• facebook
  • whatsapp
  • telegram

డిజైన్‌లో డిగ్రీ.. పీజీ!

దరఖాస్తులకు ఐఐఏడీ ఆహ్వానం

డిజైనింగ్‌పై ఆసక్తి ఉన్నవారికి ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆర్ట్‌ అండ్‌ డిజైన్‌ (ఐఐఏడీ) ఆహ్వానం పలుకుతోంది. డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి సంస్థ తాజాగా ప్రకటన విడుదల చేసింది. ప్రవేశపరీక్ష ద్వారా ప్రవేశం కల్పిస్తారు. ఈ ఏడాది ప్రవేశపరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు.

న్యూదిల్లీలోని ఐఐఏడీ (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆర్ట్‌ అండ్‌ డిజైన్‌) డిజైన్‌ అంశాల్లో బీఏ ఆనర్స్, ఎంఏ కోర్సులను అందిస్తోంది. వీటిని లండన్‌లోని కింగ్‌స్టన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్‌ సహకారంతో రూపొందించారు. ప్రవేశపరీక్ష- ఐఐఏడీ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ ద్వారా ప్రవేశాలను కల్పిస్తారు. యూజీ, పీజీ కోర్సులకు ప్రవేశపరీక్షను వేర్వేరుగా నిర్వహిస్తారు. ప్రవేశపరీక్షలో అర్హత సాధించినవారికి స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తారు.

దరఖాస్తు విధానం

ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ రెండు విధాలుగా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.2000. ఆన్‌లైన్‌లో చేసుకోవాలనుకునేవారు నేరుగా వెబ్‌సైట్‌ https://www.iiad.edu.in/ లో వివరాలతోపాటు సంబంధిత పత్రాలనూ జతచేయాల్సి ఉంటుంది. ఫీజును ఆన్‌లైన్‌లోనే కట్టేయొచ్చు. ఆఫ్‌లైన్‌లో చేయాలనుకునేవారు నేరుగా క్యాంపస్‌లో దరఖాస్తు ఫారాన్ని పొందొచ్చు. దరఖాస్తు ఫీజును డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తులో భాగంగా స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌ (ఎస్‌ఓపీ)నీ సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది.

లేటరల్‌ ఎంట్రీ అవకాశమూ ఉంది. గుర్తింపు పొందిన డిజైన్‌ సంస్థ నుంచి గత సంవత్సర డిప్లొమా/ డిగ్రీ పూర్తిచేసుండాలి. లేటరల్‌ ఎంట్రీ ఫారాన్ని డౌన్‌లోడ్‌ చేసుకుని దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ, గత సంస్థలో చూపిన ప్రతిభ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.

దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ: మార్చి 20, 2021

ఆన్‌లైన్‌ పరీక్ష తేదీలు: మార్చి 27, 28

అందుబాటులో ఉన్న కోర్సులు

యూజీ

ఫౌండేషన్‌ డిప్లొమా ఇన్‌ డిజైన్‌

బీఏ (ఆనర్స్‌) ఫ్యాషన్‌ డిజైన్‌ 

బీఏ (ఆనర్స్‌) ఇంటీరియర్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ డిజైన్‌ 

బీఏ (ఆనర్స్‌) కమ్యూనికేషన్‌ డిజైన్‌

బీఏ (ఆనర్స్‌) ఫ్యాషన్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఏదైనా గ్రూపుతో ఇంటర్‌/ తత్సమాన విద్య పూర్తిచేసినవారు అర్హులు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.

పీజీ

‣ ఎంఏ ఫ్యాషన్‌ డిజైన్‌ 

ఎంఏ ఫ్యాషన్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌

అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ సంస్థ నుంచి  ఏదైనా డిగ్రీ/ తత్సమాన విద్య పూర్తిచేసినవారు అర్హులు. ఈ విద్యా సంవత్సరంలో తుది సంవత్సరం చదువుతున్నవారూ, ఫలితాల కోసం ఎదురు చూస్తున్నవారూ దరఖాస్తుకు అర్హులే.

పరీక్ష విధానం

యూజీ

‣ ఫ్యాషన్‌ డిజైన్, కమ్యూనికేషన్‌ డిజైన్, ఇంటీరియర్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ డిజైన్‌ వారికి ఐడ్యాట్‌- ఐఐఏడీ ఆన్‌లైన్‌ డిజైన్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ను నిర్వహిస్తారు. ఆన్‌లైన్‌ పరీక్ష. కాలవ్యవధి రెండున్నర గంటలు. పరీక్షలో భాగంగా అభ్యర్థిలోని లాజికల్‌ రీజనింగ్, క్రియేటివ్‌ థింకింగ్, విజువల్‌ ఆప్టిట్యూడ్‌ అంశాలను పరీక్షిస్తారు.

‣ ఫ్యాషన్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ వారికి.. ఐమ్యాట్‌- ఐఐఏడీ ఆన్‌లైన్‌ మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ను నిర్వహిస్తారు. దీనిలో రెండు భాగాలు- పార్ట్‌-ఎ: రాతపరీక్ష; పార్ట్‌-బి: వ్యక్తిగత ఇంటర్వ్యూ ఉంటాయి. రెండింటినీ ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తారు. పరీక్ష కాలవ్యవధి రెండు గంటలు. పరీక్షలో భాగంగా అభ్యర్థి భాషాపరిజ్ఞానం, లాజికల్‌ రీజనింగ్, అనలిటికల్‌ థింకింగ్‌ అంశాలను పరిశీలిస్తారు. రాతపరీక్ష పూర్తయ్యాక ఇంటర్వ్యూ నిమిత్తం అభ్యర్థులకు తేదీ, సమయ వివరాలతో ఈమెయిల్‌ పంపుతారు.

పీజీ

‣ ఫ్యాషన్‌ డిజైన్‌ అభ్యర్థులకు ఐడ్యాట్‌- ఐఐఏడీ ఆన్‌లైన్‌ డిజైన్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ను నిర్వహిస్తారు. దీనిలో రెండు విభాగాలు- పార్ట్‌-ఎ: రాతపరీక్ష; పార్ట్‌-బి: వ్యక్తిగత ఇంటర్వ్యూ ఉంటాయి. రాతపరీక్ష ఆన్‌లైన్‌లో ఉంటుంది. కాలవ్యవధి రెండున్నర గంటలు. రాతపరీక్ష రాసినవారు వ్యక్తిగత ఇంటర్వ్యూకూ హాజరవ్వాల్సి ఉంటుంది. దీనినీ ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తారు. అభ్యర్థులకు తేదీ, సమయ వివరాలతో ఈమెయిల్‌ పంపుతారు. 

‣ ఫ్యాషన్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ వారికి.. ఐమ్యాట్‌- ఐఐఏడీ ఆన్‌లైన్‌ మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ను నిర్వహిస్తారు. దీనిలో రెండు భాగాలు- పార్ట్‌-ఎ: రాతపరీక్ష; పార్ట్‌-బి: వ్యక్తిగత ఇంటర్వ్యూ ఉంటాయి. రెండింటినీ ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తారు. పరీక్ష కాలవ్యవధి రెండు గంటలు. రాతపరీక్ష రాసినవారికి తప్పనిసరి ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఉంటుంది. అభ్యర్థులకు తేదీ, సమయ వివరాలతో ఈమెయిల్‌ పంపుతారు.

పరీక్ష విధానానికి సంబంధించి మాదిరి ప్రశ్నపత్రాలను దరఖాస్తు చేసుకున్నవారికి అందుబాటులో ఉంచుతారు.
 

Posted Date: 17-08-2021


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌