• facebook
  • whatsapp
  • telegram

నేచురోప‌తి

   అల్లోప‌తి, హోమియో, ఆయుర్వేదం...ఇవ‌న్నీ మ‌న‌కు బాగా తెలిసిన‌వే. జ‌బ్బుల‌ను న‌యం చేసేవే. కానీ కొన్ని వ్యాధులు, రుగ్మత‌ల‌కు ఏ మందులు వాడినా ప్రయోజ‌నం ఉండ‌దు. వీటిలో చాలా వాటికి నేచురోప‌తి ద్వారా చ‌క్కటి ప‌రిష్కారం ల‌భిస్తుందిప్పుడు. నేచురోప‌తి అంటే ప్రకృతితో మ‌మేకం కావ‌డ‌మే. ప‌ళ్లు, మూలికలు, ఖ‌నిజ‌ల‌వ‌ణాలు, మ‌ట్టి ఆధారంగా చికిత్సలు చేస్తారు. జ‌బ్బుని బ‌ట్టి యోగాస‌నాలు వేయించ‌డం, మ‌ట్టి ప‌ట్టీలు వేయ‌డం, మూలికా, తైల మ‌ర్దన‌...ఇలా నేచురోప‌తిలో ప‌లు చికిత్సలు ఉంటాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండ‌క‌పోవ‌డం నేచురోప‌తి మ‌రో ప్రత్యేక‌త‌గా చెప్పుకోవ‌చ్చు. ఈ కోర్సు చ‌దువుకున్నవాళ్లకు ప్రకృతిలో లభిస్తున్న వివిధ మూలికలు, వాటివల్ల కలిగే ప్రయోజనాల గురించి బోధిస్తారు. యోగా నేర్పించి, ఆయా ఆస‌నాల‌వారీ ప్రయోజ‌నాలను వివ‌రిస్తారు. ఏ పండుతో ఎలాంటి ఉప‌యోగ‌మో, ఏ మూలిక‌లో ఏముంటాయో తెలిసేలా చేస్తారు. నేచురోపతిక్ ప్రాక్టీషనర్ ఆప‌రేష‌న్‌తో పనిలేకుండా వ్యాధిని ఎలా నివారించాలో కోర్సు ద్వారా నేర్చుకుంటారు. ప్రకృతి చికిత్సల్లో అనుసరించాల్సిన విధానాలు.. ఆవిరి స్నానం, ఉప‌వాస ప్రక్రియ‌...త‌దితరాలు తెలుసుకుంటారు.

కోర్సులివీ...

   నేచురోప‌తిలో బ్యాచిలర్ ఆఫ్ నేచురోపతి అండ్ యోగిక్ సైన్స్ (బీఎన్‌వైఎస్) కోర్సు ముఖ్యమైంది.. ఈ కోర్సును తెలుగు రాష్ట్రాల్లో రెండు కాలేజీలు అందిస్తున్నాయి. అవి...

1) గాంధీ నేచర్ క్యూర్ కాలేజ్, హైదరాబాద్ (గవర్నమెంట్).

2) నారాయణ నేచర్ క్యూర్ కాలేజ్, నెల్లూరు (ప్రైవేటు)

   బీఎన్‌వైఎస్ కోర్సు ఇత‌ర మెడిక‌ల్ బ్యాచిల‌ర్ డిగ్రీల‌తో స‌మాన‌మైందిగా చెప్పుకోవ‌చ్చు. దీనికి ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీ, విజ‌య‌వాడ గుర్తింపు ఉంది. ఇంట‌ర్లో పిజిక్స్‌, కెమిస్ట్రీ, బోట‌నీ, జువాల‌జీల్లో 50 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణులు ఈ కోర్సుకి అర్హులు. కోర్సు వ్యవ‌ధి అయిదున్నరేళ్లు. ఇందులో ఏడాది ఇంట‌ర్న్‌షిప్ త‌ప్పనిస‌రి. కోర్సుని 3 పార్టులుగా విభ‌జించారు. ఏడాదిన్నర‌పాటు ఒక్కో పార్టు ఉంటుంది. మూడు పార్టులు క‌లిపి నాలుగున్నరేళ్లలో పూర్తవుతాయి. చివ‌రి ఏడాది ఇంట‌ర్న్‌షిప్ ఉంటుంది.

పార్ట్ 1లో: హ్యూమ‌న్‌ అనాట‌మీ, హ్యూమ‌న్‌ ఫిజియాల‌జీ అండ్ బ‌యోకెమిస్ట్రీ, నేచ‌ర్‌క్యూర్ ఫిలాస‌ఫీ అంశాలు బోధిస్తారు.

పార్ట్ 2లో: మైక్రోబ‌యాల‌జీ, ఫోరెన్సిక్ మెడిసిన్‌, పాథాల‌జీ, సోష‌ల్ ప్రివెంటివ్ మెడిసిన్‌, డ‌యాగ్నోస్టిక్ మెథ‌డ్స్‌, మ్యానుపులేటివ్ థెర‌పీ, యోగాథెర‌పీ అంశాలు ఉంటాయి.

పార్ట్ 3లో: క్రోమోథెర‌పీ, మ్యాగ్నటోథెర‌పీ, ఫాస్టింగ్ థెర‌పీ, న్యూట్రిష‌న్ డైటెటిక్స్‌, హైడ్రోథెర‌పీ, గైన‌కాల‌జీ అండ్ ఆబ్సెస్ట్రిక్స్‌, ఫిజియోథెర‌పీ, యోగాథెర‌పీలపై త‌ర‌గ‌తులు ఉంటాయి.

నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేచురోప‌తి, పుణె

   ఈ సంస్థ భార‌త ప్రభుత్వం, ఆయుష్ ఆధ్వర్యంలో ప‌నిచేస్తుంది. ఇక్కడ ఏడాది వ్యవ‌ధి ఉండే ట్రీట్‌మెంట్ అసిస్టెంట్ ట్రయినింగ్ కోర్సు అందుబాటులో ఉంది. నేచురోప‌తి ఆస్పత్రులు, స్పా, వెల్‌నెస్ సెంట‌ర్లలో ప‌నిచేయ‌డానికి ఈ కోర్సు ఉప‌యోగ‌ప‌డుతుంది. ఏడాదికి రెండు బ్యాచ్‌ల‌కు అవ‌కాశాలుంటాయి. జ‌న‌వ‌రి, జులైలో బ్యాచ్‌లు ప్రారంభ‌మ‌వుతాయి. ఒక్కో బ్యాచ్‌కు 40 మంది చొప్పున ఉంటారు. ప‌దోత‌ర‌గ‌తి పాసైన వాళ్లు ఈ కోర్సులో చేరొచ్చు. ఇంట‌ర్ చ‌దివిన‌వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఇంట‌ర్వ్యూలు నిర్వహించి అభ్యర్థుల‌ను ఎంపిక‌చేస్తారు. కోర్సుకు ఎంపికైన విద్యార్థుల‌కు నెల‌కు రూ.5000 చొప్పున స్టైపెండ్‌గా చెల్లిస్తారు.

వెబ్‌సైట్‌: http://punenin.org/index.htm

   ఎక్కువ మంది అధిక బ‌రువు, నెల‌స‌రి స‌మ‌స్యలు, హైబీపీ, డ‌యాబెటీస్‌, వెన్ను, కీళ్ల నొప్పులు, న‌రాల జ‌బ్బులు త‌దిత‌రాల‌తో బాధ‌ప‌డుతున్నారు. అల్లోప‌తిలో స‌రైన ప‌రిష్కారం ల‌భించ‌ని చాలామంది నేచురోప‌తి వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఈ కోర్సులు చ‌దివిన‌వాళ్లు సొంతంగా క్లినిక్కులు పెట్టుకుని రాణించ‌వ‌చ్చు లేదంటే స్పా సెంట‌ర్లలో కెరీర్ ప్రారంభించ‌వ‌చ్చు. ప్రముఖ ఆస్పత్రుల‌కు అనుబంధంగానూ సేవ‌ల‌ను కొన‌సాగించుకోవ‌చ్చు.వెబ్‌సైట్‌: www.nnymc.com

Posted Date: 08-02-2022


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌