• facebook
  • whatsapp
  • telegram

మేధకు వేదిక.. ఆవిష్కరణల పునాది!  

ఏఐ - ఎంఎల్‌ - డేటా సైన్స్‌ కోర్సులు
 

రాబోయే కాలంలోనూ ఐటీ రంగంలో డిజిటల్‌ టెక్నాలజీ హవా కొనసాగనుంది. నాస్కామ్‌ లాంటి సంస్థల నివేదికలు ఇదే చెపుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ మెరుగయ్యాక 80 శాతం కొత్త ఉద్యోగాలు డిజిటల్‌ టెక్నాలజీ రంగంలోనే రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో  ఇంజినీరింగ్‌  కళాశాలల్లో ప్రవేశపెట్టిన అత్యాధునిక కోర్సుల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లర్నింగ్‌  (ఏఐ అండ్‌ ఎంఎల్‌), డేటా సైన్స్‌ ఉన్నాయి. వీటి ప్రత్యేకతలేమిటి?  కెరియర్‌ పురోగతి ఎలా ఉంటుంది? 
 

ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్, మెషిన్‌ లర్నింగ్‌... నిజానికివి జంట పదాలు కావు. కంప్యూటర్‌ సైన్స్‌ రంగంలో జరుగుతున్న విప్లవాత్మక పరిశోధనలలో ఈ రెండూ ఒకదాని తరువాత ఒకటి తమ వంతు బాధ్యతలు నిర్వహిస్తాయి. మొదటిది వేదిక ఐతే రెండోది ఆ వేదిక ఆధారంగా అభివృద్ధి చెందిన టెక్నాలజీ అని అర్థం చేసుకోవాలి. అందుకే ఈ రెండింటినీ కలిపి ఇంజినీరింగ్‌ స్థాయిలో కొత్త కోర్సుగా ప్రవేశ పెట్టారు.
 

కంప్యూటర్‌ వ్యవస్థలు గణాంకశాస్త్రంలోని సాంకేతిక ప్రక్రియల ద్వారా తమకు ఇన్‌పుట్‌గా ఇచ్చిన డేటాను విశ్లేషిస్తాయి; మానవ ప్రమేయం లేకుండానే ప్రోగ్రాం చేసుకుని కావలసిన పని పూర్తి చేస్తాయి. అంతే కాకుండా అంచెలంచెలుగా ‘అనుభవ పూర్వకంగా’ మేధను పెంచుకునే ప్రక్రియకే ‘మెషిన్‌ లర్నింగ్‌’ అని పేరు. ఈ  క్రమంలో మనిషి ప్రత్యేకంగా ప్రతి పనికీ ప్రోగ్రాం చెయ్యవలసిన అవసరం ఉండదు.  
 

‘మెషిన్‌ ఇంటలిజెన్స్‌’ అనే పర్యాయ పదం కూడా ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌కి ఉంది. ప్రధానంగా మేధను ప్రదర్శించే మెషిన్ల ఆకృతి, నిర్మాణం, అభివృద్ధి గురించి ఇది తెలుపుతుంది. తన చుట్టూ ఉన్న పరిస్థితులనూ, పరిసరాలనూ పరిశీలించి, అర్థం చేసుకుని, అందుకు సముచితమైన నిర్ణయాన్ని తీసుకోగలిగిన శక్తి ఉన్న మరను ‘ఇంటలిజెంట్‌ మెషిన్‌’ అని నిర్వచించవచ్చు. ఈ నిర్ణయం మనుషులు తీసుకునే నిర్ణయాలకు సమానంగా ఉండాలి. స్థూలంగా చెప్పాలంటే, మానవ మేధను అనుకరించి నిర్ణయాలను తీసుకుని లక్ష్యాలను సాధించే మెషిన్లకు ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ ఉన్నట్లు అన్నమాట!
 

ఎందుకీ ప్రాచుర్యం?
ప్రభుత్వం అన్ని రంగాలలోనూ డిజిటలైజేషన్‌కి అగ్రపీఠం వెయ్యడం, ఇంటర్నెట్‌ ప్రాచుర్యం, మొబైల్‌ వ్యవస్థల ఏర్పాటు ద్వారా ఏర్పడిన కనెక్టివిటీ, చవక ధరలకే అందుబాటులో ఉంటున్న డిజిటల్‌ సేవలు, వాడుకలో ఉన్న అనుకూలతలు కలిపి ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతి సెకనుకీ దాదాపు 4.14 క్వింటిలియన్ల (417 కోట్ల కోట్ల) బైట్ల డేటా ఉత్పత్తి జరుగుతోంది. ఇంత డేటాను నిర్వహించడానికీ, భద్ర పరచడానికీ, విశ్లేషించి విలువైన సమాచారం సేకరించడానికీ మానవ శక్తి చాలదు. పైగా ఒక చిన్న పొరపాటు తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు. అంతేకాకుండా, వినియోగదారుల అభిరుచులను తెలుసుకుని వ్యాపారాలను పునర్నిర్మించుకోవడానికి సమయం దొరకదు. అవకాశాలు చేజారిపోయే ప్రమాదమూ ఉంది. ఈ సమస్యలన్నింటికీ సరైన సమాధానం ఎఐ అండ్‌ ఎంఎల్‌. అందుకే ఈ రంగానికి ఇంత ప్రాచుర్యం, ప్రాముఖ్యం!
 

ఎలా ఉంటుంది భవిత?
వివిధ సర్వేల, నివేదికల, నిపుణుల అభిప్రాయాల ప్రకారం.. ఈ రంగం ఇంకా బాల్య స్థితిలోనే ఉన్నందున మెరుగైన, సుశిక్షితులైన మానవ వనరుల కొరత తీవ్రంగా ఉంది. అంతర్జాల ఆధారిత సేవలు ఇంకా విస్తరిస్తున్నందున ఈ కొరత భారీగా ఉండబోతోంది. కనుక భవిష్యత్తు మన చేతుల్లోనే ఉన్నదని అర్థం చేసుకోవాలి. విజయాన్ని స్వయంగా రచించుకోవాలనుకునే ఉత్సాహం, నమ్మకం ఉన్నవారికీ, ఆత్మ విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ రంగం ఆహ్వానం పలుకుతోంది.
 

కెరియర్‌ అవకాశాలు
ఈ రంగం ఎన్నో కొత్త రకాల ఉద్యోగాలకు అవకాశం కల్పిస్తుంది. ఇందులో చాలా వరకు ఐదు నుంచి పది సంవత్సరాల క్రితం మనమెవ్వరమూ వినను కూడా లేదు. ఉదాహరణకు అందుబాటులో ఉండే కెరియర్‌ అవకాశాలు: కంప్యూటర్‌ విజన్‌ ఇంజినీర్, డేటా అనలిస్ట్, అల్గోరిథమ్‌ ఇంజినీర్, రిసెర్చి ఇంజినీర్, డేటా సైంటిస్ట్, డేటా ఇంజినీర్, ఎంఎల్‌ ఇంజినీర్, కంప్యూటర్‌ సైంటిస్ట్, బిగ్‌ డేటా ఆర్కిటెక్ట్, బిజినెస్‌ ఇంటలిజెన్స్‌ డెవలపర్, రొబోటిక్స్‌ ప్రోగ్రామర్, వీడియో గేమ్స్‌ డెవలపర్‌. వీటిలో కొన్ని మినహాయించి అధికభాగం ఉద్యోగాలు ప్రత్యేకంగా ఏఐ అండ్‌ ఎంఎల్‌ ఇంజినీర్లకే పరిమితమైనవి. కొన్నింటికి డేటా సైన్స్‌ ఇంజినీర్లు కూడా అర్హులు. కంప్యూటర్‌ సైన్స్‌ రంగంలో ఉన్న దాదాపు అన్ని ఉద్యోగాలకూ ఈ బ్రాంచి వారు అర్హులు. కానీ కంప్యూటర్‌ సైన్స్‌ చదివినవారు ఈ పోస్టులకి అర్హులు కారు. వారు ప్రత్యేకంగా ఈ రంగంలో కూడా కోర్సు చేసివుండాలి.  
 

విద్యార్థులు ఏం చేయాలి?
సైబర్‌ సెక్యూరిటీ, ఐఓటీ, ఏఐ అండ్‌ ఎంఎల్, డేటాసైన్స్‌.. కంప్యూటర్‌ సైన్స్‌ రంగంలో వచ్చిన ఈ కొత్త కోర్సులన్నీ ప్రస్తుత వ్యవస్థలను తిరగరాస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిత్యం విద్యార్థులు తమ మెలకువలకు మెరుగులు దిద్దుకోవాలి. స్వయంగా  దిశా నిర్దేశం చేసుకోవాలి. ఈ రంగాల్లో అనుభవజ్ఞులు కూడా లేనందున అందరూ సమానమే. పూర్వానుభవం లేదు కాబట్టి దార్శనికులుగా ఆలోచించడం అలవర్చుకోవాలి. తీసుకున్న నిర్ణయాల పర్యవసానం వివిధ కోణాల్లో చూపించే ప్రభావం పట్ల ముందుగానే అవగాహన ఏర్పరచుకోవాలి. అటువంటివారికే ఈ నూతన కోర్సులు మంచి అవకాశాలనిస్తాయి. 
 

సరైన విద్యాసంస్థ ముఖ్యం
అవకాశాలున్నాయి కదా అని, ఏదో ఒక కోర్సు చేస్తే ఉద్యోగం వస్తుందనుకోవడం పొరపాటు. పరిశ్రమలు, సంస్థలు తగిన అర్హతలు, నేర్పు, మెలకువలు ఉన్నవారికే అవకాశం ఇస్తాయి కానీ ఇతరులకు అవకాశం ఇచ్చి మెడకు గుదిబండను వేసుకోవు. అందుకే  కోర్సు, కాలేజీలు, శిక్షణ సంస్థలను ఎంచుకునే విషయంలో జాగ్రత్త అవసరం. ఈ కొత్త కోర్సుల్లో అందరూ ఒకే స్థాయిలో ఉన్నారనీ, కొందరు మాత్రం కొన్ని అడుగులు మాత్రమే ముందున్నారనీ తెలుసుకోవాలి. అలా ముందంజలో ఉన్నవారున్న సంస్థల్లో చేరటం మేలు. ఎటువంటి తాయిలాలకూ ఆశ పడకుండా, అతిశయోక్తులకు లొంగకుండా సరైన నిర్ణయం తీసుకోవాలి. చదువుల మీద వెచ్చించేది పెట్టుబడిగా చూడాలి కానీ ఖర్చులుగా చూడకూడదు.
 

సత్వర ఆవిష్కరణలకు.. డేటా సైన్స్‌ 
కృత్రిమ మేధ, మెషిన్‌ లర్నింగ్, డీప్‌ లర్నింగ్, రొబోటిక్స్, ఐఓటీలతో పాటు అనేక కొత్త టెక్నాలజీల సత్వర ఆవిష్కరణలకు డేటా సైన్స్‌ రంగం పునాది. తనతోపాటు అనేక ఇతర ఎమర్జింగ్‌ టెక్నాలజీ రంగాల అభివృద్ధికి ఇది ఆసరాగా ఉంది. ఇతర రంగాల్లో  పురోగతి అవకాశాలు సన్నగిల్లినా, లేక కొత్తగా ఇంజినీరింగ్‌ డిగ్రీ ముగించి ఆకర్షణీయమైన జీతం, అద్భుతమైన అవకాశం, భరోసా ఉన్న ఎదుగుదల కోసం చూస్తున్నవారికి డేటా సైన్స్‌ రంగం ఆహ్వానం పలుకుతోంది. 
 

దీని అవసరం ఏమిటి?
వ్యాపార సంస్థల అభివృద్ధి, నిర్ణాయక శక్తి, వ్యాపార విస్తరణలకు డేటా సైన్స్‌ వెన్నెముకగా ఉంటోంది. భారీ డేటాను సేకరించి, శుద్ధి చేసి, విశ్లేషించి, వ్యాపారాభివృద్ధికి ఇది తోడ్పడుతుంది. వినియోగదారుల అభిరుచులను సంశ్లేషించి, అందుకు తగినవిధంగా ఉత్పత్తుల తయారీ, సరఫరా, విక్రయం సంబంధిత సముచిత నిర్ణయాలు తీసుకోవడానికి డేటా సైన్స్‌ టెక్నాలజీ తోడ్పడుతోంది.  
 

డేటా సైన్స్‌లో ప్రధానంగా ఐదు అంచెల పని ఉంటుంది. మొదటి అంచెలో వివిధ పరికరాల, కేంద్రాల నుంచి ఉత్పత్తి అయ్యే డేటాను సేకరించడం. డిజిటల్‌ రూపంలో ఉన్న ప్రతి పరికరం వెలువరించే డేటాను సేకరించి, భారీ మోతాదులో దాన్ని నిల్వ చేసేందుకు (డేటా స్టోరేజి) మౌలిక వ్యవస్థను నిర్మిస్తారు (బిగ్‌ డేటా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌). ఇది డేటా ఇంజినీర్ల బాధ్యత. రెండో అంచెలో అనుభవజ్ఞులైన డేటా అనలిస్టులు ఉంటారు. భద్రపరిచిన డేటాను శుద్ధి చెయ్యడం, విశ్లేషించి అర్థవంతమైన సమాచార నివేదికలు తయారుచేసి డేటా సైంటిస్టులకు సహకరించడం వీరి బాధ్యత. తర్వాతి అంచెలో డేటా సైంటిస్టులు వివిధ టూల్స్, క్రమసూత్ర పద్ధతులు, సాంకేతిక ప్రక్రియలను వివిధ తరగతులకు చెందిన డేటాపై అనువర్తనం చేస్తారు; వ్యాపారాభివృద్ధి, సమర్థ నిర్వహణలకు అవసరమైన కీలక సమాచారాన్ని వెలికితీస్తారు. తర్వాత క్రమంలో మెషిన్‌ లర్నింగ్‌ ఇంజినీర్లు ఉంటారు. డేటా సైంటిస్టులు అభివృద్ధి చేసిన సమాచారాన్ని సద్వినియోగం చెయ్యడం కోసం అనువైన, సమర్థ మెషిన్‌ లర్నింగ్‌ నమూనాలను అభివృద్ధి చెయ్యడం వీరి ప్రధాన విధి. కోడింగ్‌ చెయ్యడం, పరీక్షలు నిర్వహించడం, రంగంలోకి దించి వినియోగించడం, ఆ క్రమంలో వచ్చే సమస్యల పరిష్కారం వీరి ముఖ్య విధులు.
 

ఎక్కడ ఉపయోగపడుతుంది?
నిత్యం ఒక కొత్త రంగం డేటా సైన్స్‌ ఉపయోగాన్ని కనుక్కుంటోంది. ముఖ్యంగా కొన్ని రంగాల్లో ఈ టెక్నాలజీ ఉపయోగం ప్రస్ఫుటం. వీటిలో ఇంటర్నెట్‌ సెర్చి మొదటిది. గూగుల్, యాహూ, బింగ్‌ వంటి సెర్చి ఇంజిన్లన్నీ డేటా సైన్స్‌ సేవలు సమర్థంగా వినియోగించుకుని మనిషి మెదడులో ఏమి ఉందో ముందే అంచనా వేస్తున్నాయి. రెండోది లక్షిత వాణిజ్య ప్రకటనలు. తమ ఉత్పత్తులను సమర్థŸంగా విక్రయించాలంటే అవి అవసరమయ్యే వినియోగదారుల భోగట్టా చాలా అవసరం. డేటా సైన్స్‌ ద్వారా ఈ పని సులువుగా చెయ్యవచ్చు. 
 

కంప్యూటర్‌ సైన్స్‌ బ్రాంచిలో ఉపశాఖ అయిన డేటా సైన్స్‌కి డిమాండ్‌ ఉండటం సహజమే. లక్షల సంఖ్యలో ఉద్యోగావకాశాలు, దాదాపు అన్ని రంగాల్లోనూ డేటా సైన్స్‌ అనువర్తనానికి అనుకూలత, అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం (2026 నాటికి కోటికి పైగా ఉద్యోగాలు ఈ రంగం కల్పిస్తుందని లింక్డిన్‌ అంచనా), కెరియర్‌లో త్వరితగతిన ఎదగడానికి అనువైన సోపాన మార్గం, అత్యధిక పారితోషికం అందుకునే అవకాశం..ఇలాంటివెన్నో! అటు కంప్యూటర్‌ సైన్స్, ఇటు డేటా సైన్స్‌ ఉభయ రంగాల్లో  ప్రావీణ్యం ఈ క్రొత్త బ్రాంచికే సొంతం.
 

ఉద్యోగావకాశాలు
ఈ కోర్సు చేసినవారికి డేటా సైన్స్‌ కన్సల్టెంట్, డేటా ఇంజినీర్, డేటా ఆర్కిటెక్ట్, డేటా టెక్నాలజీస్‌ స్పెషలిస్ట్, క్లినికల్‌- ఫార్మస్యూటికల్‌ అనలిస్ట్, ఫైనాన్షియల్‌ మాడలర్, డేటా ఎకాలజిస్ట్, డేటా విజువలైజర్, డేటాబేస్‌ అడ్మినిస్ట్రేటర్‌ లాంటి ఉద్యోగావకాశాలు ఉంటాయి. మనదేశంలోనే దాదాపు ఒక లక్ష ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయనీ, ముందు ముందు ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందే తప్ప తరగదని నిపుణుల అభిప్రాయం. ప్రస్తుతం ఒక అంచనా మేరకు 8000కు పైగా కంపెనీలు డేటా సైన్స్‌ రంగంలో ఉద్యోగావకాశాలు ఇస్తున్నాయి. 


 

Posted Date: 26-05-2021


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌