• facebook
  • whatsapp
  • telegram

నీట్‌

వైద్యవిద్యా కోర్సుల్లో చేరదల్చిన విద్యార్థులు ‘నీట్‌’ ర్యాంకు పొందడం తప్పనిసరి. గతంలో వివిధ పరీక్షలు వివిధ విశ్వవిద్యాలయాలకు జరిగేవి కానీ ఇప్పుడు ఎంబీబీఎస్‌లో ప్రవేశానికి దేశం మొత్తంలో జరిగే పరీక్షలు మూడే. అవి..1) నీట్‌ 2) ఎయిమ్స్‌ 3) జిప్‌మర్‌. నీట్‌తో పోలిస్తే ఎయిమ్స్‌, జిప్‌మర్ ద్వారా ఉండే సీట్ల సంఖ్య చాలా తక్కువ. దేశంలో ఉన్న మొత్తం ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సులకు సంబంధించిన మొత్తం 52,305 సీట్లు నీట్‌ - యూజీలో అర్హులైన విద్యార్థులతోనే భర్తీ చేయాల్సి వుంటుంది. మేనేజ్‌మెంట్‌ కోటాలో సీట్లు పొందాలన్నా నీట్‌లో అర్హత పొందాల్సిందే. తెలుగు రాష్ట్రాల ఇంటర్మీడియట్‌ బైపీసీ విద్యార్థులు వైద్య, దంతవైద్య కళాశాలల్లో ప్రవేశం కోసం తప్పనిసరిగా నీట్‌ (నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) రాయాల్సివుంది. మొదట ఏఐపీఎంటీ రూపంలో ఉన్న ఈ పరీక్ష 2016 నుంచి ‘నీట్‌’గా మారింది. ప్రభుత్వ, ప్రైవేటు లేదా డీమ్డ్‌ యూనివర్సిటీల్లో సీట్లకు మైనారిటీ సంస్థలతో కలిపి నీట్‌-యూజీ పరీక్షలో అర్హత తప్పనిసరి అయింది.

పరీక్ష విధానం
ఇంగ్లిష్‌, ఇంగ్లిష్‌- హిందీ, ఇంగ్లిష్‌-తెలుగు అనే మూడు విధానాల్లో విద్యార్థి దరఖాస్తులో ఎంచుకున్న దాని ప్రకారం నీట్ ప్రశ్నపత్రం ఉంటుంది. ఒకవేళ తెలుగు కావాలంటే ఇంగ్లిష్‌, తెలుగు రెండు భాషల్లో ఉన్న ప్రశ్నపత్రాన్ని ఎంచుకోవచ్చు. ఈ పరీక్షలో మొత్తం 180 ప్రశ్నలు ఉంటాయి. బయాలజీ నుంచి 90 ప్రశ్నలు ఉంటాయి. కానీ బోటనీ, జువాలజీల నుంచి సమంగా అంటే 45 చొప్పున ప్రశ్నలు ఉండాలనేం లేదు. 2016లో జరిగిన నీట్‌లో బోటనీ నుంచి 52, జువాలజీ నుంచి 38 ప్రశ్నలు వచ్చాయి.

సీట్ల సంఖ్య
నీట్‌ వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఎంబీబీఎస్‌/ బీడీఎస్‌ సీట్లు పెరగడం కానీ, తగ్గడం కానీ జరగదు. 371 (డి) ప్రకారం మన విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లోని ప్రభుత్వ మెడికల్‌/ కన్వీనర్‌ కోటాలోని మెడికల్‌ సీట్లు పొందడానికి అవకాశం లేదు. మన రాష్ట్రంలో ఇతర రాష్ట్ర విద్యార్థులకు కన్వీనర్‌ కోటాలోని సీట్లు ఇవ్వరు. అయితే ఈ నీట్‌ వల్ల అదనంగా డీమ్డ్‌ యూనివర్సిటీలు, ఇతర రాష్ట్రాల్లోని మెడికల్‌, డెంటల్‌ కళాశాలల్లో కేటగిరీ-బి, సి సీట్లకు అర్హత పొందుతారు. అంటే, తెలుగు రాష్ట్రాల్లోని 6500 సీట్లలో.. ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కళాశాలల్లో 4000 వరకు ఉన్న కేటగిరీ-ఎ సీట్లను తెలుగు రాష్ట్రాల విద్యార్థులకే కేటాయిస్తారు. ఇక్కడ కేటగిరీ-బి, సి, గీతం యూనివర్సిటీలోని సీట్లకు అన్ని రాష్ట్రాల విద్యార్థులూ అర్హులే. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లోని మెడికల్‌ కళాశాలల్లోని కేటగిరీ-బి, సి, డీమ్డ్‌ యూనివర్సిటీల్లోని సీట్లకు తెలుగు విద్యార్థులు కూడా పోటీపడవచ్చు. 

రిజర్వేషన్‌ విధానం
మెడికల్‌, డెంటల్‌ కళాశాలల్లో గతంలో నిర్వహించిన రిజర్వేషన్‌ విధానమే ఇప్పుడూ కొనసాగుతుంది. నీట్‌ జాతీయస్థాయి పరీక్ష అయినప్పటికీ సీట్లను నింపే విధానం ప్రాంతీయంగానే జరుగుతుంది. కాబట్టి, రిజర్వేషన్‌లో ఎలాంటి మార్పూ ఉండదు. గతంలో మాదిరిగానే ఎస్‌సీ- 15%, ఎస్‌టీ- 7% తోపాటు బీసీ- ఎ, బి, సి, డి, ఇ కూడా అలాగే కొనసాగుతుంది. ఎన్‌సీసీ, స్పోర్ట్స్‌ కోటాలు కూడా గతంలో ఉన్న విధానంలోనే కొనసాగుతాయి. కాబట్టి రిజర్వేషన్‌ అర్హత ఉన్న విద్యార్థులు ఈ విషయంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

కటాఫ్‌
ఏదైనా సంస్థలో మేనేజ్‌మెంట్‌/ మైనారిటీ కోటాలో చేరాలన్నా నీట్‌లో అర్హత పొందడం (క్వాలిఫై) తప్పనిసరి. ఇందుకు జనరల్‌ కేటగిరీ విద్యార్థులు 50 పర్సంటైల్‌, ఓబీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ విద్యార్థులకు 40 పర్సంటైల్‌, జనరల్‌ కేటగిరీ, దివ్యాంగులు 45 పర్సంటైల్‌ పొందాల్సి ఉంటుంది.

అఖిలభారత కోటా సంగతి
దరఖాస్తు భర్తీ సందర్భంగా అఖిలభారత కోటా పొందటం ఎలా అనేది అవగాహన చేసుకోవాలి. మెడికల్‌ సీట్లను ఎంసీఐ నాలుగు విభాగాలుగా విభజించింది. 1) అఖిలభారత కోటా సీట్లు 2) రాష్ట్రప్రభుత్వ కోటా సీట్లు 3) ప్రైవేటు మెడికల్‌/డెంటల్‌ కళాశాలల్లో రాష్ట్ర/ప్రైవేటు/మేనేజ్‌మెంట్‌/ ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లు 4) సెంట్రల్‌ పూల్‌ కోటా సీట్లు. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లోని 15 శాతం కోటా సీట్లకు అనర్హులు. అలాగే ఇతర రాష్ట్రాల విద్యార్థులు కూడా మన వద్ద సీట్లు పొందలేరు. ఇది కేవలం ప్రభుత్వ కళాశాలల్లోని సీట్లకూ, ప్రైవేటు కళాశాలల్లో కేటగిరీ ఏ సీట్లకూ మాత్రమే. అంటే రాష్ట్రప్రభుత్వ కౌన్సెలింగ్‌ ద్వారా నింపే సీట్లకు వర్తిస్తుంది. మూడో కేటగిరిలో ఉన్న కళాశాలల్లో ఏ రాష్ట్రవిద్యార్థి ఏ రాష్ట్రానికి అయినా వెళ్ళవచ్చు. ప్రైవేటు కళాశాలల్లో కేటగిరీ బీ లేదా కేటగిరీ సీ సీట్లు, మేనేజ్‌మెంట్‌ కోటా, ఎన్‌ఆర్‌ఐ కోటా లేదా డీమ్డ్‌ యూనివర్సిటీల్లో సీట్లు ఏ రాష్ట్రంలో ఉన్నా తెలుగు రాష్ట్రాల విద్యార్థులు చేరడానికి అర్హులే. తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ లేదా ప్రైవేటు కళాశాలల్లోని నూరుశాతం సీట్లకూ, రాష్ట్రం వెలుపలున్న ప్రైవేటు కళాశాలల్లో కేటగిరీ బీ లేదా కేటగిరీ సీ సీట్లకూ, డీమ్డ్‌ వర్సిటీల్లో ప్రవేశం కోసం దరఖాస్తు చేయదల్చిన విద్యార్థులు అఫిడవిట్‌ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ విద్యార్థులు పైన పేర్కొన్న తెలిపిన సీట్లు వద్దని ఇతర రాష్ట్రాల్లోని ప్రభుత్వ కళాశాలల్లో 15 శాతంలో సీట్లు పొందాలంటే దరఖాస్తులో అఫిడవిట్‌ పొందపరచాల్సివుంటుంది. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఈ అఫిడవిట్‌కు NO చెప్పడం సరి అవుతుంది!


 

ఎయిమ్స్‌
మనదేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన వైద్య విద్యాసంస్థ ఎయిమ్స్‌. దీనిలో UG కోర్సులకంటే PG కోర్సులకు అత్యధిక ప్రాధాన్యం. తొలిగా దిల్లీలో మాత్రమే ఉండేది. దిల్లీలోని సంస్థలో 72 సీట్లు మాత్రమే ఉన్నాయి. వీటిలో జనరల్‌ కేటగిరికీ కేవలం 36- 38 సీట్లు. పోటీ దేశమంతటా కాబట్టి సగటున రాష్ట్రానికి ఒకటి లేదా రెండు సీట్లు వచ్చేవి. మూడేళ్ళ కిందట అదనంగా ఆరు AIIMS సంస్థలు (భోపాల్‌, పాట్నా, జోధ్‌పూర్‌, రిషికేష్‌, రాయ్‌పూర్‌, భువనేశ్వర్‌) ప్రారంభమయ్యాయి. వీటిలో ప్రతి సంస్థలో 100 సీట్ల చొప్పున 600 సీట్ల వరకు ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి మంగళగిరిలోని AIIMS కూడా ప్రారంభం కావచ్చు. ఎయిమ్స్‌ పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో మాత్రమే జరుగుతుంది. పరీక్ష కాల వ్యవధి 3 గం. 30 నిమిషాలు. పరీక్షలో 200 ప్రశ్నలుంటాయి. అన్నీ బహుళ ఐచ్ఛిక ప్రశ్నలే. ఈ 200 ప్రశ్నలలో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ (బోటనీ, జువాలజీ) లలో 60 ప్రశ్నల చొప్పున మొత్తం 180. మిగిలిన 20 ప్రశ్నలు జనరల్‌ నాలెడ్జిలో ఉంటాయి. మొదటి 180 ప్రశ్నలలో 60 ప్రశ్నలు Assertion and Reasoning ప్రశ్నలుంటాయి. ప్రతి సరి అయిన సమాధానానికి +1 మార్కు, తప్పు సమాధానానికి -1/3. ర్యాంకు పొందటానికి జనరల్‌ విద్యార్థులకు 50%, ఓబీసీ వారికి 45 శాతం, ఎస్‌.సి./ఎస్‌.టి. వారికి 40 శాతం మార్కులు కటాఫ్‌ మార్కులుగా ఉంటాయి.

జిప్‌మర్‌
పాండిచ్చేరిలోని ఈ సంస్థకు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు కొంత మక్కువ చూపుతున్నారు. దీనికి కారణం పాండిచ్చేరిలోని భాగమైన యానాం కాకినాడ దగ్గరలో ఉండటం. దీనిలో కూడా స్నాతకోత్తర విభాగాలకు అదనపు ప్రాధాన్యం ఉంటుంది. జిప్‌మర్‌లో ఎంబీబీఎస్‌లో మొత్తం 150 సీట్లు ఉన్నాయి. వాటిలో పాండిచ్చేరికి 40 సీట్లు, సెల్ప్‌ ఫైనాన్స్‌డ్‌ NRI రూపంలో 5 సీట్లు ఉన్నాయి. మిగిలిన 105 సీట్లలో 50 జనరల్‌, 28 OBC , 16 SC, 11 STలకు కేటాయించి ఉంటాయి. ర్యాంకింగ్‌ కూడా కేటగిరీ పరంగానే ఇస్తారు. పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. పరీక్ష కాల వ్యవధి 2.30 గంటలు. పరీక్షలో 200 ప్రశ్నలుంటాయి. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ (బోటనీ+ జువాలజీ)లలో 60 ప్రశ్నల చొప్పున మొత్తం 180 బహుళ ఐచ్ఛిక ప్రశ్నలుంటాయి. మిగిలిన 20 ప్రశ్నల్లో 10 ప్రశ్నలు లాజిక్‌, క్వాంటిటేటివ్‌ రీజనింగ్‌లలో, 10 ప్రశ్నలు ఇంగ్లిష్‌, కాంప్రహెన్షన్‌లో ఉంటాయి. ఈ పరీక్షలో తుది ర్యాంకు నిర్ధారణకు చివరి 20 ప్రశ్నలు అంటే రీజనింగ్‌, ఇంగ్లిష్‌ బాగా ఉపయోగపడతాయి.

Posted Date: 20-10-2020


 

ఇంటర్ తర్వాత

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌