• facebook
  • whatsapp
  • telegram

గ్రూపు ఏదైనా సరే!

ఇంటర్‌లో ఏ గ్రూపు చదివితే సాధారణంగా ఆ మార్గంలోనే కెరియర్‌ ప్రయాణం సాగుతుంది. కానీ చదివిన గ్రూప్‌తో సంబంధం లేకుండా, ఏ గ్రూపు చదివినవారైనా చేరటానికి వీలైన కొన్ని కోర్సులున్నాయి. ప్రతి విద్యార్థికీ ఇవి అనువుగా ఉంటాయి. సీఏ, సీఎంఏ, కంపెనీ సెక్రటరీ లాంటి కామర్స్‌ కోర్సులు అందరికీ తెలిసినవే. వీటితో పాటు న్యాయవిద్య, ఉపాధ్యాయవిద్య, హోటల్‌ మేనేజ్‌మెంట్‌, ఫైన్‌ ఆర్ట్స్‌, లిబరల్‌ స్టడీస్‌, ఫ్యాషన్‌, డిజైన్‌... ఒకటేమిటి- వైవిధ్య భరితమైన చదువులెన్నో ఇంటర్‌ విద్యార్థుల ముందున్నాయి. తమకు బాగా ఆసక్తి ఉన్నవాటిని ఎంచుకుని, కృషి చేస్తే వీటిలో అద్భుతంగా రాణించే అవకాశముంది!

బోధన

తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్‌ ఉన్న కొలువుల్లో ఉపాధ్యాయ వృత్తి ముందుంటుంది. ఆచార్యులుగా అడుగుపెట్టడానికి ఇంటర్‌ ఏ గ్రూప్‌ విద్యార్థులైనా డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌ (డీఎడ్‌) కోర్సులో ముందుగా చేరాలి. ఇందుకోసం ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. యాభై శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా ప్రవేశాలు లభిస్తాయి. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో పలు కళాశాలలు డీఎడ్‌ కోర్సును రెండేళ్ల వ్యవధితో అందిస్తున్నాయి. దీన్ని విజయవంతంగా పూర్తిచేస్తే ప్రభుత్వం నిర్వహించే సెకెండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ) ఉద్యోగాల పరీక్షకు హాజరవడానికి అర్హత పొందుతారు. ఇందులో ప్రతిభను ప్రదర్శిస్తే ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించవచ్చు. రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ మైసూర్‌, అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీలు ఇంటర్‌ తర్వాత ఇంటిగ్రేటెడ్‌ బీఏఎడ్‌, బీఎస్సీ ఎడ్‌ కోర్సులు అందిస్తున్నాయి. ప్రాధాన్యం ఇవ్వదగ్గ కోర్సులివి. డీఎడ్‌ అనంతరం డిగ్రీ, పీజీలు చదువుకోవచ్చు. బీఎడ్‌, ఎంఎడ్‌ కోర్సుల దిశగా అడుగులేయవచ్చు. ఆర్‌ఐఈ మైసూర్‌లో ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ ఎడ్‌ కోర్సులు సైతం ఉన్నాయి. ఇంటర్‌ విద్యార్హతతో వీటిని ఆరేళ్ల వ్యవధితో నిర్వహిస్తున్నారు.

న్యాయ విద్య

న్యాయవిద్య లక్ష్యంగా ఉన్నవారు ఇంటర్‌ నుంచే తమ కలను సాకారం చేసుకోవచ్చు. రాష్ట్రస్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశానికి లాసెట్‌, జాతీయ స్థాయిలో ప్రసిద్ధ సంస్థల్లో ప్రవేశానికి క్లాట్‌, ప్రైవేటు సంస్థల్లో అడ్మిషన్లకు ఎల్‌శాట్‌ మొదలైన పరీక్షలు ఉన్నాయి. వీటిలో తగిన ర్యాంకు సంపాదిస్తే ఇంటర్‌ విద్యార్థులు అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఏ/ బీఎస్సీ/ బీకాం -ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో చేరవచ్చు. క్లాట్‌ ద్వారా జాతీయ స్థాయి అత్యున్నత విద్యా సంస్థల్లో అవకాశం పొందవచ్చు. ఎల్‌ఎల్‌బీ తర్వాత నచ్చిన స్పెషలైజేషన్‌తో ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో చేరవచ్చు. క్లాట్‌ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో నల్సార్‌ (హైదరాబాద్‌), దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం (విశాఖపట్నం)లో ప్రవేశాలు పొందవచ్చు. ఇంటర్‌లో 45% మార్కులతో ఉత్తీర్ణులైనవారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని విశ్వవిద్యాలయాలతోపాటు వాటి అనుబంధ కళాశాలల్లో లా చదువులు అందుబాటులో ఉన్నాయి.

లిబరల్‌ స్టడీస్‌

ఇటీవలి కాలంలో లిబరల్‌ స్టడీస్‌కు ఆదరణ పెరుగుతోంది. ఈ విధానంలో వైవిధ్యమైన ఆప్షన్లు ఎంచుకోవచ్చు. ప్రధాన సబ్జెక్టులతోపాటు నచ్చినవాటిని మైనర్లగా తీసుకోవచ్చు. ఫ్లేమ్‌, అశోకా..తదితర సంస్థలతో పాటు కొత్తగా ఆవిర్భవించిన క్రియా యూనివర్సిటీ ఈ విద్యలో పేరొందిన సంస్థలు. ఇంటర్‌ అన్ని గ్రూప్‌లవారికీ పరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా ప్రవేశాలు లభిస్తాయి.

ఫుట్‌వేర్‌

పాదరక్షల సంబంధ కోర్సుల కోసం దేశంలో రెండు ప్రముఖ సంస్థలు వెలిశాయి. ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌,. సెంట్రల్‌ ఫుట్‌వేర్‌ ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ సంస్థల్లో ఇంటర్‌ అర్హతతో వివిధ కోర్సులున్నాయి. ఎఫ్‌డీడీఐకి హైదరాబాద్‌ సహా దేశవ్యాప్తంగా 12 కేంద్రాలున్నాయి. బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌లో ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ ప్రొడక్షన్‌, లెదర్‌ గూడ్స్‌ అండ్‌ యాక్సెసరీస్‌ డిజైన్‌, రిటైల్‌ అండ్‌ ఫ్యాషన్‌ మర్చెండైజ్‌, ఫ్యాషన్‌ డిజైన్‌ కోర్సులను నాలుగేళ్ల వ్యవధితో నిర్వహిస్తున్నారు. సెంట్రల్‌ ఫుట్‌వేర్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌, చెన్నై ఇంటర్‌ అర్హతతో రెండేళ్ల వ్యవధితో డిప్లొమా ఇన్‌ ఫుట్‌వేర్‌ మ్యానుఫ్యాక్చర్‌ అండ్‌ డిజైన్‌, ఏడాది వ్యవధితో సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులను అందిస్తోంది.

విదేశీ భాషలు

ఇంటర్‌ అర్హతతో విదేశీ భాషలు కూడా నేర్చుకోవచ్చు. ఈ కోర్సులకు దేశంలోనే ఉత్తమ వేదిక ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ (ఇఫ్లూ)- హైదరాబాద్‌. ఇంగ్లిష్‌, అరబిక్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌, జపనీస్‌, రష్యన్‌, స్పానిష్‌ విభాగాల్లో బీఏ (ఆనర్స్‌) కోర్సులు ఇఫ్లూలో ఉన్నాయి. ఇంటర్‌ ఉత్తీర్ణులు అర్హులు. ఉస్మానియాతో సహా పలు వర్సిటీలు డిగ్రీలో ఒక సబ్జెక్టుగా విదేశీ భాషలను అందిస్తున్నాయి.

ఫైన్‌ఆర్ట్స్‌

ఇంటర్‌ తర్వాత కళల పట్ల ఆసక్తి ఉన్నవారు ఫైన్‌ఆర్ట్స్‌ కోర్సులు చేయవచ్చు. పెయింటింగ్‌, ఫొటోగ్రఫీ, యానిమేషన్‌, అప్లైడ్‌ ఆర్ట్స్‌, స్కల్ప్‌చర్‌ మొదలైన కోర్సులెన్నో ఉన్నాయి. హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైనార్ట్స్‌ వర్సిటీలో బీఎఫ్‌ఏ కోర్సులు అందిస్తున్నారు. ఆంధ్రా, ఉస్మానియా సహా పలు యూనివర్సిటీల్లో యూజీ కోర్సులున్నాయి.

డిజైన్‌
ఇంటర్‌ తర్వాత ఉన్న మార్గాల్లో డిజైన్‌ ఒకటి. ఇందుకోసం జాతీయ స్థాయితోపాటు రాష్ట్ర స్థాయిలోనూ పలు సంస్థలు ఉన్నాయి. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (నిఫ్ట్‌) దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన సంస్థ. దీనికి హైదరాబాద్‌తో సహా పలు చోట్ల క్యాంపస్‌లు ఉన్నాయి. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ (ఎన్‌ఐడీ) కూడా దేశంలో ప్రసిద్ధి చెందిన సంస్థ. దీనికి అహ్మదాబాద్‌తోపాటు విజయవాడ, కురుక్షేత్రల్లోనూ క్యాంపస్‌లు ఉన్నాయి. వీటితోపాటు యూసీడ్‌ ద్వారా ఐఐటీ బాంబే, గువాహటి, పలుసంస్థల్లో డిజైన్‌ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. ఈ సంస్థలన్నీ ఇంటర్‌ విద్యార్హతతో డిజైన్‌లో బ్యాచిలర్‌ కోర్సులు అందిస్తున్నాయి. కోర్సుల వ్యవధి నాలుగేళ్లు. రాతపరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా ప్రవేశం కల్పిస్తారు. డిజైన్‌లో బ్యాచిలర్స్‌ స్థాయిలో పలు స్పెషలైజేషన్లు లభిస్తున్నాయి.

బీబీఏ, బీబీఎం, బీసీఏ

ఇంటర్‌ అన్ని గ్రూప్‌లవారూ బీబీఏ, బీబీఎం, బీసీఏ కోర్సుల్లో చేరవచ్చు. భవిష్యత్తులో మేనేజ్‌మెంట్‌ కోర్సులు చేయాలనుకున్నవారు బీబీఏ, బీబీఎంలకు ప్రాధాన్యం ఇవ్వవచ్చు. పలు ప్రైవేటు సంస్థల్లో ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

హోటల్‌ మేనేజ్‌మెంట్‌

ఆతిథ్య రంగంలో సేవలందించాలనుకునేవారికి హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు సరైన ఎంపిక. అభిరుచి మేరకు ఇందులోని విభాగాలను స్పెషలైజేషన్‌గా ఎంచుకోవచ్చు. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ (ఐహెచ్‌ఎం)లు ఆతిథ్య రంగంలో ఉత్తమ విద్యాబోధనకు పేరుపొందిన సంస్థలు. ఇవి కేంద్ర పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఏర్పడ్డాయి. మూడేళ్ల వ్యవధితో బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్‌ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోర్సును వివిధ సంస్థలు అందిస్తున్నాయి. జాతీయస్థాయి ఉమ్మడి పరీక్ష ద్వారా పలు సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. వీటిలో రెండు సంస్థలు హైదరాబాద్‌లో ఉన్నాయి. కనీస విద్యార్హత ఇంటర్మీడియట్‌. రాష్ట్ర స్థాయిలో పలు సంస్థలు బీఎస్సీ (హోటల్‌ మేనేజ్‌మెంట్‌) కోర్సు అందిస్తున్నాయి. వీటిలో దాదాపు అన్నింట్లోనూ నేరుగా ప్రవేశాలు లభిస్తాయి. ఇంటర్‌ ఏ గ్రూప్‌ విద్యార్థులైనా అర్హులే.

స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌

స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో చేరడానికి ఏ గ్రూప్‌తోనైనా ఇంటర్‌ పాసైనవారు అర్హులు. బీఏ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌, బ్యాచిలర్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులను పలు సంస్థలు అందిస్తున్నాయి. వీటి కాలవ్యవధి మూడేళ్లు.
సంస్థలవారీగా కోర్సులు: నేషనల్‌ అకాడెమీ ఆఫ్‌ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌,ముంబయి: బ్యాచిలర్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ (బీఎంఎస్‌) స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌; మౌలానా అబ్దుల్‌ కలామ్‌ ఆజాద్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ, పశ్చిమ్‌ బంగ: బీఏ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌; జార్జ్‌ కాలేజ్‌, కోల్‌కతా: బీఏ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌; ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌, ముంబయి: బ్యాచిలర్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌.

Posted Date: 30-08-2021


 

ఇంటర్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌