• facebook
  • whatsapp
  • telegram

మెడికల్‌ డివైజెస్‌ కోర్సులకు డిమాండ్‌

* వైద్య రంగంలో కీలక పాత్ర 

   

దేశానికి వైద్యులు ఎంత అవసరమో... వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలూ అంతకంటే అవసరం. ఎప్పటికప్పుడు ఎదురవుతున్న కొత్త సవాళ్లను అధిగమించడానికి ఆరోగ్య పరికరాల తయారీ జరుగుతూనే ఉండాలి. అనారోగ్యాన్ని గుర్తించడంలో, దాన్ని నయం చేయడంలో ఈ యంత్రాలది కీలకపాత్ర. అందుకే ప్రస్తుతం ఈ రంగంలో దేశీయ సంస్థలు అధిక సంఖ్యలో ప్రయోగాలు చేస్తున్నాయి. దీంతో ఉద్యోగావకాశాలూ పెరిగాయి. ఇందులో కెరియర్‌ గురించి మరింత విపులంగా పరిశీలిస్తే..

ఆరోగ్య పరికరాలు, యంత్రాల తయారీ ఎంత అధికంగా జరిగితే అంత ఎక్కువగా ప్రాణాలు కాపాడగలుగుతాం. మెడికల్‌ డివైజెస్‌ తయారీ - నిర్వహణలో నిపుణులు సంస్థలకు సాయపడతారు. ఈ పరికరాలు వ్యాధుల గుర్తింపు, నియంత్రణ, నివారణకు ఉపయోగపడతాయి. ప్రస్తుతం ఇది అధిక శాతం ప్రైవేటు రంగంలోనే ఉంది. వేగంగా, ప్రభావవంతంగా వైద్యం అందించడంలో ఈ డివైజెస్‌ కీలకపాత్ర పోషిస్తాయి. 

‣  ఈ రంగంలో పనిచేసే నిపుణులకు కొత్తగా వచ్చే మెడికల్‌ ప్రొడక్ట్స్‌ సర్టిఫికేషన్, మార్కెట్‌ అప్రూవల్, మేనేజ్‌మెంట్‌ వంటి విధులుంటాయి. డాక్టర్ల పనిలో ఉపయోగించే పరికరాల ఫంక్షనల్‌ టెస్టింగ్, నిర్వహణ కూడా చేస్తుంటారు. మెడికల్‌ టెక్నాలజీలో పట్టా ఉన్నవారికి ఇది సరిగ్గా సరిపోయే రంగం. ఎంతో కొంత పని అనుభవం ఉండటం ఇంకా కలిసొచ్చే అంశం. వీరికి బలమైన ఇంజినీరింగ్‌ నైపుణ్యాలతోపాటు మెడిసిన్, బయాలజీ పరిజ్ఞానం అవసరం. థర్మామీటర్‌ వంటి సాధారణ పరికరాల నుంచి అతి క్లిష్టమైన బ్రెయిన్‌ స్టిమ్యులేషన్‌ ఇంప్లాంట్స్‌ వరకూ అన్నీ ఈ కోవలోకే వస్తాయి.

   


కంపెనీలు


మనదేశంలో ఈ రంగంలో ఇప్పటికే వివిధ కంపెనీలు ఉద్యోగార్థులకు అవకాశం కల్పిస్తున్నాయి. హిందుస్థాన్‌ సిరంజెస్‌ అండ్‌ మెడికల్‌ డివైజెస్, ఆప్టో సర్క్యూట్స్, విప్రో జీఈ హెల్త్‌కేర్, 3ఎం ఇండియా, మెడ్‌ట్రోనిక్, జాన్సన్‌ అండ్‌ జాన్సన్, నోవార్తిస్‌ ఏజీ, అబోట్, జిమ్మర్‌ బయోమెట్‌ ఇండియా, ఎడ్వర్డ్స్‌ లైఫ్‌ సైన్సెస్, స్ట్రైకర్, బోస్టన్‌ సైంటిఫిక్, బీపీఎల్‌ హెల్త్‌కేర్, ట్రివిట్రోన్‌ హెల్త్‌కేర్, బయోపోర్‌ సర్జికల్స్‌ వంటి కంపెనీలెన్నో నిపుణుల కోసం ఎదురుచూస్తున్నాయి. శిక్షణ అనంతరం వీటిలో ప్రయత్నించవచ్చు.

‣ కేంద్రం 2020లో ‘ప్రొడక్షన్‌ లింక్డిన్‌ ఇన్సెంటివ్‌ (పీఎల్‌ఐ) స్కీమ్‌ ఫర్‌ మెడికల్‌ డివైజెస్‌’ మొదలుపెట్టింది. అలాగే మెడికల్‌ పార్క్స్‌ వంటివి ఏర్పాటు చేయడం ఈ రంగంలో అభివృద్ధిని మరింత వేగవంతం చేసింది. 

‣ 2020 ఆర్థిక సంవత్సరంలో మెడికల్‌ డివైజెస్‌ రంగంలో విదేశీ పెట్టుబడులు ముందు సంవత్సరంతో పోలిస్తే ఒకేసారి 98 శాతం పెరిగాయి. 2019లో రూ.1,108 కోట్లు ఉంటే, 2020లో ఇది రూ.2,196 కోట్లకు చేరింది. 

‣ నిజానికి ఇప్పుడు మనం ఈ వస్తువుల కోసం అధికశాతం విదేశీ దిగుమతులపై ఆధారపడుతున్నాం. కానీ వచ్చే ఏళ్లలో దీన్ని తగ్గించి దేశీయంగా ఉత్పత్తి చేయడం కోసం రంగం సిద్ధమవుతోంది. 2025-26 నాటికి భారత్‌ ఇందులో స్వయంప్రతిపత్తి సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.

   


అర్హత

ఈ రంగంలో ప్రవేశించేందుకు సైన్స్, బయాలజీ సంబంధిత సబ్జెక్టులు చదివి ఉండాలి. వీటికి తోడు సమస్యలను పరిష్కరించే నైపుణ్యం, కొత్త తరహా ఆలోచనలు చేయడం, ఆవిష్కరణల పట్ల ఆసక్తిగా ఉండటం అవసరం. 

   మెడికల్‌ డివైజెస్‌లో చాలా రకాలున్నాయి. హెల్త్‌కేర్‌ రంగంలో వాడే ఎటువంటి యంత్రాన్ని అయినా మెడికల్‌ డివైజ్‌ అనవచ్చు. ఎక్స్‌రే మెషీన్స్, ప్రోస్టటిక్‌ ఆర్గాన్స్, ఎంఆర్‌ఐ స్కానర్స్‌.. సిరంజిలు, గ్లోవ్స్, మాస్క్స్‌ వంటివి తయారుచేసే యంత్రాలన్నీ ఈ పరిధిలోకే వస్తాయి.

   జపాన్, చైనా, దక్షిణ కొరియాల తర్వాత ప్రపంచంలో వైద్యపరికరాల తయారీలో టాప్‌ 20 దేశాల్లో భారత్‌ 4వ స్థానంలో ఉంది. ప్రస్తుతం మన దేశంలో మెడికల్‌ డివైజెస్‌ మార్కెట్‌ విలువ దాదాపు రూ.90 వేల కోట్లు. మిగతా మార్కెట్లతో పోలిస్తే భారత్‌ ఇందులో వేగంగా ఎదుగుతోంది. 2030 నాటికి ఇది నాలుగురెట్లు పెరుగుతుందని అంచనా. భారత్‌ను ఈ మార్కెట్‌కు గ్లోబల్‌ హబ్‌గా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అంతే కాకుండా దేశీయంగా ఉత్పత్తి పెంచేలా  ప్రణాళికలు రూపొందిస్తోంది. 

   మెడికల్‌ డివైజెస్‌ కోర్సుల్లో డయాగ్నొస్టిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ వంటివి నేర్పిస్తారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, అడిక్టివ్‌ మాన్యుఫాక్చరింగ్‌ బయోసెన్సార్స్, మెడికల్‌ ఇమేజింగ్‌ అండ్‌ బయోమెడికల్‌ సిగ్నల్‌ ప్రాసెసింగ్, కాడ్‌-కామ్‌ డిజైన్, బయో మెటీరియల్స్‌ వంటివి కూడా ఇందులో భాగం. ప్రోటోటైపింగ్‌లో సరికొత్త ఆలోచనలు చేసేలా ఈ కోర్సులు సాగుతాయి.

   


ఉద్యోగావకాశాలు


ప్రస్తుతం ఈ రంగంలో అధికంగా ఉద్యోగావకాశాలున్నాయి. సాంకేతిక నైపుణ్యం, గ్రాడ్యుయేషన్‌ ఉన్నవారికి ఎక్కువ డిమాండ్‌ ఉంది. డిజైన్, కాన్సెప్ట్‌ డెవలప్‌మెంట్, క్లినికల్‌ ఇన్వెస్టిగేషన్‌ వంటి విభాగాల్లో నిపుణులు  అవసరం అవుతారు. సీడీఎస్‌సీవో, స్టేట్‌ లైసెన్సింగ్‌ అథారిటీ, నోటిఫైడ్‌ బాడీస్, ఎక్స్‌పోర్ట్‌ అథారిటీస్‌లో ఎక్కువగా వీరి అవసరం ఉంది. ఉన్నత విద్యావకాశాలకూ కొదవలేదు. మెడికల్‌ డివైజెస్‌ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా, ఎగ్జిక్యూటివ్‌ డిప్లొమా వంటివి చదవొచ్చు. ఐఐటీ మద్రాస్‌ తాజాగా మెడికల్‌ సైస్సెస్‌ అండ్‌ ఇంజినీరింగ్‌లో నాలుగేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో ప్రముఖంగా డివైజ్‌ ఆవిష్కరణలపై దృష్టిపెడతారు. ఇటువంటి డిగ్రీలు మరిన్ని ఇన్‌స్టిట్యూట్ల ద్వారా అందుబాటులో ఉన్నాయి.

   


నైపర్‌లో  కోర్సులు


నైపర్‌లో మెడికల్‌ డివైజెస్‌ డిపార్ట్‌మెంట్‌లో దీనికి సంబంధించిన కోర్సులను ప్రత్యేకంగా అందిస్తున్నారు. ఫార్మాస్యూటికల్‌ సైన్స్‌ను ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీతో కలగలిపి ప్రత్యేకమైన ఎం.టెక్‌ ప్రోగ్రామ్‌గా డిజైన్‌ చేశారు. ఇందులో అకడమిక్స్‌తోపాటుగా మెడికల్‌ డివైజ్‌ టెస్టింగ్, రిసెర్చ్‌ వంటివి జరుగుతాయి. దీంతోపాటు పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ అందుబాటులో ఉంది. మెడికల్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్, బేసిక్‌  ఎలక్ట్రానిక్స్, డివైజ్‌ ఫాబ్రికేషన్, టెస్టింగ్‌ వంటివన్నీ ఇందులో నేర్పుతారు. 


ఇంకా.. : ఈ రంగంలో కోర్సుల పరిధి ఎక్కువ. విభిన్నమైన నైపుణ్యాలు సాధన చేసే అవకాశం ఉంది. ఆన్‌లైన్‌లో ఫార్మాస్యూటికల్స్‌ అండ్‌ మెడికల్‌ డివైజ్‌ ఇన్నోవేషన్స్, ఇంట్రడక్షన్‌ టు మెడికల్‌ సాఫ్ట్‌వేర్, డిజైన్‌ ఆఫ్‌ ఎక్స్‌పరిమెంట్స్, హెల్త్‌కేర్‌ మార్కెట్‌ ప్లేస్, మెడికల్‌ టెక్నాలజీ అండ్‌ ఎవల్యూషన్, రెగ్యులేటరీ అఫైర్స్, రిస్క్‌ మేనేజ్‌మెంట్, ప్రాసెస్‌ వ్యాలిడేషన్‌... వంటి కోర్సులు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో చేసే అవకాశం ఉంది. 


- డా.యూ.ఎస్‌.ఎన్‌.మూర్తి, డైరెక్టర్‌ నైపర్, గువాహటి

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఇంటర్‌తో 1600 కేంద్ర కొలువులు

‣ బోధన ఉద్యోగాలకు తొలి మెట్టు.. నెట్‌

‣ ఆయుధాలు చేపట్టి.. ఆంగ్లేయులను అదరగొట్టి!

‣ ఇంటర్‌తో ఉపాధ్యాయ విద్య.. డీఎడ్‌

Posted Date: 17-05-2023


 

ఇంటర్ తర్వాత

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌