• facebook
  • whatsapp
  • telegram

ప్రసిద్ధ సంస్థల్లో పీజీ చేస్తారా?

జామ్-2022 ప్రకటన విడుదల

అర్హత; డిగ్రీ ఉత్తీర్ణత

డిగ్రీ పూర్తి చేసిన సైన్స్ విద్యార్థులు చాలామంది ప్రఖ్యాత సంస్థల్లో మాస్టర్స్ చేయడానికి మొగ్గు చూపుతారు. వాటిలో చేరడానికి జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ (జామ్) చక్కటి మార్గం. ఈ స్కోరుతో దేశంలో పేరుగాంచిన 20 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు, ఇండియన్ ఇన్ స్టిట్యూట్ సైన్స్ (బెంగళూరు)తోపాటు ఎన్ఐటీలు, ఐఐఈఎస్టీ షిబ్పూర్, స్లైట్ పంజాబ్, ఐఐఎస్ఈఆర్లో ప్రవేశాలు పొందవచ్చు. ఈమేరకు జామ్-2022 ప్రకటన వెలువడింది.  ఈసారి ఐఐటీ రూర్కీ పరీక్ష నిర్వహిస్తోంది.

ఇన్స్టిట్యూషన్లు.. కోర్సులు

జామ్ స్కోరు ద్వారా ప్రధానంగా 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో  ఎమ్మెస్సీ (రెండేళ్లు), జాయింట్ ఎమ్మెస్సీ - పీహెచ్‌డీ, ఎమ్మెస్సీ - పీహెచ్‌డీ డ్యుయల్ డిగ్రీ, ఎమ్మెస్సీ - ఎమ్మెస్ (రిసెర్చ్)/  పీహెచ్‌డీ డ్యుయల్ డిగ్రీ ఎమ్మెస్సీ - ఎంటెక్ డ్యుయల్ డిగ్రీ, పోస్ట్ బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అలాగే ఐఐఎస్సీ (బెంగళూరు) ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ ప్రోగ్రాములో, ఎన్ఐటీలు, ఐఐఈఎస్టీ షిబ్పూర్, స్లైట్ పంజాబ్, ఐఐఎస్ఈఆర్ సంస్థలు జామ్ స్కోరు ద్వారా పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాముల్లో అడ్మిషన్లు ఇస్తున్నాయి.

అర్హత ఇదీ..

కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత అర్హత డిగ్రీలో ఉత్తీర్ణత సాధించాలి. 

ఎంపిక ఇలా..

జామ్-2022.. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అందులో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. 

దరఖాస్తు ఎలా?

అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రుసుం ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఒక టెస్ట్ పేపర్కు రూ.750, రెండు టెస్ట్ పేపర్లకు రూ.1050 చెల్లించాలి. ఇతరులు ఒక టెస్ట్ పేప‌ర్‌కు రూ.1500, రెండు టెస్ట్ పేపర్లకు రూ.2100 చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తులకు అక్టోబర్ 11 తుది గడువు. 

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: హైదారాబాద్, కరీంనగర్, వరంగల్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.

పరీక్ష విధానం

పరీక్షలో మొత్తం 7 (బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, జియాలజీ, మ్యాథమేటిక్స్, మ్యాథమేటికల్ సైన్స్, ఫిజిక్స్) టెస్ట్ పేపర్లు ఉంటాయి. అభ్యర్థులు ఒకటి లేదా గరిష్ఠంగా రెండు టెస్ట్ పేపర్లను ఎంచుకోవచ్చు. అయితే రెండు పేపర్లు ఒకే సెషన్లో ఉండకూడదు. ఉదయం సెషన్లో బయోటెక్నాలజీ, మ్యాథమేటికల్ సైన్స్, ఫిజిక్స్‌ పరీక్ష ఉంటుంది. మధ్యాహ్నం కెమిస్ట్రీ, ఎకానమిక్స్, జియాలజీ, మ్యాథమేటిక్స్ పేపర్లు నిర్వహిస్తారు. పరీక్ష సమయం 3 గంటలు. ఆంగ్ల మాధ్యమంలో ప్రశ్నపత్రం వస్తుంది. జామ్ 2022 ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ రూపంలో ఉంటుంది. ఏ సబ్జెక్టు ప్రశ్నపత్రంలోనైనా మొత్తం 60 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. వీటికి వంద మార్కులు కేటాయించారు. ఈ ప్రశ్నలను మూడు సెక్షన్లుగా విభజించి ప్రశ్నపత్రంలో పొందుపరుస్తారు. అవి మల్టిపుల్ ఛాయిస్, మల్టిపుల్ సెలెక్ట్, న్యూమరికల్ ఆన్సర్ టైప్ పశ్నలు. 

సెక్ష‌న్-ఎ: ఇందులో మొత్తం 30 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలుంటాయి. వీటిలో ఒక మార్కు ప్రశ్నలు పది, రెండు మార్కుల ప్రశ్నలు 20 ఉంటాయి. ప్రతి ప్రశ్నకు నాలుగు ఆప్షన్లు ఇస్తారు. ఒకటే సరైన సమాధానం ఉంటుంది. రుణాత్మక మార్కులుంటాయి. తప్పు సమాధానాలకు ఒక మార్కు ప్రశ్నకు 1/3, రెండు మార్కుల ప్రశ్నలకు 2/3 మార్కులు కోత విధిస్తారు.

సెక్ష‌న్‌-బి: ఈ సెక్షన్లో మొత్తం 10 మల్టిపుల్ సెలెక్ట్ ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు. ప్రతి ప్రశ్నకు నాలుగు ఆప్షన్లు ఇస్తారు. కానీ ఒకటి లేదా అంత కంటే ఎక్కువ సమాధానాలు ఉంటాయి. వాటిని సరిగ్గా గుర్తిస్తేనే పూర్తి మార్కులు ఇస్తారు. పాక్షిక సమాధానాలకు మార్కులు ఇవ్వరు. రుణాత్మక మార్కులుండవు. 

సెక్ష‌న్‌-సి​​​​​: ఇందులో న్యూమెరికల్ ఆన్సర్ టైప్ ప్రశ్నలు మొత్తం 20 వస్తాయి. ఒక మార్కు ప్రశ్నలు 10, రెండు మార్కుల ప్రశ్నలు 10 ఉంటాయి. ఈ ప్రశ్నలకు ఆప్షన్లు ఉండవు. వీటికి వాస్తవ సంఖ్య సమాధానంగా ఉంటుంది. అభ్యర్థి సమాధాన సంఖ్యను కంప్యూటర్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 

సిలబస్ ఇలా..

బయోటెక్నాలజీ

ఈ పరీక్షలో బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టులకు చెందిన ప్రశ్నలు వస్తాయి. బీఎస్సీ టెక్నాలజీ,  సెల్ బయాలజీ, బయో కెమిస్ట్రీ, జెనెటిక్స్, మాలిక్యులర్ బయాలజీ, ఎవల్యూషన్, మైక్రోబయాలజీ, ప్లాంట్ బయాలజీ, ఎనిమల్ బయాలజీ, ఎకాలజీ, మెథడ్స్ ఇన్ బయాలజీ అంశాలపై దృష్టి పెట్టాలి. కెమిస్ట్రీలో అమినో ఆసిడ్లు, ప్రోటీన్లు తదితర విషయాలను అధ్యయనం చేయాలి. 

కెమెస్ట్రీ

ఈ సబ్జెక్టులో ఆర్గానిక్ విభాగం నుంచి జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, రియాక్షన్ మెకానిజం, స్పెక్ట్రోస్కోపీ, స్టీరియో కెమిస్ట్రీ, నేమ్డ్ రియాక్షన్, రియేజెంట్స్ తదితర పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. ఫిజికల్ కెమిస్ట్రీ విభాగంలో క్వాంటమ్ కెమిస్ట్రీ, థర్మోడైనమిక్స్, కెమికల్ కైనటిక్స్, ఎలక్ట్రో కెమిస్ట్రీ, సాలిడ్ స్టేట్ అంశాలపై దృస్టి సారించాలి. ఎనలిటికల్ కెమిస్ట్రీ, రసాయన బంధం, ఇనార్గానిక్ ప్రశ్నలు అడుగుతారు. 

ఫిజిక్స్

ఫిజిక్స్ సబ్జెక్టులో పరీక్ష రాసేవారు ఫిజికల్ ఆప్టిక్స్, క్వాంటమ్ మెకానిక్స్, థర్మోడైనమిక్స్, వేవ్స్ అండ్ ఆసిలేషన్స్, హీట్, ఆప్టిక్స్, మోడ్రన్ ఫిజిక్స్, న్యూక్లియర్ ఫిజిక్స్, అటామిక్ ఫిజిక్స్, క్వాంటమ్ థియరీ, స్పెక్ట్రోస్కోపీ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. 

మ్యాథమేటిక్స్

మ్యాథ్స్ సబ్జెక్టు అభ్యర్థులు మ్యాట్రిక్స్, డెరివేటివ్స్, కాలిక్యులస్, వెక్టార్స్, ట్రైగనోమెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీలపై సాధన చేయాలి. 

ఎకనామిక్స్

ఎకనామిక్స్ పరీక్ష రాసే అభ్యర్థులు మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్, ఇండియన్ ఎకానమీ, స్టాటిస్టిక్ ఎకానమీ, మ్యాథమెటికల్ ఎకానమీ అంశాలను అధ్యయనం చేయాలి. 

ముఖ్యమైన తేదీలు: 

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 30, 2021.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులకు తుది గడువు: అక్టోబర్ 11, 2021.

జామ్-2022 పరీక్ష తేదీ: ఫిబ్రవరి  13, 2022.

ఫలితాల వెల్లడి: మార్చి 22, 2022.

వెబ్‌సైట్‌: https://jam.iitr.ac.in/

Posted Date: 07-08-2021


 

ప్రవేశ పరీక్షలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌