయి.

కాలవ్యవధి: 6-12 నెలలు

హోటల్‌ మేనేజ్‌మెంట్‌

హోటల్‌ మేనేజ్‌మెంట్, కేటరింగ్‌ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా కోర్సులు ఈ రంగంలో సులువుగా నిలదొక్కుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. హోటల్‌ నిర్వహణలో బాధ్యతలు, మెలకువలు వంటివన్నీ నేర్పించేలా డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటి తర్వాత కొంత అనుభవం సంపాదిస్తే మంచి ఉద్యోగంలో స్థిరపడొచ్చు.

కాలవ్యవధి: 2 ఏళ్లు

ఎస్‌ఈవో ట్రైనింగ్‌ 

సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ (ఎస్‌ఈవో) డిజిటల్‌ మార్కెట్‌లో అభివృద్ధి చెందుతున్న అంశం. కొన్ని కంపెనీలు తమ వెబ్‌సైట్‌ను సందర్శించే వారి సంఖ్య పెంచుకునేందుకు ఈ టెక్నిక్స్‌ను ఉపయోగిస్తున్నాయి. అందువల్ల దీనిలో నిపుణుల అవసరం ఉంది.  ఈ ఫీల్డ్‌లో డిప్లొమా పూర్తి చేసి మంచి కెరియర్‌ నిర్మించుకోవచ్చు.

కాలవ్యవధి: 6-12 నెలలు

సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

ఒక సంస్థ సేవలు లేదా ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో మార్కెటింగ్‌ చేయడమే సోషల్‌ మీడియా మార్కెటింగ్‌. వివిధ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్ల ద్వారా ఈ పనిని చేయాల్సి ఉంటుంది. మార్కెటింగ్‌లో రాణించాలనుకునే యువతకు ఈ కోర్సులు సరిపోతాయి. 

కాలవ్యవధి: 3-6 నెలలు

ఇతర సర్టిఫికెట్‌ కోర్సులు

ఎంఎస్‌ ఆఫీస్, ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్, వెబ్‌ డిజైనింగ్, గ్రాఫిక్‌ డిజైనింగ్‌ వంటి విభాగాల్లో వివిధ సర్టిఫికెట్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిని నేర్చుకుని కంప్యూటర్‌ నాలెడ్జ్‌ అవసరం ఉన్నవి, డేటా ఆపరేటింగ్, వెబ్‌ స్క్రిప్ట్‌ రాయడం, మల్టీమీడియా గ్రాఫిక్స్‌ చేయడం వంటి  ఉద్యోగాల్లో చేరొచ్చు.

కాలవ్యవధి: 3-6 నెలలు

డెంటల్‌ మెకానిక్స్‌

దంత వైద్యంపై కనీస అవగాహన కల్పించేదే డెంటల్‌ మెకానిక్స్‌. పళ్లు, చిగుళ్ల ఆరోగ్యం, వ్యాధులు, చికిత్స వంటి అంశాలను ఇందులో బోధిస్తారు. దీనివల్ల అభ్యర్థులు వైద్యులకు సహాయకులుగా చేరే అవకాశం ఉంటుంది. ఇందులో డిప్లొమా కోర్సు అందుబాటులో ఉంది.

కాలవ్యవధి: 2 ఏళ్లు

స్టాక్‌ మార్కెట్‌ ట్రైనింగ్‌

ఆర్థిక వ్యవస్థపై అవగాహన, ఆసక్తి ఉన్న వారికి ఈ కోర్సు చక్కగా నప్పుతుంది. స్టాక్‌ మార్కెట్‌ ఎలా నడుస్తుంది, ట్రెండ్స్‌ను ఎలా అంచనా వేస్తారు, ఎలాంటి పెట్టుబడులు శ్రేయస్కరం వంటి విషయాలన్నీ ఇందులో నేర్చుకోవచ్చు. తద్వారా ఆ రంగంలో రాణించే అవకాశం లభిస్తుంది.

కాలవ్యవధి: 1-2 ఏళ్లు
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ డిగ్రీతో కమాండెంట్‌ కొలువు

‣ గ్రూప్‌-1 విజయానికి ఏ పుస్తకాలు చదవాలి?

‣ నీట్‌ ర్యాంకుల కటాఫ్‌ ఎంత?

‣ నియామకాల్లో ఏమేం చూస్తారు?

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 02-05-2022


 

టెన్త్ తర్వాత

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌