• facebook
  • whatsapp
  • telegram

పిలుస్తోంది.. ఫ్యాషన్‌ ప్రపంచం!

తారల తళుకులు... యువతరం మెరుపుల్లో ప్రధానమైనది ఫ్యాషన్‌. ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఆకర్షణీయంగా, ప్రత్యేకంగా ఉండటానికి ఇష్టపడుతున్నారు. చూస్తున్నకొద్దీ చూడాలనిపించేలా వివిధ దుస్తులు, వస్తువులు రూపొందుతున్నాయిప్పుడు. అయితే వీటి తయారీలో నిపుణుల సృజనే కీలకం. ఫ్యాషన్‌ టెక్నాలజీ, ఫ్యాషన్‌ డిజైన్‌ కోర్సులు చదివినవారు ఈ రంగంలో రాణిస్తున్నారు.  ఈ విభాగంలో మేటి చదువులు అందించడానికి జాతీయ స్థాయిలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (నిఫ్ట్‌)లు ఏర్పాటు చేశారు. ఈ సంస్థలు యూజీ, పీజీ స్థాయుల్లో కోర్సులు అందిస్తున్నాయి. వీటిలో ప్రవేశాలకు నిఫ్ట్‌-2023 ప్రకటన వెలువడింది! 


హైదరాబాద్‌తోపాటు దేశవ్యాప్తంగా 18 కేంద్రాల్లో నిఫ్ట్‌ క్యాంపస్‌లు నెలకొల్పారు. ఈ సంస్థల్లో నాలుగేళ్ల వ్యవధితో యూజీ, రెండేళ్ల వ్యవధితో పీజీ కోర్సులు అందిస్తున్నారు. యూజీ స్థాయిలో డిజైన్‌లో 6 రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అవి... యూక్సెసరీ డిజైన్, నిట్‌వేర్‌ డిజైన్, ఫ్యాషన్‌ కమ్యూనికేషన్, లెదర్‌ డిజైన్, ఫ్యాషన్‌ డిజైన్, టెక్స్‌టైల్‌ డిజైన్‌. ఈ సంస్థ ఫ్యాషన్‌ టెక్నాలజీ కోర్సునూ యూజీలో అందిస్తోంది. పీజీలో డిజైన్, ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్, ఫ్యాషన్‌ టెక్నాలజీ కోర్సులు ఉన్నాయి. సృజనాత్మకత, డిజైన్‌పై ఆసక్తి, ఊహలకు రూపమివ్వగలిగే నైపుణ్యం, స్కెచింగ్‌ ప్రావీణ్యం ఉన్నవారు ఈ కోర్సుల్లో చేరి, ప్రతిభను విస్తరించుకోవచ్చు. 


 ఇవీ అర్హతలు 


బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌


అర్హత: ఇంటర్మీడియట్‌ లేదా సమాన స్థాయి కోర్సుల్లో ఉత్తీర్ణత. ఆఖరు సంవత్సరం చదువుతున్నవాళ్లూ దరఖాస్తు చేసుకోవచ్చు. 


బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ


అర్హత: మ్యాథ్స్, ఫిజిక్స్‌తో ఇంటర్‌ ఉత్తీర్ణత లేదా మూడేళ్ల డిప్లొమా. ఆఖరు సంవత్సరం విద్యార్థులూ అర్హులే.


వయసు: పై రెండు కోర్సులకూ ఆగస్టు 1, 2023 నాటికి 24 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఐదేళ్లు మినహాయింపు. 


మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్, ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత లేదా నిఫ్ట్‌ లేదా నిడ్‌ నుంచి కనీసం మూడేళ్ల వ్యవధితో యూజీ డిప్లొమా. మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ కోర్సులకు నిఫ్ట్‌ నుంచి బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (బీఎఫ్‌టెక్‌) లేదా ఏదైనా సంస్థ నుంచి బీఈ/బీటెక్‌. ఆఖరు సంవత్సరం విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్ఠ వయసు నిబంధన లేదు. 


  పరీక్ష ఇలా...


ఎంచుకున్న కోర్సు ప్రకారం ప్రశ్నపత్రం మారుతుంది. రుణాత్మక మార్కులు లేవు. ప్రతి సరైన సమాధానానికీ ఒక మార్కు. 


బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్, మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సుల్లో ప్రవేశానికి జనరల్‌ ఎబిలిటీ టెస్ట్‌ (జీఏటీ) నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌/ హిందీ మాధ్యమంలో ఉంటుంది. పరీక్ష వ్యవధి 2 గంటలు. 


బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌కు మొత్తం వంద ప్రశ్నలుంటాయి. వీటిలో క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ నుంచి 20 ప్రశ్నలు, కమ్యూనికేటివ్‌ ఎబిలిటీ నుంచి 25, ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌ నుంచి 25, ఎనలిటికల్‌ ఎబిలిటీ నుంచి 15, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌ నుంచి 15 ప్రశ్నలు అడుగుతారు.


బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (బీఎఫ్‌టెక్‌), మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (ఎంఎఫ్‌టెక్‌), మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశానికి.. జనరల్‌ ఎబిలిటీ టెస్టు (జీఏటీ) నిర్వహిస్తారు. మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. వీటిని మూడు గంటల్లో పూర్తిచేయాలి. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ పరీక్షలో... క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ నుంచి 30, కమ్యూనికేషన్‌ ఎబిలిటీ అండ్‌ ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌ నుంచి 45, ఎనలిటికల్‌ అండ్‌ లాజికల్‌ ఎబిలిటీ నుంచి 25, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌ నుంచి 25 ప్రశ్నలు అడుగుతారు. కేస్‌ స్టడీకి 25 మార్కులు కేటాయించారు.


సీట్లు...


అన్ని నిఫ్ట్‌ల్లోనూ కలిపి యూజీ, పీజీ స్థాయుల్లో మొత్తం 5199 సీట్లు అందుబాటులో ఉన్నాయి.


బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌లో.. ఫ్యాషన్‌ డిజైన్‌ 742, లెదర్‌ డిజైన్‌ 172, యాక్సెసరీ డిజైన్‌ 654, టెక్స్‌టైల్‌ డిజైన్‌ 697, నిట్‌వేర్‌ డిజైన్‌ 302, ఫ్యాషన్‌ కమ్యూనికేషన్‌ 742 సీట్లు ఉన్నాయి. 


‣ బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీలో అపారల్‌ ప్రొడక్షన్‌ విభాగంలో 652 మందికి అవకాశం ఉంది.


పీజీ కోర్సులైన మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌లో 304, మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌లో 786, మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీలో 148 సీట్లు కేటాయించారు.


వెయిటేజీ 


బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీలో వంద శాతం జీఏటీ వెయిటేజీ ఉంటుంది. బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సుల్లో సీఏటీకి 50, జీఏటీకి 30, సిచ్యుయేషన్‌ టెస్టుకి 20 శాతం వెయిటేజీ ఉంది. మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సుల్లో సీఏటీకి 40, జీఏటీకి 30, పర్సనల్‌ ఇంటర్వ్యూ (పీఐ)కి 30 శాతం వెయిటేజీ ఉంది. మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీలో జీఏటీకి 70, పీఐకి 30 శాతం వెయిటేజీ ఉంది. మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌లో జీఏటీకి 70, గ్రూప్‌ డిస్కషన్‌/పీఐకి 30 శాతం వెయిటేజీ కల్పించారు. 


ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ: డిసెంబరు 31


ప్రవేశ పరీక్ష తేదీ: ఫిబ్రవరి 5


తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం


వెబ్‌సైట్‌: https://nift.ac.in/admission


అవకాశాలెన్నో...


మన దేశంలో ఫ్యాషన్‌ టెక్నాలజీ కోర్సుల్లో నిఫ్ట్‌లదే పైచేయి. అందువల్ల వీటిలో చదువులు పూర్తిచేసుకున్నవారికి కార్పొరేట్‌ సంస్థలు ప్రాంగణ నియామకాల ద్వారా ఆకర్షణీయ వేతనాలు, హోదాలు అందిస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ హుందాగా కనిపించాలనే తపన పెరుగుతోంది. ఇందుకోసం దుస్తులు, యాక్సెసరీస్‌ పాత్రే కీలకం. అలాగే డబ్బు విషయంలోనూ వెనుకాడకుండా ఫ్యాషన్‌ ప్రపంచం వైపు జనాలు పరుగులు తీస్తున్నారు. ఆకట్టుకునేలా దుస్తులు, వివిధ వస్తువులను డిజైన్‌ చేయగలిగే నైపుణ్యం ఉన్నవాళ్లు రూ.లక్షల్లో సంపాదించవచ్చు. కోర్సులు విజయవంతంగా పూర్తిచేసుకున్న తర్వాత ఫ్యాషన్‌ డిజైనర్, స్టైలిస్ట్‌ (స్టోర్స్‌), ఫ్యాషన్‌ రిటైలర్, ఫ్యాషన్‌ ఆంత్రప్రెన్యూర్, పర్సనల్‌ స్టైలిస్ట్‌/ సెలబ్రిటీ స్టైలిస్ట్‌ తదితర హోదాలతో రాణించవచ్చు. సొంతంగా బొటిక్‌ లాంటివి నడపవచ్చు.


 ప్రశ్నలడిగే అంశాలు 


క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ: కూడికలు, గుణింతాలు, భాగహారం, తీసివేతలు, శాతాలు, భిన్నాలు, వడ్డీ రేట్లు, పని-కాలం, దూరం-వేగం, నిష్పత్తి, సగటు..తదితర అంశాలపై ప్రశ్నలుంటాయి. ఈ ప్రశ్నల స్థాయి మరీ అంత కఠినంగా ఉండదు. హైస్కూల్‌ మ్యాథ్స్‌ పుస్తకాల నుంచి వీటిని చదువుకుంటే సరిపోతుంది. ప్రాథమికాంశాలపై పట్టున్నవారు ఎక్కువ మార్కులు తేలికగానే పొందవచ్చు. 


కమ్యూనికేషన్‌ ఎబిలిటీ: అభ్యర్థుల ఆంగ్ల భాషా ప్రావీణ్యాన్ని పరీక్షిస్తారు. దైనందిన జీవితంలో మాట్లాడటానికి అవసరమైన పదసంపద, వ్యాకరణం ఉన్నాయో, లేదో పరీక్షించేలా ప్రశ్నలు సంధిస్తారు. ఆంగ్లంలో పాసేజ్‌లు ఇచ్చి వాటిపై ప్రశ్నలడుగుతారు. ఈ విభాగంలోని ప్రశ్నలు హైస్కూల్‌ స్థాయిలో ఉంటాయి. వ్యాకరణ ప్రాథమిక నియమాలు, ప్రాథమిక స్థాయి పదసంపద పరిజ్ఞానం ఉండాలి. సమానార్థాలు, వ్యతిరేకార్థాలు, సామెతలు, నుడికారాలు, సింగ్యులర్, ప్లూరల్, వన్‌ వర్డ్‌ సబ్‌స్టిట్యూట్స్, స్పెల్లింగ్‌ కరెక్షన్‌ తదితర విభాగాల్లో ప్రశ్నలు వస్తాయి.


ఎనలిటికల్‌ ఎబిలిటీ: అభ్యర్థి తర్కాన్ని పరీక్షించడానికి ఈ సెక్షన్‌ను కేటాయించారు. కొంత సమాచారం ఇచ్చి దాన్నుంచే జవాబులు రాబట్టే ప్రశ్నలు అడుగుతారు. ఈ సెక్షన్‌ ద్వారా అభ్యర్థి ఆలోచనా స్థాయిని కూడా పరీక్షిస్తారు. ఇచ్చిన సమాచారాన్ని బాగా విశ్లేషించగలిగితే సమాధానం గుర్తించడం సులువవుతుంది. గణితంలో పరిజ్ఞానం ఈ సెక్షన్‌ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టడానికి ఉపయోగపడుతుంది.


జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌: వర్తమాన సంఘటనలతో ముడిపడిన ప్రశ్నలడుగుతారు. జనరల్‌ నాలెడ్జ్‌లో అభ్యర్థికి సమాజం, పరిసరాలపై ఉన్న అవగాహనను పరిశీలిస్తారు. తాజా పరిణామాలపై అవగాహన ఉన్నవాళ్లు సులువుగానే కరెంట్‌ అఫైర్స్‌ ప్రశ్నలకు సమాధానాలు రాయొచ్చు. రోజూ ఏదైనా పత్రిక చదివి ముఖ్యాంశాలను నోట్సు రూపంలో రాసుకుంటే సమాచారాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. జనవరి, 2022 నుంచి వివిధ విభాగాల్లో జరిగిన ప్రధాన సంఘటనలను మననం చేసుకోవాలి. 


క్రియేటివ్‌ ఎబిలిటీ టెస్ట్‌: అభ్యర్థికి డిజైనింగ్‌లో సృజనాత్మకత ఎలా ఉందో ఈ పరీక్ష ద్వారా పరిశీలిస్తారు. రంగులను ఎలా ఉపయోగిస్తున్నారు, పరిశీలనాశక్తి ఏ విధంగా ఉంది, కొత్తదనం ఏమైనా ఉందా, ఇలస్ట్రేషన్, కళాత్మక నైపుణ్యం..తదితర అంశాల మేళవింపుతో ఈ పరీక్ష ఉంటుంది. స్కెచింగ్‌ నైపుణ్యం, ఊహాశక్తి బాగున్నవారు రాణించగలరు. 


కేస్‌ స్టడీ: ఈ విభాగంలో ఫ్యాషన్‌ పరిశ్రమకు సంబంధించిన అంశం గురించి సమాచారం ఉంటుంది. అభ్యర్థి మేనేజీరియల్‌ నైపుణ్యం పరిశీలిస్తారు. ఫ్యాషన్‌ ప్రపంచంలో తాజా పోకడలపై అవగాహన పెంచుకోవాలి. 


మాదిరి ప్రశ్నపత్రాల సాధన


పాత ప్రశ్నపత్రాలను అధ్యయనం చేస్తే ప్రశ్నల తీరుపై అవగాహన పెరుగుతుంది. ఎన్నో సంస్థల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఏదైనా ఒకటి ఎంచుకుని బాగా చదివితే సరిపోతుంది. పరీక్షకు ముందు వీలైనన్ని మాదిరి ప్రశ్నపత్రాలను సాధన చేసినవాళ్లు ఎక్కువ మార్కులు పొందడం కష్టమేమీ కాదు. 


రాత పరీక్షలో అర్హత సాధించినవాళ్లకు వారు ఎంపిక చేసుకున్న కోర్సును బట్టి సిచ్యువేషన్‌/ స్టూడియో టెస్ట్, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.


సిచ్యువేషన్‌/ స్టూడియో టెస్టు: ఇందులో అభ్యర్థిలోని సృజన, 3డీ మోడలింగ్‌ నైపుణ్యం పరీక్షిస్తారు. ఇచ్చిన కాన్సెప్ట్‌పై అభ్యర్థికి ఉన్న స్పష్టత, ఆ అంశంపై ఉన్న పరిజ్ఞానం.. మొదలైనవి పరిశీలించి మార్కులు కేటాయిస్తారు. ఫ్యాషన్‌ టెక్నాలజీ/డిజైన్‌ రంగాల్లో అవగాహన, స్కెచింగ్‌ నైపుణ్యం, రంగులు మేళవించడంలో పట్టు ఉన్నవారు ఇందులో రాణించగలరు. 


ఇంటర్వ్యూ: ఫ్యాషన్‌ కెరియర్‌పై అభ్యర్థికి ఏ మేరకు ఆసక్తి ఉంది? ఈ రంగంపై పరిజ్ఞానం ఏ స్థాయిలో ఉంది? అకడమిక్‌ ప్రతిభ, కో కరిక్యులర్‌ యాక్టివిటీస్, కమ్యూనికేషన్, జనరల్‌ అవేర్‌నెస్‌ అండ్‌ ఆప్టిట్యూడ్, క్రియేటివిటీ, లేటరల్‌ థింకింగ్‌..తదితర కోణాల్లో పరిశీలిస్తారు.

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఫారిన్‌ ట్రేడ్‌.. అద్భుత కెరియర్‌!

‣ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రత్యేక అధికారులు

‣ ఆవిష్కరణల అధ్యయనానికీ కోర్సులు!

‣ కుదిరిన వేళల్లో కాస్త సంపాదించుకుంటారా?

‣ కాపీ కొట్టాలని ఎందుకు అనిపిస్తుందంటే?

Posted Date: 10-11-2022


 

ప్రవేశ పరీక్షలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌