• facebook
  • whatsapp
  • telegram

న్యాయం గెలిచే‘లా’! 

క్లాట్‌ - 2021  ప్రకటన విడుదల

ప్రముఖ సంస్థల్లో న్యాయవిద్యలో ప్రవేశానికి నిర్వహించే కామన్‌ లా అడ్మిషన్‌ టెస్టు (క్లాట్‌) ప్రకటన వెలువడింది. దేశవ్యాప్తంగా 22 జాతీయ సంస్థల్లో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీ ఎల్‌ఎల్‌బీ, ఏడాది వ్యవధి ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశానికి ఈ పరీక్షలో సాధించిన స్కోరు ప్రామాణికం. ఈ సంస్థల్లో చేరినవారు నాణ్యమైన న్యాయవిద్యను అభ్యసించడంతోపాటు, ప్రాంగణ నియామకాల్లో మేటి అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు. దేశంలోని ఎన్నో ఇతర సంస్థలూ క్లాట్‌ స్కోరుతో న్యాయవిద్యలో ప్రవేశానికి అవకాశం కల్పిస్తున్నాయి!

న్యాయవాద వృత్తిపై ఆసక్తి ఉన్న ఇంటర్మీడియట్‌ విద్యార్థులు రాయాల్సిన ముఖ్యమైన పరీక్ష క్లాట్‌. ఇందులో ప్రతిభ చూపితే అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఏ ఎల్‌ఎల్‌బీ/బీఎస్సీ ఎల్‌ఎల్‌బీ/బీకాం ఎల్‌ఎల్‌బీ/బీబీఎం ఎల్‌ఎల్‌బీ/బీఎస్‌డబ్ల్యు ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో చేరవచ్చు. యూజీ క్లాట్‌ పరీక్షలో ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలోనే వస్తాయి. అయితే వీటిని నేరుగా అడగరు. ప్రతి విభాగంలోనూ ప్యాసేజ్‌లు ఇచ్చి వాటి కింద ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 150 ప్రశ్నలు వస్తాయి. ప్రతి తప్పు సమాధానానికీ పావు మార్కు చొప్పున తగ్గిస్తారు. 

పరీక్ష వ్యవధి 2 గంటలు. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ నుంచి 28-32 ప్రశ్నలు (20 శాతం వెయిటేజీ), కరంట్‌ అఫైర్స్, జీకే 35-39 (25 శాతం వెయిటేజీ), లీగల్‌ రీజనింగ్‌ 35-39 (25 శాతం వెయిటేజీ), లాజికల్‌ రీజనింగ్‌ 28-32 (20 శాతం వెయిటేజీ), క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌ 13-17 (10 శాతం వెయిటేజీ) వరకు ప్రశ్నలు వస్తాయి. 

పరీక్ష ఆఫ్‌లైన్‌లోనే నిర్వహిస్తారు. ప్రశ్నలు గ్రహణ, తార్కిక నైపుణ్యాలు, సామర్థ్యాలను తెలుసుకునేలా ఉంటాయి. పరీక్ష ద్వారా న్యాయవిద్య అభ్యసించడానికి అవసరమైన ఆప్టిట్యూడ్, నైపుణ్యాలు ఉన్నాయా? లేవా? అనేది గమనిస్తారు. యూజీ లా కోర్సుల్లో సుమారు 2700 సీట్లు లభిస్తున్నాయి.  

గడువు తేదీ? అర్హతలు? 

ఎల్‌ఎల్‌బీ 5 సంవత్సరాల కోర్సులో చేరే విద్యార్థులు ఇంటర్‌ 45% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్‌సీ/ ఎస్‌టీ విద్యార్థులకు 40% మార్కులు సరిపోతాయి. చివరి సంవత్సరం పరీక్షకు హాజరవుతున్న వాళ్లూ అర్హులే. 

ఎల్‌ఎల్‌ఎం కోర్సు చేయదల్చినవారు ఎల్‌ఎల్‌బీ పరీక్షను 55% మార్కులతో; ఎస్‌సీ, ఎస్‌టీ వారు 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. చివరి పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులు కూడా రాయవచ్చు.  

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 31, 2021

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.4000; ఎస్సీ, ఎస్టీలకు రూ.3500.

పరీక్ష తేది: జూన్ 13, 2021

వెబ్‌సైట్‌: https://consortiumofnlus.ac.in/

పీజీ క్లాట్‌

ఈ పరీక్ష కూడా 150 మార్కులకే ఉంటుంది. అయితే ఇందులో మల్టిపుల్, సబ్జెక్టివ్‌ ప్రశ్నలు వస్తాయి. మల్టిపుల్‌ విభాగంలో వంద ప్రశ్నలు వస్తాయి. వీటికి వంద మార్కులు. ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు. ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కు చొప్పున తగ్గిస్తారు. సబ్జెక్టివ్‌లో రెండు వ్యాసాలు రాయాలి. ఒక్కో దానికి 25 చొప్పున 50 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో వ్యాసాన్ని 800 పదాల్లో పూర్తిచేయాలి. లా, వర్తమాన సంఘటనలపై ముడిపడి వ్యాసరూప ప్రశ్నలు వస్తాయి. మొత్తం పరీక్ష వ్యవధి రెండు గంటలు. ఎల్‌ఎల్‌బీ పాఠ్యపుస్తకాలు బాగా చదివినవారు ఎక్కువ స్కోరు సాధించగలరు. 

రాణించాలంటే... 

పరీక్ష ఆబ్జెక్టివ్‌ తరహాదే అయినప్పటికీ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడానికి తక్కువ సమయంలో పాసేజ్‌లను చదివి అర్థం చేసుకునే నైపుణ్యం పెంచుకోవాలి. ఇందుకోసం సంబంధిత అంశాల్లో పరిజ్ఞానం ఒక్కటే సరిపోదు. ఆంగ్లభాషపై పట్టు పెంచుకోవడం తప్పనిసరి. విస్తృతంగా చదవడం, వేగం, గ్రహణ సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడం అవసరం. నవలలు, వార్తాపత్రిక కథనాలు, సంపాదకీయాలు, పత్రికలు, ఆంగ్లంలో విమర్శనాత్మక సమీక్షలు, వార్తాంశాలను చదువుతుండటం ముఖ్యం. వాటిని చదివిన తరువాత సొంతంగా నోట్సు సిద్ధం చేసుకోగలగాలి. క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌లోని ప్రశ్నలకు తక్కువ వ్యవధిలో సమాధానం గుర్తించడానికి పాఠశాల స్థాయిలో నేర్చుకున్న శాతాలు, నిష్పత్తులు, సగటుల వంటి ప్రాథమిక అంకగణితం బాగా సాధన చేయాలి. మాక్‌ పరీక్షలను తప్పనిసరిగా రాయాలి. వీటి ద్వారా బలహీనతలు తెలుసుకోవడంతో పాటు సమయ నిర్వహణపై పట్టు పెరుగుతుంది. వెనుకబడిన అంశాల్లో ఎక్కువ కృషి చేయాలి.

క్లాట్‌ మాదిరి ప్రశ్నలు వెబ్‌సైట్‌లో ఉంచారు. దరఖాస్తు చేసుకున్నవారికి విభాగాలవారీ స్టడీ మెటీరియల్‌తో పాటు చేయాల్సిన ఎక్సర్‌సై జ్‌లు సైతం ఇస్తారు. అభ్యర్థులు తమకు నచ్చిన ఆంగ్ల దినపత్రికను ప్రతిరోజూ అనుసరించడం తప్పనిసరి. రూ.500 అదనంగా చెల్లించి క్లాట్‌ గత సంవత్సరం ప్రశ్నపత్రం పొందవచ్చు (ఇంటర్నెట్‌లో ప్రశ్నపత్రం- సమాధానాలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి) ప్రశ్నల సరళిపై అవగాహనకు గత ఏడాది ప్రశ్నపత్రం ఉపయోగపడుతుంది.

స్కోరుతో కొలువు

గేట్‌ స్కోరుతో పబ్లిక్‌ సెక్టార్‌ కంపెనీలు ఉద్యోగాలిస్తున్నట్లుగానే క్లాట్‌ ఎల్‌ఎల్‌ఎం పరీక్ష స్కోరు, ఇంటర్వ్యూలతో కొలువులు లభిస్తున్నాయి. భారత్‌ హెవీ ఎల్రక్టికల్స్‌ లిమిటెడ్, ఓఎన్‌జీసీ లిమిటెడ్, నేషనల్‌ థర్మల్‌ పవర్, ఆయిల్‌ ఇండియా లిమిటెడ్, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్, పవర్‌ సిస్టమ్‌ ఆపరేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌...లీగల్‌ విభాగాల్లో ఆకర్షణీయ వేతనాలతో ఉద్యోగులుగా తీసుకుంటున్నాయి. వీరికి లా ఆఫీసర్‌/ అసిస్టెంట్‌ లీగల్‌ అడ్వైజర్‌/ ట్రెయినీ లీగల్‌ అడ్వయిజర్‌ హోదాలు దక్కుతున్నాయి. ఈ పరీక్షలో సాధించిన స్కోరుకు సంస్థలు దాదాపు 75 శాతం వెయిటేజీ ఇస్తున్నాయి. మిగిలిన 25 శాతం ఇంటర్వ్యూకు కేటాయిస్తున్నాయి.

ఉపాధి అవకాశాలు? 

ఎక్కువమంది విద్యార్థులు ప్రాంగణ నియామకాల్లో మంచి వేతనాలతో బహుళజాతి సంస్థల్లో అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు. వీరిని ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకులు, ప్రైవేటు ఈక్విటీలు, కన్సల్టింగ్, అకౌంటింగ్‌ సంస్థలూ, లీగల్‌ ఫర్మ్‌లు ఎక్కువగా నియమించుకుంటున్నాయి. లా గ్రాడ్యుయేట్లను కోర్టులు జ్యుడీషియల్‌ క్లర్క్‌లుగానూ తీసుకుంటున్నాయి. లీగల్‌ ప్రాసెస్‌ అవుట్‌సోర్సింగ్‌ విస్తరిస్తోంది. బోధనలోనూ అవకాశాలుంటాయి. ఎన్జీవోలు, చైల్డ్‌ రైట్స్, హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్లు, కార్పొరేట్‌ లీగల్‌ సెల్స్‌ ...తదితర చోట్ల కొలువులు వస్తాయి. కంపెనీలకు సేవలు అందించడానికి కార్పొరేట్‌ లీగల్‌ ఫర్మ్‌లు కూడా ఉన్నాయి. వీటిలో పెద్ద మొత్తంలో వేతనాలు చెల్లిస్తున్నారు. మీడియా సంస్థల్లోనూ లీగల్‌ జర్నలిజంలో అవకాశాలు ఉంటాయి. సైబర్‌ క్రైమ్, ఆన్‌లైన్‌ మోసాలు, కాపీ రైట్‌ కేసులు ఎక్కువవుతున్నాయి. పెరుగుతోన్న సాంకేతిక మోసాలు, సైబర్‌ నేరాలు లీగల్‌ పట్టభద్రుల అవకాశాలను విస్తృతం చేస్తున్నాయి.  

క్లాట్‌లో ఏ సబ్జెక్టు ఎలా?

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌

పాసేజ్‌ ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ఒక్కో పాసేజ్‌ 450 పదాల్లో ఉంటుంది. వర్తమాన అంశాలు, చరిత్రాత్మక ఫిక్షన్, నాన్‌ ఫిక్షన్‌ విభాగాల్లో పాసేజ్‌లు ఉండవచ్చు. ఇంటర్‌ విద్యార్థి అర్థం చేసుకునే స్థాయిలోనే, ఒక్కోటి 5 నుంచి 7 నిమిషాల్లో చదవగలిగేలా ఉంటాయి. వీటిద్వారా అభ్యర్థిలోని గ్రహణ, భాషా నైపుణ్యాలను గమనిస్తారు. జవాబు గుర్తించడానికి ఆ పాసేజ్‌ క్షుణ్నంగా చదవాలి. అందులోని ముఖ్యమైన అంశాలను అర్థం చేసుకోవాలి. అందులోని భిన్న అభిప్రాయాలు, వాదనలు.. అన్నీ బేరీజు వేసుకుని స్పష్టమైన నిర్ణయానికి రావాలి. పదసంపదపై పట్టు పెంచుకుంటే పాసేజ్‌ అర్థం చేసుకోవడం తేలికవుతుంది. ఆకళింపు చేసుకుంటూ వేగంగా చదవగలిగే నైపుణ్యాన్ని అలవర్చుకోవాలి. ఇందుకోసం వీలైనన్ని కాంప్రహెన్షన్‌ ప్రశ్నలు సాధన చేయాలి. దీంతోపాటు ద హిందూ/టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా/ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చే వ్యాసాలు అందులోనూ ముఖ్యంగా సమకాలీన చర్చనీయ అంశాలకు సంబంధించి నిపుణుల అభిప్రాయాలు బాగా చదవాలి.  

కరంట్‌ అఫైర్స్, జీకే

ఈ విభాగంలో సైతం 450 పదాల్లో పాసేజ్‌ ఇచ్చి ప్రశ్నలు అడుగుతారు. వార్తలు, కథనాలు, నాన్‌ ఫిక్షన్‌ రచనల నుంచి ఈ పాసేజ్‌లు వస్తాయి. ఈ పాసేజీల్లో లీగల్‌ లేదా లీగల్‌ సంబంధిత అంశాలు ఉండవచ్చు. అయితే సమాధానాలు గుర్తించడానికి న్యాయవిద్య అంశాల్లో ప్రావీణ్యం అవసరం లేదు. పాసేజ్‌ల ద్వారా వర్తమానాంశాలు, జనరల్‌ నాలెడ్జ్‌ల్లో అభ్యర్థి అవగాహన తెలుసుకునేలా ప్రశ్నలు వస్తాయి. ముఖ్యంగా భారత్‌లో, ప్రపంచంలో చర్చనీయమవుతోన్న పరిణామాలు, సంఘటనలు; కళలు, సంస్కృతి; అంతర్జాతీయ అంశాలు, వర్తమానంతో ముడిపడిన చారిత్రక అంశాలు..తదితరాల్లో అభ్యర్థిని పరీక్షిస్తారు. అందువల్ల తాజా సంఘటలను ప్రత్యేక దృష్టితో చదవాలి. వీటిపై నిపుణుల అభిప్రాయాలను తెలుసుకోవాలి. ఈ విభాగంలో రాణించడానికి ఆంగ్ల పత్రికలు అనుసరించాలి. 

లీగల్‌ రీజనింగ్‌

ఇందులోనూ 450 పదాల్లో పాసేజ్‌ ఇచ్చి ప్రశ్నలు అడుగుతారు. లీగల్‌తో ముడిపడిన ఉన్న వాస్తవ సంఘటనలు, పరిణామాలు, పబ్లిక్‌ పాలసీ, నీతి, తాత్వికాంశాల ప్రశ్నలు వస్తాయి. వీటికి జవాబులు గుర్తించడానికి న్యాయవిద్యతో పరిచయం అవసరం లేదు. వర్తమానాంశాలపై అవగాహన, సమకాలీన న్యాయ, మానవత్వ సంఘటనలపై దృష్టి సారించాలి. ఇచ్చిన పాసేజ్‌లోని నిబంధనలు, సూత్రాలు (నియమాలు) గుర్తించాలి. వాటిని వివిధ సందర్భాలకు అనువర్తించాలి. వాస్తవికతకు తర్కాన్ని జోడించి ఆలోచిస్తే ఈ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించవచ్చు. 

లాజికల్‌ రీజనింగ్‌

ఈ విభాగంలో 300 పదాలతో ప్యాసేజ్‌ ప్రశ్నలు వస్తాయి. అయితే ఆ ప్యాసేజ్‌ కింద ప్రశ్నలు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అడగవచ్చు. వీటికి సరైన సమాధానం గుర్తించడానికి ఇచ్చిన పాసేజ్‌లో వాదనలు, ముగింపులు గమనించాలి. వాటిని తార్కికంగా విశ్లేషించుకోవాలి. 

క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌

ఈ విభాగంలో.. సమాచారం లేదా గ్రాఫ్‌లు లేదా అంకెలతో కూడిన చిత్రాలు లేదా కొన్ని వాస్తవికాంశాలు...వీటిలో ఏవైనా ఇచ్చి ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నకు సంబంధించిన జవాబు దానిపైన ఉన్న వివరణతో ముడిపడే ఉంటుంది. అభ్యర్థులు ఆ సమాచారం ఆధారంగా సరైన సమాధానం ఎంచుకోవాలి. గణితంపై పట్టు ఉంటే ఈ విభాగాన్ని ఎదుర్కోవచ్చు. ఇందుకోసం పదో తరగతిలోని రేషియో, ప్రపోర్షన్స్, ఆల్జీబ్రా, మెన్సురేషన్, స్టాటిస్టిక్స్‌ అంశాలను బాగా చదువుకోవాలి. 

ఉపయోగపడే పుస్తకాలు: 

ఇంగ్లిష్‌-వర్డ్‌ పవర్‌ మేడ్‌ ఈజీ, 

కరంట్‌ అఫైర్స్‌ అండ్‌ జీకే-జీకే టుడే, 

లీగల్‌ రీజనింగ్‌- యూనివర్సల్స్‌ క్లాట్‌ గైడ్, 

లాజికల్‌ రీజనింగ్‌-ఎంకేపాండే/ఆర్‌ఎస్‌ అగర్వాల్, 

క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌- ఆర్‌ఎస్‌ అగర్వాల్, 

పదో తరగతి గణిత పుస్తకం.
 

- అమరేంద్ర యార్లగడ్డ (ఈనాడు - హైదరాబాద్)
 

Posted Date: 07-01-2021


 

ప్రవేశ పరీక్షలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌