• facebook
  • whatsapp
  • telegram

ఫ్యాషన్‌గా కెరియర్‌ డిజైన్‌! 

డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిఫ్ట్‌ ప్రకటన
 

మెరిపించి మురిపించే సృజనాత్మకతకు ప్రాధాన్యమిస్తుంది- ఫ్యాషన్‌! అందుకే వర్ణాలతో, విభిన్న ఆకృతులతో ఆకట్టుకునే కళగానూ దీన్ని అభివర్ణిస్తుంటారు. కళ్లు చెదిరే దుస్తులూ, యాక్సెసరీలను డిజైన్‌ చేయడం వంటివి దీనిలో ప్రధానంగా కనిపిస్తాయి. వీటిని రూపొందించేవారికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ! అందుకే యువత ఎక్కువగా ఎంచుకుంటున్న కెరియర్లలో ఇదీ ఒకటిగా మారింది. ఈ కెరియర్‌పై ఆసక్తి ఉన్నవారికి నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (నిఫ్ట్‌) అవకాశం కల్పిస్తోంది. ఫ్యాషన్‌ కోర్సులను అందించే ఈ సంస్థ 2021 ప్రవేశాలకుగానూ తాజాగా ప్రకటన విడుదల చేసింది.
 

సమాజంలో ఫ్యాషన్‌ డిజైనర్లకు ప్రత్యేక గుర్తింపు ఉంది. వీరు తమ ప్రతిభా సామర్థ్యాలూ, ముందు చూపు, సృజనలతో వ్యక్తులను ప్రత్యేకంగా, ఆకర్షణీయంగా కనపడేలా చేస్తారు. దీనిలో సంస్కృతీ సంప్రదాయాలతోపాటు సామాజిక పరిస్థితులకూ ప్రాధాన్యమిస్తుంటారు. అందుకే సృజనాత్మక ప్రాధాన్యమున్న రంగాల్లో దీన్నీ ఒకదానిగా చెబుతుంటారు. దేశంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎల్లప్పుడూ ఆదరణ ఉండే రంగమిది. గత దశాబ్ద కాలంలో ఈ రంగం మరింత విస్తృతమైంది. త్వరితగతిన పేరు, గుర్తింపు తీసుకువచ్చే సత్తా దీనికుంది. అందుకే యువతరం ఫ్యాషన్‌ రంగంపై ఎంతో మోజు, ప్రత్యేక ఆదరణ చూపిస్తుంటారు.
 

దీన్ని కెరియర్‌గా ఎంచుకోవాలనుకునేవారు సంబంధిత కోర్సులను చేయడం తప్పనిసరి. ఎన్నో ప్రముఖ సంస్థలు సంబంధిత కోర్సులను అందిస్తున్నాయి. ఫ్యాషన్‌ సంబంధిత విద్యాబోధన పరంగా పేరుగాంచిన సంస్థల్లో నిఫ్ట్‌ ప్రముఖమైనది. ఇది 2021కిగానూ వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నోెటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రవేశపరీక్ష నిర్వహించి దానిలో అర్హత సాధించినవారికి ప్రవేశాలను కల్పిస్తారు. అర్హత సాధించినవారు నిఫ్ట్‌- బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చెన్నై, దిల్లీ, గాంధీనగర్, హైదరాబాద్, జోధ్‌పూర్, కాంగ్రా, కానూర్, కోల్‌కతా, ముంబయి, పంచకుల, పట్నా, రాయ్‌బరేలీ, షిల్లాంగ్, శ్రీనగర్‌ల్లోని ఏదో ఒక క్యాంపసులో ప్రవేశం పొందొచ్చు.
 

పరీక్ష విధానం
ప్రధానంగా రెండు రకాల రాతపరీక్షలు- క్రియేటివిటీ ఎబిలిటీ టెస్ట్‌ (క్యాట్‌), జనరల్‌ ఎబిలిటీ టెస్ట్‌ (గ్యాట్‌) ఉంటాయి. కొన్ని కోర్సులకు రెండిటి స్కోర్లు అవసరం. కొన్నింటికి గ్యాట్‌ స్కోరు సరిపోతుంది. క్యాట్‌లో ఒక టాస్క్‌ ఇచ్చి చేయమని అడగొచ్చు. దీనిలో విద్యార్థి సహజ పరిజ్ఞానం, కాన్సెప్టు అభివృద్ధి, డిజైన్‌ చేయగల సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. గ్యాట్‌ ఎంచుకున్న కోర్సును బట్టి ప్రశ్నించే అంశాలు, పరీక్ష సమయాల్లో మార్పులుంటాయి. బీడిజైన్, ఎండిజైన్‌ వారికి క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ, కమ్యూనికేషన్‌ ఎబిలిటీ, ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్, అనలిటికల్‌ ఎబిలిటీ, జీకే అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌ నుంచి ప్రశ్నలు వస్తాయి. మొత్తం 100 ప్రశ్నలు. మార్కులు 120. పరీక్ష కాలవ్యవధి 120 నిమిషాలు.
 

బీఎఫ్‌టెక్, ఎంఎఫ్‌టెక్, ఎంఎఫ్‌ఎం వారికి.. క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ, కమ్యూనికేషన్‌ ఎబిలిటీ అండ్‌ ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్, అనలిటికల్‌ అండ్‌ లాజికల్‌ ఎబిలిటీ, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌  కరెంట్‌ అఫైర్స్, కేస్‌ స్టడీ అంశాలను పరిశీలిస్తారు. మొత్తం ప్రశ్నలు 150. పరీక్ష కాలవ్యవధి 180 నిమిషాలు. 
 

ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీల్లో ఉంటుంది. కోర్సును బట్టి ప్రశ్నపత్రం వేర్వేరుగా ఉంటుంది. ప్రశ్నల కఠినత్వ స్థాయుల్లోనూ మార్పులుంటాయి.
 

బి.డిజైన్‌: క్యాట్, గ్యాట్‌లతోపాటు సిచ్యువేషన్‌ టెస్ట్‌ ఉంటుంది. వీటికి వరుసగా 50%, 30%, 20% చొప్పున వెయిటేజీ ఉంటుంది.
 

బీఎఫ్‌టెక్‌: వీరికి గ్యాట్‌ ద్వారా ప్రవేశం కల్పిస్తారు.
 

ఎం.డిజైన్‌: క్యాట్, గ్యాట్‌లతోపాటు గ్రూప్‌ డిస్కషన్, వ్యక్తిగత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వీటికి వరుసగా 40%, 30%, 30% చొప్పున వెయిటేజీ ఉంటుంది.
 

ఎంఎఫ్‌ఎం: గ్యాట్‌ ఉంటుంది. దీనిలో అర్హత సాధించినవారికి గ్రూప్‌ డిస్కషన్, వ్యక్తిగత ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. వీటికి వరుసగా 70%, 30% చొప్పున వెయిటేజీ ఉంటుంది.
 

ఎంఎఫ్‌టెక్‌: గ్యాట్‌తోపాటు గ్రూప్‌ డిస్కషన్, వ్యక్తిగత ఇంటర్వ్యూలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీటికి వరుసగా 70%, 30% చొప్పున వెయిటేజీ ఉంటుంది.
 

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం.
 

ముఖ్యమైన తేదీలు
దరఖాస్తుకి గడువు: జనవరి 21, 2021
ఆలస్య రుసుముతో: జనవరి 24, 2021
ప్రవేశపరీక్ష తేదీ: ఫిబ్రవరి 14, 2021
వెబ్‌సైట్‌: https://nift.ac.in/
 

దరఖాస్తు ప్రక్రియ
ఆన్‌లైన్‌ (https://applyadmission.net/nift2021/) లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా విద్యార్థి తన వివరాలతో అకౌంట్‌ రూపొందించుకోవాల్సి ఉంటుంది. తరువాత దానిలోకి లాగిన్‌ అయ్యి దరఖాస్తు ఫారాన్ని నింపాల్సి ఉంటుంది. అవసరమైన పత్రాలతోపాటు ఫొటో, సంతకాన్నీ అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.
 

కోర్సు చివరి ఏడాది చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ ప్రవేశ సమయానికి కోర్సు పూర్తి చేసుండటం తప్పనిసరి.
 

ఏయే కోర్సులు?
గ్రాడ్యుయేషన్, పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఎమర్జింగ్‌ అంశాలైన ఏఐ, ఐఓటీ, ఫ్యాషన్‌ థింకింగ్, బిగ్‌డేటా ఖీ బిజినెస్‌ అనలిటిక్స్, ఆగ్‌మెంటెడ్‌ రియాలిటీ, వర్చువల్‌ ఎక్స్‌పీరియన్స్‌ డిజైన్‌ వంటివాటికీ కరిక్యులమ్‌లో చోటుకల్పిస్తున్నట్లు సంస్థ నిపుణులు చెబుతున్నారు.
 

యూజీ కోర్సులు
మొత్తం ఏడు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కోర్సుల కాలవ్యవధి నాలుగేళ్లు. కోర్సులన్నీ ఫౌండేషన్‌ ప్రోగ్రామ్‌తో ప్రారంభమవుతాయి. 
దీనిలో రెండు సెమిస్టర్లు ఉంటాయి. సృజనాత్మకత, అవసరమైన ఇతర నైపుణ్యాలను దీనిలో బోధిస్తారు. డిజైన్, టెక్నాలజీ, సామాజిక, సంస్కృతి అంశాల పరంగా మేనేజ్‌మెంట్‌ అంశాలను బోధిస్తారు. 
 

బి.డిజైన్‌ (ఫ్యాషన్‌ డిజైన్‌) 
ఇమేజ్‌ క్రియేషన్, స్టైలింగ్‌ అంశాలపై ఆసక్తి ఉన్నవారు దీనిని ఎంచుకోవచ్చు. గార్మెంట్‌ డిజైన్, వివిధ పాటర్న్స్‌తోపాటు అపారల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాథమికాంశాలను కోర్సులో నేర్చుకుంటారు.
 

బి.డిజైన్‌ (లెదర్‌ డిజైన్‌) 
లెదర్‌ ఉపయోగించి దుస్తులు, చెప్పులు, లగ్జరీ గూడ్స్‌.. మొదలైన వాటిని రూపొందించడంపై ఆసక్తి ఉన్నవారు దీనిని ఎంచుకోవచ్చు.
 

బి.డిజైన్‌ (యాక్సెసరీ డిజైన్‌) 
జ్యూలరీ, క్రాఫ్ట్స్, వ్యక్తిగత యాక్సెసరీ, సాఫ్ట్‌గూడ్స్, డెకరేషన్‌ మొదలైన అంశాలపై ఆసక్తి ఉన్నవారు ఎంచుకోవచ్చు.
 

బి.డిజైన్‌ (టెక్స్‌టైల్‌ డిజైన్‌) 
వివిధ రకాల వస్త్రాలపై ఆసక్తి ఉన్నవారు దీనిని ఎంచుకోవచ్చు. ఫ్యాషన్‌ రంగంలో కీలకమైన విభాగమిది. ప్రింట్, వివెన్‌ డిజైన్, ఎంబ్రాయిడరీ.. ఇలా రకరకాల వస్త్రాలపై వీరు దృష్టిపెడతారు.
 

బి.డిజైన్‌ (నిట్‌వేర్‌ డిజైన్‌) 
అల్లిక తరహా దుస్తులపై ఆసక్తి ఉన్నవారు దీనిని ఎంచుకోవచ్చు.
 

బి.డిజైన్‌ (ఫ్యాషన్‌ కమ్యూనికేషన్‌) 
నిత్యం మార్కెట్‌లోకి ఎన్నో ఉత్పత్తులు విడుదలవుతుంటాయి. ఆకట్టుకునే స్వరూపం, సేవల పరంగా బాగా ప్రభావం చూపినవాటికి ఆదరణ ఉంటుంది. దానిని ప్రజల దృష్టికి తీసుకెళ్లడానికి ఎన్నో వ్యూహాలు, ప్రణాళిక అవసరమవుతాయి. ఈ అంశాలపై ఆసక్తి ఉన్నవారు దీనిని ఎంచుకోవచ్చు. గ్రాఫిక్‌ డిజైన్, అడ్వర్టైజింగ్‌ స్పేస్‌ డిజైన్, విజువల్‌ మర్చండైజింగ్, ఫ్యాషన్‌ ఫొటోగ్రఫీ, ఫ్యాషన్‌ జర్నలిజం మొదలైన అంశాలను కోర్సులో భాగంగా నేర్చుకుంటారు.
 

బి.ఎఫ్‌టెక్‌ (అపారల్‌ ప్రొడక్షన్‌)
అపారల్‌ తయారీపై ఆసక్తి ఉన్నవారు దీనిని ఎంచుకోవచ్చు. అపారల్‌ ప్రొడక్షన్‌ టెక్నాలజీ, మేనేజ్‌మెంట్, డెవలప్‌మెంట్‌ మొదలైన అంశాలను కోర్సులో భాగంగా నేర్చుకుంటారు.
 

ఎవరు అర్హులు?
ఆగస్టు 1, 2021 నాటికి 24 ఏళ్లు మించకూడదు. ఎస్‌సీ, ఎస్‌టీ, పీడబ్ల్యూడీ కేటగిరీల వారికి అయిదేళ్ల సడలింపు ఉంది.
గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి ఇంటర్మీడియట్‌/ 10+2 లేదా ఏఐసీటీఈ/ స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ నుంచి 3 లేదా 4 ఏళ్ల డిప్లొమా పూర్తిచేసినవారు అర్హులు.
 

పీజీ కోర్సులు
మొత్తం మూడు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కోర్సుల కాలవ్యవధి రెండేళ్లు.
 

ఎం.డిజైన్‌ (మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌)
డిజైనింగ్‌ విభాగంలో స్పెషలైజేషన్, అడ్వాన్స్‌డ్‌ నైపుణ్యాలను అందుకోవాలనుకునేవారు ఎంచుకోవచ్చు.
 

మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌ (ఎం.ఎఫ్‌.ఎం.)
ఫ్యాషన్‌ రంగంలో మేనేజీరియల్, లీడర్‌షిప్‌ అంశాలను నేర్చుకోవాలనుకునేవారికి ఇది అనుకూలం. 
 

మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (ఎం.ఎఫ్‌టెక్‌)
ఫ్యాషన్, అనుబంధ మాన్యుఫాక్చరింగ్‌ విభాగాల్లో ఉన్నత అవకాశాలు కావాలనుకునేవారు దీన్ని ఎంచుకోవచ్చు. ఆపరేషన్స్‌కు సంబంధించి మేనేజీరియల్‌ కాన్సెప్టులను కోర్సులో భాగంగా నేర్చుకుంటారు.
 

ఎవరు అర్హులు?
వయఃపరిమితి ఏమీ లేదు.
ఎం.డిజైన్‌కు డిగ్రీ స్థాయిలో బి.డిజైన్‌ చేసి ఉండటం తప్పనిసరి. లేదా కనీసం మూడేళ్ల వ్యవధి గల అండర్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా అయినా చేసుండాలి.
ఎంఎఫ్‌ఎంకు ఏదైనా డిగ్రీ పూర్తిచేసినవారు అర్హులు.
ఎం.ఎఫ్‌టెక్‌కు గుర్తింపు పొందిన సంస్థ నుంచి బి.ఎఫ్‌టెక్‌ లేదా బీఈ/ బీటెక్‌ చేసుండాలి.

Posted Date: 27-03-2021


 

ప్రవేశ పరీక్షలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌