• facebook
  • whatsapp
  • telegram

ఇంటిగ్రేటెడ్‌ విధానంలో విభిన్న కాంబినేషన్లు

టెన్త్‌ కాగానే ఇంటర్‌... ఇంటర్‌ తర్వాత డిగ్రీ... ఆ తర్వాత పీజీ... ప్రతి దశలోనూ ఎంట్రన్సులు... స్కోర్లు.. ర్యాంకులు! చాలామందికి ఇవన్నీ ‘అబ్బా!’ అనిపిస్తాయి. కానీ ఈ పరీక్షల, మజిలీల, అడ్మిషన్‌ ఎదురుచూపుల గోల లేకుండా ఇంటర్‌ తర్వాత ఒక్కసారి సీటు కొడితే ఏకంగా పీజీతో బయటకు వచ్చే అవకాశం కల్పిస్తున్నాయి.. కొన్ని సంస్థలు! హ్యుమానిటీస్‌, ఆర్ట్స్‌, సైన్స్‌, టెక్నాలజీ, మేనేజ్‌మెంట్‌, బీఎడ్‌... ఒకటేమిటి! ఆసక్తికరమైన సబ్జెక్టుల్లో భిన్నరకాల వైవిధ్యభరితమైన ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు విద్యార్థులను స్వాగతిస్తున్నాయ్‌!

ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో చేరితే సంబంధిత సబ్జెక్టుల్లో నిష్ణాతులుగా మారడానికి అవకాశాలుంటాయి. కొన్ని ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో ఏడాది పాటు సమయమూ ఆదా అవుతుంది. ప్రస్తుతం ఐఐటీలు, ఐఐఎంలు సహా పేరున్న సంస్థలెన్నో ఇంటిగ్రేటెడ్‌ -ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంబీఏ, ఎమ్మెస్సీ ఎడ్‌, బీఏఎడ్‌, బీఎస్సీ ఎడ్‌ కోర్సులు అందిస్తున్నాయి.
 

ఐఐఎం ఇండోర్‌: ఎంబీఏ

అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రాం ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (ఐపీఎం) కోర్సును ఐఐఎం-ఇండోర్‌ అందిస్తోంది. ఈ తరహా కోర్సును అందిస్తోన్న ఏకైక ఐఐఎం ఇండోర్‌ కావడం విశేషం. కోర్సులో 120 సీట్లున్నాయి. రాతపరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. పదోతరగతి, ఇంటర్‌ల్లో కనీసం 60 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 55) శాతం మార్కులు సాధించినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ ప్రకటన వెలువడింది. 

ఆర్‌ఐఈ మైసూర్‌: బీఏఎడ్‌ / బీఎస్సీఎడ్‌

డిగ్రీ కోర్సులతో కలిపి బీఎడ్‌ అందిస్తోంది మైసూర్‌లోని ప్రాంతీయ విద్యా సంస్థ (ఆర్‌ఐఈ). ఇందులో నాలుగేళ్ల బీఏ ఎడ్‌, బీఎస్సీఎడ్‌ కోర్సుల్లో చేరిపోవచ్చు. ఇంటర్‌ ఆర్ట్స్‌, సైన్స్‌ కోర్సుల్లో ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష ద్వారా ఎంపికచేస్తారు. ఆర్‌ఐఈ మైసూర్‌లో బీఎస్సీ బీఎడ్‌ (ఎంపీసీ)లో 40, బీఎస్సీ బీఎడ్‌ (బైపీసీ)లో 40, బీఏబీఎడ్‌ 40 చొప్పున సీట్లున్నాయి. ఇవన్నీ నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు. ఇదే సంస్థ ఆరేళ్ల వ్యవధితో ఎమ్మెస్సీ ఎడ్‌ మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో అందిస్తోంది. వీటికి ఇంటర్‌ ఎంపీసీ గ్రూప్‌లో 45 (ఎస్సీ, ఎస్టీలు 40) శాతం మార్కులతో ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ ప్రకటన కొద్ది రోజుల్లో వెలువడుతుంది.
అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీ, బెంగళూరు నాలుగేళ్ల బీఎస్సీ ఎడ్‌ కోర్సును బయలాజికల్‌ సైన్సెస్‌, ఫిజికల్‌ సైన్సెస్‌, మ్యాథమెటిక్స్‌ విభాగాల్లో అందిస్తోంది. వీటిలో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. ఇంటిగ్రేటెడ్‌ బీఏబీఎడ్‌ కోర్సు జమ్మూ, సౌత్‌ బిహార్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలు అందిస్తున్నాయి. ఇంటిగ్రేటెడ్‌ బీఎస్సీ బీఎడ్‌ (మ్యాథ్స్‌) సెంట్రల్‌ యూనివర్సిటీ తమిళనాడు, సౌత్‌ బిహార్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలు అందిస్తున్నాయి. ప్రవేశాలు సీయూసెట్‌తో లభిస్తాయి. ప్రకటన వెలువడింది.

 

హెచ్‌సీయూ: ఆర్ట్స్‌, హ్యుమానిటీస్‌, సైన్సెస్‌

ఏ గ్రూప్‌తోనైనా ఇంటర్‌ ఉత్తీర్ణులైనవారికి ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ హెల్త్‌ సైకాలజీ, ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ (హ్యుమానిటీస్‌): తెలుగు, హిందీ, లాంగ్వేజ్‌ సైన్సెస్‌; ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ (సోషల్‌ సైన్సెస్‌): ఎకనామిక్స్‌, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌, సోషియాలజీ, ఆంత్రోపాలజీ కోర్సులను హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ అందిస్తోంది. ఈ కోర్సులకు 60 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ మ్యాథమెటికల్‌ సైన్సెస్‌, ఫిజిక్స్‌, కెమికల్‌ సైన్సెస్‌, సిస్టమ్స్‌ బయాలజీ కోర్సులకు ఇంటర్‌ సైన్స్‌ గ్రూప్‌ల్లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించినవారు అర్హులు. ఆరేళ్ల వ్యవధితో ఎమ్మెస్సీ ఆప్టోమెట్రీ అండ్‌ విజన్‌ సైన్సెస్‌ కోర్సు హెచ్‌సీయూలో అందిస్తున్నారు. ఇంటర్‌ సైన్స్‌ గ్రూప్‌ల్లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులు అర్హులు. పరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా ప్రవేశాలు లభిస్తాయి. ప్రకటన మరికొద్ది రోజుల్లో వెలువడుతుంది.
 

ఐఐటీ మద్రాస్‌: ఎంఏ

ఐఐటీ-మద్రాస్‌ ఎంఏ-డెవలప్‌మెంట్‌ స్టడీస్‌, ఎంఏ-ఇంగ్లిష్‌ స్టడీస్‌లను ఇంటర్‌ విద్యార్హతతో అందిస్తోంది. హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (హెచ్‌ఎస్‌ఈఈ) ద్వారా కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. ఒక్కో కోర్సుకీ 23 మంది చొప్పున మొత్తం 46 మంది విద్యార్థులను చేర్చుకుంటారు. వ్యవధి అయిదేళ్లు.

మన తెలుగు రాష్ట్రాల్లో ...

ఉస్మానియా యూనివర్సిటీ: ఎం.ఎ. ఎకనమిక్స్‌, ఎమ్మెస్సీ - కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ, ఎంబీఏ  

తెలంగాణ యూనివర్సిటీ: అప్లయిడ్‌ ఎకనామిక్స్‌, ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ, ఎంబీఏ

పాలమూరు యూనివర్సిటీ, మహబూబ్‌ నగర్‌: ఎమ్మెస్సీ కెమిస్ట్రీ

కాకతీయ యూనివర్సిటీ: ఎమ్మెస్సీ: కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ

మహాత్మాగాంధీ యూనివర్సిటీ: ఎంబీఏ, ఎమ్మెస్సీ ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ

ఆంధ్రా యూనివర్సిటీ: ఎమ్మెస్సీ: జియాలజీ, అప్లయిడ్‌ కెమిస్ట్రీ

ఆచార్య నాగార్జున: ఎమ్మెస్సీ నానో టెక్నాలజీ

యోగి వేమన యూనివర్సిటీ, కడప: ఎమ్మెస్సీ -బయోటెక్నాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్‌, ఎర్త్‌ సైన్సెస్‌

ప్రముఖ సంస్థల్లో...

టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ (టిస్‌) తుల్జాపూర్‌ క్యాంపస్‌లో బీఏ ఆనర్స్‌ సోషల్‌ వర్క్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ స్పెషలైజేషన్‌తో అందిస్తోంది. ఇదే క్యాంపస్‌లో బీఏ సోషల్‌ సైన్సెస్‌ కోర్సు చదువుకోవచ్చు. గువాహతి క్యాంపస్‌లోనూ బీఏ సోషల్‌ సైన్సెస్‌ కోర్సు ఉంది.
బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ఆర్ట్స్‌ కోర్సులను జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ఆర్ట్స్‌ యూనివర్సిటీ, ఆంధ్రా యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ అందిస్తున్నాయి.
ఇంటర్‌ తర్వాత లా కోర్సులను ఇంటిగ్రేటెడ్‌ విధానంలో చదువుకోవచ్చు. జాతీయస్థాయిలో క్లాట్‌, రాష్ట్ర స్థాయుల్లో లా సెట్‌ ద్వారా పలు సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది.
అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీ, బెంగళూరులో బీఏ: ఎకనామిక్స్‌, హ్యుమానిటీస్‌; బీఎస్సీ: ఫిజిక్స్‌, బయాలజీ, మ్యాథమెటిక్స్‌ కోర్సులు ఉన్నాయి. వీటిలో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది.
శ్రీ సత్యసాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ లెర్నింగ్‌ ఇంటర్‌ విద్యార్థులకు బీఏ, బీకాం, బీబీఏ బీఎస్సీల్లో పలు కోర్సులు అందిస్తోంది.
జేఎన్‌యూ న్యూదిల్లీ ఆనర్స్‌ విధానంలో పలు విదేశీ భాషలను బీఏ కోర్సు ద్వారా అందిస్తోంది.

ఐఐటీ మద్రాస్‌లో ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ

ఇంటర్‌ తరువాత ఐఐటీల్లో ఇంజినీరింగ్‌ కాకుండా ఇతర కోర్సు చదవాలనుకునేవారికి శుభవార్త! అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ ప్రోగ్రామ్‌ ద్వారా ఐఐటీ మద్రాస్‌ ఈ అవకాశాన్ని కల్పిస్తోంది. 
ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, మద్రాస్‌ (ఐఐటీఎం) అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ మాస్టర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ (ఎంఏ) ప్రోగ్రాముల్లో ప్రవేశాలను కల్పిస్తోంది. హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (హెచ్‌ఎస్‌ఈఈ) ద్వారా ఈ ప్రోగ్రామ్‌ల్లోకి ప్రవేశం పొందొచ్చు. ఇది జాతీయస్థాయి పరీక్ష. హ్యుమానిటీస్‌పై ఆసక్తి ఉన్నవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు.అయిదేళ్లు పూర్తయ్యేనాటికి ప్రతి విద్యార్థీ 521 క్రెడిట్లను సంపాదించాల్సి ఉంటుంది. రెండు విభాగాల్లో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 1. ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ ఇన్‌ డెవలప్‌మెంట్‌ స్టడీస్‌ 2. ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ ఇన్‌ ఇంగ్లిష్‌ స్టడీస్‌.
గుర్తింపు పొందిన సంస్థ/ విశ్వవిద్యాలయం నుంచి ఇంటర్మీడియట్‌ లేదా రెండేళ్ల ప్రీ యూనివర్సిటీ ఎగ్జామ్‌ పూర్తిచేసినవారు అర్హులు.
నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీకి చెందిన జాయింట్‌ సర్వీసెస్‌ వింగ్‌ నిర్వహించే రెండేళ్ల కోర్సు తుది పరీక్షలు రాయబోయేవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు కనీసం 60% మార్కులు సాధించి ఉండాలి. ఎస్‌సీ, ఎస్‌టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు కనీసం 55% మార్కులు సాధించి ఉండాలి.
దరఖాస్తులను ఆన్‌లైన్‌లో (http://hsee.iitm.ac.in) లో పూర్తిచేయాలి.  మొదటి మూడు సెమిస్టర్లలో విద్యార్థుల అకడమిక్‌ ప్రదర్శన (సీజీపీఏ) ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.

పరీక్ష విధానం

పరీక్ష వ్యవధి 3 గంటలు. రెండు విభాగాలుగా ఉంటుంది. పార్ట్‌-1 కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష. ప్రశ్నలు మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలో ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి 2.30 గంటలు. దీనిలో ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌, అనలిటికల్‌ అండ్‌ క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ, జనరల్‌ స్టడీస్‌, ఎన్విరాన్‌మెంట్‌ ఎకాలజీలపై ప్రశ్నలుంటాయి. పార్ట్‌-2 ఆఫ్‌లైన్‌ పరీక్ష. దీనిలో అభ్యర్థి జనరల్‌ అంశంపై ఎస్సే రాయాల్సి ఉంటుంది. సమయం 30 నిమిషాలు. ప్రశ్నపత్రం ఆంగ్లంలోనే ఉంటుంది. పరీక్షను అహ్మదాబాద్‌, బెంగళూరు, భువనేశ్వర్‌, చెన్నై, కోయంబత్తూరు, గువాహటి, హైదరాబాద్‌, ఇండోర్‌, జమ్మూ, కొచ్చి, కోల్‌కతా, లఖ్‌నవూ, ముంబయి, న్యూదిల్లీ, పట్నా, తిరువనంతపురాల్లో నిర్వహిస్తారు.

Posted Date: 19-10-2021


 

ఇంటర్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌