• facebook
  • whatsapp
  • telegram

ఇంటర్‌తో చేరి..పీజీతో బయటికి!

ఇంజినీరింగ్‌, మెడిసిన్‌.. ఇంతకంటే వేరే చదువులు లేవా? ఐఐటీలు, ఐఐఎంలూ అందరికీ అందే పరిస్థితి లేదు కదా! ఇప్పుడేం చేయాలి... ఇంటర్‌ తర్వాత ఏ కోర్సులో చేరాలి? విద్యార్థులనూ, తల్లిదండ్రులనూ పదే పదే వేధించే ప్రశ్నలు ఇవి. మంచి వసతులు, మెరుగైన బోధనతో మరెన్నో విశిష్ట సంస్థలు మన దేశంలో ఉన్నాయి. ఇంటర్‌ విద్యార్హతతో ఇంటిగ్రేటెడ్‌- ఎంబీఏ, ఇంటిగ్రేటెడ్‌ బీఎడ్‌, ఇంటిగ్రేటెడ్‌ పీజీ, విదేశీ భాషల వంటి వైవిధ్య కోర్సులను ఆ సంస్థలు అందిస్తున్నాయి.

 

నేరుగా ఐఐఎంలోకి!

అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రాం ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (ఐపిఎం) కోర్సును ఐఐఎం -ఇండోర్‌ అందిస్తోంది. ఈ తరహా కోర్సును అందిస్తోన్న ఏకైక ఐఐఎం ఇండోర్‌ ఒక్కటే కావడం విశేషం. కోర్సులో 120 సీట్లు ఉన్నాయి. రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు మూడేళ్ల కోర్సు అనంతరం క్యాట్‌ ద్వారా పీజీపీ కోర్సుల్లో చేరినవారికి ఉండే కరిక్యులం బోధిస్తారు. భవిష్యత్తులో ఎంబీఏ చదవాలనుకునే ఇంటర్‌ విద్యార్థులు ఐఐఎం ఇండోర్‌ అందించే ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ కోసం ప్రయత్నించవచ్చు.
అర్హత: పదోతరగతి, ఇంటర్లో కనీసం 60 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 55) శాతం మార్కులు సాధించాలి.

 

సీయూ సెట్‌

ఇంటర్‌ అర్హతతోనే కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో చదువుకునే అవకాశం ఉంది. ఒకే పరీక్షతో పదకొండు ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ప్రవేశానికి మార్గం కల్పిస్తోంది సెంట్రల్‌ యూనివర్సిటీస్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (సీయూసెట్‌).

ప్రవేశం కల్పించే కేంద్రీయ సంస్థలు: హర్యానా, జమ్మూ, కర్ణాటక, కశ్మీర్‌, కేరళ, పంజాబ్‌, రాజస్థాన్‌, సౌత్‌ బిహార్‌, తమిళనాడు. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌-బెంగళూరు.

కోర్సులు: ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ (కర్ణాటక సెంట్రల్‌ యూనివర్సిటీ), బీటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రికల్‌, సివిల్‌, ప్రింటింగ్‌ అండ్‌ ప్యాకేజింగ్‌ టెక్నాలజీ) హర్యానా సెంట్రల్‌ యూనివర్సిటీ అందిస్తోంది. ఇంటిగ్రేటెడ్‌ బీఎస్సీ బీఎడ్‌ కోర్సు తమిళనాడు సెంట్రల్‌ యూనివర్సిటీ, ఇంటిగ్రేటెడ్‌ బీఎస్సీ బీఎడ్‌, ఇంటిగ్రేటెడ్‌ బీఏ బీఎడ్‌ కోర్సులను సౌత్‌ బిహార్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలు నిర్వహిస్తున్నాయి. ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ: ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, జువాలజీ, లైఫ్‌ సైన్సెస్‌, బయోకెమిస్ట్రీ, బయెటెక్నాలజీ, బోటనీ, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌, సైకాలజీ, జాగ్రఫీ, జియాలజీ, ఎకనామిక్స్‌ ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ: ఇంగ్లిష్‌, ఎకనామిక్స్‌; ఇంటిగ్రేటెడ్‌ బీఏ ఎల్‌ఎల్‌బీ, బీఎస్సీ: టెక్స్‌టైల్స్‌, బీఏ: ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌ బ్యాచిలర్‌ ఆఫ్‌ వొకేషనల్‌

స్టడీస్‌: బయో మెడికల్‌ సైన్సెస్‌, ఇండస్ట్రియల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, రిటైల్‌ మేనేజ్‌ మెంట్‌, టూరిజం మేనేజ్‌మెంట్‌, బీపీఏ: మ్యూజిక్‌, బ్యూటీ అండ్‌ వెల్‌నెస్‌లో డిప్లొమా, క్రాఫ్ట్స్‌ అండ్‌ డిజైన్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

 

విదేశీ భాషలకు ఇఫ్లూ

ఏదో ఒక విదేశీ భాషపై ప్రావీణ్యం ఉంటే ఉద్యోగం ఖాయమైనట్టే. సాఫ్ట్‌ వేర్‌, బీపీవో, కేపీవో, ఎల్‌పీవో, మెడికల్‌ ట్రాన్స్‌క్రిప్షన్‌...ఇలా అన్ని రంగాలు, విభాగాల్లో విదేశీ భాషలు వచ్చినవాళ్లకు ప్రాధాన్యం పెరిగింది. జర్మన్‌, స్పానిష్‌, ఫ్రెంచ్‌, ఇటాలియన్‌, పర్షియన్‌, చైనీస్‌...ఇలా ఏదో ఒక భాషలో నైపుణ్యం పెంచుకుంటే సుస్థిర కొలువును సొంతం చేసుకోవచ్చు. ఈ కోర్సులకు దేశంలోనే ఉత్తమ వేదిక ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ (ఇఫ్లూ)- హైదరాబాద్‌. దీనికి లఖ్‌నవ్‌, షిల్లాంగ్‌ల్లోనూ క్యాంపస్‌లు ఉన్నాయి.

కోర్సులు, అర్హతలు: ఇంగ్లిష్‌, అరబిక్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌, జపనీస్‌, రష్యన్‌, స్పానిష్‌ విభాగాల్లో బీఏ (ఆనర్స్‌), జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌లో బీఏ కోర్సులు ఉన్నాయి. అర్హత ఇంటర్‌ ఉత్తీర్ణత. ప్రస్తుతం ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నవాళ్లూ దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్‌ బేస్డ్‌ విధానంలో ఆబ్జెక్టివ్‌ పరీక్ష ద్వారా ప్రవేశం లభిస్తుంది. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉచిత వసతి కల్పిస్తారు. భోజన ఖర్చులు భరించడానికి నెలకు రూ.వెయ్యి స్టైపెండ్‌ చెల్లిస్తారు.

వెబ్‌ సైట్‌: www.efluniversity.ac.in

 

అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీ

అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీ రెసిడెన్షియల్‌ విధానంలో ఈ ఏడాది నుంచి కొత్తగా బీఎస్సీ బీఎడ్‌ డ్యూయల్‌ డిగ్రీ కోర్సు నాలుగేళ్ల వ్యవధితో అందిస్తోంది. బైపీసీ, ఎంపీసీ స్ట్రీమ్‌ల్లో ఈ కోర్సు నిర్వహిస్తారు. మూడేళ్ల బీఏ, బీఎస్సీ కోర్సులు ముందు నుంచీ ఉన్నాయి. ఎంపికైన విద్యార్థులు ఫిజిక్స్‌, బయాలజీ, ఎకనామిక్స్‌, హ్యుమానిటీస్‌ల్లో ఒకదాన్ని స్పెషలైజేషన్‌గా తీసుకోవచ్చు. ఇంటర్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్షలో చూపిన ప్రతిభ, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులకు ప్రవేశాలు లభిస్తాయి. ఈ సంస్థలో ప్రవేశం లభించినవారికి ఫీజు, వసతుల నుంచి పూర్తి మినహాయింపు లేదా రాయితీ లభిస్తుంది. అవసరమైనవారికి రుణ సౌకర్యం కూడా కల్పిస్తారు.

వెబ్‌సైట్‌: http://azimpremjiuniversity.edu.in

 

ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌

స్టాటిస్టిక్స్‌, మ్యాథ్స్‌, ఎకనామిక్స్‌ కోర్సులపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దృష్టిసారించాల్సిన సంస్థల్లో ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐఎస్‌ఐ) ప్రధానమైంది. డిగ్రీ కోర్సుల్లో చేరినవారికి నెలకు రూ. 3 వేలు స్టైపెండ్‌ను ఇక్కడ చెల్లిస్తారు. ప్రవేశపరీక్షలో చూపిన ప్రతిభ, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఇంటర్‌ విద్యార్థులకు బీస్టాట్‌, బీమ్యాథ్స్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ సంస్థ కేంద్ర కార్యాలయం కోల్‌కతాలో ఉంది. దిల్లీ, బెంగళూరు, చెన్నై, తేజ్‌పూర్‌ల్లో శాఖలున్నాయి. అలాగే కోయంబతూర్‌, హైదరాబాద్‌, ముంబై, పుణెల్లో నెట్‌ వర్క్‌ కార్యాలయాలు ఉన్నాయి.

వెబ్‌సైట్‌: www.isical.ac.in

 

ఐఐఎస్‌ఈఆర్‌లో బీఎస్‌ - ఎంఎస్‌

ఇంటర్‌ ఎంపీసీ, బైపీసీ విద్యార్థులను పరిశోధనల దిశగా నడిపించడానికి ఏర్పాటుచేసినవే ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఐఐఎస్‌ఈఆర్‌)లు. కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఏడు చోట్ల తిరుపతి, బరంపురం, భోపాల్‌, కోల్‌కతా, మొహాలీ, పుణె, తిరువనంతపురంలో వీటిని నిర్వహిస్తున్నారు. బీఎస్‌-ఎంఎస్‌ పేరుతో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు ఇక్కడ అందిస్తున్నారు. వీటిలోకి మూడు మార్గాల ద్వారా ప్రవేశం లభిస్తుంది. ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ర్యాంకు సాధించినవాళ్లు, ఇన్‌స్పైర్‌ ఫెలోషిప్‌కు ఎంపికైనవారు ప్రవేశ పరీక్ష రాయకుండానే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రెండూ లేనివారికి అడ్మిషన్‌ టెస్ట్‌తో అవకాశం కల్పిస్తారు. అలాగే జేఈఈ ర్యాంకర్లు, ఇన్‌స్పైర్‌ ఫెలోషిప్‌కు ఎంపికైనవాళ్లు సైతం ఐఐఎస్‌ఈఆర్‌ నిర్వహించే పరీక్ష రాసుకోవచ్చు. సగం సీట్లు జేఈఈ ర్యాంకులు, ఇన్‌స్పైర్‌ ఫెలోషిప్పులకు ఎంపికైనవారితో భర్తీ చేస్తారు. మిగతా సగం సీట్లు పరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా కేటాయిస్తారు. ఏడు సంస్థల్లోనూ కలిపి 1285 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సంస్థల్లో చేరిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రతినెలా రూ.అయిదు వేలు స్కాలర్‌షిప్‌ అందిస్తారు.

బీఎస్‌ - ఎంఎస్‌ కోర్సులు: బయలాజికల్‌ సైన్సెస్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌, కెమిస్ట్రీ, ఎర్త్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సెస్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్స్‌, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌.

సీట్ల వివరాలు: ఐఐఎస్‌ఈఆర్‌: బరంపురం-100, భోపాల్‌ - 260, కోల్‌కతా - 200, మొహాలీ - 200, పుణె - 200, తిరువనంతపురం - 200, తిరుపతి - 125

బీఎస్‌ ఎకనామిక్స్‌: భోపాల్‌ ఐఐఎస్‌ఈఆర్‌ బీఎస్‌ ఎకనామిక్‌ సైన్సెస్‌ పేరుతో 2017 నుంచీ నాలుగేళ్ల కోర్సు అందిస్తోంది. కోర్సు అనంతరం మరో ఏడాది చదువు పూర్తిచేస్తే ఎంఎస్‌ డిగ్రీనీ ప్రదానం చేస్తుంది. ఇంటర్లో మ్యాథ్స్‌ చదువుకున్నవారు ఈ కోర్సుకి దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హత: సైన్సు సబ్జెక్టులతో ఇంటర్‌ ఉత్తీర్ణులైనవారు, చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

వెబ్‌సైట్‌:www.iiseradmission.in

 

ఐఐఎస్సీలో బీఎస్సీ (రిసెర్చ్‌)

పరిశోధనల దిశగా అడుగులేయాలని ఆశించే విద్యార్థులకు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ నాలుగేళ్ల వ్యవధితో బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ (రిసెర్చ్‌) కోర్సులు నిర్వహిస్తోంది. కోర్సులో చేరినవాళ్లు ఏదైనా సైన్స్‌ సబ్జెక్టును ప్రత్యేకంగా చదువుకుంటారు. అలాగే ప్రతి విద్యార్థీ ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, బయాలజీ, ఇంజినీరింగ్‌, హ్యుమానిటీస్‌ అంశాలు చదవడం తప్పనిసరి. నాలుగేళ్లలో ఎనిమిది సెమిస్టర్లు ఉంటాయి. ఇందులో మొదటి మూడు సెమిస్టర్లు అందరికీ ఉమ్మడిగా ఉంటాయి. అభ్యర్థులు తీసుకున్న స్పెషలైజేషన్‌ను తర్వాత మూడు సెమిస్టర్లలో పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తారు. నాలుగో ఏట పరిశోధన దిశగా ఫ్యాకల్టీ పర్యవేక్షణలో ప్రాజెక్టు చేస్తారు. నాలుగేళ్ల తర్వాత కావాలనుకుంటే ఐఐఎస్సీలోనే మరో ఏడాది చదివితే పీజీ పట్టా అందుకోవచ్చు. అనంతరం పీహెచ్‌డీ చేయవచ్చు.

 

స్పెషలైజేషన్లు: కోర్సులో చేరినవాళ్లు ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, బయాలజీ, మెటీరియల్స్‌, ఎర్త్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ వీటిలో ఏ సబ్జెక్టునైనా స్పెషలైజేషన్‌ గా తీసుకోవచ్చు. ఇంజినీరింగ్‌ నుంచి ఒక ఎలెక్టివ్‌ కోర్సు, హ్యుమానిటీస్‌లో ఒక సెమినార్‌ కోర్సు తీసుకోవడం తప్పనిసరి. కోర్సు పూర్తయిన తర్వాత డిగ్రీలను అభ్యర్థులు తీసుకున్న మేజర్‌ డిసిప్లిన్‌ పేరుతో ప్రదానం చేస్తారు. కోర్సులోకి మొత్తం 120 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారు. ఎంపికైనవారికి ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. తక్కువ ధరకు వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తారు.

అర్హత: ఎంపీసీ గ్రూప్‌తోలో ఇంటర్‌ పూర్తిచేసినవాళ్లు, ద్వితీయ సంవత్సరం కోర్సు చదువుతున్నవారు అర్హులు. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ తోపాటు బయాలజీ, ఎలక్ట్రానిక్స్‌, స్టాటిస్టిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులు చేస్తున్న వాళ్లూ దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రథమశ్రేణి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఎస్సీ, ఎస్టీలు పాసైతే సరిపోతుంది.
కేవీపీవై, జేఈఈ మెయిన్స్‌, జేఈఈ అడ్వాన్స్‌డ్‌, నీట్‌ వీటిలో ఎందులోనైనా చూపిన ప్రతిభ ద్వారా సీట్లు కేటాయిస్తారు. సంబంధిత స్కోర్‌తో ఐఐఎస్సీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

వెబ్‌ సైట్‌: www.iisc.ac.in/ug

 

డిగ్రీతోపాటే బీఎడ్‌

డిగ్రీతోపాటు బీఎడ్‌ కూడా అందిస్తోంది మైసూర్‌లోని ప్రాంతీయ విద్యా సంస్థ (ఆర్‌ఐఈ). ఇందులో నాలుగేళ్ల బీఎస్సీ బీఎడ్‌ లేదా బీఏ బీఎడ్‌ లేదా ఆరేళ్ల ఎమ్మెస్సీ ఎడ్యుకేషన్‌ కోర్సుల్లో చేరిపోవచ్చు.సెమిస్టర్‌ విధానంలో విద్యా బోధన ఉంటుంది. ఇంటర్‌ ఆర్ట్స్‌, సైన్స్‌ కోర్సుల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష ద్వారా ఎంపికచేస్తారు. దేశవ్యాప్తంగా అజ్మీర్‌, భోపాల్‌, భువనేశ్వర్‌, మైసూర్‌ల్లో ఆర్‌ఐఈలు ఉన్నాయి. ఏపీ, తెలంగాణ మైసూర్‌ పరిధిలోకి వస్తాయి. ఆర్‌ఐఈ మైసూర్‌లో బీఎస్సీ బీఎడ్‌ (ఎంపీసీ)లో 40, బీఎస్సీ బీఎడ్‌ (బైపీసీ)లో 40, బీఏబీఎడ్‌ 40 చొప్పున సీట్లు ఉన్నాయి. ఇవన్నీ నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు. ఆరేళ్ల ఎమ్మెస్సీ ఎడ్యుకేషన్‌ కోర్సుని మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో ఈ సంస్థ అందిస్తోంది. ఒక్కో సబ్జెక్టులో 15 చొప్పున సీట్లు ఉన్నాయి. ఎమ్మెస్సీ-ఎడ్‌ కోర్సు ఒక్క మైసూర్‌ లోనే ఉంది. రాత పరీక్షలో సాధించిన మార్కులకు 60 శాతం, అకడమిక్‌ మార్కులకు 40 శాతం వెయిటేజీ ఉంటుంది.

వెబ్‌సైట్‌: www.riemysore.ac.in

 

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ

అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఆర్ట్స్‌, సైన్స్‌, హ్యుమానిటీస్‌ కోర్సులను కేంద్రీయ విశ్వవిద్యాలయం - హైదరాబాద్‌ (హెచ్‌సీయూ) అందిస్తోంది. ఇంటర్‌ పూర్తిచేసినవాళ్లు ఈ కోర్సులకు అర్హులు. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమికల్‌ సైన్సెస్‌, సిస్టమ్‌ బయాలజీ, ఆప్టోమెట్రీ అండ్‌ విజన్‌ సైన్సెస్‌, హెల్త్‌ సైకాలజీ, ఎర్త్‌ సైన్సెస్‌ల్లో ఎమ్మెస్సీ; హిందీ, తెలుగు, ఉర్దూ, లాంగ్వేజ్‌ సైన్సెస్‌ల్లో ఎంఏ హ్యూమానిటీస్‌; ఎకనామిక్స్‌, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌, సోషియాలజీ, ఆంత్రోపాలజీల్లో ఎంఏ సోషల్‌ సైన్సెస్‌ కోర్సులు అందిస్తోంది.

ఈ కోర్సులన్నీ ఇంటిగ్రేటెడ్‌ విధానంలో ఇంటర్‌ విద్యార్థుల కోసం నిర్వహిస్తున్నారు. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ప్రకటన త్వరలో వెలువడుతుంది.

వెబ్‌సైట్‌: www.uohyd.ac.in

 

టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ (టిస్‌)

టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ బీఏ సోషల్‌ సైన్సెస్‌, బ్యాచిలర్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌ కోర్సులను అందిస్తోంది. కాల వ్యవధి మూడేళ్లు. ఈ కోర్సులను టిస్‌ ముంబయి క్యాంపస్‌ తోపాటు హైదరాబాద్‌, గువాహతి, తుల్జాపూర్‌ కేంద్రాల్లో నిర్వహిస్తోంది. ఈ కోర్సులకు ఎంపికైనవాళ్లు అదే క్యాంపస్‌లో కావాలనుకుంటే పీజీ కూడా పూర్తిచేసుకోవచ్చు. పరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా ప్రవేశాలు లభిస్తాయి.

అర్హత: ఇంటర్‌ ఉత్తీర్ణత.

వెబ్‌సైట్‌: www.tiss.edu

 

చెన్నై మ్యాథమెటికల్‌ ఇన్‌స్టిట్యూట్‌

చెన్నై మ్యాథమెటికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ బీఎస్సీ (ఆనర్స్‌)- మ్యాథ్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ల్లో; బీఎస్సీ (ఆనర్స్‌)-మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ల్లో నిర్వహిస్తోంది. రాత పరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. బీఎస్సీ కోర్సులకు ఎంపికైన వారికి స్టైపెండ్‌ చెల్లిస్తారు.

వెబ్‌సైట్‌:‌ www.cmi.ac.in

 

నెస్ట్‌ 

పరిశోధనా రంగంలో రాణించాలనుకునే ఇంటర్‌ సైన్స్‌ విద్యార్థులకు నేషనల్‌ ఎంట్రన్స్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ (నెస్ట్‌)ని మించిన అవకాశం లేదనే చెప్పుకోవచ్చు. ఈ పరీక్ష ద్వారా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆప్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఎన్‌ఐఎస్‌ఈఆర్‌), భువనేశ్వర్‌; యూనివర్సిటీ ఆఫ్‌ ముంబై, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీ విభాగానికి చెందిన సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ బేసిక్‌ సైన్సెస్‌ (సీఈబీఎస్‌)ల్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. ఈ సంస్థల్లో ప్రవేశం లభించినవారు ఇన్‌స్పైర్‌ స్కాలర్‌షిప్‌తో అయిదేళ్ల పాటు నెలకు రూ.5000 చొప్పున ఉపకార వేతనం పొందవచ్చు. అలాగే వేసవి ప్రాజెక్టు కోసం ఏడాదికి రూ.20,000 చొప్పున చెల్లిస్తారు. అన్ని సెమిస్టర్లలోనూ మంచి ప్రతిభ ప్రదర్శించిన విద్యార్థులకు బాబా అటామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (బార్క్‌) ట్రైనింగ్‌ స్కూల్లో పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశం కల్పిస్తారు.  శాస్త్రవేత్తలతో బోధన ఇక్కడి ప్రత్యేకత. ఇంటర్‌ ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

వెబ్‌సైట్‌: www.nestexam.in

Posted Date: 29-10-2021


 

ఇంటర్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌