• facebook
  • whatsapp
  • telegram

ఏఐ, ఎంఎల్‌ కోర్సులకు ఎందుకు డిమాండ్‌?

ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌, మెషిన్‌ లర్నింగ్‌ నైపుణ్యాలతో భారీ ఉద్యోగావకాశాలు

తెలుగు రాష్ట్రాల్లో ఇంజినీరింగ్‌ ప్రవేశాల తరుణమిది. కంప్యూటర్‌ సైన్స్‌తో ఇంచుమించు సమానంగా విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్న కోర్సు... ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌- మెషిన్‌ లర్నింగ్‌ (ఏఐ అండ్‌ ఎంఎల్‌). ఈ నైపుణ్యాలు లక్షల ఉద్యోగావకాశాలు అందించగలవనీ, భవిష్యత్తుకు ఢోకా ఉండదనీ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏఐ-ఎంఎల్‌ విశిష్టతలేమిటో తెలుసుకుందామా?  

ఇంజినీరింగ్‌ స్టడీస్‌ ఔత్సాహికుల సంభాషణల్లో ఎక్కువగా చర్చకు వస్తున్న బ్రాంచి.. ఏఐ అండ్‌ ఎంఎల్‌. అభివృద్ధి చెందుతున్న ఈ టెక్నాలజీ డొమైన్‌ మాదిరి మరే ఇతర శాఖ కూడా ఇంత విస్తృతంగా అందరి దృష్టినీ ఆకర్షించలేదని చెప్పవచ్చు.   

సమాచార సాంకేతిక రంగం (ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ)లోని విప్లవాత్మక పరిణామాలు యూజర్‌ ఫ్రెండ్లీ విషయంలో మెరుగ్గా ఉండే కొత్త టూల్స్‌కు దారితీస్తున్నాయి. అంతే కాదు, కోరుకున్న ఫంక్షనాలిటీని ఇవ్వడంలో ఇవి మరింత సమర్థంగా ఉంటాయి. వాస్తవానికి ఏఐ, ఎంఎల్‌ వేటికవే స్వతంత్రంగా ఉండవు. ఒకదానితో మరొకటి వెళ్లే జంట పదాలివి. ఈ రెండూ చేపట్టే పనులు ఒకదానికొకటి అనుబంధంగా ఉంటాయి. ఏఐ; ఏఐ అండ్‌ ఎంఎల్‌.. ఏ పేర్లతో పిలిచినా వీటి పాఠ్యాంశాలు దాదాపు ఒకటే. 

ఎందుకింత గిరాకీ?

ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు డిజిటలైజేషన్‌కు పెద్ద పీట వేస్తున్నాయి. అంచనాలకు మించి ఇంటర్నెట్‌ ప్రజాదరణ పొందుతోంది. వాణిజ్య సంస్థలు ఇంటర్నెట్‌ ఆధారంగా తమ వ్యాపారాభివృద్ధికి మొగ్గు చూపుతున్నాయి. మొబైల్‌ రంగంలో విప్లవాత్మక మార్పులు, చవక ధరలకే డిజిటల్‌ సేవలు అందుబాటులోకి రావడం వల్ల కంప్యూటర్‌ రంగం ఆవిష్కరణలకు పుట్టినిల్లుగా వెలుగుతోంది. వినియోగదారుల అభిరుచులను ముందుగానే తెలుసుకుని తగినట్టు వ్యాపారాన్ని పెంచుకోవదానికి పరిశ్రమలు కసరత్తు మొదలు పెట్టడం వల్ల ఇలాంటివి సమర్థంగా చెయ్యగలిగిన, సొంతంగా తర్ఫీదు ఇచ్చుకుని అభివృద్ధి చేసుకోగలిగిన కంప్యూటర్‌ ప్రోగ్రాములకు ఆదరణ ఉంటోంది. 

ఇటువంటి స్వయం శిక్షిత ప్రోగ్రాములను అభివృద్ధి చేసే ప్రక్రియే కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌).సంక్లిష్టమైన, జటిలమైన, అతి పెద్ద మోతాదులో ఉన్న డేటాను తక్కువ సమయంలోనే శోధించి అనుకూల నిర్ణయాన్ని ఇవ్వగలిగిన బలాన్ని ఈ రంగం కలిగిస్తోంది. దీంతో ఈ రంగంలో లక్షల కొత్త ఉద్యోగాలకు అవకాశం ఏర్పడింది. తద్వారా వ్యాపార అభివృద్ధే లక్ష్యంగా ఉండే వాణిజ్య సంస్థలకు ఈ కొత్త టెక్నాలజీ ఒక సువర్ణావకాశాన్ని కలిగించింది. అందుకే ఈ రంగానికి ప్రత్యేక విశిష్టత, గిరాకీ. ఇంజినీరింగ్‌ రంగంలో ఈ టెక్నాలజీ కలికితురాయిగా వెలుగుతోందంటే.. అది అతిశయోక్తి కాదు! 

కొత్త టెక్నాలజీ.. కొత్త ఉద్యోగాలు

‘47 శాతం ఉద్యోగాలు టెక్నాలజీ చేతిలో ఓడిపోతాయి’ అని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయపు ఇంజినీరింగ్‌ సేవల విభాగానికి చెందిన కార్ల్‌ ఫ్రే, మైఖేల్‌ ఒస్‌బొర్న్‌లు తమ నివేదికలో ప్రకటించారు. వాస్తవానికి 47 శాతం ఉద్యోగాల్లో కొన్ని విధులను ఆధునికీకరిస్తారు,  ఆటోమేషన్‌కు లోనవుతాయని అర్థం. ఉదాహరణకు ఏటీఎంల వల్ల టెల్లర్‌ ఉద్యోగాలు తగ్గిపోతాయనే భావన ఉండేది. ఐతే ఏటీఎంల స్థాపన వల్ల టెల్లర్‌ ఉద్యోగాల సంఖ్య పెరిగింది. జరిగింది ఏమిటంటే- ఏటీఎంల స్థాపన వల్ల బాంకులకు కొత్త శాఖలు తెరిచే ప్రక్రియ సరళీకృతమైంది. ఖర్చులు తగ్గిపోవడం వల్ల టెల్లర్‌ ఉద్యోగాల సంఖ్య పెరిగింది. కాబట్టి ఈ కొత్త టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు తగ్గిపోతాయనేది నిజం కాకపోగా, కొత్త ఉద్యోగాలు పుట్టుకు రావడంతోపాటు ఉన్న కొలువుల ఆధునికీకరణ జరుగుతుంది. ఈ మారిన పరిస్థితులకు అనుగుణంగా మెలకువలూ, నైపుణ్యాలూ పెంచుకుంటే భవితకు ఎటువంటి లోటూ ఉండదు.

ఈ కోర్సులో ఏమి నేర్చుకుంటారు?  

ఏఐ అండ్‌ ఎంఎల్‌ కోర్సుకు సంభావ్యత, గణాంకాల (ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్‌) పరిజ్ఞానం వెన్నెముక. గణితంలోని ఈ రెండు విభాగాల శిక్షణ లోతుగా ఉంటుంది. కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ (సీఎస్‌ఈ)కి అనుబంధమైన శాఖ కావడం వల్ల ఆ బ్రాంచికి సంబంధించిన సబ్జెక్టులు చాలావరకు ఉంటాయి. సిలబస్‌ పరంగా బీటెక్‌ స్థాయిలో సీఎస్‌ఈ, ఏఐ- ఎంఎల్‌ల మధ్య 5-10 శాతం వ్యత్యాసం ఉంటుందని చెప్పవచ్చు. అంటే- సీఎస్‌ఈ అనే పునాదిపై వెలసిన భవంతి ఏఐ అండ్‌ ఎంఎల్‌ కోర్సు అని అర్థం చేసుకోవాలి. 

సీఎస్‌ఈకి అవసరమైన తార్కిక ఆలోచన, తక్కువ వనరులతో సమస్యలకు సమర్థ పరిష్కారాలు కనుక్కునే మెలకువలు సహజ లక్షణాలుగా పెంపొందించుకోగలిగినవారు ఈ కోర్సులో రాణించగలరు. ‘‘ఎక్కువగా కంటికి కనిపించేది ఎక్కువగా అమ్ముడు పోతుంది’’ అనే మనస్తత్వ శాస్త్ర సూత్రంపై ఆధారపడి  కొన్ని ఉత్పత్తుల సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌లు టోకు దుకాణాల్లోనూ, చిల్లర దుకాణాల్లోనూ తమ ఉత్పత్తుల ప్రదర్శనకు దుకాణాదారులను ఒత్తిడి చేస్తూ ఉంటారు. బిస్కెట్లు, సబ్బులు, షాంపూలు ఈ కోవకు చెందిన ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. అందుకే మనం వివిధ రకాల షాంపూల చిన్న చిన్న పాకెట్లు దొంతర్లుగా  వేళ్ళాడగట్టటం చూస్తూ ఉంటాం. 

ఐతే నిజంగా ఈ మేరకు అమ్మకాలు జరుగుతాయా అన్నది కచ్చితంగా చెప్పలేము. ఇటువంటి సమస్యల సమాధానాలకు, మెషిల్‌ లర్నింగ్‌ పద్ధతుల ద్వారా కొనుగోలుదారులు ఫలానా కంపెనీకి చెందిన ఉత్పత్తులను కొంటారా లేదా అన్నది ఎక్కువ సంభావ్యతతో కనుక్కోవచ్చు. పైగా దీనిద్వారా, ఆయా ప్రాంతాలలోని వినిమయదారుల కొనుగోలు సరళిపై  కచ్చితమైన, నిర్దిష్టమైన అభిప్రాయాలనూ, పద్ధతులనూ కనిపెట్టవచ్చు. ఇదే సమస్యకు సమాధానం మనిషి పనిచెయ్యవలసి వస్తే, చాలా సమయం అవసరమవుతుంది, ఇది మనిషి ఓపికకు అగ్ని పరీక్ష. పైగా ఇంత మోతాదులో ఉన్న డేటాను పరీక్షించడంలో  తప్పులు  కూడా జరగవచ్చు. అలాంటి పొరపాట్ల ఆధారంగా తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు వ్యాపార ఉనికికే ప్రమాదకారి కావచ్చు.

మెషిన్‌ లర్నింగ్‌ అంటే?

ఇచ్చిన ఇన్‌పుట్‌ డేటాను, క్రమ సూత్ర పద్ధతులను (అల్గోరిదమ్‌) క్షుణ్ణంగా అధ్యయనం చేసి, మానవ ప్రమేయం లేకుండా సమర్థŸమైన క్రమ సూత్ర పద్ధతిని అభివృద్ధి చేసుకుని, సొంతంగా డేటాను విశ్లేషించి కావలసిన పనిని పూర్తిచేసే కంప్యూటర్‌ వ్యవస్థ- మెషిన్‌ లర్నింగ్‌.. గణాంక శాస్త్రంలోని సాంకేతిక ప్రక్రియల, పద్ధతుల అనువర్తనం ద్వారా ఇది సాధ్యమవుతుంది. అంచెలంచెలుగా,  అనుభవ పూర్వకంగా నిర్ణాయక మేధను కంప్యూటర్‌ వ్యవస్థలు పెంపొందించుకోగలగడం ఈ ప్రక్రియ విశిష్టత. అందువల్ల దీనికి మెషిన్‌ ఇంటలిజెన్స్‌ అనే పర్యాయ పదం కూడా ఉంది. ఒకవేళ మనుషులు ఈ నిర్ణయం తీసుకోవలసి వస్తే ఆ సందర్భంలో ఏ నిర్ణయం తీసుకుంటారో అలాంటి నిర్ణయం కంప్యూటర్‌ చెయ్యగలగాలన్న మాట. 

స్థూలంగా చెప్పాలంటే, మనిషి మేధను కంప్యూటర్‌ వ్యవస్థ అనుకరించే ప్రక్రియకు కృత్రిమ మేధ అనీ, దానికోసం పాటించే నియమావళిని మెషిన్‌ లర్నింగ్‌ అనీ పిలుస్తారు.

కెరియర్‌ అవకాశాలు

ఇంచుమించు నెలకొక కొత్త ఆవిష్కరణగా వెలుగుతున్న  ఏఐ అండ్‌ ఎంఎల్‌ రంగంలో నూతనత్వంతో కూడుకున్న కొలువులకు కొదువ లేదు. బీటెక్‌ స్థాయిలో డిగ్రీ ఉన్న అభ్యర్థులకు ఈ రంగంలో ఉన్న కొలువులూ, అనుభవం ఉన్నవారికి ఉండే ముఖ్య అవకాశాలూ ఇక్కడ చూడండి:

మెషిన్‌ లర్నింగ్‌ ఇంజినీర్‌ 

డేటా సైంటిస్ట్‌

డేటా ఇంజినీర్‌  

డేటా అనలిస్ట్‌

సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌  

ఏఐ ఎంఎల్‌ ఇంజినీర్‌ 

యూఐ/యూఎక్స్‌ డిజైనర్‌ (సరళతరమైన యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ల అభివృద్ధి)  

ఎన్‌ఎల్‌పీ ఇంజినీర్‌  

డేటా అనలిటిక్స్‌ స్పెషలిస్ట్‌ 

కంప్యూటర్‌ విజన్‌ ఇంజినీర్‌ 

అల్గోరిదమ్‌ ఇంజినీర్‌ 

కంప్యూటర్‌ సైంటిస్ట్‌

సమీప భవిష్యత్తులో కొన్ని లక్షల ఉద్యోగాల అవకాశాలున్న రంగంగా ప్రముఖ నివేదికలు అభిప్రాయం వెలిబుచ్చుతున్నాయి. అందువల్ల భవిష్యత్తుకు ఢోకా లేని రంగం ఇది. ఇక ఉన్నత చదువుల విషయానికి వస్తే మనదేశంలో, విదేశాలలో ఎన్నో అవకాశాలు ఉన్న రంగం. పైగా రిసెర్చి స్థాయిలో పి.హెచ్‌.డి. కూడా తక్కువ కాలంలో ముగించగలిగిన అవకాశం ఉన్న బ్రాంచి ఇది. యూనికార్న్‌లుగా వ్యవహరించే అంకుర సంస్థలకు అవకాశం ఉండి కెరియర్‌ అవకాశాలూ ఎక్కువే. 

బ్యాంకు నుంచి విద్యా రంగం వరకు, నియామకాల ప్రక్రియ నుంచి ఉద్యోగుల సంక్షేమ పథకాల నిర్వహణ వరకు అన్ని రంగాల్లోనూ ఉనికిని చాటుకుంటున్న ఈ రంగంలో కెరియర్‌ మలచుకోవడానికి బీటెక్‌తో పాటు సమాంతరంగా కొన్ని ప్రత్యేక కోర్సులు, కనీసం రెండు ప్రాజెక్టులు చెయ్యడం చాలా అవసరం. అలాగే ఎన్‌పీటెెల్‌ లాంటి ఆన్లైన్‌ కోర్సుల్లో సర్టిఫికేషన్‌ అదనపు బలం.


 

Posted Date: 22-09-2021


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌