• facebook
  • whatsapp
  • telegram

ఆపత్కాలంలో.. ఆరోగ్య‌సేవ‌లో..

 హెల్త్‌కేర్ రంగంలో పెరుగుతున్న అవ‌కాశాలు

కొవిడ్‌ పరిణామం కారణంగా ఎన్నో రంగాలు దెబ్బతిన్నాయి. ప్రభావం పడనివి చాలా తక్కువ. వాటిల్లో వైద్య, ఆరోగ్య రంగం    ఒకటి. ఈ ఆపద సమయంలో ముందుండి సేవలందిస్తున్న వైద్యులూ, సిబ్బందీ ఎంతో     మందిలో స్ఫూర్తి నింపుతున్నారు. దీంతో ఎందరో విద్యార్థులు ఈ రంగంపై ఆసక్తిని చూపుతున్నారు. కానీ వైద్యవిద్య దేశంలో అందరికీ అందుబాటులో లేదన్నది వాస్తవం. ఇలాంటి వారికోసం ఇదే రంగంలో ఇంకెన్నో విభాగాలుఉన్నాయి. మంచి ఉపాధి అవకాశాలనూ అందిస్తున్నాయి. అవేంటో చూద్దామా?

అందరూ ఆరోగ్యంగా, సురక్షితంగా జీవించడంపై దృష్టి సారించేలా చేసింది కరోనా. ఆరోగ్యంపై పెరుగుతున్న అవగాహన సంబంధిత ఉత్పత్తుల, సేవల పెరుగుదలకూ దారి తీయటం సహజం. ఫలితంగా ఈ రంగంలో సుశిక్షితులైన నిపుణుల అవసరాన్ని పెంచుతోంది. ఈ అనిశ్చిత పరిస్థితిలో భవిష్యత్తు సురక్షితంగా ఉండే కెరియర్‌లను ఎంచుకోవాలనుకునేవారికి వైద్య, ఆరోగ్య రంగం ఓ మంచి వేదిక అవుతోంది. గత ఏడాది కాలంగా వైద్యులు, సిబ్బందిపై పెరుగుతున్న సానుకూల అభిప్రాయం కూడా ఈ కెరియర్లను ఎంచుకునేలా ప్రోత్సహిస్తోంది.  

ఒక నివేదిక ప్రకారం గత ఏడాది లాక్‌డౌన్‌ నుంచి ప్రస్తుతం వరకు ఉద్యోగాల కోత లేకపోవడమే కాకుండా నిరంతరం అవకాశాలు కల్పిస్తున్నవాటిల్లో హెల్త్‌కేర్‌ రంగముంది. జీతభత్యాల్లోనూ గత ఏడాదితో పోలిస్తే కనీసం 8 శాతం పెరుగుదల కనిపిస్తోంది. హెల్త్‌కేర్‌ మార్కెట్‌ 2022నాటికి మూడురెట్లు అంటే 8.6 ట్రిలియన్‌ రూపాయలకు చేరుతుందని ఎఫ్‌డీఐ అంచనా. వైద్య, ఆరోగ్య రంగం అనగానే అందరికీ వైద్య వృత్తే గుర్తుకొస్తుంది. కానీ దీనిలో ఇంకా ఎన్నో అనుబంధ విభాగాలున్నాయి. విద్యార్థులు తమ ఆసక్తీ, అభిరుచుల ప్రకారం వీటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవచ్చు.

నర్సింగ్‌  

తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు నర్సింగ్‌ కోర్సులను అందిస్తున్నాయి. సాధారణంగా ఏఎన్‌ఎం (యాక్సిలరీ నర్సింగ్‌ మిడ్‌వైఫరీ), బీఎస్‌సీ నర్సింగ్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఏఎన్‌ఎం కోర్సును ఏ గ్రూపు వారైనా ఎంచుకోవచ్చు. బీఎస్‌సీ నర్సింగ్‌కు మాత్రం ఇంటర్‌లో బైపీసీ చదివినవారే అర్హులు. అన్ని కోర్సుల్లోకెల్లా బీఎస్‌సీ నర్సింగ్‌కు ప్రాధాన్యమెక్కువ. జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేటు విద్యాసంస్థలు బీఎస్‌సీ నర్సింగ్‌లో ప్రవేశాలను కల్పిస్తున్నాయి. జాతీయ స్థాయిలో ఎయిమ్స్‌ లాంటివి ప్రవేశపరీక్షలు నిర్వహిస్తున్నాయి. రాష్ట్ర స్థాయిలో చాలావరకూ మెరిట్‌ ఆధారంగానే ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఏఎన్‌ఎం కోర్సు కాలవ్యవధి రెండేళ్లు. ఇది చేసినవారు గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారులు, మహిళలు, వృద్ధులకు అవసరమైన ప్రాథమిక వైద్యసేవలు అందిస్తారు.

క్లినికల్‌ రిసెర్చ్‌

ప్రతి ఔషధం క్లినికల్‌ రిసెర్చర్లు పరీక్షించాకే మార్కెట్‌లోకి వస్తుంది. మెడికల్‌ రిసెర్చ్‌లో క్లినికల్‌ రిసెర్చర్లకు గిరాకీ ఎక్కువ. వీరు వివిధ డ్రగ్‌లు, జబ్బులపై పరిశోధనలు చేస్తారు. ఔషధాలు, మెడికల్‌ ఎక్విప్‌మెంట్ల ప్రభావం, సురక్షిత, పనిచేసే విధానం లాంటివాటిపై పనిచేస్తారు. వీటిలోనూ రకాలుంటాయి. సాధారణంగా డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఎక్కువగా బైపీసీ వారికే అవకాశముంది. చాలాకొద్ది సంస్థలు ఎంపీసీ వారికీ అవకాశం కల్పిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్లినికల్‌ రిసెర్చ్‌ (ఐసీఆర్‌ఐ), ముంబయి వంటి ప్రముఖ సంస్థలు తక్కువ సంఖ్యలో 
ఈ కోర్సును అందిస్తున్నాయి. చాలావరకూ ప్రత్యేకంగా ప్రవేశపరీక్షను నిర్వహించి, ప్రవేశాలు కల్పిస్తున్నాయి.

సైకాలజీ

2017లో వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌.. మన దేశాన్ని ‘ఎక్కువ కుంగుబాటున్న దేశం’గా అభివర్ణించింది. ప్రతి ఏడుగురిలో ఒకరికి మానసికపరమైన సమస్యలుండటమే కారణం. లాక్‌డౌన్‌ తరువాత ఈ పరిస్థితి మరింత పెరిగింది. కొవిడ్‌ రెండో వేవ్‌ మానసికంగా ఎంతోమందిపై ఒత్తిడిని పెంచుతోంది. నిరుద్యోగం, ఆరోగ్యాలకు సంబంధించి భయాందోళనలూ, ఆర్థిక ఇబ్బందులూ ఇందుకు కారణమవుతున్నాయి. దీంతో చాలామందికి సంబంధిత నిపుణుల అవసరం పెరుగుతోంది. 

సైకాలజీ సంబంధిత అంశాలపై అధ్యయనం చేసే శాస్త్రం. ఈ నిపుణులు వ్యక్తులు స్పందించే తీరు, భావోద్వేగాలు, ప్రవర్తన మొదలైన అంశాలను పరిశీలించి వారి సమస్యలను గుర్తిస్తారు. తద్వారా థెరపీ, కౌన్సెలింగ్‌ ద్వారా చికిత్సనందిస్తారు. డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సులున్నాయి. సైన్స్‌ సబ్జెక్టులతో  ఇంటర్‌ పూర్తిచేసినవారు దీన్ని ఎంచుకోవచ్చు. దీనిలో క్లినికల్, ఫోరెన్సిక్, ఇండస్ట్రియల్‌/ ఆర్గనైజేషన్‌ బిహేవియర్, స్పోర్ట్స్, స్కూల్, కౌన్సెలింగ్, రిహాబిలిటేషన్, హెల్త్, కాగ్నిటివ్‌ న్యూరోసైన్స్, ఎడ్యుకేషనల్, బయో సైకాలజీ, ఎన్విరాన్‌మెంటల్‌ సైకాలజీ మొదలైన స్పెషలైజేషన్లూ అందుబాటులో ఉన్నాయి. కోర్సు పూర్తిచేసిన తర్వాత నచ్చిన విభాగంలో కెరియర్‌ మలచుకోవచ్చు. వీరికి బోధన, పరిశోధన రంగాల్లోనూ అవకాశాలుంటాయి.

పారామెడికల్‌  

అనారోగ్యం కారణంగా సంప్రదించేది వైద్యులనే అయినా డాక్టర్లకు సైతం అందులో సాయమందించేవారు పారామెడిక్స్‌. రోగ నిర్ధారణ పరీక్షలు, స్కానింగ్, ఎక్స్‌రేలు, అల్ట్రాసౌండ్, అనస్తీషియా, ఎంఆర్‌ఐ తదితరమైనవి వీరి పనిలో భాగంగా ఉంటుంది. రెండు రకాల కోర్సులు- బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సులు, డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. డిప్లొమా కోర్సుల కాలవ్యవధి రెండేళ్లు కాగా బ్యాచిలర్‌ కోర్సులకు మూడేళ్లు. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆక్యుపేషనల్‌ థెరపీ (బీఓటీ), ఆడియాలజీ అండ్‌ స్పీచ్‌ థెరపీ, ఫిజియోథెరపీ, ఆపరేషన్‌ థియేటర్‌ టెక్నాలజీ, డయాలసిస్‌ టెక్నాలజీ, మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ, అనస్తీషియా టెక్నాలజీ, ఆప్టోమెట్రీ, రేడియాలజీ, ఎక్స్‌రే టెక్నాలజీ, మెడికల్‌ రికార్డ్‌ టెక్నాలజీ మొదలైన కోర్సులు అందుబాటులో ఉన్నాయి. చాలావరకూ సంస్థలు మెరిట్‌ ఆధారంగానే ప్రవేశాలు కల్పిస్తున్నాయి. కొన్ని ప్రముఖ సంస్థలు మాత్రం ప్రవేశపరీక్ష నిర్వహించి, వాటిలో సాధించిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి.

ఫార్మసీ  

బీఫార్మసీ, ఫార్మా-డీ కోర్సులు ఉన్నాయి. వీటికి ఎంసెట్‌ ర్యాంకు ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. బీఫార్మసీ కాలవ్యవధి నాలుగేళ్లు. దీన్ని పూర్తిచేసినవారు ఫార్మసిస్ట్, డ్రగిస్ట్, పేషెంట్‌ కౌన్సెలింగ్‌/ ఫార్మా సంస్థల్లో ప్రొడక్షన్, క్వాలిటీ విభాగాల్లో ఉద్యోగావకాశాలు పొందొచ్చు. ఔషధ వినియోగం, వ్యాధి నిర్ధారణ చికిత్స, ఔషధ ప్రతికూల ప్రభావాల సేకరణ, పర్యవేక్షణకు సంబంధించిన అంశాల గురించి చదివేది ఫార్మా-డీ. దీని కాలవ్యవధి ఆరేళ్లు.  

బీఎస్‌సీ

బైపీసీ తరువాత డిగ్రీ కోర్సులు అనగానే బయాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ వంటి సంప్రదాయ కోర్సులే గుర్తుకువస్తాయి. కానీ బయో

కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్, అగ్రికల్చర్‌ జియాలజీ, జెనెటిక్స్, ఫోరెన్సిక్‌ సైన్స్, ఫుడ్‌ టెక్నాలజీ, హోంసైన్స్, కమ్యూనిటీ సైన్స్, స్పోర్ట్స్‌ అండ్‌ ఫిట్‌నెస్, క్లినికల్‌ మైక్రోబయాలజీ, ఆక్వాకల్చర్, ఫిషరీస్‌ అండ్‌ వైల్డ్‌ సైన్సెస్, ఫారెస్ట్రీ, న్యూట్రిషన్‌ అండ్‌ డైటెటిక్స్‌ మొదలైన స్పెషలైజ్‌డ్‌ కోర్సులూ అందుబాటులో ఉన్నాయి. కొవిడ్‌ విస్తృతి తరువాత ఈ స్పెషలైజ్‌డ్‌ కోర్సులకు ఆదరణ పెరిగింది. ముఖ్యంగా మైక్రోబయాలజీ, వైరాలజీ, ఇమ్యూనాలజీ కోర్సులపై ఆసక్తి పెరుగుతోంది. వీటిల్లో చాలావరకూ మెరిట్‌ ఆధారంగానే ప్రవేశాలున్నాయి. చాలాకొద్ది సంస్థలు ఎంచుకున్న కోర్సునుబట్టి ప్రవేశపరీక్ష నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తున్నాయి.

Posted Date: 13-05-2021


 

కోర్సులు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌