• facebook
  • whatsapp
  • telegram

మెరుగైన భవితకు మేలైన నిర్ణయం!

ఇంటర్మీడియట్‌ తర్వాత కోర్సులు, కొలువులు

విద్యార్థులు తమను తాము సమీక్షించుకుని, సరైన మార్గాన్ని ఎంచుకోవడం ఎంతో ముఖ్యం. ఈ అవకాశం అన్ని సందర్భాల్లోనూ రాదు. తొలిసారి పదో తరగతి తర్వాత వస్తుంది. మళ్లీ ఇంటర్మీడియట్‌ అనంతరం దక్కుతుంది. ఈ దశలో తీసుకునే నిర్ణయమే వృత్తి జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఎంచుకోవడానికి ఎన్నో దారులు ఉన్నాయి. అన్నీ విలువైనవే. అయితే ఆ దారి మీకు సరిపోతుందా అనేది పరిశీలించడం ముఖ్యం. ఆసక్తి, నైపుణ్యం, అభిరుచి.. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే సరైన నిర్ణయం తీసుకోవడం మీ చేతుల్లోనే ఉంటుంది.

పదో తరగతి తర్వాత తీసుకున్న నిర్ణయాల్లో ఏవైనా పొరపాట్లు జరిగితే సరిదిద్దుకునేందుకు ఇంటర్‌ తర్వాత మరోసారి అవకాశమొస్తుంది. ఒకవైపు సాధారణ డిగ్రీలు, మరోవైపు ప్రొఫెషనల్‌ కోర్సులు అన్నీ ఇంటర్‌ తర్వాతే మొదలవుతాయి. వీటిలో ఇంజినీరింగ్, మెడిసిన్‌ మినహా మిగిలినవాటిలోకి ఇంటర్మీడియట్‌ అన్ని గ్రూపుల విద్యార్థులకూ అవకాశం ఉంది. అందువల్ల అందుబాటులో ఉన్న అన్ని కోర్సులపైనా అవగాహన పెంచుకుంటే ఎందులో చేరాలో సులువుగానే నిర్ణయం తీసుకోవచ్చు.

వీడ్కోలూ పలకొచ్చు...

ఇంటర్మీడియట్‌లో ఎంపీసీ, బైపీసీ గ్రూపు చదివిన విద్యార్థుల్లో కొందరు రాణించలేకపోవడం అలాగే ఆసక్తి లేకపోవడంతో ఇబ్బందులు పడుతుంటారు. అయితే వీరు ఆ దారిలోనే కొనసాగాలా, మరో మార్గంలో ముందడుగేయాలా అన్న విషయంలో ఓ నిర్ణయానికి రావచ్చు. ఎంపీసీ, బైపీసీల్లో భవిష్యత్తును ఆశించేవారికి మేటి కోర్సులెన్నో ఉన్నాయి. అలాగే ఈ సైన్స్‌ గ్రూపులను వదిలించుకోవాలనుకునేవారు రాణించడానికి అవకాశమున్న చదువుల సంఖ్యా తక్కువ కాదు. అందువల్ల పూర్తిస్థాయిలో సమీక్షించుకుని కలర్‌ఫుల్‌ కెరియర్‌ లైఫ్‌ నిర్మించుకోవచ్చు. అయితే సమీక్షకు ఇదే చివరి అవకాశంగా భావించాలి.

ఎంచుకోండిలా...

విద్యార్థులంతా ఎవరికి వారే ప్రత్యేకం. నైపుణ్యాలు, బలాలు, బలహీనతలు పరిగణనలోకి తీసుకుని భవిష్యత్తును నిర్ణయించుకోవాలి. ఇలా చేస్తేనే తీసుకున్న నిర్ణయానికి న్యాయం చేయగలం. ఫలితంగా చదువుల్లో రాణించడం సులువవుతుంది. ఎంచుకోవడానికి ఎక్కువ సంఖ్యలో ఆప్షన్లు ఉండటంతో ఎందులో చేరాలో నిర్ణయించుకోవడం కొంచెం కష్టమవుతోంది. అందువల్ల ఎవరికి వారు ఆసక్తులను గమనించి, ప్రత్యేకతలు తెలుసుకోవాలి. బలాలను విశ్లేషించుకుని...బలహీనతలూ పరిగణనలోకి తీసుకోవాలి. ఆ తర్వాతే ఒక నిర్ణయానికి రావాలి. చేరాలనుకున్న కోర్సు స్వరూపాన్ని గమనించాలి. అది మనకు సరిపోతుందా, లేదా చూసుకోవాలి. నచ్చిన కోర్సు ఎంచుకోవడం మంచిదే. అయితే ఆ కోర్సులో లభించే ఉన్నత విద్య, కోర్సు అనంతరం అందులో ఉండే అవకాశాలపైనా అవగాహన ఉండాలి. ముఖ్యంగా కొత్త కోర్సులు ఎంచుకున్నప్పుడు జాగ్రత్తగా ముందడుగేయాలి. ఇంటర్మీడియట్‌ గ్రూపుల వారీ విద్యార్థులకు ఉన్న అవకాశాలు, అన్ని గ్రూపుల వారికీ ఉమ్మడిగా ఉండే దారుల వివరాలు తెలుసుకుంటే నిర్ణయానికి రావడం సులువవుతుంది. 

పేరున్న సంస్థల్లో..

అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీ రెసిడెన్షియల్‌ విధానంలో బీఏ కోర్సు అందిస్తోంది. ఇంటర్‌ ఏ గ్రూప్‌ విద్యార్థులైనా చేరవచ్చు.  

టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ బీఏ సోషల్‌ సైన్సెస్, బ్యాచిలర్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌ కోర్సులను అందిస్తోంది. 

ప్రత్యేక అభిరుచి ఉన్నవారు ప్రైవేటు సంస్థలు అందించే లిబరల్‌ స్టడీస్‌ కోర్సుల్లోనూ చేరవచ్చు. క్రియా, ఆశోక, ఫ్లేమ్, జిందాల్‌...ఇలా పలు సంస్థలు ఇప్పుడు లిబరల్‌ చదువుల్లో పేరు గడించాయి. 

ఇంటర్మీడియట్‌ ఏ గ్రూప్‌లో చేరినప్పటికీ సీఏ, సీఎంఏ, సీఎస్‌ ప్రొఫెషనల్‌ కోర్సుల కోసం నమోదు చేసుకోవచ్చు.  

దూరవిద్యలోనూ...

కాలేజీలకు వెళ్లి డిగ్రీలు చదువుకోవడానికి వీలు లేనివారు ఇంటర్‌ తర్వాత దూరవిద్య ద్వారా డిగ్రీ కోర్సుల్లో చేరవచ్చు. దాదాపు అన్ని యూనివర్సిటీలూ దూరవిద్యను అందిస్తున్నాయి. లాయర్లు, ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు కావాలనుకున్నవారు దూరవిద్యలో కాకుండా రెగ్యులర్‌ విధానంలో డిగ్రీ కోర్సుల్లో చేరడమే శ్రేయస్కరం. డిగ్రీ అర్హతతో నిర్వహించే దాదాపు అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకూ దూరవిద్యలో చదివినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఇవీ దారులు...

ఎంపీసీతో: బీఈ/ బీటెక్‌/ బీఆర్క్, ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ, బీఎస్, బీఎస్‌ఎంఎస్, బీఎస్సీ 10+2 టెక్నికల్‌ ఎంట్రీ (ఆర్మీ/ నేవీ), పైలట్, ఎన్‌డీఏ (నేవీ, ఎయిర్‌ఫోర్స్‌)

బైపీసీతో: మెడిసిన్‌ (ఎంబీబీఎస్, బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్, బీడీఎస్‌...), వెటర్నరీ సైన్స్‌ అండ్‌ యానిమల్‌ హజ్బెండ్రీ. బీఎస్సీ అగ్రికల్చర్‌/ హార్టికల్చర్‌/ సెరికల్చర్‌/ ఫ్లోరికల్చర్‌. బీఎస్సీ నర్సింగ్, ఫిజియోథెరపీ, పారా మెడికల్‌ కోర్సులు, ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ, బీఎస్, బీఎస్‌-ఎంఎస్‌. బీఎస్సీ రెగ్యులర్, బీఎస్సీ- ఫారెస్ట్రీ/ ఫిషరీ సైన్స్‌/ న్యూట్రిషన్‌/ హోం సైన్స్‌. ఆప్టోమెట్రీ

ఎంపీసీ, బైపీసీ ఇద్దరికీ: బీఫార్మసీ, ఫార్మ్‌డీ…

అన్ని గ్రూపులవారికీ (ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్‌ఈసీ): లా, లిబరల్‌ స్టడీస్, డీఎడ్, ఇంటిగ్రేటెడ్‌ బీఎడ్, సీఏ, సీఎంఏ, సీఎస్‌. హోటల్‌ మేనేజ్‌మెంట్, హాస్పిటాలిటీ, టూరిజం. ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ, ఎంబీఏ, బీబీఎం, బీబీఏ, బీసీఏ, బీఏ, బీఎస్‌డబ్ల్యూ. ఫైన్‌ ఆర్ట్స్, విదేశీ భాషలు, ఎయిర్‌ హోస్టెస్‌ అండ్‌ ఫ్లయిట్‌ స్టివార్డ్, ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ కోర్సులు, డిజైన్, ఫ్యాషన్, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్, డిప్లొమా/ సర్టిఫికెట్‌ కోర్సులు, వొకేషనల్‌ కోర్సులు, ఆఫ్‌ బీట్‌ కోర్సులు, ఏఎన్‌ఎం, ఎన్‌డీఏ (ఆర్మీ) 

అన్ని గ్రూపుల వారికీ..

ఎవర్‌ గ్రీన్‌... టీచింగ్‌

ఇంటర్మీడియట్‌ అన్ని గ్రూపుల విద్యార్థులూ టీచింగ్‌ కోర్సుల్లో చేరవచ్చు. వీరు డీఎడ్‌ చదవడానికి డైట్‌ సెట్‌ రాసుకోవచ్చు. పరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా ప్రవేశాలు లభిస్తాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆధ్వర్యంలో పలు డైట్‌లు డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ కోర్సును రెండేళ్ల వ్యవధితో అందిస్తున్నాయి. ఈ కోర్సును విజయవంతంగా పూర్తిచేసుకున్నవారు సెకెండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ) పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఇంటర్మీడియట్‌ అనంతరం నాలుగేళ్ల వ్యవధితో వివిధ సంస్థలు అందిస్తోన్న బీఏఎడ్, బీఎస్సీ ఎడ్‌ కోర్సులనూ చదువుకోవచ్చు.   

ఇంటిగ్రేటెడ్‌గా..

ఇంటర్‌ విద్యార్హతతో బీఎడ్, ఎంఏ, ఎంబీఏ...మొదలైన కోర్సులను ఇంటిగ్రేటెడ్‌ విధానంలో చదువుకోవచ్చు. ఐఐటీలు, ఐఐఎంలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు సహా పలు సంస్థలు అందించే ఇంటిగ్రేటెడ్‌ పీజీ కోర్సుల్లో ఇంటర్‌ అన్ని గ్రూపుల వారూ చేరిపోవచ్చు.  

ఆతిథ్యంలో..

ఆతిథ్య రంగంలో సేవలందించాలనుకునేవారు, పాకశాస్త్రంపై అభిరుచి ఉన్నవారు, నిర్వహణ నైపుణ్యం ఉన్నవారు, క్రమపద్ధతిలో సర్దడాన్ని ఇష్టపడేవారు...వీరంతా హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులకు ప్రాధాన్యం ఇవ్వవచ్చు. జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో పలు సంస్థలు బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్‌ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్, బ్యాచిలర్‌ ఆఫ్‌ కలినరీ ఆర్ట్స్‌ కోర్సులను అందిస్తున్నాయి. ఇంటర్‌ ఏ గ్రూప్‌ విద్యార్థులైనా వీటిని చదువుకోవచ్చు. పరీక్షలో చూపిన ప్రతిభ లేదా మార్కుల మెరిట్‌తో ప్రవేశాలుంటాయి. 

డిజైన్‌లో..

ఇంటర్‌ అర్హతతో ఉన్న మార్గాల్లో డిజైన్‌ ఒకటి. ఇందుకోసం జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో పలు సంస్థలు ఉన్నాయి. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (నిఫ్ట్‌) దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన సంస్థ. అలాగే నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ (ఎన్‌ఐడీ) కూడా ముఖ్యమైందే. ఐఐటీ బాంబే, గువాహటితోపాటు పలు సంస్థలు డిజైన్‌ కోర్సులు అందిస్తున్నాయి. పరీక్షలో చూపిన ప్రతిభతో ప్రవేశం కల్పిస్తారు. 

ఫుట్‌వేర్‌ కోర్సులు

పాదరక్షల తయారీ శిక్షణకు ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్, సెంట్రల్‌ ఫుట్‌వేర్‌ ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ల్లో ఇంటర్‌ అర్హతతో వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 

ఫైన్‌ ఆర్ట్స్‌...

ఇంటర్‌ తర్వాత ప్రత్యేక అభిరుచులు ఉన్నవారు ఫైన్‌ఆర్ట్స్‌ బాట పట్టవచ్చు. పెయింటింగ్, ఫొటోగ్రఫీ, యానిమేషన్, అప్లైడ్‌ ఆర్ట్స్, స్కల్ప్‌చర్‌... మొదలైన కోర్సులెన్నో ఉన్నాయి. వీటికోసమే ప్రత్యేకంగా ఏపీ, తెలంగాణల్లో ఆర్ట్స్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీలు ఏర్పాటయ్యాయి. వీటిలో ఇంటర్‌ విద్యార్థుల కోసం అండర్‌ గ్రాడ్యుయేషన్‌లో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ఆర్ట్స్‌ (బీఎఫ్‌ఏ)లో పైన పేర్కొన్న కోర్సులు అందిస్తున్నారు. ఆంధ్రా, ఉస్మానియా సహా పలు యూనివర్సిటీల్లో యూజీ స్థాయిలో ఈ కోర్సులు ఉన్నాయి. జాతీయ స్థాయిలోనూ పలు సంస్థలు ఫైన్‌ఆర్ట్స్‌ అందిస్తున్నాయి.

విదేశీ భాషలు...

ఇంటర్‌ అర్హతతో విదేశీ భాషలు కూడా నేర్చుకోవచ్చు. ప్రస్తుతం అన్ని రంగాలు, విభాగాల్లో విదేశీ భాషలు వచ్చినవాళ్లకు ప్రాధాన్యం పెరిగింది. జర్మన్, స్పానిష్, ఫ్రెంచ్, ఇటాలియన్, పర్షియన్, చైనీస్‌...ఇలా ఏదో ఒక భాషలో నైపుణ్యం పెంచుకుంటే సుస్థిర కొలువును సొంతం చేసుకోవచ్చు. హైదరాబాద్‌లోని ఇఫ్లూతోపాటు పలు విశ్వవిద్యాలయాలు డిగ్రీలో ఒక సబ్జెక్టుగా విదేశీ భాషలను అందిస్తున్నాయి. పరీక్షతో ప్రవేశాలుంటాయి. 

అదిరే ’లా’

న్యాయవిద్య లక్ష్యమైనవారు ఇంటర్‌ అర్హతతో ముందుకెళ్లవచ్చు. లా కోర్సుల్లో ప్రవేశానికి పలు మార్గాలు ఉన్నాయి. రాష్ట్రస్థాయి విద్యా సంస్థల్లోకి లాసెట్, జాతీయ స్థాయిలో పేరొందిన సంస్థల్లోకి క్లాట్, ప్రైవేటు సంస్థల్లోకి ఎల్‌శాట్‌..మొదలైన పరీక్షలు ఉన్నాయి. వీటిద్వారా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఏ/ బీఎస్సీ/ బీకాం -ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో చేరిపోవచ్చు.  
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ వ్యవసాయ కోర్సులకు జాతీయ పరీక్ష

‣ బ్యాంకు ఉద్యోగం... సాధించే వ్యూహం!

‣ విజయం.. ఇలా సాధ్యం!

‣ దేశ రాజధానిలో టీచింగ్‌ ఉద్యోగాలు

Posted Date: 04-08-2022


 

ఇంటర్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌