• facebook
  • whatsapp
  • telegram

వైమానికం... తలమానికం!

ఇంటర్‌ తర్వాత ఇంటిగ్రేటెడ్‌ చదువులకు శ్రీకారం చుట్టే అవకాశం మొదలవుతుంది. ఎలాంటి అంతరాయం లేకుండా ఆసక్తి ఉన్న సబ్జెక్టుల్లో ప్రతిష్ఠాత్మక సంస్థల నుంచి పీజీ పూర్తిచేసుకోవడానికి ఇంటిగ్రేటెడ్‌ విద్య చక్కని దారి చూపుతుంది. సబ్జెక్టుపై గట్టి పట్టుకూ, పరిశోధనల దిశగా అడుగులేయడానికీ ఈ కోర్సులు దోహదపడతాయి. కొన్ని కోర్సుల్లో చేరినవారికి ఏడాది సమయమూ ఆదా అవుతుంది. ప్రస్తుతం ఐఐటీలు, ఐఐఎంలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు సహా చాలా సంస్థలు అందించే ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంబీఏ, బీఎడ్, లా కోర్సులకు ఆదరణ లభిస్తోంది!

‘ఫలానా కోర్సులో ఉన్నత విద్య అభ్యసించాలి, ఈ రంగంలో పరిశోధనలు చేయాలి’ అనే స్పష్టమైన లక్ష్యముంటే ఇంటిగ్రేటెడ్‌ విధానంలో చదవడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. సాధారణంగా పీజీ కోర్సుల్లో చేరడానికి యూజీ ఆఖరు సంవత్సరంలో ఉన్నప్పుడు వివిధ సంస్థలు నిర్వహించే పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో చేరినవారు పీజీ ప్రవేశాలకు పరీక్షలు రాయాల్సిన అవసరం ఉండదు. ఒకసారి చేరితే కోర్సు పూర్తయేంతవరకూ అవాంతరాలు లేకుండా నిశ్చింతగా చదువుకోవచ్చు. ఒకవేళ ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో చేరిన తర్వాత ఉన్నత చదువులపై ఆసక్తి లేకపోయినా, అప్పటిదాకా చదువుతోన్న సబ్జెక్టు నచ్చకపోయినా యూజీ డిగ్రీతో బయటకు వచ్చేయవచ్చు. ఈ సౌకర్యాన్ని కొన్ని సంస్థలు కల్పిస్తున్నాయి.

అయితే కోర్సులో చేరకముందే అన్నీ తెలుసుకోవడం మంచిది. కొన్ని కోర్సుల్లో చేరినవారికి మధ్యలో వైదొలగే అవకాశం ఉండదు. సాధారణంగా ఇంటిగ్రేటెడ్‌ కోర్సులంటే ఎమ్మే లేదా ఎమ్మెస్సీలే ఎక్కువమందికి తెలుసు. ప్రస్తుతం మేనేజ్‌మెంట్, లా, టీచింగ్, ఇంజినీరింగ్‌ కోర్సులను జాతీయ స్థాయిలో పేరున్న విద్యాసంస్థలు అందిస్తున్నాయి. కొన్నిచోట్ల ప్రతినెలా స్ట్టైపెండూ అందుతుంది.

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం

ఇంటిగ్రేటెడ్‌ విధానంలో ఐదేళ్ల ఎంఏ, ఎమ్మెస్సీ కోర్సులను వివిధ విభాగాల్లో హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం అందిస్తోంది. పరీక్షలో చూపిన ప్రతిభతో వీటిలో ప్రవేశం లభిస్తుంది.
ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ కోర్సులు: మ్యాథమేటికల్‌ సైన్సెస్, ఫిజిక్స్, కెమికల్‌ సైన్సెస్, సిస్టమ్స్‌ బయాలజీ, అప్లయిడ్‌ జియాలజీ, హెల్త్‌ సైకాలజీ.
ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ కోర్సులు (హ్యుమానిటీస్‌): తెలుగు, హిందీ, లాంగ్వేజ్‌ సైన్సెస్‌.
ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ కోర్సులు (సోషల్‌ సైన్సెస్‌): ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్, సోషియాలజీ, ఆంత్రపాలజీ
ఈ సంస్థ ఆరేళ్ల వ్యవధితో మాస్టర్‌ ఆఫ్‌ ఆప్టోమెట్రీ (ఎం ఆప్టోమ్‌) కోర్సునూ ఇంటర్‌ విద్యార్హతతో అందిస్తోంది.

బిర్లా సంస్థల్లో...

బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (బిట్స్‌) పిలానీ, గోవా, హైదరాబాద్‌ క్యాంపసుల్లో ఇంటిగ్రేటెడ్‌ విధానంలో ఎమ్మెస్సీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయలాజికల్‌ సైన్సెస్, ఎకనామిక్స్‌ కోర్సులు అందిస్తోంది. బిట్‌శాట్‌తో ప్రవేశం లభిస్తుంది. ఆసక్తి ఉన్నవారు పిలానీ క్యాంపస్‌లో అందించే ఎమ్మెస్సీ జనరల్‌ స్టడీస్‌ కోర్సులోనూ చేరవచ్చు.

సెంట్రల్‌ యూనివర్సిటీల్లో...

ఇటీవలి కాలంలో ఏర్పడిన 14 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, బీఆర్‌ అంబేడ్కర్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ కలిసి సెంట్రల్‌ యూనివర్సిటీస్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (సీయూసెట్‌) పేరుతో పరీక్షలు నిర్వహిస్తున్నాయి. వీటిలో ఇంటర్‌ విద్యార్థులకు ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు ఎంఏ, ఎమ్మెస్సీ విభాగాల్లో అందుబాటులో ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో...
ఉస్మానియా యూనివర్సిటీ: ఎం.ఎ. ఎకనామిక్స్, ఎమ్మెస్సీ - కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ, ఎంబీఏ
తెలంగాణ వర్సిటీ: అప్లయిడ్‌ ఎకనామిక్స్, ఫార్మా. కెమిస్ట్రీ, ఎంబీఏ
పాలమూరు యూనివర్సిటీ: ఎమ్మెస్సీ కెమిస్ట్రీ
కాకతీయ యూనివర్సిటీ: ఎమ్మెస్సీ: కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ

ఇంటర్‌ సైన్స్‌ విద్యార్థులు ఐఐటీలతోపాటు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, రాష్ట్ర స్థాయి సంస్థలు, కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రత్యేక సంస్థల్లో ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ కోర్సుల్లో చేరడానికి అవకాశం ఉంది. ఐఐటీల్లో జేఈఈ స్కోరుతో ప్రవేశం లభిస్తుంది. బీఎస్‌ ఎంఎస్‌ పేరుతో సైన్స్‌ విభాగాల్లో ఐఐఎస్‌ఈఆర్‌లు కోర్సులు అందిస్తున్నాయి. ఇంటర్‌ మార్కుల మెరిట్, జేఈఈ స్కోర్, ఆప్టిట్యూడ్‌ టెస్టులో చూపిన ప్రతిభ, కేవీపీవై తదితర విధానాల ద్వారా ప్రవేశం లభిస్తుంది. దేశవ్యాప్తంగా 7 చోట్ల ఈ సంస్థలున్నాయి. వీటిలో చేరిన విద్యార్థులకు ప్రతి నెలా స్టైపెండ్‌ అందుతోంది. నేషనల్‌ ఎంట్రన్స్‌ స్క్రీనింగ్‌ టెస్టు (నెస్ట్‌)తో నైసర్, సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ బేసిక్‌ సైన్సెస్‌ల్లో బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్‌ కోర్సులు చదువుకోవచ్చు. స్టైపెండ్‌ అందుతుంది. జేఎన్‌యూ, న్యూదిల్లీ ఆయుర్వేద బయాలజీలో ఇంటిగ్రేటెడ్‌ బీఎస్సీ ఎంఎస్‌సీ అందిస్తోంది.బీఎస్‌ ఎంఎస్‌

ఎంఏ

రాష్ట్ర, జాతీయస్థాయి విశ్వవిద్యాలయాలు ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ కోర్సు అందిస్తున్నాయి. ఐఐటీ-మద్రాస్‌ ఎంఏ-డెవలప్‌మెంట్‌ స్టడీస్, ఎంఏ-ఇంగ్లిష్‌ స్టడీస్‌లను ఇంటర్‌ విద్యార్హతతో అందిస్తోంది. హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ ద్వారా కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంతోపాటు, కొత్తగా ఏర్పడిన కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ కోర్సులు అందిస్తున్నాయి.

ఐదేళ్లలో ఎంటెక్‌

ఐఐటీలతోపాటు కొన్ని విశ్వవిద్యాలయాలు, డీమ్డ్‌ సంస్థలు అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ అందిస్తున్నాయి. ఐఐటీ-జేఈఈ స్కోరుతో ప్రవేశం లభిస్తుంది. రాష్ట్రస్థాయి సంస్థల్లోనూ ఈ కోర్సులున్నాయి. పేరొందిన ప్రైవేటు విద్యాసంస్థల్లో కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులు ఎక్కువ. హెచ్‌సీయూ అందించే ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ (సీఎస్‌)లో జేఈఈ స్కోరుతో చేరవచ్చు.

డిగ్రీ/ పీజీ + బీఎడ్‌

నాలుగేళ్లకే డిగ్రీతోపాటు బీఎడ్‌ పూర్తిచేసుకునే అవకాశాన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రాంతీయ విద్యాసంస్థలు, కొన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ప్రసిద్ధ ప్రైవేటు సంస్థలు అందిస్తున్నాయి. వీటిలో చేరినవారికి ఏడాది సమయం ఆదాతోపాటు, బోధనపై గట్టి పునాది ఏర్పడుతుంది. ఆసక్తి ఉంటే ఇంటర్‌ తర్వాత నేరుగా ఎంఎస్‌సీతోపాటు బీఎడ్‌ చదువుకోవచ్చు. ఇలా చేరడం వల్ల ఏడాది సమయం ఆదా అవుతుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో ఆర్‌ఐఈ మైసూరులో ఈ కోర్సులన్నీ అందుబాటులో ఉన్నాయి. వీటిలో చేరినవారు మధ్యలో వైదొలగే వీలుండదు. అజీం ప్రేమ్‌జీ వర్సిటీ, బెంగళూరు; తేజ్‌పూర్‌ యూనివర్సిటీ, సెంట్రల్‌ యూనివర్సిటీ తమిళనాడు, సౌత్‌ బిహార్‌ సెంట్రల్‌ వర్సిటీ, శస్త్ర వర్సిటీ, జీడీ గోయంకా, లవ్‌ లీ ప్రొఫెషనల్‌..సంస్థలు నాలుగేళ్ల బీఎస్‌సీ ఎడ్, బీఏ ఎడ్‌ కోర్సులు అందిస్తున్నాయి.

బీబీఏ/బీటెక్‌ + ఎంబీఏ

ఇంటర్‌ తర్వాత ఐఐఎం ఇండోర్, రోహ్‌తహ్‌ అందించే అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రాం ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (ఐపీఎం)లో చేరవచ్చు.చాలా సంస్థలు బీబీఏ+ ఎంబీఏ ఐదేళ్ల కోర్సును ఇంటిగ్రేటెడ్‌ విధానంలో అందిస్తున్నాయి. ఐఐటీ మద్రాస్, నిర్మా వర్సిటీ, మరికొన్ని సంస్థల్లో బీటెక్‌ + ఎంబీఏ కోర్సులున్నాయి. ఎన్‌ఐఐటీ వర్సిటీ నాలుగేళ్ల వ్యవధితో ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ అందిస్తోంది.

బీఎల్‌

తర్వాత నేరుగా న్యాయ విద్య కోర్సులు చదువుకోవచ్చు. డిగ్రీ, బీఎల్‌ కోర్సులను అయిదేళ్లకే పూర్తిచేసుకోవచ్చు. ఈ రెండూ విడిగా చదవడానికి ఆరేళ్లు పడుతుంది. జాతీయ న్యాయవిశ్వవిద్యాలయాలు, రాష్ట్రస్థాయి సంస్థలు, ప్రైవేటు కళాశాలలు ఈ కోర్సులు అందిస్తున్నాయి. విద్యార్థులు బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ కోర్సులతోపాటు బీఎల్‌ పూర్తిచేసుకోవచ్చు. జాతీయ సంస్థల్లోకి క్లాట్, రాష్ట్రస్థాయిలో లాసెట్‌ లతో అవకాశం లభిస్తుంది.
మహాత్మా గాంధీ యూనివర్సిటీ: ఎంబీఏ, ఎమ్మెస్సీ ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ
ఆచార్య నాగార్జున: ఎమ్మెస్సీ నానో టెక్నాలజీ.
యోగి వేమన యూనివర్సిటీ: ఎమ్మెస్సీ -బయోటెక్నాలజీ అండ్‌ బయో ఇన్ఫర్మాటిక్స్, ఎర్త్‌ సైన్సెస్‌.

Posted Date: 12-10-2021


 

ఇంటర్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌