• facebook
  • whatsapp
  • telegram

మారిటైం విశ్వ‌విద్యాల‌యంలో మేలైన కోర్సులు!

ఐఎంయూ సెట్‌ ప్ర‌క‌ట‌న విడుద‌ల‌

డిగ్రీ, పీజీ, బీబీఏ, పీజీ డిప్లొమా, పీహెచ్‌డీలో ప్ర‌వేశాలు

భూమిపై నాలుగింట మూడొంతులు నీరే విస్తరించి ఉంది. స‌ముద్రాలు దేశాలకు రక్షణగా.. వారధులుగా.. కోట్లాది మంది ప్రజలకు జీవనాధారంగా ఉన్నాయి. దేశాల మధ్య సరకు రవాణాకు జలమార్గం అత్యంత కీలకం. సముద్రాలకు సంబంధించి(మారిటైం) ఓషనోగ్రీఫీ, హిస్టరీ, మారిటైమ్ లా, సెక్యూరిటీ, సెర్చ్ అండ్ రెస్క్యూ, కార్గో తదితర అంశాలపై కోర్సులు, శిక్షణ, పరిశోధనల నిమిత్తం ఇండియన్ మారిటైం యూనివర్సిటీ (ఐఎంయూ) ఏర్పాటైంది. ఇది కేంద్రియ విశ్వవిద్యాలయం. దీన్ని భారత ప్రభుత్వానికి చెందిన షిప్పింగ్, వాట‌ర్‌వేస్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో స్థాపించారు. దేశవ్యాప్తంగా ఈ క్యాంప‌స్‌లు చెన్నై, కొచ్చిన్, కోల్‌క‌తా, ముబై పోర్ట్, నవీ ముంబై, విశాఖపట్నంలో కొలువుదీరాయి. వీటిలో వివిధ కోర్సులకు తాజాగా ప్రకటన విడుదలైంది. ఐఎంయూ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఐఎంయూ సెట్)-2021 ద్వారా 2021-22 విద్యాసంవత్సరానికి ప్రవేశాలు కల్పిస్తారు.

కోర్సులు.. వివరాలు....

అండర్ గ్రాడ్యుయేట్ 

బీటెక్ (మెరైన్ ఇంజినీరింగ్): ఈ కోర్సు వ్యవధి నాలుగేళ్లు, ఇది చెన్నై, కోల్‌క‌తా, ముంబై పోర్ట్ క్యాంప‌స్‌లో అందుబాటులో ఉంది. 

బీటెక్ (నావల్ ఆర్కిటెక్చర్ అండ్ ఓషియన్ ఇంజినీరింగ్): ఈ కోర్సు వ్యవధి కూడా నాలుగేళ్లే. విశాఖపట్నం క్యాంప‌స్‌లో అందిస్తారు. 

బీఎస్సీ (నాటికల్ సైన్స్): కోర్సు వ్యవధి మూడేళ్లు. చెన్నై, కొచ్చిన్, నవీ ముంబై క్యాంప‌స్‌లో ఉంది. 

బీబీఏ (లాజిస్టిక్స్, రిటైలింగ్ అండ్ ఈ కామర్స్): ఇది మూడేళ్ల కోర్సు. చెన్నై, కొచ్చిన్ క్యాంప‌స్‌లో అందుబాటులో ఉంది. ఇందులో చేరేందుకు ఐఎంయూ సెట్ రాయాల్సిన అవసరం లేదు. ఐఎంయూ అడ్మిషన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత కోర్సులో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

డీఎన్ఎస్ (డిప్లొమా ఇన్ నాటికల్ సైన్స్): ఇది ఏడాది కోర్సు. చెన్నై, నవీ ముంబై క్యాంప‌స్‌లో బోధిస్తారు. 

అర్హత 

అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరాలనుకునే వారు కనీసం 60శాతం మార్కులతో ఇంటర్మీడియట్/ 10+2(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్) ఉత్తీర్ణత సాధించాలి. వయసు 17 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

పోస్టు గ్రాడ్యుయేట్ ప్రోగ్రాములు

ఎంబీఏ (పోర్ట్ అండ్ షిప్పింగ్ మేనేజ్‌మెంట్‌): ఇది రెండేళ్ల కోర్సు. చెన్నై, కొచ్చిన్ కేంద్రాల్లో అందుబాటులో ఉంది. 

ఎంబీఏ (ఇంటర్నేషనల్ ట్రాన్స్‌పోర్టేష‌న్‌అండ్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్‌): ఈ కోర్సు వ్యవధి రెండేళ్లు. చెన్నై, కోల్‌క‌తా, విశాఖపట్నం, కొచ్చిన్ క్యాంప‌స్‌లో బోధిస్తారు. 

ఎంటెక్ (మెరైన్ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్‌): కోర్సు వ్యవధి రెండేళ్లు. కోల్‌క‌తా క్యాంప‌స్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. 

ఎంటెక్ (నావల్ ఆర్కిటెక్చర్ అండ్ ఓషియన్ ఇంజినీరింగ్): రెండేళ్ల కోర్సు. విశాఖపట్నం కేంద్రంలో బోధిస్తారు .

ఎంటెక్ (డ్రెడ్జింగ్ అండ్ హార్బర్ ఇంజినీరింగ్): రెండేళ్ల కోర్సు. విశాఖపట్నంలో అందుబాటులో ఉంది. 

అర్హత 

పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరాలంటే ప్రోగ్రాములను అనుసరించి ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ, సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత తప్పనిసరి. వయసుతో సంబంధం లేదు.

పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా (మెరైన్ ఇంజినీరింగ్): ఇది ఏడాది కోర్సు. ముంబై పోర్ట్ క్యాంపస్లో అందుబాటులో ఉంది. సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. వయసు 28 ఏళ్లు మించరాదు. 

పీహెచ్‌డీ అండ్ ఎంఎస్ (రిసెర్చ్ ) ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. 

ఎంపిక ఎలా?

అర్హులైన అభ్యర్థులకు ఐఎంయూ సెట్ నిర్వహిస్తారు. ఇది కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ప్రొక్టోర్డ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఇందులో వచ్చిన స్కోర్ ఆధారంగా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. 

దరఖాస్తు ఇలా..

అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అందుకు ఆగస్టు 20, 2021 తుది గడువు. రిసెర్చ్ ప్రోగ్రాములకు జనరల్ అభ్యర్థులు రూ.1500, ఎస్సీ/ ఎస్టీలు రూ.1000 చెల్లించాలి. బీబీఏ కోర్సుకు జనరల్ అభ్యర్థులు రూ.200, ఎస్సీ/  ఎస్టీలు రూ. 140 చెల్లించాలి. యూజీ, పీజీ కోర్సులకు దరఖాస్తు చేసుకునే జనరల్ అభ్యర్థులు రూ.1000, ఎస్సీ/ ఎస్టీలు రూ.700 చెల్లించాలి. 

పరీక్ష విధానం

అండర్ గ్రాడ్యుయేట్‌కు సంబంధించిన పరీక్షలో 200 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు వస్తాయి. ఇంటర్/ 10+2 స్థాయి నుంచి ఇంగ్లిష్, జనరల్ ఆప్టిట్యూట్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్ విభాగాల్లో ప్రశ్నలొస్తాయి. 

ఎంబీఏ కోర్సులకు నిర్వహించే పరీక్షలో 120 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలుంటాయి. క్వాంటిటేటివ్ ఎబిలిటీ, డేటా ఇంట‌ర్‌ప్రెటేష‌న్‌, వెర్బల్ ఎబిలిటీ, రీజనింగ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. 

పీజీ కోర్సులకు సంబంధించిన పరీక్షలో 200 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలుంటాయి. లాజికల్ రీజనింగ్, మ్యాథమేటిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్/ నావల్ ఆర్కిటెక్చర్/ మెరైన్ ఇంజినీరింగ్/ సివిల్ ఇంజినీరింగ్ విభాగాల నుంచి ప్రశ్నలడుగుతారు. 

పీహెచ్‌డీ, ఎమ్మెస్ (రిసెర్చ్) ప్రోగ్రాములకు సెట్ పరీక్షను నవంబర్ 2021లో నిర్వహిస్తారు. వీటికి ప్రవేశ పరీక్షను పార్ట్-1, పార్ట్-2 పద్ధతిలో జరుగుతుంది. పార్ట్-1లో 120 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలుంటాయి. సమయం రెండు గంటలు ఇస్తారు. జనరల్ మెంటల్ ఎబిలిటీ, నాలెడ్జ్ ఆఫ్ మారిటైం సెక్టార్ & నాలెడ్జ్ ఆఫ్ ది స్కూల్/ ఏరియా ఆఫ్ రిసెర్చ్ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పార్ట్-2లో స్కూల్/ ఏరియాకు సంబంధించిన వ్యాసం ఇస్తారు. సమయం గంట ఉంటుంది. రుణాత్మక మార్కులుంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు కోత విధిస్తారు. 

ఫీజుల వివ‌రాలు

బీటెక్‌, డీఎన్ఎస్‌, ఎంటెక్ కోర్సుల్లో చేరేవారు ఏడాదికి రూ.2 ల‌క్ష‌ల 25 వేలు ఫీజు చెల్లించాలి. ఎంబీఏ చేరేవారు ఏడాదికి రూ.2 ల‌క్ష‌లు, బీబీఏ అభ్య‌ర్థులు ఏడాదికి రూ.ల‌క్ష, పీజీడీఎంఈ కోర్సులో చేరాలంటే ఏడాదికి రూ.3 ల‌క్ష‌ల 50 వేలు చెల్లించాలి. ఎమ్మెస్ (రిసెర్చ్‌) విద్యార్థులు ఏడాదికి రూ.ల‌క్ష 75 వేలు చెల్లించాల్సి ఉంటుంది. పీహెచ్‌డీ అభ్య‌ర్థులు మొద‌టి మూడేళ్లు రూ.30 వేలు చెల్లించాలి.  

ఉద్యోగావకాశాలు

ఈ రంగంలో విస్తృతమైన అవకాశాలు లభిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉపాధి అవకాశాలకు కొదువ లేదు. ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి క్యాంపస్ ప్లేస్‌మెంట్లు లభిస్తాయి. ప్రముఖ కంపెనీలు మంచి ప్యాకేజీలు ఆఫర్ చేస్తాయి. వీటిలో ఎన్‌వైకే గ్రూప్, ఆదానీ, సీపోల్, టీవీఎస్, గాటి, ఏసీటీఎల్, టీమ్ గ్లోబల్, స్విఫ్ట్ లాజిస్టిక్స్, ఆల్ కార్గో, మహీంద్రా లాజిస్టిక్స్ తదితర సంస్థలు ఉద్యోగాలు కల్పిస్తాయి. అలాగే బెటా, క్యాట్ లాజిస్టిక్స్, సెంచూరీ ప్లై, మ్యాక్, దమ్కో, డీహెచ్ఎల్, జీవీకే, హోండా, అదానీ, టీవీఎస్, యూఏఎస్సీ, టీఎస్ఈ లాజిస్టిక్స్, బ్లూలైన్ లాంటి సంస్థలు సమ్మర్ ఇంట‌ర్న్‌షిప్‌లు అందిస్తున్నాయి. 

పరీక్ష తేదీ: ఆగస్టు 29, 2021. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు. 

వెబ్‌సైట్‌: https://www.imu.edu.in/

Posted Date: 01-08-2021


 

ప్ర‌ఖ్యాత సంస్థ‌లు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌