• facebook
  • whatsapp
  • telegram

భవిష్యత్‌ అవకాశాలకు క్యూబర్‌నెటిస్‌!

డెవలపర్‌, అడ్మినిస్ట్రేటర్‌గా ఉద్యోగావకాశాలుకొత్త అవకాశాలకు క్యూబర్‌నెటిస్‌! ఇటీవల ఐటీలో ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్న అభ్యర్థులకు ఎదురవుతున్న ప్రశ్న.. క్యూబర్‌నెటిస్‌లో ప్రావీణ్యం ఉందా అని!.. వివిధ అప్లికేషన్లను ఉపయోగించడంలో ప్రస్తుతం ఇదొక ముఖ్యమైన టెక్నాలజీ. దీనిపై అవగాహన పెంచుకోవడం ద్వారా డెవలపర్, అడ్మినిస్ట్రేటర్‌గా అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. మరిన్ని వివరాలు పరిశీలిస్తే..


క్యూబర్‌నెటిస్‌ను గూగుల్‌ తొలిసారిగా 2014లో అభివృద్ధి చేసింది. ఈ టెక్నాలజీ కంటైనర్లతో అనుసంధానమై ఉన్న పనులను ఆటోమేట్‌ చేస్తుంది. దీన్ని అభివృద్ధి చేసేవరకూ గూగుల్‌ డాకర్‌ను ఉపయోగించింది. క్యూబర్‌నెటిస్‌ వచ్చాక.. పరిశ్రమకు పూర్తిస్థాయిలో ఉపయోగపడగలదు అని గమనించి ఉచిత, ఓపెన్‌సోర్స్‌ ప్రాజెక్టుగా విడుదల చేసింది. ఇప్పుడది విజయవంతంగా నడుస్తోంది. 2022 చివరినాటికి 61 శాతానికి పైగా సంస్థల్లో కంటైనర్‌ ఆర్కెస్ట్రేషన్‌ కోసం క్యూబర్‌నెటిస్‌నే ఉపయోగిస్తున్నారు.


ఏళ్లు గడిచేకొద్దీ మారుతున్న అవసరాలకు తగిన విధంగా క్యూబర్‌నెటిస్‌ కూడా అభివృద్ధి చెందుతూ వచ్చింది. ‘2022 స్టాక్‌ ఓవర్‌ఫ్లో డెవలపర్‌ సర్వే’ ప్రకారం.. క్యూబర్‌నెటిస్‌ ఇంజినీర్లకు రానున్న కాలంలో మరింత డిమాండ్‌ పెరగనుంది. 


క్యూబర్‌నెటిస్‌ ఒక ఓపెన్‌సోర్స్‌ ప్లాట్‌ఫామ్‌. ఇది కంటైనర్‌ అప్లికేషన్లకు సంబంధించి మాన్యువల్‌ అప్లికేషన్లను ఆటోమేట్‌ చేస్తుంది. గ్రూప్‌గా ఉన్న హోస్ట్‌లను క్లస్టర్‌ చేసుకుంటే.. అలాంటి క్లస్టర్లను క్యూబర్‌నెటిస్‌  సహాయంతో సులభంగా నిర్వహించవచ్చు.


ఉపయోగం ఏంటి?

క్యూబర్‌నెటిస్‌.. సంస్థలకు రకరకాలైన పనులకు ఉపయోగపడుతుంది. ఆర్కెస్ట్రేషన్‌ టూల్‌గా ముఖ్యపాత్ర పోషిస్తుంది. దీనివల్ల కంటైనర్లు టాస్కులను సులభంగా నిర్వహించడంతోపాటు రిస్కులను తగ్గిస్తాయి. క్లౌడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మైక్రోసర్వర్లను ఉపయోగించేటప్పుడు ఆర్గనైజేషన్‌ కోసం ఇది అవసరం పడుతుంది. 

ప్రొడక్షన్‌ ఎన్విరాన్‌మెంట్స్‌లో కంటైనర్లను ఉపయోగించడం మొదలుపెట్టాక క్యూబర్‌నెటిస్‌ అవసరం బాగా ఉంటుంది. ఫిజికల్, వర్చువల్‌ మెషీన్లలో కంటైనర్లను షెడ్యూల్, రన్‌ చేయడానికి దీని అవసరం బాగా ఉంటుంది. అంతేకాకుండా ఇది లోడ్స్‌ను సమతూకంలో ఉంచుతుంది. 

డెవలపర్స్, ఆపరేషన్స్‌ టీమ్స్‌ వారికి క్యూబర్‌నెటిస్‌ బాగా ఉపయోగపడుతుంది. ఉత్పాదకత పెంచడంలోనూ, బృందాలను సమన్వయం చేయడంలోనూ, వినియోగదారుడికి మెరుగైన సేవలు అందించడంలోనూ ఇది అక్కరకొస్తుంది.


ఇంకా..

ఆర్కెస్ట్రేషన్‌ ఫ్రేమ్‌వర్క్‌ లేకపోతే.. సర్వీసులు ఎక్కడో ఒకచోట రన్‌ అవుతూ.. ఏదైనా ఇబ్బంది ఎదురైతే దాన్ని ఎదుర్కోవడం కష్టమైపోతుంది. అదే ఈ ఫ్రేమ్‌వర్క్‌ ఉంటే రన్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఎలా ఉండాలో యూజర్‌ నిర్ణయించవచ్చు, అంతా అతడి చేతుల్లో ఉంటుంది. ఇందుకు క్యూబర్‌నెటిస్‌ సహాయపడుతుంది. ఇందులో వివిధ రకాల టూల్స్‌ ఉంటాయి. ఇది కాన్ఫిగరింగ్, డిప్లాయింగ్, మేనేజింగ్, మోనిటరింగ్‌ మాత్రమే కాకుండా ఇంకా పెద్దస్థాయి అప్లికేషన్లను కూడా సులభంగా చేయగలుగుతుంది. 

ఒకప్పుడు సంస్థలు అప్లికేషన్లను ఫిజికల్‌ సర్వర్ల మీద నడిపించేవి. ఇది రిసోర్సు వినియోగంలో సమస్యలకు కారణమయ్యేది. ఒకేచోట రెండు అప్లికేషన్లు రన్‌ అవుతూ ఉంటే.. కొన్నిసార్లు ఒక అప్లికేషన్‌ ఎక్కువ రిసోర్సును ఉపయోగించుకోవడం వల్ల మరో అప్లికేషన్‌ తక్కువగా పర్ఫామెన్స్‌ చూపించేది. అలా అని ఎక్కువ ఫిజికల్‌ సర్వర్లను ఉంచడం సంస్థలకు ఆర్థికంగా భారమవుతుంది. దీని కారణంగా వర్చువలైజేషన్‌ తెరమీదకు వచ్చింది. ఆ తర్వాత క్యూబర్‌నెటిస్‌ వంటి సాంకేతికత వినియోగం పెరిగింది.


నేర్చుకోవడం ఎలా..?

క్యూబర్‌నెటిస్‌ క్లస్టర్‌ ఆర్కెస్ట్రేషన్‌ సిస్టమ్‌ ప్రాథమిక అంశాల నుంచి నేర్చుకోవాలి. కంటైనరైజ్డ్‌ అప్లికేషన్‌ క్లస్టర్‌ను డిప్లాయ్‌ చేయడం, అప్డేట్‌ చేయడం, డీబగ్‌ చేయడం.. వంటివన్నీ నేర్చుకోవాలి. ఇది నేర్చుకోవడం మొదలుపెట్టే ముందు డిస్ట్రిబ్యూటెడ్‌ సిస్టమ్, అథెంటికేషన్‌ అండ్‌ ఆథరైజేషన్, కీ వాల్యూ స్టోర్, ఏపీఐ, వైఏఎంఎల్, కంటైనర్, సర్వీస్‌ డిస్కవరీ, వంటి అంశాలపై అవగాహన ఉండాలి. 

తర్వాత దీని ఆర్కిటెక్చర్‌ను అర్థం చేసుకోవాలి. కంట్రోల్‌ ప్లేన్, వర్కర్‌ నోడ్, యాడ్‌ఆన్‌ కాంపొనెంట్స్, నెట్‌వర్క్‌ డిజైన్‌ను తెలుసుకోవాలి. కాన్ఫిగరేషన్స్‌తోపాటు, ఆబ్జెక్ట్స్, రిసోర్సులను నేర్చుకోవాలి.


కోర్సులు

దీనికి సంబంధించి సర్టిఫికేషన్‌ కోర్సులు చాలానే అందుబాటులో ఉన్నాయి. ఎడ్‌ఎక్స్, ఎడ్యురేకా, అప్‌గ్రాడ్, కోర్సెరా, యుడెమీ వంటి లెర్నింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌ నుంచి నేర్చుకోవచ్చు. 

‘క్యూబర్‌నెటిస్‌ ఫర్‌ బిగినర్స్, డెవోప్స్‌ విత్‌ క్యూబర్‌నెటిస్, కోర్‌ కాన్సెప్ట్స్, క్యూబర్‌నెటిస్‌ ఫర్‌ డెవలపర్స్‌’ అంటూ రకరకాలైన కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా దీన్ని సులభంగా అధ్యయనం చేయవచ్చు.


ఉద్యోగాలు

సాధారణంగా క్యూబర్‌నెటిస్‌ సర్టిఫికేషన్‌తో రెండు రకాలైన మార్గాల్లో వెళ్లవచ్చు. ఒకటి డెవలపర్, రెండోది అడ్మినిస్ట్రేటర్‌. సర్టిఫైడ్‌ క్యూబర్‌నెటిస్‌ అప్లికేషన్‌ డెవలపర్, అడ్మినిస్ట్రేటర్, సెక్యూరిటీ స్పెషలిస్ట్‌.. ఇలా పలు ఉద్యోగాల్లోకి వెళ్లే అవకాశం ఉంది.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ నౌకాదళంలో 224 కొలువులకు నోటిఫికేషన్‌ (చివరి తేదీ: అక్టోబరు 29, 2023)

‣ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లోకి మార్గం.. మ్యాట్‌ (చివరి తేదీ: నవంబరు 28, 2023)

‣ దివ్యాంగులకు కేంద్రం ఆర్థిక సాయం (చివరి తేదీ: డిసెంబరు 31, 2023)

‣ నేరాల గుట్టు పట్టే కోర్సులు

‣ కొత్త పరిస్థితుల్లో కంగారొద్దు!

Posted Date: 19-10-2023


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌