• facebook
  • whatsapp
  • telegram

అందుకోండి.. ఆరోగ్యరంగంలో అవకాశాలు!

మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కోర్సు - ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు

కరోనాలాంటి విపత్కర కాలాల్లోనూ డిమాండ్ తగ్గని ఉద్యోగాలు కొన్ని ఉన్నాయి. సాధారణ డిగ్రీ అర్హతతో ప్రజారోగ్యం విభాగంలో పీజీ చేస్తే అలాంటి కొలువులను అందుకోవచ్చు. ఆర్థిక వ్యవస్థల్లోని కష్ట నష్టాలతో సంబంధం లేకుండా మంచి జీతాలనూ పొందవచ్చు. ప్రస్తుతం తెలంగాణలోని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (కేఎన్ ఆర్ యూహెచ్ఎస్) పబ్లిక్ హెల్త్ విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ కోర్సు చేస్తే  అందరికీ ఆరోగ్యాన్నీ, ఆనందాన్నీ పంచే ఉద్యోగంలో చేరవచ్చు. ప్రజలకు దగ్గరగా ఉండి వారికి సేవ చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.

ఎంపిక ఎలా?

కేఎన్ఆర్ యూహెచ్ఎస్ లోని మాస్టర్ ఆఫ్‌ పబ్లిక్ హెల్త్  కోర్సులో మొత్తం 40 సీట్లు ఉన్నాయి. ప్రవేశ పరీక్ష ప్రతిభ ఆధారంగా 20, మేనేజ్మెంట్ కోటా కింద 16, ఎన్నారై కోటా కింద 04 కేటాయిస్తారు.  ఎంపికలు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ద్వారా నిర్వహిస్తారు. ఇందులో 100 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఇస్తారు. ఒకటిన్నర గంటల్లో పరీక్ష పూర్తి చేయాలి. రుణాత్మక మార్కులు లేవు.  కోర్సు కాలవ్యవధి రెండు సంవత్సరాలు. నాలుగు సెమిస్టర్లు ఉంటాయి. నాలుగో సెమిస్టర్లో రెండు నెలలపాటు ఇంట‌ర్న్ షిప్‌ ఉంటుంది.
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. దరఖాస్తు రిజిస్ట్రేషన్ కోసం ఓసీ/ బీసీ అభ్యర్థులు రూ.4000, ఎస్సీ/ ఎస్టీలు - రూ.3000, ఇతర రాష్ట్రాలు/ దేశాలకు చెందిన వారు రూ.6000 రుసుం చెల్లించాలి. గడువులోపు ఆన్లైన్ దరఖాస్తు కాపీతో పాటు సంబంధిత ధ్రువపత్రాలను పోస్టల్ ద్వారా లేదా నేరుగా యూనివర్సిటీలో స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

పరీక్ష సిలబస్

ఈ పరీక్షలో పార్ట్-ఎ, పార్ట్-బి ఉంటాయి. పార్ట్-ఎలో కమ్యూనికబుల్ డిసీజెస్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, మెటర్నిటీ & చైల్డ్ హెల్త్, ఫ్యామిలీ ప్లానింగ్ & కాంట్రాసెప్షన్ మెజర్స్, ప్రైమరీ హెల్త్కేర్, ఫ్యామిలీ & బిహేవియర్ సైన్సెస్ విభాగాల నుంచి అయిదు ప్రశ్నల చొప్పున మొత్తం 30 ప్రశ్నలకు సమాధానం రాయాల్సి ఉంటుంది.  పార్ట్-బిలో జనరల్ నాలెడ్జ్ నుంచి 20, న్యూట్రిషన్, ఎన్విరాన్మెంటల్ హెల్త్ సబ్జెక్టుల నుంచి 10 ప్రశ్నల చొప్పున, బేసిక్ స్టాటిస్టిక్స్, ఎపిడమాలజీ, డెమోగ్రఫీ, సానిటేషన్ & హైజీన్, నేషనల్ & ఇంటర్నేషనల్ హెల్త్ ఏజెన్సీస్, పాపులేషన్ పాలసీ సబ్జెక్టుల్లో ఒక్కోదాని నుంచి 5 ప్రశ్నల వరకు అడుగుతారు.

అర్హతలు

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీని 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు పరిమితి లేదు. దూరవిద్యలో డిగ్రీ చేసిన వారు, విదేశీ అభ్యర్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. 

రిజర్వేషన్

ప్రవేశ పరీక్షలో అభ్యర్థులు కనీసం 40% మార్కులకు పైగా సాధించాలి. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులైతే 30 శాతానికి పైగా పొందాలి. ఆరోగ్యవంతులై ఉండాలి. ఎస్సీలకు 15%, ఎస్టీలకు 6%, బీసీలకు 29% రిజర్వేషన్లు వర్తిస్తాయి.

ఉద్యోగావకాశాలు

ఈ కోర్సు పూర్తి చేసిన వారికి మన దేశంతో పాటు ఇతర దేశాలల్లోనూ మంచి డిమాండ్ ఉంది. జాతీయ, అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు, రిసెర్చ్ సెంటర్లు, ప్రభుత్వ వైద్యారోగ్య విభాగాలు, ఎన్జీఓలు, బహుళ స్థాయి కంపెనీల్లో చేరి మంచి వేతనాలను అందుకోవచ్చు. సాధారణంగా వీరికి లభించే ఉద్యోగాల వివరాలు...

1. ఎపిడమాలజిస్ట్,

2. హెల్త్కేర్ అడ్మినిస్ట్రేటర్,

3. న్యూట్రిషనిస్ట్,

4. హెల్త్ ఇన్ఫర్మాటిక్స్ స్పెషలిస్ట్,

5. పబ్లిక్ హెల్త్ ప్రాజెక్టు మేనేజర్,

6. హెల్త్ అండ్ సెఫ్టీ ఇంజినీర్,

7. హెల్త్కేర్ కన్సల్టెంట్,

8. పబ్లిక్ హెల్త్ ఎడ్యుకేటర్,

9. మెంటల్ హెల్త్కేర్ కౌన్సెలర్.

కోర్సు అందుబాటులో ఉన్న ముఖ్యమైన యూనివర్సిటీలు/ కాలేజీలు

తెలుగు రాష్ట్రాల్లో...
కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, వరంగల్
www.knruhs.telangana.gov.in

డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం, విజయవాడ
http://ntruhs.ap.nic.in/

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ పబ్లిక్ హెల్త్, హైదరాబాద్
https://phfi.org/iiph-hyderabad/

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, తెలంగాణ
https://www.uohyd.ac.in/

ఇతర ప్రాంతాల్లో ...
మణిపాల్ యూనివర్సిటీ, క‌ర్ణాట‌క‌
https://manipal.edu/

జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ, న్యూదిల్లీ
https://www.jnu.ac.in/main/

యూనివర్సిటీ ఆఫ్ ల‌ఖ్‌న‌వూ
https://www.lkouniv.ac.in/

అమిటీ యూనివర్సిటీ, నోయిడా
https://www.amity.edu/

కెఎల్ఈ యూనివర్సిటీ, బెల్గాం
https://kledeemeduniversity.edu.in/

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ పబ్లిక్ హెల్త్, గాంధీనగర్, హైదరాబాద్
https://iiphg.edu.in/

నోయిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ
https://niu.edu.in/

నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఎపిడమాలజీ, త‌మిళ‌నాడు
http://www.nie.gov.in/

శ్రీ రామచంద్ర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్, చెన్నై
https://www.sriramachandra.edu.in/

మహారాష్ట్ర యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, నాసిక్‌
https://www.muhs.ac.in/

సింబియాసిస్ ఇన్‌స్టిట్యూట్‌ ఆప్ హెల్త్ సైన్సెస్, పుణె
https://siu.edu.in/

టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ సోషల్ సైన్స్, ముంబ‌యి
https://www.tiss.edu/

ఐఐహెచ్ఎంఆర్, జైపూర్
https://www.iihmr.edu.in/

మహాత్మా జ్యోతిరావు ఫులే యూనివర్సిటీ, జైపూర్
https://www.mjrpuniversity.ac.in/

ప్రావర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అహ్మద్నగర్
https://www.pravara.com/

దేశ‌వ్యాప్తంగా ఇంకా చాలా యూనివర్సిటీలు/ కాలేజీల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది.
 

విదేశాల్లోనూ ఉద్యోగాలు

వ్యాధులు ఒకరి నుంచి మరొకరికి సంక్రమించకుండా అడ్డుకోవడం చాలా ముఖ్యం. వ్యాధుల వ్యాప్తికి కారణాలు, అవి ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ చర్యలు వంటి పలు అంశాలగురించి క్షుణ్ణంగా తెలుసుకోవడానికి ఈ మాస్టర్స్ పబ్లిక్ హెల్త్ కోర్సు ఎంతగానో ఉపయోగపడుతుంది. శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ప్రైవేటు, ప్రభుత్వ, విదేశాల్లో మంచి ఉద్యోగావకాశాలు ఉంటాయి. వ్యాధుల వ్యాప్తికి కారణాలపై పరిశోధనలు చేయడం, ప్రజలు వ్యాధుల బారిన పడకుండా అవగాహన కల్పించడంలో వీరు ముఖ్యపాత్ర పోషిస్తారు. ప్రస్తుతం ఈ కోర్సుకు డిమాండ్ బాగానే ఉంది. 2015 సంవత్సరం నుంచి యూనివర్సిటీలో తరగతులు నిర్వహిస్తున్నాం. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఎవరైనా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. రెండేళ్ల కాలంలో విద్యార్థులు ఈ కోర్సుపై పూర్తి పట్టు సాధించేలా అనుభవం కలిగిన మా బోధన సిబ్బంది శిక్షణ ఇస్తారు. 

- డాక్టర్ ఎం.జయరాం, సీనియర్ అకడమిక్ రిజిస్ట్రార్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్.

Posted Date: 27-03-2021


 

కోర్సులు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌