• facebook
  • whatsapp
  • telegram

ఆహార తయారీలో... కొలువులు ఆహా!

మనోజ్కు వైవిధ్యం అంటే ఎంతో ఇష్టం. తినే ఆహారంలోనూ కొత్త రుచుల కోసం చూస్తుంటాడు. అదే విధంగా సంప్రదాయ కోర్సులకు సంబంధం లేని విభిన్నమైన కోర్సు చదవాలని ఆశించాడు.  తన అభిరుచికి తగినట్లు మంచి విద్యాసంస్థలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కోర్సులో చేరి, వరసగా డిగ్రీ, పీజీ కోర్సులు పూర్తిచేశాడు. వేగంగా వృద్ధి చెందుతున్న ఈ రంగంలో అవకాశాలు ఎక్కువ ఉండటం, ఆసక్తితో తాను నేర్చుకున్న  నైౖపుణ్యాల మూలంగా సులువుగానే అతడికి కొలువు దొరికింది!

 ఆహార తయారీ రంగంలో భారీస్థాయిలో ఉద్యోగాలు వస్తున్నాయి. గత నాలుగేళ్లలో దీనిలో 3.85 లక్షల కొలువుల కల్పన జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి మరో 4 లక్షల కొత్త ఉద్యోగాలు లభిస్తాయని కేంద్రమంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌ చేసిన ప్రకటన ఈ రంగంలో కెరియర్‌ను ఎంచుకున్నవారికి ఉత్సాహం కల్గించేదే! ప్రభుత్వం ప్రత్యేకంగా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)ని స్థాపించి ఈ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాభివృద్ధికి అవసరమైన నిధులు సమకూర్చబోతోంది. ఈ నేపథ్యంలో దీనిలో కెరియర్‌ అవకాశాల గురించి తెలుసుకుందాం!

   ఆధునిక జీవనశైలికి అనుగుణమైన అభిరుచులూ, పెరుగుతున్న ఆహారోత్పత్తి, నిల్వ సామర్థ్యాల కారణంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగం అభివృద్ధి చెందుతోంది. ముడిపదార్థాలను ఆహార పదార్థాలుగా మార్చడానికి ఉపయోగించే మెలకువలూ, పద్ధతులూ దీనిలో ఉంటాయి. వేగంగా పరిధిని విస్తరించుకుంటున్న ఈ రంగం సైన్స్‌, ఇంజినీరింగ్‌.. ఇలా అన్ని రకాల నేపథ్యాలవారికీ ఉద్యోగావకాశాలను కల్పిస్తోంది. ‘భవిష్యత్తులో మొత్తం వ్యవసాయోత్పత్తుల విలువ విపరీతంగా మారనుంది. దేశంలో ఆహారోత్పత్తి.. ప్రధాన పరిశ్రమల్లో ఒకటిగా మారనుంది' అని గత నవంబర్‌లో ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ చేసిన వ్యాఖ్యలు రాబోయే కాలంలోనూ ఈ రంగ ఉజ్వల భవితను సూచిస్తున్నాయి.

   వ్యవసాయం నుంచి మాన్యుఫాక్చరింగ్‌ వరకూ సంబంధం ఉండటంతో ఈ రంగంలో నేరుగా, పరోక్షంగా చాలా ఉద్యోగావకాశాలు ఏర్పడుతున్నాయి. పైగా మనదేశం ఆహారోత్పత్తిలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. పెరుగుతున్న ఆరోగ్య స్పృహ కారణంగా రాబోయే సంవత్సరాల్లో ఆరోగ్యకరమైన, ఆధునిక ఆహారోత్పత్తులకూ, వాటిని అందించగల నిపుణులకూ మరింత గిరాకీ పెరిగే అవకాశముంది.

   ఆహార ఉత్పత్తి, రవాణా, నిల్వ, పరిరక్షణ, ప్యాకేజింగ్‌, క్యానింగ్‌, ఆధునిక యంత్రాలను ఉపయోగించడం, పరిశోధన మొదలైన ప్రధాన అంశాలను ఈ కోర్సుల్లో నేర్పుతారు. ఆహార పదార్థాలను పరిరక్షించడానికి ఫ్లేవర్లను జోడించడం, కృత్రిమ రంగులను అద్దడం లాంటివి చేస్తున్నారు. ఈ కోర్సులో ఆహార పరిశ్రమలో ఉపయోగించే రసాయనాల పరిజ్ఞానాన్ని అందిస్తారు.

ఉపాధి అవకాశాలు

   రాబోయేకాలంలో దేశంలో ఆహారోత్పత్తి రెట్టింపు అయ్యే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాబట్టి ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో డిగ్రీ చేసినవారికి ఆదరణ పెరుగుతుంది. వీరికి క్యానింగ్‌, డెయిరీ అండ్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ప్యాకేజింగ్‌, ఫ్రోజెన్‌ ఫుడ్‌/ రెఫ్రిజిరేషన్‌, థర్మోప్రాసెసింగ్‌ విభాగాల్లో ఎక్కువగా అవకాశాలుంటాయి. ఫ్రూట్స్‌ అండ్‌ వెజిటబుల్స్‌ ప్రాసెసింగ్‌, ఫిషరీస్‌, మిల్క్‌ అండ్‌ మిల్క్‌ ప్రొడక్ట్స్‌, మీట్‌ అండ్‌ పౌల్ట్రీ, ఆల్కహాలిక్‌ బెవరేజెస్‌, సాఫ్ట్‌డ్రింక్స్‌, గ్రెయిన్‌ ప్రాసెసింగ్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలోని కొన్ని ఉపశాఖలు. ఇవేకాకుండా బేకరీ సంబంధ, చాక్లెట్స్‌, కోకా ఉత్పత్తులు, సోయా, మినరల్‌ వాటర్‌, హై ప్రోటీన్‌ ఫుడ్స్‌, సాఫ్ట్‌ బెవరేజెస్‌, ఆల్కహాలిక్‌, నాన్‌ ఆల్కహాలిక్‌ ఫ్రూట్‌ బెవరేజెస్‌ మొదలైన వాటిల్లోనూ ఉద్యోగావకాశాలుంటాయి.

   ఈ రంగంలో ఫ్రెషర్లకూ, అనుభవజ్ఞులైన ప్రొఫెషనల్స్‌కూ ఉద్యోగావకాశాలు పుష్కలం. మేనేజర్లు, ఫుడ్‌ టెక్నాలజిస్ట్స్‌, ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లు మంచి అవకాశాలు పొందుతున్నారు. ఈ రంగంలో గ్రాడ్యుయేట్లు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సంస్థలు, ఫుడ్‌ రిసెర్చ్‌ లేబొరేటరీలు, హాస్పిటల్స్‌, కేటరింగ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌, రిటైలర్స్‌, ఫుడ్‌ హోల్‌సేల్‌, రెస్టారెంట్లలో కొలువులు పొందొచ్చు. మిల్క్‌ ప్రొడక్ట్స్‌, గ్రెయిన్స్‌, ఫ్రూట్స్‌ అండ్‌ వెజిటబుల్స్‌, ఫిషరీస్‌, కాన్ఫెక్షనరీ, బెవరేజెస్‌, ప్యాకేజ్‌డ్‌/ కన్వీనియన్స్‌ ఫుడ్స్‌, ప్లాంటేషన్‌ ప్రొడక్ట్స్‌, హెల్త్‌ ఫుడ్స్‌, సప్లిమెంట్లు వంటి వివిధ విభాగాల్లో ఉద్యోగాలుంటాయి. బాక్టీరియాలజిస్ట్‌, టాక్సికాలజిస్ట్‌, ఫుడ్‌ టెక్నాలజిస్ట్‌, ఫుడ్‌ బ్యాచ్‌ మేకర్‌, ఫుడ్‌ కుకింగ్‌ మెషిన్‌ ఆపరేటర్స్‌ అండ్‌ టెండర్స్‌, బేకర్స్‌ పోస్టులకు సంస్థలు వీరిని ఎంచుకుంటాయి.

   అనలిటికల్‌ కెమిస్ట్స్‌, రిసెర్చ్‌ సైంటిస్ట్స్‌, బయోకెమిస్ట్స్‌, ఇంజినీర్స్‌ (మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, అగ్రికల్చరల్‌, కెమికల్‌, సివిల్‌, ఇండస్ట్రియల్‌), హోమ్‌ ఎకనామిస్ట్స్‌, మేనేజర్స్‌, అకౌంటెంట్స్‌లకూ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలో కొలువులుంటాయి.

   ఎంపిక చేసుకుంటున్న ప్రముఖ సంస్థలు: డాబర్‌ ఇండియా, అమూల్‌, ఎంటీఆర్‌, ఐటీసీ లిమిటెడ్‌, ఆగ్రోటెక్‌ ఫుడ్స్‌, పార్లే ప్రొడక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, క్యాడ్‌బరీ ఇండియా లిమిటెడ్‌, నెస్లే ఇండియా, పెప్సికో ఇండియా, బ్రిటానియా ఇండస్ట్రీస్‌, హిందుస్థాన్‌ యూనీలివర్‌, గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌ మొదలైనవి.

   విద్యార్హత, అనుభవం, నైపుణ్యాలను బట్టి జీతభత్యాలు ఆధారపడి ఉంటాయి. ఫ్రెషర్‌గా సంవత్సరానికి రూ.2.5- రూ. 3 లక్షల వరకూ సంపాదించగలుగుతారు. అనుభవమున్నవారికి ఏడాదికి రూ.4 లక్షల నుంచి రూ.5.5 లక్షల వరకు వేతనం లభిస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లో.. 

ఎంసెట్‌ ర్యాంకు ద్వారా ప్రవేశం కల్పిస్తున్న కొన్ని సంస్థలు..

*» ఆచార్య ఎన్‌జీ రంగా యూనివర్సిటీ

*» యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ టెక్నాలజీ 

*» ఉస్మానియా యూనివర్సిటీ  

»*  అరోరా టెక్నలాజికల్‌ అండ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌- హైదరాబాద్‌  

*» కాలేజ్‌ ఆఫ్‌ ఫుడ్‌ అండ్‌ సైన్స్‌ టెక్నాలజీ- బాపట్ల 

*» విజ్ఞాన్‌ యూనివర్సిటీ- గుంటూరు

బీఎస్‌సీ- ఫుడ్‌ టెక్నాలజీ కోర్సును అందిస్తున్నవాటిలో కొన్ని..

*» ఆదికవి నన్నయ యూనివర్సిటీ- రాజమండ్రి 

*» ఆంధ్రా లయోలా కాలేజ్‌- విజయవాడ  

*» ఆంధ్రా యూనివర్సిటీ అనుబంధ కళాశాలలు  

*» హోమ్‌సైన్స్‌ కాలేజ్‌- హైదరాబాద్‌  

*» పయనీర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌- హైదరాబాద్‌.

ఏయే కోర్సులు?
 

దీనిలో డిప్లొమా, సర్టిఫికెట్‌, డిగ్రీ, డాక్టొరల్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కళాశాల/ విశ్వవిద్యాలయాన్ని బట్టి కోర్సు కాలవ్యవధి ఒక్కోకోర్సుకు ఒక్కోలా ఉంటుంది.

సర్టిఫికెట్‌ కోర్సు: 

*» సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ అండ్‌  ప్రిజర్వేషన్‌

డాక్టొరల్‌ కోర్సులు: 

*» పీహెచ్‌డీ ఇన్‌ ఫుడ్‌ టెక్నాలజీ/ బయోటెక్నాలజీ/ ఫుడ్‌ ప్రిజర్వేషన్‌

డిప్లొమా కోర్సులు: 

*» డిప్లొమా ఇన్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ 

*» డిప్లొమా ఇన్‌ ఫుడ్‌ ప్రిజర్వేషన్‌ 

*» డిప్లొమా ఇన్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ టెక్నాలజీ

బ్యాచిలర్‌ కోర్సులు (మూడు/ నాలుగేళ్లు): 

*» బీఎస్‌సీ ఇన్‌ హోమ్‌సైన్స్‌/ ఫుడ్‌ టెక్నాలజీ/

ఫుడ్‌ సైన్స్‌ 

»* బీటెక్‌ ఇన్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ టెక్నాలజీ

మాస్టర్‌ డిగ్రీ (రెండేళ్లు): 

* ఎంఎస్‌సీ ఇన్‌ హోంసైన్స్‌/ ఫుడ్‌ టెక్నాలజీ/ ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌/ బయోటెక్నాలజీ 

»ఎంటెక్‌ ఇన్‌ హోంసైన్స్‌/ ఫుడ్‌ టెక్నాలజీ/ ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌/ బయోటెక్నాలజీ

అర్హత, ప్రవేశం 

ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో సర్టిఫికెట్‌ కోర్సు చేయాలనుకునేవారు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. బ్యాచిలర్‌ కోర్సులు చేయాలనుకునేవారు 10+2లో సైన్సు గ్రూపులు (ఎంపీసీ/ బైపీసీ) చదివుండాలి. జేఈఈ మెయిన్స్‌ ద్వారానూ అడ్మిషన్‌ పొందొచ్చు. ఎంఎస్‌సీ, ఎంటెక్‌ చేయాలనుకునేవారు సైన్స్‌ విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తిచేసుండాలి. ఎంటెక్‌ చేయాలనుకునేవారు గేట్‌ రాయాల్సి ఉంటుంది. కొన్ని ప్రైవేటు విశ్వవిద్యాలయాలు తమకంటూ ప్రత్యేకమైన ప్రవేశపరీక్షలను నిర్వహిస్తున్నాయి.

ప్రవేశాలు కల్పిస్తున్న ప్రముఖ సంస్థల్లో కొన్ని..

*» ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, ఖరగ్‌పూర్‌

*» బి.పంత్‌ యూనివర్సిటీ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ టెక్నాలజీ, పట్నాగర్‌ 

*» రాజస్థాన్‌ టెక్నికల్‌ యూనివర్సిటీ, కోటా, రాజస్థాన్‌ 

»* ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫుడ్‌ ప్రాసెస్‌ ఇంజినీరింగ్‌, ఘజియాబాద్‌, యూపీ 

* ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐసీటీ), ముంబయి 

»ఎంఎస్‌ యూనివర్సిటీ, వడోదర 

* యూనివర్సిటీ ఆఫ్‌ బాంబే, ముంబయి 

* అమిటీ యూనివర్సిటీ- నోయిడా 

* సామ్‌ హిగ్గిన్‌ బోధమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ టెక్నాలజీ అండ్‌ సైన్సెస్‌- అలహాబాద్‌

Posted Date: 16-12-2021


 

కోర్సులు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌