• facebook
  • whatsapp
  • telegram

పరిశోధనలకు ప్రసిద్ధ వేదిక ఐఐఎస్ఈఆర్!

దేశవ్యాప్తంగా ఏడుచోట్ల కేంద్రాలు

డ్యుయల్ డిగ్రీతో ప్రత్యేక గుర్తింపు

 పరిశోధనే వృత్తిగా మార్చుకొని శాస్త్రవేత్తలుగా ఎదగాలనుకునే వారికి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) చక్కటి వేదిక. ఇక్కడ నిత్యం సమాజ హితానికి తోడ్పడే బేసిక్ సైన్స్‌లో పరిశోధనలు జరుగుతాయి. భారత మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ సంస్థను దేశంలోని ఏడు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. అవి బెరహంపూర్ (ఒడిశా), భోపాల్ (మధ్యప్రదేశ్), కోల్‌క‌తా (పశ్చిమబెంగ‌), మొహాలీ (పంజాబ్), పుణె (మహారాష్ట్ర), తిరువనంతపురం (కేరళ), తిరుపతి (ఆంధ్రప్రదేశ్). 

నాణ్యమైన బోధన, అధునాతన ప్రయోగశాలలు జాతీయ, అంతర్జాతీయ పరిశోధన జర్నల్స్‌తో కూడిన డిజిటల్ లైబ్రరీలు ఐఐఎస్ఈఆర్ విద్యాసంస్థల ప్రత్యేకత. అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన రిసెర్చ్ వసతులు, పరిశోధన, బోధనారంగంలో అపార అనుభవం ఉన్న అధ్యాపకులు ఇక్కడ అందుబాటులో ఉంటారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వ‌ర్క్‌(ఎన్ఐఆర్ఎఫ్) ఏటా ప్రకటించే ర్యాంకింగ్స్‌లో ఈ విద్యాసంస్థలు ఉత్తమ స్థానంలో నిలుస్తున్నాయి. గతేడాది విశ్వవిద్యాలయాల కేటగిరీలో ఐఐఎస్ఈఆర్-పుణె 25, కోల్‌క‌తా 29వ స్థానంలో నిలిచాయి. 
మరి వీటిలో అడ్మిషన్లకు మార్గాలేంటి? ఏ సమయంలో ఉంటాయి? ప్రవేశ పరీక్ష ఎలా ఉంటుందనే అంశాలు వివరంగా..

డ్యుయ‌ల్ ‌డిగ్రీ కోర్సులు

ఐఐఎస్ఈఆర్ విద్యాసంస్థలు బీఎస్-ఎంఎస్ డ్యుయల్ కోర్సులను అందిస్తున్నాయి. వీటి వ్యవధి అయిదు, నాలుగు సంవత్సరాలు. ఐదేళ్ల‌లో బయాలజికల్ సైన్స్, కెమికల్ సైన్స్, మ్యాథమెటికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, ఎర్త్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఎర్త్ అండ్ క్లైమెట్ సైన్సెస్, హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్స్, ఇంటిగ్రేటెడ్ అండ్ ఇంట‌ర్ డిసిప్లీన‌రీ సైన్సెస్, ఎక‌నామిక్ సైన్సెస్, ఇంజినీరింగ్ సైన్సెస్ (కెమిక‌ల్ ఇంజినీరింగ్‌, డేటా సైన్స్‌, ఎల‌క్ట్రిక‌ల్ & కంప్యూట‌ర్ సైన్స్ ఇంజినీరింగ్‌), జియోలాజిక‌ల్ సైన్సెస్, ఇంటిగ్రేటెడ్ అండ్ ఇంట‌ర్ డిసిప్లీన‌రీ సైన్సెస్ మొదలైన సబ్జెక్టుల్లో ఈ కోర్సులు చేయవచ్చు. నాలుగేళ్ల‌లో ఇంజినీరింగ్ సైన్సెస్ అండ్ ఎక‌నామిక్స్ కోర్సు చేయ‌వ‌చ్చు. విద్యాసంస్థ, సెమిస్టర్లను బట్టి ఫీజులో తేడాలుంటాయి. బీఎస్-ఎంఎస్ కోర్సుకు అత్యధికంగా రూ.50 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ప్ర‌స్తుతం ఈ కోర్సుల్లో చేరేందుకు నోటిఫికేష‌న్ వెలువ‌డింది. పూర్తి వివ‌రాలు మార్చి చివ‌రి వారంలో ప్ర‌క‌టించ‌నున్న‌ట్ల సంస్థ తెలిపింది.

అర్హత.. ప్రవేశ పరీక్ష

ఆయా కోర్సుల్లో చేరడానికి 10+2లో ఎంపీసీ, బైపీసీ, ఎంబైపీసీతోపాటు ఇతర విద్యార్థులూ అర్హులే. అలాగే మరో మూడు రకాల మార్గాల ద్వారా అర్హత సాధించవచ్చు. కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (కేవీపీవై) ఫెలోషిప్ పొందాలి. జేఈఈ అడ్వాన్స్డ్లో కామన్ ర్యాంకు జాబితాలో పది వేల కంటే తక్కువ‌ర్యాంకు సాధించాలి. రిజర్వ్ కేటగిరీలో కూడా పది వేల కంటే తక్కువ ర్యాంకు వచ్చిన విద్యార్థులు అర్హత పొందుతారు. స్టేట్ అండ్ సెంట్రల్ బోర్డు(ఎస్సీబీ) మార్గంలో 10+2 లో సైన్స్ విభాగంలో సంబంధిత బోర్డు నిర్దేశించిన కటాఫ్ మార్కులు సాధించినవారు అర్హులు. ఈ విద్యాసంస్థల్లో 50 శాతం సీట్లను కేవీపీవై, జేఈఈ ద్వారా భర్తీ చేస్తారు. ఇందులో మిగిలిన సీట్లతోపాటు మరో 50 శాతం సీట్లను ఎస్సీబీ విధానంలో అర్హత పొందిన విద్యార్థులకు ఐఐఎసీఈఆర్ ప్రత్యేక ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో ప్రతిభ ఆధారంగా భర్తీ చేస్తారు.

దీనికి ఎన్సీఈఆర్టీ 11, 12 తరగతుల పాఠ్యాంశాలను ప్రామాణికంగా తీసుకుంటారు. ఆప్టిట్యూట్ టెస్ట్ ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుంచి ప్రశ్నలడుగుతారు. ఈ పరీక్ష ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. ప్రవేశ పరీక్షలో ప్రశ్నలన్నీ విద్యార్థుల విశ్లేషణ, తార్కిక సామర్థ్యాలను పరీక్షించేలా ఉంటాయి. ఐఐటీ-జేఈఈ మెయిన్స్, అడ్వాన్సుడ్ స్థాయిలో వస్తాయి. దేశవ్యాప్తంగా జరిగే ఈ పరీక్షను తెలుగు రాష్ట్రాల్లో 17 కేంద్రాల్లో నిర్వహిస్తారు. వాటిలో అనంతపురం, ఏలూరు, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌న‌గర్, నిజామాబాద్, వరంగల్ ఉన్నాయి. 

ఇంకా ఏమేం కోర్సులున్నాయ్?

ఐఐఎస్ఈఆర్ సంస్థలు పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సులను కూడా అందిస్తున్నాయి. పీహెచ్‌డీలో బయాలాజికల్ సైన్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో ఎమ్మెస్, ఎమ్మెస్సీ, ఎంటెక్, ఎంబీబీఎస్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రవేశాలకు విద్యార్థులు కచ్చితంగా జాతీయ స్థాయి పరీక్షలైన నెట్/గేట్/యూటీజీ-జీఆర్ ఎఫ్/డీబీటీ/ఐసీఎమ్మార్/నెట్-ఎల్ఎస్/ఇన్‌స్పైర్‌పీహెచ్‌డీ తదితర పరీక్షల్లో ప్రతిభ చాటాలి. ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీని కూడా బయాలాజికల్ సైన్స్, కెమికల్ సైన్స్, మ్యాథమెటికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ సబ్జెక్టుల్లో అందిస్తున్నారు. ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత సబ్జెక్టులు కలిగిన బ్యాచిలర్స్ డిగ్రీ పొందిన విద్యార్థులు ఈ కోర్సులకు అర్హులు. అలాగే జాతీయ పరీక్షలు జామ్, జేజీఈఈబీఐఎల్ఎస్, జస్ట్‌లో అర్హత సాధించాలి. ఈ కోర్సుల్లో చేరాలంటే విద్యాసంస్థను బట్టి ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. పీహెచ్‌డీకి సుమారు రూ.60 వేలు, ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీకి దాదాపు రూ.70 వేలు కట్టాలి. 

ఐఐఎస్ఈఆర్ -భోపాల్ వీటితోపాటు బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఇంజినీరింగ్ సైన్స్, ఎకానమిక్ సైన్స్ కోర్సులను అందిస్తోంది. ఇంజినీరింగ్ సైన్స్‌లో కెమికల్ సైన్స్, డేటా సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ విభాగాలున్నాయి. వీటిలో కూడా కేవీపీవై, జేఈఈ అడ్వాన్స్డ్, స్టేట్ అండ్ సెంట్రల్ బోర్డు మార్గాల ద్వారా ప్రవేశాలు పొందవచ్చు. కోర్సు రుసుముగా రూ.35 వేలు చెల్లించాలి.

ఉద్యోగావకాశాలు 

ఈ విద్యాసంస్థల్లో బీఎస్-ఎంఎస్ పూర్తి చేసిన చాలామంది విద్యార్థులు దేశవిదేశాల్లోని విద్యాసంస్థల్లోనూ పీహెచ్‌డీ చేస్తున్నారు. ఆక్స్‌ఫ‌ర్డ్‌, కాల్టెక్, కేంబ్రిడ్జ్, హార్వర్డ్, ఎంఐటీ, ప్రిన్స్‌స్ట‌న్, మ్యాక్స్ ప్లాంక్ లాంటి ప్రఖ్యాత ఇన్‌స్టిట్యూట్లలో చేరారు. అలాగే ఇక్కడ చదువు పూర్తి చేసినవారు సీఎస్ఐఆర్ లాంటి సంస్థలతోపాటు దేశంలోని ఎన్నో ఇన్‌స్టిట్యూట్లలో సైంటిఫిక్ ఫ్యాకల్టీగా పని చేస్తున్నారు. అధిక వేతనాలు పొందుతున్నారు.

నోటిఫికేష‌న్: http://www.iiseradmission.in/index.html

Posted Date: 06-03-2021


 

ప్ర‌ఖ్యాత సంస్థ‌లు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌