• facebook
  • whatsapp
  • telegram

ఇంటర్‌తో ఉపాధ్యాయ విద్య.. డీఎడ్‌

* ఏపీ, టీస్‌ డీఈఈసెట్‌ నోటిఫికేషన్లు విడుదల

   

బోధన రంగంలో ఆసక్తి ఉన్నవారు ఇంటర్మీడియట్‌ తర్వాత ఆ దిశగా  అడుగులేయవచ్చు. ఈ విద్యార్హతతో రెండేళ్ల వ్యవధితో డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఈఎల్‌ఈడీ) కోర్సులో చేరవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఈ కోర్సును అందిస్తున్నాయి. డీఈఈ సెట్‌లో చూపిన ప్రతిభతో  ప్రవేశాలుంటాయి. ఆంధ్రప్రదేశ్,  తెలంగాణల్లో ఇటీవలే ఈ ప్రకటనలు వెలువడిన నేపథ్యంలో ఆ వివరాలు...


చిన్న వయసులోనే స్థిరమైన కెరియర్‌ జీవితాన్ని పొందడానికి డీఎడ్‌ కోర్సు దారి చూపుతుంది. తెలుగు రాష్ట్రాల్లో దీన్ని తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మాధ్యమాల్లో అందిస్తున్నారు. ఇంటర్మీడియట్‌లో చదివిన గ్రూపు, పరీక్ష రాయడానికి ఎంచుకున్న మాధ్యమం ప్రకారం డీఎడ్‌ కోర్సును సంబంధిత భాషలో పూర్తి చేసుకోవచ్చు. డీఈఈ సెట్‌లో సాధించిన మార్కుల ఆధారంగా రిజర్వేషన్ల ప్రకారం సీట్లు కేటాయిస్తారు. 


ప్రతి జిల్లాలోనూ ప్రభుత్వ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌ (డైట్‌) నడుస్తున్నాయి. ఇవి కాకుండా ఎయిడెడ్, మైనార్టీ, ప్రైవేటు సంస్థలూ డీఎడ్‌ కోర్సు అందిస్తున్నాయి. వీటిలో ఏ సంస్థలో ప్రవేశానికైనా డీఈఈ సెట్‌ రాయాల్సిందే. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో కనీస అర్హత మార్కులు (35) సాధించడం తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీలకు మినహాయింపు లభిస్తుంది. 85 శాతం సీట్లు స్థానికులతో భర్తీ చేస్తారు. మిగిలిన 15 శాతం సీట్లకు అందరూ పోటీపడవచ్చు. కౌన్సెలింగ్‌తో సీట్లు కేటాయిస్తారు. ప్రభుత్వ డైట్లలో వంద శాతం, మిగిలిన సంస్థల్లో 80 శాతం సీట్లు కన్వీనర్‌ కోటాలో కేటగిరీ ఎ కింద భర్తీ చేస్తారు. ప్రైవేటు, మైనార్టీ సంస్థల్లో 20 శాతం సీట్లు కేటగిరీ బిలో భర్తీ అవుతాయి. 

   


అవకాశాలిలా...


రెండేళ్ల డీఎడ్‌ కోర్సును విజయవంతంగా పూర్తిచేసుకుంటే ఉపాధ్యాయునిగా/ఉపాధ్యాయురాలిగా ఒకటి నుంచి ఐదు తరగతుల విద్యార్థులకు బోధించవచ్చు. ప్రభుత్వ పాఠశాలల్లో నియామకాల ప్రకటన వెలువడినప్పుడు సెకెండరీ గ్రేడ్‌ టీచర్‌(ఎస్‌జీటీ) పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఎస్‌జీటీ అవకాశం వచ్చినవారు మొదటి నెల నుంచే రూ.30 వేలకు పైగా వేతనం అందుకుంటున్నారు. డీఎడ్‌ పూర్తయిన తర్వాత కేంద్రీయ విద్యా సంస్థల్లో ప్రైమరీ టీచర్‌ (పీఆర్‌టీ) పోస్టులకు పోటీ పడవచ్చు. దీనికోసం సీటెట్‌లో ఉత్తీర్ణత సాధించాలి. అనంతరం ప్రకటన వెలువడినప్పుడు పరీక్షలో చూపిన ప్రతిభతో అవకాశం లభిస్తుంది. వీరు రూ.35,400 మూలవేతనం పొందవచ్చు. డీఏ, హెచ్‌ఆర్‌ఏ, అన్నీ కలిపి ప్రారంభంలోనే రూ.50 వేలకు పైగా అందుకోవచ్చు.


డీఎడ్‌ విద్యార్హతతోనే పేరొందిన ప్రైవేటు విద్యాసంస్థల్లో ఆకర్షణీయ వేతనంతో బోధన రంగంలో రాణించగలరు. డీఎడ్‌లో పొందిన మార్కుల శాతం, సీటెట్‌ స్కోరు, ఆంగ్ల ప్రావీణ్యం వీటి ఆధారంగా వేతనం   ఆధారపడి ఉంటుంది. పేరున్న విద్యాసంస్థలు రూ.30వేల వరకు వీరికి జీతం అందిస్తున్నాయి. డీఎడ్‌ తర్వాత వీరు నేరుగా లేదా దూరవిద్యలో బీఏ/బీఎస్సీ... తదితర కోర్సులు పూర్తిచేసుకోవచ్చు. అలాగే రెండుమూడేళ్ల బోధనానుభవంతో దూరవిద్యలో బీఎడ్‌ చదివే అవకాశమూ వీరికి ఉంది. ఎస్‌జీటీగా చేరినవారు అనుభవం, విద్యార్హతలతో స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ) కావచ్చు.  

   


డీఈఈ సెట్‌ ఏపీ..


వంద మార్కుల ప్రశ్నపత్రంలో రెండు భాగాలుంటాయి. పార్ట్‌ ఎలో 60, పార్ట్‌ బిలో 40 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. పార్ట్‌ ఎలో టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌ 5, జనరల్‌ నాలెడ్జ్‌ 5, ఇంగ్లిష్‌ 5, తెలుగు 5, ఆప్షనల్‌ లాంగ్వేజ్‌ (తెలుగు, ఇంగ్లిష్, తమిళం, ఉర్దూల్లో ఏదో ఒకటి) 10, మ్యాథ్స్‌ 10, జనరల్‌ సైన్స్‌ 10, సోషల్‌ స్టడీస్‌ 10 ప్రశ్నలు వస్తాయి. సబ్జెక్టు, లాంగ్వేజ్‌ ప్రశ్నలన్నీ 6 నుంచి పదో తరగతి సిలబస్‌లో ఉన్న అంశాల నుంచే అడుగుతారు. పార్ట్‌ బి అభ్యర్థి ఇంటర్మీడియట్‌లో చదివిన గ్రూపు, ఎంచుకున్న విభాగం బట్టి మారుతుంది. మ్యాథ్స్‌/ ఫిజికల్‌ సైన్స్‌/ బయాలజీ/ సోషల్‌ స్టడీస్‌లో 40 ప్రశ్నలు ఇంటర్మీడియట్‌ పాఠ్యాంశాల నుంచే అడుగుతారు. మ్యాథ్స్‌ తీసుకున్నవారికి మొదటి ఏడాది నుంచి 20, రెండో సంవత్సరం నుంచి 20 ప్రశ్నలు వస్తాయి. ఫిజికల్‌ సైన్స్‌ ఎంచుకుంటే ఫిజిక్స్‌ 20, కెమిస్ట్రీ 20 ప్రశ్నలు అడుగుతారు. బయాలజీ వారికి బోటనీ 20, జువాలజీ 20 ప్రశ్నలు ఉంటాయి. సోషల్‌ స్టడీస్‌లో హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్‌ ఒక్కో సబ్జెక్టు నుంచి 13 లేదా 14 ప్రశ్నలు చొప్పున మొత్తం 40 వస్తాయి. పరీక్ష తెలుగు, ఇంగ్లిష్, తమిళం, ఉర్దూ మాధ్యమాల్లో నిర్వహిస్తారు. అభ్యర్థి నచ్చిన మాధ్యమం ఎంచుకోవచ్చు.

   


సన్నద్ధత 

ఈ పరీక్షలో విజయానికి ఇంటర్మీడియట్‌ సిలబస్‌పై పట్టు తప్పనిసరి. అభ్యర్థి ఎంచుకున్న గ్రూపు ప్రకారం ఇంటర్‌ పాఠ్యపుస్తకాలు బాగా చదవాలి. పరీక్షలో ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సమాన ప్రాధాన్యం ఉంది. అందువల్ల రెండేళ్ల పాఠ్యపుస్తకాలపైనా సమానంగా శ్రద్ధ వహించాలి. వీటిని చదివిన తర్వాత పాత ప్రశ్నపత్రాలను అధ్యయనం చేయాలి. పాఠ్యాంశాలవారీ లభిస్తోన్న ప్రాధాన్యం, ప్రశ్నల స్థాయి గమనించాలి. అందుకు తగ్గట్టు మరోసారి సన్నద్ధం కావాలి. వీలైనన్ని మాదిరి ప్రశ్నలు, మోడల్‌ పేపర్లను సాధన చేయాలి. సంబంధిత గ్రూపుల వారీ రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజీల ప్రశ్నపత్రాలు అధ్యయనంలో ఉపయోగపడతాయి. పార్ట్‌ ఎలో సబ్జెక్టు ప్రశ్నలకు హైస్కూలు 8,9,10 తరగతుల మ్యాథ్స్, సైన్స్, సోషల్, తెలుగు, ఇంగ్లిష్‌ పుస్తకాలు బాగా చదివితే ఎక్కువ మార్కులు పొందవచ్చు. 

సీట్ల కేటాయింపు: ఏపీలో ఇంటర్మీడియట్‌లో చదివిన గ్రూపుల వారీ డైట్లలో సీట్లు కేటాయిస్తారు. మ్యాథ్స్, ఫిజికల్‌ సైన్స్, బయలాజికల్‌ సైన్స్, సోషల్‌ స్టడీస్‌ ఒక్కో విభాగానికి 25 శాతం చొప్పున సీట్లు లభిస్తాయి. మ్యాథ్స్, ఫిజికల్‌ సైన్స్‌ సీట్లకు ఎంపీసీ;  బయలాజికల్‌ సైన్స్‌ సీట్లకు బైపీసీ, సోషల్‌ స్టడీస్‌ సీట్లకు సీఈసీ, హెచ్‌ఈసీ గ్రూపుల వారు పోటీపడవచ్చు. ఏపీలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక్కో దాంట్లో 50 చొప్పున 33 డైట్‌ల్లో 1650 సీట్లు ఉన్నాయి. 

   


డీఈఈ సెట్‌ తెలంగాణ...


ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున వంద మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. అభ్యర్థులు తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మాధ్యమాల్లో పరీక్ష రాసుకోవచ్చు. ఇందులో మొత్తం 3 విభాగాలు ఉంటాయి. పార్ట్‌-1లో జనరల్‌ నాలెడ్జ్, టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌ 10 ప్రశ్నలు వస్తాయి. పార్ట్‌-2లో తెలుగు మీడియంలో పరీక్ష రాసేవారికి జనరల్‌ ఇంగ్లిష్‌ 10, జనరల్‌ తెలుగు 20 ప్రశ్నలు వస్తాయి. అదే ఇంగ్లిష్‌ మీడియం అయితే జనరల్‌ ఇంగ్లిష్‌ 20, జనరల్‌ తెలుగు 10 ప్రశ్నలు ఉంటాయి. పార్ట్‌-3లో మ్యాథ్స్‌ 20, ఫిజికల్‌ సైన్సెస్‌ 10, బయలాజికల్‌ సైన్సెస్‌ 10, సోషల్‌ స్టడీస్‌ 20 చొప్పున ప్రశ్నలు వస్తాయి. 

   


సన్నద్ధత 


సబ్జెక్టు, లాంగ్వేజ్‌ ప్రశ్నలన్నీ తెలంగాణ పదో తరగతి సిలబస్‌ స్థాయిలోపే ఉంటాయి. అందువల్ల 6 నుంచి 10 తరగతుల పాఠ్యపుస్తకాలు బాగా చదువుకుంటే సరిపోతుంది. ఇంటర్మీడియట్‌ పాఠ్యాంశాలు చదవాల్సిన పనిలేదు. తెలంగాణ డీఈఈసెట్‌ పాత ప్రశ్నపత్రాలు అధ్యయనం చేయాలి. ఆర్‌జేసీ, పాలిటెక్నిక్‌ పాత ప్రశ్నపత్రాలు, మోడల్‌ పేపర్లు సన్నద్ధతలో ఉపయోగపడతాయి. పరీక్షకు ముందు వీలైనన్ని మాక్‌ టెస్టులు రాయాలి. డీఈఈ సెట్‌లో సాధించిన స్కోరు, రిజర్వేషన్ల ప్రకారం సీట్లు కేటాయిస్తారు. ఇంటర్మీడియట్‌లో చదివిన గ్రూపుతో సంబంధం లేదు. నమూనా పరీక్ష వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. పరీక్షకు ముందు దాన్ని రాస్తే అవగాహన పెరుగుతుంది. 


అర్హత: 50శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 శాతం. ఒకేషనల్‌ విద్యార్థులు అనర్హులు. సెప్టెంబరు 1 నాటికి 17 ఏళ్లు నిండాలి. గరిష్ఠ వయః పరిమితి లేదు. 


ముఖ్య తేదీలు

ఏపీ

దరఖాస్తులు: మే 27లోగా ఫీజు చెల్లించి, మే 28 లోపు దరఖాస్తు చేసుకోవాలి. 

పరీక్షలు: జూన్‌ 12, 13 తేదీల్లో 

వెబ్‌సైట్‌: https://apdeecet.apcfss.in/


తెలంగాణ

దరఖాస్తులు: మే 22 వరకు స్వీకరిస్తారు

పరీక్ష తేదీ: జూన్‌ 1

వెబ్‌సైట్‌: http://deecet.cdse.telangana.gov.in/

    

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఇంటర్‌తో 1600 కేంద్ర కొలువులు

‣ బోధన ఉద్యోగాలకు తొలి మెట్టు.. నెట్‌

‣ ఆయుధాలు చేపట్టి.. ఆంగ్లేయులను అదరగొట్టి!

‣ నలంద వర్సిటీలో పీజీ, పీహెచ్‌డీ అడ్మిషన్లు

Posted Date: 17-05-2023


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌