• facebook
  • whatsapp
  • telegram

సత్వర ఉపాధికి డిప్లొమా దారి!

సాంకేతిక విద్యపై ఆసక్తి ఉన్నవారు ఇంజినీరింగ్‌ కోర్సులవైపు మొగ్గు చూపుతారు. పదోతరగతి పూర్తికాగానే టెక్నికల్‌ విద్యను అభ్యసించాలనుకునే వారికి ఇవి డిప్లొమా/ పాలిటెక్నిక్‌ పేరిట అందుబాటులో ఉన్నాయి. వృత్తివిద్యా కోర్సులుగా పేరొందిన వీటిని సాధారణంగా కెరియర్‌లో త్వరగా స్థిరపడాలనుకునేవారు ఎంచుకుంటారు. ఇంజినీరింగ్‌తో పోల్చి వీటిపట్ల కొంత చిన్నచూపు చూసేవారు ఉన్నారు. వాస్తవానికి ఈ కోర్సులు పూర్తి చేసినవారికి ఉపాధి అవకాశాలు విస్తృతంగా ఉన్నాయి!

పదితో ఇంజినీరింగ్‌ అవకాశం పాలిటెక్నిక్‌ కోర్సుల ద్వారా సాధ్యమవుతుంది. ‘చేయడం ద్వారా నేర్చుకోవడం’ అనే విధానం వీటిలో  కనిపిస్తుంది. సాధారణంగా ఉద్యోగ జీవితంలో త్వరగా స్థిరపడాలనుకునేవారు వీటిని ఎక్కువగా ఎంచుకుంటుంటారు. అందుకే వీటిని ఉద్యోగాధారిత కోర్సులుగానూ పిలుస్తారు. పాలిటెక్నిక్‌ కోర్సులకు డిప్లొమా ఇన్‌ ఇంజినీరింగ్‌గానూ పేరు. వీటి సిలబస్‌ పరిశ్రమలకు అనుగుణంగా, విద్య పూర్తవడంతోనే విద్యార్థి సంబంధిత పరిశ్రమలో ఉద్యోగం సాధించేలా ఉంటుంది. ఏఐసీటీఈ (ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌) ఆధ్వర్యంలో వీటిని నిర్వహిస్తున్నారు. కోర్సుల ద్వారా ఎంచుకున్న విభాగానికి సంబంధించిన ప్రాథమిక పరిజ్ఞానాన్ని అందజేస్తారు. కేవలం పుస్తక పరిజ్ఞానానికే పరిమితం కాకుండా ప్రాక్టికల్‌ పరిజ్ఞానానికీ ప్రాధాన్యమివ్వడం వీటిలో కనిపిస్తుంది. అందుకే ఈ కోర్సులను ఎంచుకున్నవారికి సంస్థలూ ప్రాధాన్యమిచ్చి ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి. 

పాలిటెక్నిక్‌ పూర్తిచేసినవారికి రెండు ప్రధాన మార్గాలుంటాయి. అవి: 

1. ఉన్నత చదువులు 

2. ఉద్యోగం.

ఆర్థికపరంగా ఇబ్బందులు ఉండి, త్వరగా స్థిరపడాలి అనుకునేవారు ఉద్యోగాలను ఎంచుకోవచ్చు. సంస్థలు వీరిని ప్రారంభ/ జూనియర్‌ స్థాయి హోదాలో ఎంచుకుంటాయి. అలాకాకుండా మెరుగైన స్థాయికి ఎదగాలి, లోతైన పరిజ్ఞానం సాధించాలనుకునేవారు ఉన్నత చదువులను ఎంచుకోవచ్చు.
 

ఉన్నత విద్యావకాశాలు

ఎంచుకున్న విభాగానికి సంబంధించి లోతైన పరిజ్ఞానాన్ని పొందాలనుకునేవారు వీటిని ఎంచుకోవచ్చు. పాలిటెక్నిక్‌ పూర్తిచేసినవారు ఎంచుకోగల కోర్సుల్లో ప్రముఖమైనవి:
 

బీటెక్‌/ బీఈ 

పాలిటెక్నిక్‌ తరువాత ఉన్నతవిద్య పరంగా ఎక్కువమంది ఆసక్తి చూపేది బ్యాచిలర్‌ ఆఫ్‌ టెక్నాలజీ/ బ్యాచిలర్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ కోర్సులవైపే. ప్రవేశపరీక్ష ద్వారా వీటిలోకి ప్రవేశం పొందొచ్చు. రాష్ట్రాలన్నీ ప్రత్యేకంగా ఈసెట్‌ (ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ) నిర్వహించి వచ్చిన ర్యాంకు ఆధారంగా లేటర్‌ ఎంట్రీ అవకాశాన్ని కల్పిస్తాయి. దీంతో నేరుగా ఇంజినీరింగ్‌ రెండో ఏడాదిలోకి ప్రవేశం దొరుకుతుంది. కొన్ని ప్రముఖ కళాశాలలూ ప్రత్యేకంగా ప్రవేశపరీక్ష నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తున్నాయి.
 

సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్‌

నాన్‌ ఇంజినీరింగ్‌ కోర్సులవారు వీటికి ఎక్కువ ప్రాధాన్యమిస్తుంటారు. ఇంజినీరింగ్‌ కాకుండా సంబంధిత విభాగంలో డిగ్రీ కోర్సు చేయాలనుకునేవారూ వీటిని ఎంచుకోవచ్చు. వీరు బీఎస్‌సీ, బీసీఏ కోర్సులను ఎంచుకోవచ్చు. నాన్‌ టెక్నికల్‌ వైపువారు బీకాం, బీఏ వైపు మొగ్గు చూపించొచ్చు. అయితే చాలావరకూ సంస్థలు ఇంటర్మీడియట్‌/ తత్సమాన స్కోరును ఆశిస్తాయి.
 

ఏఎంఐఈ సర్టిఫికేషన్‌                                               

అసోసియేట్‌ మెంబర్‌ ఆఫ్‌ ద ఇన్‌స్టిట్యూషన్స్‌ ఆఫ్‌ ఇంజినీర్‌ (ఏఎంఐఈ).. అందించే సర్టిఫికేషన్‌ కోర్సును చేయొచ్చు. సాంకేతికంగా దీనిని బీఈ డిగ్రీకి సమానంగా పరిగణిస్తారు. దీనిని పూర్తిచేసినవారికి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్, ఇండియా వీరికి సర్టిఫికెట్‌ ప్రదానం చేస్తుంది. ఏఎంఐఈ పరీక్షలో రెండు సెక్షన్లు ఉంటాయి. సాధారణంగా వీటిని పూర్తిచేయడానికి నాలుగేళ్లు పడుతుంది. పాలిటెక్నిక్‌ డిప్లొమా చేసినవారికి సెక్షన్‌-ఎలోని కొన్ని పేపర్ల (ప్రాజెక్ట్‌) నుంచి మినహాయింపు ఉంటుంది. దీంతో వీరికి ఈ సర్టిఫికేషన్‌ మూడేళ్లలో పూర్తిచేసే అవకాశం ఉంటుంది.
 

ఉద్యోగావకాశాలు

పాలిటెక్నిక్‌ కోర్సులను ప్రొఫెషనల్‌ కెరియర్‌కు దగ్గరిదారిగా చెబుతుంటారు. మంచి కెరియర్‌ అవకాశాలను అందిస్తుండటమే అందుకు కారణం. ఎన్నో ప్రముఖ సంస్థలు ఇంజినీరింగ్‌ వారితో పోలిస్తే వీరికి తొలి ప్రాధాన్యం ఇస్తుంటాయి. కోర్సులు పూర్తిచేసినవారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి.

పీఎస్‌యూలు/ ప్రభుత్వ రంగ సంస్థలు

ప్రభుత్వ, దాని అనుబంధ సంస్థలు పాలిటెక్నిక్‌ పూర్తిచేసినవారికి ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాయి. వీరిని ఇంజినీరింగ్, నాన్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో జూనియర్‌ స్థాయి, టెక్నికల్‌ హోదాలకు ఎంపిక చేస్తుంటారు.
 

నియమించుకుంటున్న సంస్థలు:
 

‣ రైల్వే 

‣ ఆర్మీ 

‣ గెయిల్‌ (గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌) 

‣ ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఓఎన్‌జీసీ) 

‣ డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీఓ) 

‣ భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (బీహెచ్‌ఈఎల్‌) 

‣ నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌టీపీసీ) 

‣ పబ్లిక్‌ వర్క్‌ డిపార్ట్‌మెంట్లు 

‣ బీఎస్‌ఎన్‌ఎల్‌ 

‣ ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌లు 

‣ నేషనల్‌ శాంపిల్‌ సర్వే ఆర్గనైజేషన్‌ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) 

‣ ఇండియన్‌ పెట్రో కెమికల్స్‌ లిమిటెడ్‌ (ఐపీసీఎల్‌)

పాలిటెక్నిక్‌ కోర్సులంటే..ఉద్యోగాధారిత కోర్సులు. వీటి సిలబస్‌ పరిశ్రమలకు అనుగుణంగా, విద్య పూర్తవడంతోనే విద్యార్థి సంబంధిత పరిశ్రమలో ఉద్యోగం సాధించేలా ఉంటుంది. కోర్సుల ద్వారా ఎంచుకున్న విభాగానికి సంబంధించిన ప్రాథమిక పరిజ్ఞానాన్ని అందజేస్తారు. కేవలం పుస్తక పరిజ్ఞానానికే పరిమితం కాకుండా ప్రాక్టికల్‌ పరిజ్ఞానానికీ ప్రాధాన్యమివ్వడం వీటి ప్రత్యేకత! 

ప్రైవేటు రంగ సంస్థలు

మాన్యుఫాక్చరింగ్, కన్‌స్ట్రక్షన్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్‌ విభాగాలకు సంబంధించిన ప్రైవేటు సంస్థలు డిప్లొమా పట్టాదారులకు అవకాశాలు కల్పిస్తాయి. ఈ సంస్థలూ ప్రభుత్వ విభాగాల్లానే వీరిని జూనియర్‌/ టెక్నికల్‌ స్థాయి హోదాలకే ఎంచుకుంటాయి.

నియమించుకుంటున్న ప్రముఖ సంస్థలు: 

‣ ఏర్‌లైన్స్‌ (ఇండిగో, స్పైస్‌జెట్‌) 

‣ కన్‌స్ట్రక్షన్‌ (యూనీటెక్, డీఎల్‌ఎఫ్, జీఎంఆర్‌) 

‣ కమ్యూనికేషన్‌ సంస్థలు (భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌) 

‣ కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ (టీఈఎస్, హెచ్‌సీఎల్, విప్రో) 

‣ ఎలక్ట్రికల్‌/ విద్యుత్‌ సంబంధిత (టాటా పవర్, బీఎస్‌ఈఎస్, ఎల్‌ అండ్‌ టీ) 

‣ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ (హిందుస్థాన్‌ యూనీలివర్, వోల్టాస్‌)

సొంత వ్యాపారం

డిప్లొమా కోర్సులన్నీ ప్రాక్టికల్‌/ చేయడం ద్వారా నేర్చుకోవడం పద్ధతిలోనే ఉంటాయి. దీంతో విద్యార్థులకు సబ్జెక్టుకు సంబంధించిన ప్రాథమిక పరిజ్ఞానం ఎక్కడ ఎలా ఉపయోగించాలో తెలుస్తుంది. కాబట్టి వారికి ఉన్న పరిజ్ఞానంతో కావాలనుకుంటే సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించుకోవచ్చు. ఉదాహరణకు- ఒక విద్యార్థి కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేశాడనుకుంటే.. కంప్యూటర్‌ రిపేరింగ్‌కు సంబంధించి వ్యాపారాన్ని ప్రారంభించుకోవచ్చు. 

ఇవీ హోదాలు 

‣ డిప్లొమా ఇన్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌: అసిస్టెంట్‌ మేనేజర్, ఫీల్డ్‌ ఇన్‌స్పెక్టర్, క్వాలిటీ కంట్రోల్‌ ఇంజినీర్‌

‣ డిప్లొమా ఇన్‌ ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌: ఆటోమొబైల్‌ ఇంజినీర్, ప్రొడక్షన్‌ ఇంజినీర్, డిజైన్‌ ఇంజినీర్‌

‣ డిప్లొమా ఇన్‌ కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌: వెబ్‌ డిజైనర్, సిస్టమ్‌ అనలిస్ట్, క్లౌడ్‌ ఆర్కిటెక్ట్‌

‣ డిప్లొమా ఇన్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌: ఎలక్ట్రికల్‌ ఇంజినీర్స్, నెట్‌వర్క్‌ ప్లానింగ్‌ ఇంజినీర్‌

‣ డిప్లొమా ఇన్‌ ఇంటీరియర్‌ డెకరేషన్‌: అసిస్టెంట్‌ డిజైనర్, డ్రాఫ్ట్స్‌మన్, సెట్‌అప్‌ డిజైనర్‌ 

Posted Date: 02-07-2021


 

టెన్త్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌