• facebook
  • whatsapp
  • telegram

ఉపాధికి నిధి!

భరోసా ఇస్తున్న కామర్స్‌

అంకెలతో ఆడుకునే ఆసక్తీ, తార్కికంగా విశ్లేషించే లక్షణాలూ ఎంతో కొంత మీకున్నాయా? అయితే కామర్స్‌ కోర్సులు మీకో చక్కటి అవకాశం. వాటిలో ప్రవేశించి, పరిజ్ఞానం సంపాదించి బ్యాలెన్స్‌ షీట్లూ, లాభనష్టాల నివేదికలూ, ఆర్థిక గణాంకాలను బేరీజు వేసే కెరియర్‌ను సొంతం చేసుకోవచ్చు. ఇంజినీరింగ్‌, మెడిసిన్‌, ఆర్కిటెక్చర్‌ లాంటివాటికి ఎంత ప్రాచుర్యం ఉన్నా ఉపాధి అవకాశాలకు ఢోకా లేని కామర్స్‌ కోర్సులకు ఆదరణ పెరుగుతూనే ఉంది!

మార్కెట్‌ అవసరాలకు సరిపడే ఆధునిక కోర్సులను చేస్తూ కామర్స్‌ విద్యార్థులు తమ గిరాకీ పెంచుకుంటున్నారు. ఒక వ్యాపారానికి సంబంధించిన ఆర్థిక ఆరోగ్యాన్ని సూచించే బ్యాలెన్స్‌ షీటు, ట్రేడింగ్‌ అకౌంట్‌, లాభనష్టాల నివేదికలను సిద్ధం చేసే సబ్జెక్టుల పరిజ్ఞానాన్ని కామర్స్‌ అందిస్తుంది. అకౌంటింగ్‌ సూత్రాలు, ఆర్థికాంశాలు, వాణిజ్య పెట్టుబడుల వ్యూహాలు మొదలైన అంశాలను కామర్స్‌ విద్యార్థులు అధ్యయనం చేస్తారు. బిజినెస్‌ అకౌంటింగ్‌లో కంప్యూటర్ల వాడకాన్ని కూడానేర్చుకోవాల్సివుంటుంది.

కామర్స్‌ గ్రాడ్యుయేట్ అయ్యాక చాలా ఉద్యోగావకాశాలుంటాయి. పై చదువులపై అభిరుచి ఉంటేే... పీజీ కోర్సు అయిన ఎం.కామ్‌ను మరో రెండేళ్ళు చదవచ్చు. ఒకవేళ ఈ కోర్సుపై ఆసక్తి లేకపోయినా ఇతర మార్గాల్లో ఉన్నత విద్యావకాశాలున్నాయి.

మేనేజ్‌మెంట్‌: బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ ప్రొఫెషనల్‌ కావాలంటే పీజీ/డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ చేయవచ్చు. కామర్స్‌ చదివినవారికి ఈ కోర్సు పరిచితంగానూ, తేలిగ్గా అవగాహన చేసుకునేలాగానూ ఉంటుంది. కామర్స్‌ విద్యార్థులు ఫైనాన్స్‌ మాత్రమే కాకుండా మార్కెటింగ్‌, ఆపరేషన్స్‌, హెచ్‌ఆర్‌, ఐటీ మొదలైన స్పెషలైజేషన్లు ఎంచుకోవచ్చు. బిజినెస్‌ అనలిటిక్స్‌ లాంటి కొత్త స్పెషలైజేషన్లు కూడా ఉన్నాయి.

లా: బీకాం అర్హతతో లా డిగ్రీని చేస్తూ లీగల్‌ కెరియర్లోకి ప్రవేశించవచ్చు. యూనివర్సిటీలూ, కళాశాలలూ, లా విద్యాసంస్థల్లో మూడేళ్ళ గ్రాడ్యుయేట్‌ డిగ్రీని ఎంచుకోవచ్చు.

కంప్యూటర్‌ అప్లికేషన్స్‌: కంప్యూటర్‌ లేదా ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ను అప్పటికే చదివివుంటేనే మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ (ఎంసీఏ) చదవటానికి వీలుంటుందని చాలామంది భావిస్తుంటారు. అది వాస్తవం కాదు. కామర్స్‌ గ్రాడ్యుయేట్లు ఎం.ఇ. లేదా ఎంటెక్‌కు దరఖాస్తు చేసుకోవటానికి అర్హత ఉండదు కానీ, ఎంసీఏలో చేరటానికి మాత్రం వీలుంటుంది. కామర్స్‌లో, కంప్యూటర్స్‌లో పరిజ్ఞానం బిజినెస్‌ కంప్యూటింగ్‌, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌లలో కెరియర్‌ను తీర్చిదిద్దుకోవటానికి ఉపయోగపడతాయి.

బ్యాంకింగ్‌: బ్యాంకులు ఇటీవలికాలంలో పెద్దసంఖ్యలో ఉద్యోగుల నియామకం చేసుకుంటున్నాయి. కామర్స్‌ విద్యార్థులకు నిర్దేశించిన సిలబస్‌లో బ్యాంకింగ్‌ ముఖ్యమైనది. బ్యాంకు ఉద్యోగాలకు పోటీపడటంలో మిగతా డిగ్రీల వారికంటే ఇది అదనపు ప్రయోజనం. మర్చంట్‌ బ్యాంకింగ్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌లో ఉద్యోగాలు కామర్స్‌వారికి లభిస్తాయి.

ఆడిటింగ్‌: చాలా ఆడిటింగ్‌ సంస్థలు ఆడిట్‌ వర్క్‌ కోసమో, సీనియర్‌ ఆడిటర్లకు సాయం చేయటం కోసమో కామర్స్‌ గ్రాడ్యుయేట్లను నియమించుకుంటాయి. కొన్ని ఆడిట్‌ సంస్థలు స్థానికంగా, ప్రాంతీయంగా ఉంటే మరికొన్ని అఖిల భారత స్థాయిలో, మరికొన్ని అంతర్జాతీయంగానూ విధులు నిర్వహిస్తుంటాయి.

కన్సల్టింగ్‌: కామర్స్‌ నేపథ్యం ఉండి, కొంత అనుభవం ఉన్నవారు కన్సల్టింగ్‌లో చాలా అవకాశాలను పొందగలుగుతారు. ఆడిటింగ్‌, ఇన్‌కమ్‌టాక్స్‌, సర్వీస్‌ టాక్స్‌, జీఎస్‌టీ మొదలైన అంశాల్లో ప్రత్యేక నైపుణ్యం సాధించినవారికి ఉజ్వల భవిత ఉంటుంది. సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ ప్లానర్‌ కోర్సు చేసినవారు ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌లో కన్సల్టింగ్‌ చేసుకోవచ్చు. ఇవే కాకుండా స్టాక్‌ బ్రోకింగ్‌, చార్ట్‌ర్డ్‌ ఫైనాన్షియల్‌ అనాలిసిస్‌, కామర్స్‌ టీచింగ్‌ మొదలైన ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.

ప్రొఫెషనల్‌ కోర్సులు మూడు దేశవ్యాప్తంగా జీఎస్‌టీ (వస్తు, సేవల పన్ను) అమల్లోకి రావటం వల్ల సీఏలకూ, ఇతర కామర్స్‌ ప్రొఫెషనల్స్‌కూ ఉపాధి అవకాశాలు 3 నుంచి 5 రెట్లు పెరిగాయని చెప్పవచ్చు. భవిష్యత్తులో కామర్స్‌ నిపుణులుగా, వ్యాపారవేత్తలుగా ఎదగాలంటే పదో తరగతి తరువాతే కామర్స్‌ గ్రూపులు ఎంచుకుని ప్రణాళికబద్ధంగా చదవాల్సివుంటుంది.

గ్రూపులు-కెరియర్‌

ఎంఈసీ: మేథ్స్‌పై అభిమానం ఉండి, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ అంటే భయపడేవారు.. మేథ్స్‌తోపాటు భవిష్యత్తులో ఏ కోర్సు చదవాలనుకున్నా అవకాశం ఉండాలనుకునేవారికి ఎంఈసీ మంచి మార్గం. సైన్స్‌ గ్రూపుల్లో ఉండే మేథ్స్‌, కామర్స్‌ గ్రూపుల్లోని ఎకనామిక్స్‌, కామర్స్‌ వంటి సబ్జెక్టుల మేలు కలయికే ఇది. సీఏ/ సీఎంఏ/ సీఎస్‌ వంటి ప్రొఫెషనల్‌ కోర్సులకు ఎంఈసీ మంచి పునాది. ఇంటర్‌లో ఎంఈసీ గ్రూపు తీసుకుని భవిష్యత్తులో బీకాం, బీబీఎం, బీఏ, బీఎస్‌సీ వంటి కోర్సులు చదివి, ఆపై ఎంకాం, ఎంసీఏ, ఎంఎస్‌సీ, ఎంబీఏ కోర్సులు పూర్తిచేయవచ్చు.

సీఈసీ: ఇది కామర్స్‌, ఎకనామిక్స్‌, సివిక్స్‌ వంటి ప్రధాన సబ్జెక్టుల కలయిక. లా పూర్తి చేయడానికి, సివిల్స్‌ రావడానికి, అన్ని రకాల కాంపిటీటివ్‌ పరీక్షలు రాయడానికి సీఈసీ గ్రూప్‌లోని సబ్జెక్టులే కీలకం. కామర్స్‌ కెరియర్‌ కావాలి కానీ మేథ్స్‌ అంటే భయం అనుకునేవారు నిశ్చింతగా సీఈసీ గ్రూపుని తీసుకోవచ్చు. సీఈసీ గ్రూపు తీసుకుని సీఏ, సీఎంఏ, సీఎస్‌ వంటి ప్రొఫెషనల్‌ కోర్సులు పూర్తిచేయవచ్చు.

సీఏ: సీఏ చదవాలంటే ఒకప్పుడు డిగ్రీ తరువాతకానీ సీఏ కోర్సులోకి ప్రవేశం ఉండేది కాదు. ఇప్పుడు ఇంటర్‌తోపాటే సీఏ కోర్సు చదవడం ప్రారంభించవచ్చు. ఇంటర్‌ ఎంఈసీ/ ఎంపీసీ/ బైపీసీ/ సీఈసీ/ హెచ్‌ఈసీ.. ఇలా ఏ గ్రూపువారైనా సీఏ కోర్సును చదవవచ్చు. అయితే సీఏ చేయాలనుకునే చాలామంది విద్యార్థులు ఇంటర్‌లో ఎంఈసీ గ్రూపుతోపాటే సీఏ కూడా ఏకకాలంలో చదవడానికే సుముఖత చూపిస్తున్నారు. ఇలా ఇంటర్‌తోపాటే సీఏ కోర్సు కూడా చదవడం వల్ల ప్రాథమికాంశాలపై పట్టు సాధించడంతోపాటు చదవబోయే సీఏ కోర్సులోని మిగిలిన దశలకీ గట్టి పునాది ఏర్పడుతుంది.
దీనిలో సీఏ ఫౌండేషన్‌, సీఏ ఇంటర్మీడియట్‌, సీఏ ఫైనల్‌ దశలుంటాయి. సీఏ ఇంటర్మీడియట్‌ చేసినవారు మూడేళ్ల ఆర్టికల్‌షిప్‌ చేయాల్సి ఉంటుంది. పన్ను లెక్కింపు, అకౌంటింగ్‌, డేటా విశ్లేషణ విభాగాల్లో సీఏలకు లక్షకుపైగా కొత్త ఉద్యోగావకాశాలు రానున్నాయని అంచనా. జీఎస్‌టీ అమలు వల్ల నగదు చెలామణి లాభదాయకత, పారదర్శకత మెరుగుపడి పన్ను ఎగవేతలు తగ్గిపోతాయనీ, ఫలితంగా సంభవించే ఆర్థికాభివృద్ధి వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయనే అంచనా వ్యక్తమవుతోంది.

సీఎంఏ: సీఏ కోర్సు తరువాత విద్యార్థులు ఈ కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెంట్‌వైపు విశేషంగా ఆకర్షితులు అవుతున్నారు. పదో తరగతి తరువాత నాలుగేళ్లలో, ఇంటర్‌ ఎంఈసీతోపాటు సీఎంఏ చదివిన విద్యార్థులయితే ఇంటర్‌ తరువాత రెండేళ్లలో, ఇంటర్‌ తరువాత సీఎంఏ చదవడం మొదలుపెట్టినవారైతే రెండున్నరేళ్లలో సీఎంఏ పూర్తిచేయవచ్చు. సీఎంఏ చదవాలంటే ఇంటర్మీడియట్‌లో ఏ గ్రూపు వారైనా అర్హులే. ఈ కోర్సు చదవాలంటే రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. ఇందుకు విద్యార్థి తప్పనిసరిగా ఇంటర్‌ (10+2) లేదా తత్సమాన పరీక్ష పాస్‌ అవ్వాల్సి ఉంటుంది. దీనిలో ఫౌండేషన్‌, ఇంటర్మీడియట్‌, ఫైనల్‌ అనే దశలుంటాయి.
ఇది చదివితే మేనేజ్‌మెంట్‌ కోర్సులను అందించే సంస్థల్లో లెక్చరర్స్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ప్రొఫెసర్లుగా ఉద్యోగం లభిస్తుంది. అనేక ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ, ప్రభుత్వేతర సంస్థల్లోనూ సీఎంఏలు చీఫ్‌ ఇంటర్నల్‌ ఆడిటర్‌, కాస్ట్‌ కంట్రోలర్‌, చీఫ్‌ అకౌంటెంట్‌, ఫైనాన్షియల్‌ కంట్రోలర్‌ వంటి కీలక పదవులనూ నిర్వర్తించవచ్చు.

కంపెనీ సెక్రటరీ

ఈ సీఎస్‌ కోర్సును ఫౌండేషన్‌ ప్రోగ్రామ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రోగ్రామ్‌, ప్రొఫెషనల్‌ ప్రోగ్రామ్‌ అనే 3 స్థాయుల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. సీఎస్‌ కోర్సు పూర్తిచేసే క్రమంలో రాతపరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడమే కాకుండా అప్రెంటిస్‌షిప్‌ పేరుతో ఉండే ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ పూర్తిచేయాల్సి ఉంటుంది. కంపెనీ సెక్రటరీలు నేర్పుతో, ఓర్పుతో వ్యాపారవేత్తలకు సలహాలు, సూచనలు ఇస్తారు. బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌కి సలహాలు ఇవ్వడం, కంపెనీ రిజిస్ట్రార్‌గా న్యాయ సలహాలు అందించటం చేస్తారు. కంపెనీల విధానాల రూపకర్తగా, చీఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌గా, కంపెనీ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా, సంస్థ యాజమాన్యానికి, వాటాదారులకు, రుణదాతలకు అనుసంధానకర్తగా అనేక రూపాల్లో హోదాల్లో ఉద్యోగం చేయవచ్చు. చీఫ్‌ ఫైనాన్స్‌ ఆఫీసర్లుగా, బ్యాంకు మేనేజర్లుగా, ఫైనాన్షియల్‌ కన్సల్టెంట్లుగా ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా మంచి హోదాల్లో ఉపాధి పొందొచ్చు.

ఫారిన్‌ డిగ్రీలూ చేయొచ్చు..

బీకాంతోపాటు ఒక ప్రొఫెషనల్‌ కోర్సు పూర్తిచేసుకోవటం తాజా ధోరణి. ఇలా కామర్స్‌ డిగ్రీ ముగిసేలోపు సీఏ, సీఎంఏ, సీఎస్‌లలో ఏదో ఒకటి చేస్తే ఉద్యోగావకాశాలు బాగా ఉంటున్నాయి. టెన్త్‌ పూర్తిచేసినవారు ఇంటర్మీడియట్లో ఎంఈసీ లేదా సీఈసీ గ్రూపు తీసుకుంటే కామర్స్‌లోకి విజయవంతంగా ప్రవేశించవచ్చు. ఒకప్పటిలాగా కాకుండా సీఏ ఉత్తీర్ణత శాతం బాగా పెరిగింది.

ఓ కొత్త పరిణామం ఏమిటంటే... బీకాంతో పాటు విదేశీ కోర్సులను చదవటం. వీటికి అంతర్జాతీయంగా గుర్తింపు ఉండటం వల్ల బహుళజాతి కంపెనీలు ఈ కోర్సులు చేసిన కామర్స్‌ పట్టభద్రులను ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి.

అమెరికాకు చెందిన ‘సర్టిఫైడ్‌ పబ్లిక్‌ ఎకౌంటెంట్స్‌ (సీపీఏ)’ దీనిలో ఒకటి. ఇది మన సీఏతో సమానం.

బ్రిటిష్‌కు చెందిన ‘చార్టర్డ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెంట్స్‌ (సీఐఎంఏ)’ కోర్సు మరొకటి. వీటిని మనదేశం నుంచే చేసే వీలుంది. రిజిస్టర్‌ చేసుకుని, సెల్ఫ్‌స్టడీ చేసుకోవటమే. చాలామంది విద్యార్థులు దీన్ని బాగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ రెండు కోర్సుల్లో ఏదో ఒకదాన్ని బీకాంతో పాటు చేస్తే రూ.2-3 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు లభిస్తున్నాయి.

లండన్‌కు సంబంధించిన ‘సర్టిఫైడ్‌ కోర్స్‌ ఇన్‌ బిజినెస్‌ అనలిటిక్స్‌’ ఇలాంటిదే. కంపెనీల ఉత్పత్తుల మార్కెట్‌ స్థితిని విశ్లేషించే ఈ అనలిటిక్స్‌ ప్రాచుర్యం పొందుతోంది.

Posted Date: 17-03-2021


 

ఇంటర్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌