• facebook
  • whatsapp
  • telegram

పబ్లిక్‌ హెల్త్‌ ఎంటమాలజీలో పీజీ

 

 

భారత ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్వశాఖ- ఆరోగ్య పరిశోధన విభాగం ఆధ్వర్యంలోని ఐసీఎంఆర్‌- వెక్టర్‌ కంట్రోల్‌ రిసెర్చ్‌ సెంటర్‌ పీజీ కోర్సులో ప్రవేశానికి ప్రకటన విడుదల చేసింది. పుదుచ్చేరి యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ఈ రిసెర్చ్‌ సెంటర్‌ ఎంఎస్‌సీ పబ్లిక్‌ హెల్త్‌ ఎంటమాలజీ (పీహెచ్‌ఈ) కోర్సులో 2021-23 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. నాలుగు సెమిస్టర్లుగా ఉండే ఈ పీజీ కోర్సును ఆంగ్ల మాధ్యమంలో నిర్వహిస్తారు.

 

మనదేశంలో, ఇతర ఉష్ణమండల దేశాల్లో కీటకాల ద్వారా వ్యాపించే మలేరియా, డెంగీ లాంటి వ్యాధుల దృష్ట్యా ప్రజారోగ్య రంగంలో ఎంటమాలజిస్టుల (కీటక శాస్త్రవేత్తల) అవసరం పెరుగుతోంది. చాలా రాష్ట్రాల్లో ఎంటమాలజిస్టుల పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి. ఈ తరహా వ్యాధుల నివారణ, నియంత్రణ చేయగల పరిజ్ఞానం, నైపుణ్యం ఉన్న సిబ్బంది అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని, రెండు సంవత్సరాల పబ్లిక్‌ హెల్త్‌ ఎంటమాలజీ కోర్సును 2011 నుంచి వీసీఆర్‌సీలో ప్రారంభించారు.

 

దేశంలోనే ఇది ప్రత్యేకమైన కోర్సుగా గుర్తింపు పొందింది. విద్యార్థులు పబ్లిక్‌ హెల్త్‌ ఎంటమాలజీపై లోతైన పరిజ్ఞానం పొందటానికీ, వ్యాధుల చికిత్సలో ఆధునిక విధానాలపై కేంద్రీకృత శిక్షణకీ ఈ కోర్సు అవకాశాన్ని అందిస్తుంది.

 

ఎంఎస్‌సీ (పీహెచ్‌ఈ)లో సీట్లను 1. ఓపెన్‌ కాంపిటిషన్‌ 2. ఇన్‌-సర్వీస్‌ (సెల్ఫ్‌ సపోర్టింగ్‌/ స్పాన్సర్డ్‌) కేటగిరీల ద్వారా భర్తీ చేస్తారు.

 

 

కేటగిరీ-1: ప్రవేశం పొందాలనుకునేవారు గుర్త్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసై ఉండాలి. బీఎస్‌సీ ఇన్‌ జువాలజీ/ బోటనీ/ లైఫ్‌ సైన్సెస్‌/ మెడికల్‌ ల్యాబొరేటరీ టెక్నాలజీ/ మైక్రో బయాలజీ/ ఎకాలజీ/ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌/ బయోకెమిస్ట్రీ లేదా బీవీఎస్‌సీ/ ఎంబీబీఎస్‌/ బీఈ/ బీటెక్‌ (బయోటెక్నాలజీ ఒక సబ్జెక్టుగా) ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం పరీక్ష రాస్తున్నవారు, ఫలితాల కోసం ఎదురుచూస్తున్నవారు కూడా దరఖాస్తు చేయడానికి అర్హులే. అయితే ఎంపిక సమయానికి సంబంధిత ధ్రువ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. 

 

కేటగిరి-2: ఇన్‌-సర్వీస్‌ (సెల్ఫ్‌ సపోర్టింగ్‌/ స్పాన్సర్డ్‌) ప్రవేశాలను ఏ, బీ గ్రూపులుగా విభజించారు. ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర సంస్థల్లో పనిచేస్తున్నారు ఈ కేటగిరి కిందకు వస్తారు. వీరు కేటగిరి-1లో పేర్కొన విధంగా డిగ్రీ పాసై, పనిచేస్తోన్న సంస్థ ఇచ్చిన ‘నో అబ్జెక్షన్‌’ సర్టిఫికెట్‌ను దరఖాస్తుకు జతచేయాలి. 

 

ఎంపిక ప్రక్రియ: కేటగిరి-1 అభ్యర్థులను ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. కేటగిరి-2కు చెందిన అభ్యర్థులను డిగ్రీలో పొందిన మార్కులు, అనుభవం, పనిచేస్తోన్న సంస్థ ఇచ్చిన రికమండేషన్‌/ రిఫరెన్స్‌ లెటర్‌ ఆధారంగా ఎంపికచేస్తారు. ప్రవేశానికి అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను సంస్థ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. కేటగిరి-1 కింద ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.6,000 స్కాలర్‌షిప్‌ ఇస్తారు. కేటగిరి-2 అభ్యర్థులు నెలకు రూ.3,000 స్కాలర్‌షిప్‌కు అర్హులు. 

 

దరఖాస్తు: దరఖాస్తులను సంస్థ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. దరఖాస్తుకు రూ.100 (ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులు రూ. 50) డిమాండ్‌ డ్రాఫ్ట్‌ను జతచేసి రిజిస్టర్‌/ స్పీడ్‌ పోస్టులో పంపాలి. ‘ది డైరెక్టర్, ఐసీఎంఆర్‌-వెక్టర్‌ కంట్రోల్‌ రిసెర్చ్‌ సెంటర్‌’ పేరున  డీడీ తీసి దాన్ని దరఖాస్తుకు జతచేయాలి. 

 

దరఖాస్తుకు చివరి తేది: జులై 23

ప్రవేశపరీక్ష (కేటగిరి -1) తేది: ఆగస్టు 22

ఇంటర్వ్యూ (కేటగిరి -2): ఆగస్టు 25

ఫలితాల ప్రకటన: ఆగస్టు 27

తరగతులు ప్రారంభం: సెప్టెంబరు 8 

(ఈ తేదీలు తాత్కాలికమే. కొవిడ్‌-19 నేపథ్యంలో తేదీ మారే అవకాశం ఉంది)

చిరునామా: డైరెక్టర్, ఐసీఎంఆర్‌-వెక్టర్‌ కంట్రోల్‌ రిసెర్చ్‌ సెంటర్, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హెల్త్‌ రిసెర్చ్, మెడికల్‌ కాంప్లెక్స్, ఇందిరా నగర్, పుదుచ్చేరి- 605 006. 

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ చూడొచ్చు. 

వెబ్‌సైట్‌: https://vcrc.icmr.org.in/
 

Posted Date: 14-07-2021


 

కోర్సులు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌