• facebook
  • whatsapp
  • telegram

తెర మీద... తెర వెనుక

సహజ నైపుణ్యాలకు చక్కని మెరుగులు

ఇంటర్‌ తర్వాత: ఫిల్మ్‌ స్టడీస్‌ 

 

 

భిన్న నైపుణ్యాలున్న వ్యక్తులు కలసికట్టుగా శ్రమిస్తేనే చలనచిత్రం రూపొంది, మనతో ఈలలు వేయించి, చప్పట్లు కొట్టిస్తుంది. తెరపైకి కళాకారులు రావడం వెనుక ఎంతో మంది నిపుణుల శ్రమ దాగి ఉంది. ఓటీటీల రాకతో ప్రదర్శన వేదికల పరిధి మరింత విస్తరించింది. నైపుణ్యం ఉన్నవారు నిలదొక్కుకునేందుకు మార్గం సుగమమైంది. చిత్ర పరిశ్రమలో సత్తా చాటడానికి ఎన్నో విభాగాలు ఉన్నాయి. అలాగే ఔత్సాహికులకు శిక్షణ ఇచ్చే సంస్థలూ పెరిగాయి. ఆసక్తి ఉన్నవారు ఇంటర్‌ విద్యార్హతతో వీటిలో చేరవచ్చు. 

 

మన దేశంలో కళలకు ఆదరణ ఎక్కువ. అందులోనూ సినిమాల గురించైతే ఎంత చెప్పుకున్నా తక్కువే. తెలుగు రాష్ట్రాల్లో ఈ అభిమానానికి హద్దులు లేవు. ప్రతిభ, నైపుణ్యం ఉన్న కళాకారులను ఇక్కడి జనాలు అభిమానంతో ఆరాధిస్తారు. 

 

ప్రదర్శన వేదికలు విస్తరించడంతో ‘ఒకే ఒక్క ఛాన్స్‌!’ అంటూ స్టూడియోల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గింది. వినోదాన్ని అందించే ఛానెళ్లు పెరిగాయి. సీరియల్స్‌తోపాటు వివిధ కార్యక్రమాలు ఆదరణ పొందుతున్నాయి. 

 

వెండితెర, బుల్లితెరలకు పోటీగా వెబ్‌ సిరీస్, షార్ట్‌ ఫిల్మ్స్‌ జనాల మనసు దోచుకుంటున్నాయి. వైవిధ్యమైన కంటెంట్‌తో ప్రేక్షకులను కట్టిపడేసే నిర్మాణ సంస్థలూ వస్తున్నాయి. ఓవర్‌ ది టాప్‌ (ఓటీటీ) సంస్థలు ఊహించంత వేగంగా వృద్ధి చెందుతున్నాయి. ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టా, వాట్సాప్‌...ఇవన్నీ నేటితరం నైపుణ్యాలను ప్రపంచానికి సులువుగా చాటిచెప్పుతున్నాయి. 

 

కంటెంట్‌ వైరల్‌ అయిందంటే సంబంధిత నట, సాంకేతిక వర్గాన్ని నిర్మాణ సంస్థలే ఆహ్వానిస్తున్నాయి.

 

నటనతోపాటు...

సినీ ప్రపంచమంటే ఎన్నో విభాగాల సమ్మిళితం. నటులు ఇందులో ఒక భాగం మాత్రమే. దర్శకత్వం, స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫీ, స్క్రీన్‌ రైటింగ్, ఎడిటింగ్, ప్రొడ్యూసింగ్, సౌండ్‌ రికార్టింగ్, విజువల్‌ ఎఫెక్ట్స్, ప్రీ ప్రొడక్షన్, పోస్టు ప్రొడక్షన్, లైటింగ్, మ్యూజిక్, వాయిస్‌ డబ్బింగ్‌...ఇలా ఎన్నో విభాగాల సమన్వయం అవసరం. వీటి సాయంతో తుది మెరుగులు దిద్దుకున్న సినిమా థియేటర్లు, టీవీలు, కంప్యూటర్లు, మొబైళ్లలో కనువిందు చేస్తుంది. ఔత్సాహికులు తమ నైపుణ్యాలు, ఆసక్తి ప్రకారం నచ్చిన విభాగానికి చెందిన కోర్సులో చేరి ప్రతిభకు మెరుగులద్దుకోవచ్చు. 

 

ఎన్నో కోర్సులు 

ఇంటర్‌ విద్యార్హతతో ఫిల్మ్‌ స్టడీస్‌ కోర్సుల్లో చేరవచ్చు. ప్రైవేటు సంస్థలే ఎక్కువగా అండర్‌ గ్రాడ్యుయేట్‌ చదువులు అందిస్తున్నాయి. సినీ నేపథ్యం ఉన్నవారి ఆధ్వర్యంలోనే చాలా సంస్థలు నడుస్తున్నాయి. ఫిల్మ్‌ కోర్సులకు దేశంలో ముంబై ప్రసిద్ధి చెందింది. ఆ తర్వాతి స్థానాల్లో హైదరాబాద్‌ కూడా ప్రముఖమైనదే. ఫుల్‌ టైం కోర్సుల్లో చేరినవారికి సినిమాకు చెందిన అన్ని విభాగాలపైనా అవగాహన కల్పిస్తారు. కోర్సు చివరలో లేదా సమాంతరంగా స్పెషలైజేషన్‌పై దృష్టి సారిస్తారు. ఇంటర్‌ విద్యార్హతతో సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ కోర్సుల్లో చేరవచ్చు. వీటిలో ప్రవేశానికి.. పరీక్ష లేదా నైపుణ్యాన్ని తెలిపే వీడియో పంపడం, ముఖాముఖి...మొదలైనవి నిర్వహిస్తారు. కొన్ని సంస్థలు కోర్సు చివరలో సినిమా, టీవీల్లో అవకాశాలు కల్పిస్తున్నాయి. నిర్మాణ సంస్థలు ప్రాంగణ నియామకాల ద్వారా కొత్తవారిని తీసుకుంటున్నాయి. 

 

ఇవీ సంస్థలు 

టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ (టిస్‌), విజిలింగ్‌ వుడ్స్‌ ఇంటర్నేషనల్‌ (డబ్ల్యుడబ్ల్యుఐ): ఇవి సంయుక్తంగా ఫిల్మ్‌ మేకింగ్‌లో డిగ్రీ, డిప్లొమా కోర్సులు అందిస్తున్నాయి. ఇంటర్‌ అర్హతతో బీఎస్సీ/బీఏ ఫిల్మ్‌ మేకింగ్‌ (సినిమాటోగ్రఫీ/ డైరెక్షన్‌/ ఎడిటింగ్‌/ ప్రొడ్యూసింగ్‌/ సౌండ్‌ రికార్డింగ్‌ అండ్‌ డిజైన్‌/ విఎఫ్‌ఎక్స్‌) స్పెషలైజేషన్లతో కోర్సులు నడుపుతున్నాయి. ఈ స్పెషలైజేషన్లలో రెండేళ్ల వ్యవధితో అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా కోర్సులూ ఉన్నాయి. బీఏ (స్క్రీన్‌ రైటింగ్‌/ యాక్టింగ్‌) కోర్సుల్లో చేరవచ్చు. యాక్టింగ్‌లో అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా, స్క్రీన్‌ రైటింగ్‌లో డిప్లొమా, అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా కోర్సులూ ఉన్నాయి. ఆరు నెలల వ్యవధితో వెబ్‌ అండ్‌ టీవీ సిరీస్‌ స్క్రీన్‌ రైటింగ్‌లో సర్టిఫికెట్‌ కోర్సు ఉంది. డిప్లొమాల వ్యవధి ఏడాది. ఈ సంస్థలో ప్రవేశాలు జనరల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు, క్రియేటివ్‌ ఎబిలిటీ టెస్టు, స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభతో లభిస్తాయి. 

 

ఏషియన్‌ అకాడెమీ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్, నోయిడా: మూడేళ్ల వ్యవధితో బీఎస్సీ (సినిమా) కోర్సుతో కలిపి నచ్చిన విభాగంలో డిప్లొమా అందిస్తోంది. యాక్టింగ్, సినిమాటోగ్రఫీ, డైరెక్షన్, పోస్టు ప్రొడక్షన్, సౌండ్‌ ఎడిటింగ్‌లో ఏదైనా ఎంచుకోవచ్చు. బీఏ థియేటర్‌ అండ్‌ డ్రామా కోర్సునూ చదువుకోవచ్చు. ఇక్కడ ఏడాది వ్యవధితో డిప్లొమా, మూడు నెలల వ్యవధితో షార్ట్‌ టర్మ్‌ కోర్సులూ ఉన్నాయి.  

 

ముంబై డిజిటల్‌ ఫిల్మ్‌ అకాడెమీ: డిజిటల్‌ ఫిల్మ్‌ మేకింగ్, డిజిటల్‌ సినిమాటోగ్రఫీ, యాక్టింగ్, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, ఫిల్మ్‌ అండ్‌ వీడియో ఎడిటింగ్, సౌండ్‌ డిజైనింగ్‌ అండ్‌ ఎడిటింగ్, ఫొటోగ్రఫీ, స్క్రీన్‌ ప్లే రైటింగ్, వాయిస్‌ డబ్బింగ్‌ అండ్‌ యాంకరింగ్‌లో ఏడాది డిప్లొమా, ఆరు నెలల సర్టిఫికెట్, మూడు నెలల షార్ట్‌ టర్మ్‌ కోర్సులు ఉన్నాయి.

 

బుక్‌ మై ఫేస్, స్కైవాక్‌ యాక్టింగ్‌ ఇన్‌స్టిట్యూట్, ఫిల్మ్‌ అండ్‌ క్రియేటివ్‌ ఆర్ట్‌ ఇన్‌స్టిట్యూట్, రోషన్‌ తనేజా స్కూల్‌ ఆఫ్‌ యాక్టింగ్, బెర్రీజాన్‌ యాక్టింగ్‌ స్టూడియో, అనుపమ్‌కేర్‌ యాక్టర్‌ ప్రిపేర్స్, ఆర్‌కే ఫిల్మ్స్‌ అండ్‌ మీడియా అకాడెమీ, ఆర్‌కే బెస్ట్‌ యాక్టింగ్‌ స్కూల్, యాక్టర్‌ స్టూడియో ఇండియా.....తదితర సంస్థల్లో సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులు ఉన్నాయి. 

 

సత్యజిత్‌ రే ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్, కోల్‌కతా; ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, పుణెలను మినిస్ట్రీ ఆఫ్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ ఆధ్వర్యంలో స్వయంప్రతిపత్తి సంస్థలగా ఏర్పాటు చేశారు. వీటిలో చాలా కోర్సులను పీజీ డిప్లొమా స్థాయుల్లో అందిస్తున్నారు. గ్రాడ్యుయేట్లకు అవకాశం ఉంటుంది. 

 

తెలుగు రాష్ట్రాల్లో...

ఆంధ్రా యూనివర్సిటీ 3 నెలల వ్యవధితో యాక్టింగ్‌లో సర్టిఫికెట్‌ కోర్సు అందిస్తోంది. అన్నపూర్ణ కాలేజ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ మీడియా బ్యాచిలర్స్‌ డిగ్రీలో మీడియా ప్రొడక్షన్‌ కోర్సులు నిర్వహిస్తోంది. రామానాయుడు ఫిల్మ్‌ స్కూల్‌ డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, యాక్టింగ్‌ కోర్సులు అందిస్తోంది. వీటితోపాటు మరికొన్ని సంస్థలు ఫిల్మ్‌ కోర్సుల్లో మెలకువలు నేర్పుతున్నాయి. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంతోపాటు కొన్ని సంస్థల్లో పీజీ స్థాయి కోర్సులు ఉన్నాయి.  

 

విభాగాల వారీగా...

యాక్షన్‌: వివిధ భావాలను ముఖకవళికల ద్వారా ప్రకటించగలిగే నేర్పరితనం ఉండాలి. నృత్యలో పరిచయం, మంచి రూపం అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. బాడీ లాంగ్వేజ్, సంభాషణలు పలికే విధంపై దృష్టి సారించాలి.  

 

డైరెక్షన్‌: సినిమా ఎలా తీయాలో దర్శకులు బ్లూ ప్రింట్‌ రూపొందిస్తారు. షూటింగ్‌ నిరాటంకంగా కొనసాగించి సినిమా/ సీరియల్‌/ షార్ట్‌ ఫిల్మ్‌ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో దర్శకుడే మార్గదర్శి. నిర్వహణ నైపుణ్యం, అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లడం, నాయకత్వ లక్షణాలు ఉన్నవారు డైరెక్షన్‌పై దృష్టి సారించవచ్చు. దశలవారీగా అసిస్టెంట్‌ డైరెక్టర్, డైరెక్టర్‌ హోదాలు సొంతం చేసుకోవచ్చు. 

 

స్క్రీన్‌ప్లే: సినిమాకు సంబంధించిన అవుట్‌లైన్‌ అంతా ఇందులో ఉంటుంది. దీని ఆధారంగానే వివిధ సన్నివేశాలు అభివృద్ధి చేస్తారు. రచనలో సృజనాత్మకత ఉన్నవారు, కొత్తగా ఆలోచించగలిగేవారు ఈ విభాగంపై దృష్టి సారించవచ్చు. భాష, సన్నివేశాల అల్లిక ద్వారా హత్తుకునేలా చేసే నైపుణ్యం ఉన్నవారు స్క్రీన్‌ప్లేలో రాణించవచ్చు. కోర్సు పూర్తయిన తర్వాత అసిస్టెంట్‌ రైటర్, రైటర్‌గా సేవలు అందించవచ్చు. 

 

సినిమాటోగ్రఫీ: ఫొటోగ్రఫీ, వీడియోలపై పట్టున్నవారు ఈ విభాగాన్ని ఎంచుకోవచ్చు. కొత్త టెక్నాలజీపై గురి ఉండాలి. సందర్భానికి తగ్గ దృశ్యాలతో ప్రేక్షకులను కట్టి పడేయాలి. చిత్రీకరణ జరుగుతోన్న ప్రాంతానికి తగ్గట్టుగా, సన్నివేశానికి సరిపోయేలా లైటింగ్, విజువల్‌ ఎఫెక్ట్స్‌ తీసుకొచ్చి దృశ్యానికి ప్రాణం పోసేది వీళ్లే. నిరంతర శ్రమతో అసిస్టెంట్‌ సినిమాటోగ్రాఫర్, సినిమాటోగ్రాఫర్‌ హోదాలు అందుకోవచ్చు. 

 

ఎడిటింగ్‌: షూట్‌ నిడివి నాలుగైదు గంటలు ఉంటుంది. దాన్ని రెండున్నర గంటలకు కుదించాలి. అవసరమైన సన్నివేశాలకు అన్యాయం జరగకుండా, ఉపయోగం లేనివాటిని తెలివిగా తొలగించాలి. ఆరంభం నుంచి ఆఖరిదాకా సన్నివేశాల మధ్య సమన్వయం దెబ్బతినకుండా చూసుకోవాలి. ఇవన్నీ బేరీజు వేసే నైపుణ్యం ఉన్నవారు ఎడిటింగ్‌ ఎంచుకోవచ్చు. సినీ ప్రపంచంలో దశలవారీగా ఎడిటర్‌ స్థాయికి చేరుకోవచ్చు.  

 

సౌండ్‌ రికార్డింగ్‌: సన్నివేశాలకు తగ్గ శబ్దాలను జోడిస్తేనే సినిమా అనుభవం పరిపూర్ణమవుతుంది. సన్నివేశాల్లో ప్రేక్షకులు లీనమవుతారు. సాంకేతికతపై పట్టు, శబ్ద ప్రయోగంపై ఆసక్తి ఉన్నవారు సౌండ్‌ రికార్డింగ్‌ కోర్సుల్లో చేరవచ్చు.

 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఎలా ఎంచుకోవాలి.. సరైన కెరియర్‌?

‣ సైన్యంలో సాంకేతిక పోస్టులు!

‣ కమ్యూనిటీ సైన్స్‌లో బీఎస్‌సీ

Posted Date: 19-10-2021


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌