• facebook
  • whatsapp
  • telegram

ప్రామాణిక క్రీడా శిక్షకులకు ప్రత్యేక కోర్సులు !

ప్రకటన విడుదల చేసిన నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ

కోచ్, పీఈటీ, స్పోర్ట్స్ సైకాలజిస్టులుగా స్థిరపడేందుకు అవకాశం

మన దేశంలో మంచి  క్రీడాకారులకు కొదువ లేదు. కానీ వారిని సరైన దిశగా నడిపించే ప్రామాణిక శిక్షకులకు కొరత ఉంది. రాతిని విగ్రహంగా మార్చేది శిల్పి అయితే.. ఒక సాధారణ ఆటగాడిని ప్రతిభావంతుడైన క్రీడాకారుడిగా తీర్చిదిద్దేది కోచ్.  ప్రతి ఆటగాడి విజయం వెనుక శిక్షకుడి పాత్ర ప్రధానంగా ఉంటుంది. ఇటీవల జరిగిన ఒలింపిక్స్‌లో భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించిన పలువురు పతకాలు సాధించడంతో అంతటా సందడి నెలకొంది.  ఆ పతకాలు సాధించిన అందరూ తమ కోచ్ ఇచ్చిన విలువైన శిక్షణ వల్లే గెలుపు సాధ్యమైందని ప్రశంసలు కురిపించారు. సరైన శిక్షకులు లేకుండా క్రీడల్లో రాణించడం సాధ్యం కాదు. కానీ అలాంటి కోచ్ అవ్వాలంటే మాత్రం క్రీడలో నైపుణ్యాలు తెలిస్తే సరిపోదు. అందుకు సంబంధించిన కోర్సులూ చేయాలి. 

క్రీడల్లో కండ బలం కంటే.. బుద్ధి బలం ఎంతో ముఖ్యం. అందుకే ఆటగాళ్లను మానసికంగా దృఢంగా ఉంచడంలో సైకాలజిస్టుల పాత్ర కీలకం. ఇందుకోసం సైకాలజిస్టుల అవసరం ఉంటుంది. కోచ్‌లుగా, సైకాలజిస్టులుగా, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లుగా, స్పోర్ట్స్ సైంటిస్టులుగా రాణించాలనుకునే వారికి ఇప్పుడు చక్కటి అవకాశం వచ్చింది. భారత క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ (ఎన్ఎస్‌యూ) ఏటా డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తోంది. ఇది మ‌ణిపూర్‌లోని ఇంఫాల్‌లో ఉంది. 2021-22 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇందులో ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది. 

కోర్సులు.. వివరాలు

అండర్ గ్రాడ్యుయేట్

బీఎస్సీ (స్పోర్ట్స్ కోచింగ్); ఈ కోర్సు వ్యవధి నాలుగేళ్లు. మొత్తం ఎనిమిది సెమిస్టర్లు ఉంటాయి. 50 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 

అర్హతలు;  కోర్సులో చేరాలనుకునే వారు కనీసం 45శాతం మార్కులతో ఇంటర్ (10+2)/  తత్సమాన ఉత్తీర్ణత సాధించాలి. దేశం తరఫున అంతర్జాతీయ పోటీల్లో ప్రాతినిథ్యం వహించి ఉండాలి. వయసు జులై 1, 2021 నాటికి 17 ఏళ్లు ఉండాలి. 

ఎంపిక విధానం; ఎంపిక  నాలుగు దశల్లో జరుగుతుంది. నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ (ఎన్ఎస్‌యూ) నిర్వహించే నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (ఎన్ఎస్‌యూఈఈ)- 100 మార్కులు, ఫిజికల్ ఫిట్‌నెస్‌- 40 మార్కులు, గేమ్ ప్రొఫిషియన్సీ- 50, స్పోర్ట్స్ అచీవ్‌మెంట్‌ వెయిటేజీ- 30 మార్కులుగా మొత్తం 220 మార్కులకు నిర్వహిస్తారు. 

బీపీఈఎస్; బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్(బీపీఈఎస్) కోర్సు వ్యవధి మూడేళ్లు. ఆరు సెమిస్టర్లు ఉంటాయి. మొత్తం 50 సీట్లున్నాయి. 

అర్హతలు; కోర్సులో చేరాలనుకునే వారు కనీసం 45శాతం మార్కులతో ఇంటర్ (10+2)/  తత్సమాన ఉత్తీర్ణత సాధించాలి. దేశం తరఫున అంతర్జాతీయ పోటీల్లో ప్రాతినిథ్యం వహించి ఉండాలి. జులై 1, 2021 నాటికి వయసు 23 ఏళ్లు ఉండాలి. 

ఎంపిక; నాలుగు దశల్లో చేపడతారు. ఎన్ఎస్‌యూఈఈ- 100 మార్కులు, ఫిజికల్ ఫిట్‌నెస్‌- 40 మార్కులు, గేమ్ ప్రొఫిషియన్సీ- 50, స్పోర్ట్స్ అచీవ్‌మెంట్‌ వెయిటేజీ- 30 మార్కులుగా మొత్తం 220 మార్కులకు నిర్వహిస్తారు. 

పోస్ట్ గ్రాడ్యుయేట్

ఎమ్మెస్సీ (స్పోర్ట్స్ కోచింగ్);  ఈ కోర్సు వ్యవధి రెండేళ్లు. నాలుగు సెమిస్టర్లు ఉంటాయి. ఈ ఏడాది 15 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, ఫుట్బాల్, వెయిట్ లిఫ్టింగ్ విభాగాల్లో శిక్షణఇస్తారు. 

అర్హతలు; ఈ కోర్సులో చేరాలంటే కనీసం 50శాతం మార్కులతో స్పోర్ట్స్ కోచింగ్‌లో గ్రాడ్యుయేట్ డిగ్రీ విత్ డిప్లొమా/ పీజీ డిప్లొమా పూర్తి చేయాలి.  లేదా మూడేళ్ల స్పోర్ట్స్ కోచింగ్లో డీపెడ్/బీపీఈఎస్/ బీఎస్సీ విత్ డిప్లొమా లేదా నాలుగేళ్ల బీఎస్సీ స్పోర్ట్స్ కోచింగ్/ తత్సమాన ఉత్తీర్ణత సాధించాలి. సీనియర్ నేషనల్/ ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో పాల్గొనాలి. 

ఎంపిక;  మొత్తం 5 సెగ్మెంట్ల ద్వారా ఎంపిక చేస్తారు. ఎన్ఎస్‌యూఈఈ- 100 మార్కులు, ఫిజికల్ ఫిట్నెస్మార్కులు, గేమ్ ప్రొఫిషియన్సీ (స్కిల్ టెస్ట్ & ప్లేయింగ్ ఎబిలిటీ) - 25 మార్కులు, స్పోర్ట్స్ అచీవ్‌మెంట్‌ వెయిటేజీ- 30 మార్కులు, వైవా- 20 మార్కులు కాగా మొత్తం 200 మార్కులుంటాయి. వీటి ద్వారా ఎంపికలు ఉంటాయి.

ఎంఏ (స్పోర్ట్స్ సైకాలజీ); మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ స్పోర్ట్స్ సైకాలజీ (ఎంఏ సైకాలజీ) కోర్సు రెండేళ్లు ఉంటుంది. నాలుగు సెమిస్టర్లుంటాయి. 15  మందికి అవకాశం ఉంది. 

అర్హతలు; సైకాలజీ/ బీపీఈఎస్/ బీఎస్సీ (స్పోర్ట్స్ కోచింగ్)లో బ్యాచిలర్స్ డిగ్రీ విత్ పీబీఈడీ/  బీఏ(హానర్స్) ఉత్తీర్ణత సాధించాలి. లేదా సైకాలజీ/ స్పోర్ట్స్ సైకాలజీ ఒక సబ్జెక్టుగా ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. కనీసం 50శాతం మార్కులు తప్పనిసరి. ఏదైనా ఆట/ క్రీడా పోటీల్లో పాల్గొని ఉండాలి. 

ఎంపిక;  ఈ కోర్సులోకి ఎంపికలు మూడు పద్ధతుల్లో ఉంటాయి. ఎన్ఎస్యూఈఈ- 100 మార్కులు, స్పోర్ట్స్ అచీవ్మెంట్ వెయిటేజీ- 30 మార్కులు, వైవా- 20 మార్కులుగా మొత్తం 150 మార్కులకు ఉంటుంది. 

ఎంపీఈఎస్; మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ (ఎంపీఈఎస్) కోర్సు కూడా రెండేళ్లే ఉంటుంది. నాలుగు సెమిటర్లు నిర్వహిస్తారు. ఈ కోర్సులో 30 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 

అర్హతలు; ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 50శాతం మార్కులతో బీపీఈఎస్ (10+2+3)/ తత్సమాన ఉత్తీర్ణత సాధించాలి. దేశం తరఫున అంతర్జాతీయ పోటీల్లో ప్రాతినిథ్యం వహించి ఉండాలి.

ఎంపిక; ఐదు పద్ధతుల్లో ఎంపిక విధానం ఉంటుంది. (ఎన్ఎస్‌యూఈఈ)- 100 మార్కులు, ఫిజికల్ ఫిట్నెస్- 25 మార్కులు, గేమ్ ప్రొఫిషియన్సీ- 25 మార్కులు, స్పోర్ట్స్ అచీవ్‌మెంట్‌ వెయిటేజీ- 30 మార్కులు, వైవా- 20 మార్కులు కాగా మొత్తం 200 మార్కులుంటాయి. 

దరఖాస్తు చేయండిలా..

అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అందుకు ఆగస్టు 19, 2021 తుది గడువు. ఒక్క కోర్సుకు దరఖాస్తు రుసుము రూ.1000 చెల్లించాలి. 

పరీక్షా కేంద్రాలు

దేశంలోని మొత్తం ఏడు నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్వాలియర్ (మధ్యప్రదేశ్), కోల్కతా (పశ్చిమబెంగాల్), ముంబై (మహారాష్ట్ర), పాటియాలా (పంజాబ్), తిరువనంతపురం (కేరళ), బెంగళూరు (కర్ణాటక), ఇంఫాల్ (మణిపూర్)లో కేంద్రాలున్నాయి. 

ఆన్‌లైన్ పరీక్ష ఇలా..

నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ (ఎన్ఎస్యూ).. నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (ఎన్ఎస్‌యూఈఈ) ఆన్‌లైన్ పద్ధతిలో జరుగుతుంది. పరీక్షను మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. సమయం రెండు గంటలు ఉంటుంది. ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ రూపంలో వస్తాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్లో ఉంటుంది. 

గేమ్ ప్రొఫిషియన్సీ 

పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు సంబంధించి మొత్తం 25 మార్కులకు ఉంటుంది. ఇందులో స్కిల్ టెస్ట్ మార్కులు, ప్లేయింగ్ ఎబిలిటీ- 10 మార్కులు, ఆటగాడి పూర్తి ప్రదర్శనకు- 5 మార్కులు ఉంటాయి. 

అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల అభ్యర్థులకు నిర్వహించే గేమ్ ప్రొఫిషియన్సీలో మొత్తం 50 మార్కులుంటాయి. స్కిల్ టెస్ట్కు- 20 మార్కులు, ప్లేయింగ్ ఎబిలిటీ- 20 మార్కులు, ఆటగాడి ప్రదర్శనకు- 10 మార్కులు ఇస్తారు. 

కోర్సులు.. ఫీజులు

అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులైన బీపీఈఎస్, బీఎస్సీ (స్పోర్ట్స్ కోచింగ్)లో చేరే అభ్యర్థులు తొలి రెండు సెమిస్టర్లకు రూ.92,800, మూడు-నాలుగు సెమిస్టర్లకు రూ.76000, ఐదు-ఆరు సెమిస్టర్లకు రూ. 76000, ఏడు-ఎనిమిదో సెమిస్టర్లకు రూ.76000 చెల్లించాలి. 

పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులైన ఎంపీఈఎస్, ఎమ్మెస్సీ (స్పోర్ట్స్ కోచింగ్), ఎంఏ (స్పోర్ట్స్ సైకాలజీ)లో చేరేవారు తొలి రెండు సెమిస్టర్లకు రూ.88,100, మూడు-నాలుగు సెమిస్టర్లకు 72,300 చెల్లించాలి. 

ఉద్యోగావకాశాలు

దేశంలో కోచ్‌ల‌కు భారీ డిమాండ్ ఉంది. అందుకే ఆటగాళ్లు ఇతర దేశాల నుంచి సైతం శిక్షకులను రప్పించుకుంటున్నారు. మనవాళ్లు కూడా ఇతర దేశాల క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్నారు. దీన్ని బట్టి జాతీయ, అంతర్జాతీయంగా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఆయా కోర్సులు చేసిన వారు విద్యాసంస్థల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లుగా, ట్రైనర్లుగా ఉద్యోగం చేయవచ్చు. ఫిట్నెస్ సెంటర్లు, పాఠశాలల్లో స్పోర్ట్స్ థెరపిస్టులుగా రాణించవచ్చు. ఇక సైకాలజీ కోర్సు చేసిన వారు టీచర్లుగా, రిసెర్చర్, కౌన్సెలర్లుగా స్థిరపడతారు. ఫిజకల్ ఎడ్యుకేషన్ కోర్సు చేస్తే.. ఫిట్నెస్ సంబంధిత రంగాల్లో ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి. స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్, ఫిట్‌నెస్‌ క్లబ్, హెల్త్ క్లబ్, లా ఎన్ ఫోర్స్‌మెంట్‌, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ, ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్లు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. 

పరీక్ష తేదీ: సెప్టెంబర్ 10, 2021

వెబ్‌సైట్‌: https://www.nsu.ac.in/

Posted Date: 11-08-2021


 

కోర్సులు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌