• facebook
  • whatsapp
  • telegram

బ‌యోటెక్నాల‌జీతో బహుముఖ అవకాశాలు

క‌రోనాతో ఈ రంగానికి పెరిగిన డిమాండ్

కొవిడ్ - 19 కారణంగా విద్యా వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తంగా మారింది. 2020-21 విద్యాసంవ‌త్స‌రంలో విద్యార్థులు త‌ర‌గతి గదుల‌కు దూర‌మై ఇళ్ల‌కే ప‌రిమితమ‌య్యారు. దీంతో వారి ప‌రిస్థితి గంద‌ర‌గోళంగా త‌యార‌యింది. కొంద‌రు మాత్రం కెరియర్ ను ఉన్న‌తంగా తీర్చిదిద్దుకునేందుకు ఈ స‌మ‌యాన్ని వినియోగించుకుంటున్నారు. కొత్త కోర్సులు, క‌ళాశాల ఎంపిక‌ల‌ను అన్వేషిస్తూ ప్ర‌ణాళిక ర‌చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బ‌యోటెక్నాల‌జీ రంగం, అందులో ఉద్యోగావ‌కాశాల గురించి  తెలుసుకుందాం.

సైన్స్ విద్యార్థులు పన్నెండో తరగతి తర్వాత మంచి అవకాశాల కోసం ఎంచుకోదగిన కోర్సుల్లో బయోటెక్నాలజీ ఒకటి. ఇది జీవశాస్త్రం, రసాయన శాస్త్రం, సాంకేతిక అంశాలతోపాటు కొంత వరకు  గణిత స‌బ్జెక్టుల‌ను కలిగి ఉంటుంది. ‘బయోటెక్నాలజీ’ జీవశాస్త్రం, దానికి సంబంధించిన సాంకేతికతను వివరిస్తుంది. బయోటెక్నాలజీని ఆరోగ్య సంరక్షణ, ఔషధాలు, ఆహార ఉత్పత్తి, పశుసంవర్ధకం, వ్యవసాయం, వస్త్రాలు, పోషణ మొదలైన రంగాల్లో ఉపయోగిస్తారు.

ప‌ది, పన్నెండో త‌ర‌గ‌తులు, గ్రాడ్యుయేషన్ తర్వాత డిప్లొమా ఇన్ బయోటెక్నాలజీ, బీఎస్సీ, బీటెక్ లేదా బయోటెక్నాలజీలో బీఈ, ఎంఎస్సీ, బయోటెక్నాలజీలో ఎంటెక్ లేదా బయోటెక్నాలజీలో పీజీ చేసేందుకు అవ‌కాశం ఉంది. చాలామంది విద్యార్థులు బయోటెక్నాలజీలో పొందుపరిచిన అంశాలపై కొంత గందరగోళానికి గురవుతుంటారు.  కానీ ఇది చాలా సరళమైన, విస్తృత‌మైన కోర్సు. మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, జెనెటిక్స్, మాలిక్యులర్ అండ్ సెల్యులార్ బయాలజీ, ఫార్మకాలజీ, డెయిరీ టెక్నాలజీ, అగ్రి-టెక్, వైరాలజీ, బయోస్టాటిస్టిక్స్ ఇంకా అనేక ఇతర విభాగాలు ఈ బ‌యోటెక్నాల‌జీలో ఉన్నాయి.

ముఖ్య‌మైన విభాగాలు

మైక్రోబయాలజీ:  వైద్య‌, ఫార్మా రంగాల్లో ప్ర‌స్తుతం ఈ విభాగానికి అపార‌మైన ఉద్యోగావ‌కాశాలు ఉన్నాయి. దీంతో సైన్స్ విద్యార్థులు ఎక్కువ మంది బ‌యోటెక్నాల‌జీలో ఈ మైక్రోబ‌యాల‌జీని ఎంచుకుంటున్నారు. ఇది బ్యాక్టీరియా, వైరస్‌లు, శిలీంద్రాలు, ప్రోటోజోవా మొదలైన సూక్ష్మ జీవులు, మానవ శరీరంపై వాటి ప్రభావం గురించి అధ్య‌య‌నం చేస్తుంది. ఈ కోర్సు బ్యాక్టీరియా, వైరస్‌ల‌కు సంబంధించిన వ్యాధుల అంశాన్ని కూడా వివరిస్తుంది.

బయోకెమిస్ట్రీ: ఈ విభాగం జీవ‌,ర‌సాయ‌న శాస్త్రాల‌అధ్యయనంతో ప్రధానంగా వ్యవహరిస్తుంది. ఇది జీవ కణాల లోపల సంభవించే రసాయన ప్రక్రియ గురించి తెలియజేస్తుంది. ఇందులో సంక్లిష్ట అణువుల నిర్మాణం, ప్రవర్తన, కణాలు, కణజాలాలు మొదలైన విష‌యాల గురించి ప్రధానంగా తెలుసుకోవ‌చ్చు.

ఫార్మకాలజీ: ఇందులో ఫార్మకోలాజికల్ సైన్స్ ను అధ్యయనం చేస్తారు. మందులు, వాటి ప్రభావాల గురించి తెలుసుకోవ‌చ్చు. ఒక జీవికి అవసరమైన మందులు లేదా ఔషధాల‌గురించి ప్రాథమిక అవగాహన కల్పిస్తుంది. ఇది కార్డియోవాస్కులర్, న్యూరోలాజికల్, ఆర్థో వంటి అవయవ వ్యవస్థల గురించీ వివరిస్తుంది. ఫార్మకాలజీని ఎంచుకునే విద్యార్థులకు ప్రయోగశాలలు, ఫోరెన్సిక్ ల్యాబ్‌లు, ఔషధ కంపెనీల్లో మంచి అవకాశాలు లభిస్తాయి.

అగ్రి-టెక్: అగ్రి-టెక్‌ను అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ అని కూడా పిలుస్తారు. దీని ద్వారా కొత్త ఆవిష్కరణలు, విభిన్న జీవ సాంకేతిక పరిజ్ఞానాలతో వ్యవసాయ రంగాన్ని మెరుగుపరచడానికి ఉన్న అవకాశాలను అధ్యయనం చేస్తారు. ఇది యంత్రాలు, బయో గ్యాస్, కొత్త టెక్నాలజీ, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల్లో కూడా సహాయపడుతుంది, వ్యవసాయ రంగం సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త‌పుంత‌లు తొక్క‌డానికి ఈ కోర్సు ఎంత‌గానో దోహ‌ద‌ప‌డుతుంది. వ్యవసాయ ఉత్పత్తిని మెరుగుపరచడం, రైతులకు మరింత ప్రభావవంతమైన పంటలను అందించ‌డంలో వ్యవసాయ ఇంజనీర్లు ప్రధాన పాత్ర పోషిస్తుంటారు.

పెరుగుతున్న అవకాశాలు

కొవిడ్ మహమ్మారి కార‌ణంగా ప్రజల జీవితాలు అస్తవ్యస్తమయ్యాయి. దీంతో మ‌న‌వైద్య, ఆరోగ్య వ్యవస్థల్లోని లోపాలు బయటపడ్డాయి. దేశంలో పటిష్టమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అభివృద్ధి చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో మన దేశంలో వివిధ ప‌రిశోధ‌న‌లు, ప్ర‌యోగాలు, డిజైన్ పరికరాల త‌యారీ, ఫార్మారంగం వంటి వాటిలో పని చేసేందుకు ఎక్కువ మంది బయోటెక్నాలజీ నిపుణుల అవసరం ఏర్ప‌డింది.  డిప్లొమా మొదలు పీజీ వరకు ఏ కోర్సు చేసినా వెంటనే ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలనే ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇప్పటి నుంచే బయోటెక్నాలజీని దృష్టిలో ఉంచుకొని కెరియర్ ను ప్లాన్ చేసుకోవచ్చు.

Posted Date: 21-04-2021


 

కోర్సులు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌