‣ ఇంటర్‌తో ఏఎన్ఎం, జీఎన్ఎం, బీఎస్సీ ప్రవేశాలు
మేటి ఉపాధి అవకాశాలు అందించే కోర్సుల్లో నర్సింగ్ విద్య ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా నర్సుల కొరత ఉంది. అందువల్ల కోర్సు పూర్తయిన వెంటనే ఉద్యోగానికి ఢోకా లేదు. కార్పొరేట్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వీరికి ఆకర్షణీయ వేతనాలూ దక్కుతున్నాయి. బీఎస్సీ నర్సింగ్‌తో కేంద్ర ఆసుపత్రుల్లో అవకాశం వచ్చినవారు మొదటి నెల నుంచే రూ.80 వేల వేతనం అందుకోవచ్చు. ఇంటర్మీడియట్ గ్రూపు ప్రకారం.. ఏఎన్ఎం, జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో చేరవచ్చు.
నర్సింగ్ వృత్తిలో రాణించడానికి.. ఒత్తిడిని తట్టుకోవాలి. ఓర్పు తప్పనిసరి. సహాయపడే తత్వం, రాత్రివేళల్లో పని చేయడానికి సిద్ధపడాలి. మానసిక సామర్థ్యం, స్పృహతో మెలగడం, వృత్తి పరిజ్ఞానం, పరిశీలన, నిర్వహణ నైపుణ్యాలు ఉండాలి.
నర్సింగ్ కోర్సుల్లో చేరాలంటే ఇంటర్మీడియట్ విద్య పూర్తిచేయడం తప్పనిసరి. ఏఎన్ఎం, జీఎన్ఎం కోర్సులకు ఇంటర్/ప్లస్ 2 అన్ని గ్రూపుల వారికీ అవకాశం ఉంటుంది. వీటిలో ప్రవేశం పొందినవారికి నర్సింగ్ ఎగ్జామినేషన్ బోర్డు ఆధ్వర్యంలో పరీక్షలు ఉంటాయి. బీఎస్సీ నర్సింగ్ కోర్సుకి మాత్రం బైపీసీ వాళ్లే అర్హులు. ఈ కోర్సు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నడుపుతారు. ఏఎన్ఎం కోర్సులో నర్సింగ్కు సంబంధించిన ప్రాథమిక అంశాలపై అవగాహన కల్పిస్తారు. అయితే దీనితోనూ ఉపాధి పొందవచ్చు. మేటి అవకాశాలు ఆశించేవారు జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్కు ప్రాధాన్యమివ్వాలి. ఇవి పూర్తయిన తర్వాత ఎమ్మెస్సీ నర్సింగ్, నర్సింగ్‌లో పీహెచ్డీ చేసుకోవచ్చు. నర్సింగ్ విద్యలో మహిళలకే అధిక ప్రాధాన్యం. పరిమిత సంస్థల్లోనే మేల్ నర్సింగ్ అందుబాటులో ఉంది. ఏఎన్ఎం, జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో చేరినవారికి ఆ ఏడాది డిసెంబరు 31 నాటికి 17 ఏళ్లు నిండాలి.
ఏఎన్ఎం
ఆక్సిలరీ నర్స్ అండ్ మిడ్వైఫ్ (ఏఎన్ఎం) కోర్సు వ్యవధి రెండేళ్లు. తెలుగు రాష్ట్రాల్లో పలు కళాశాలలు ఈ కోర్సు అందిస్తున్నాయి. ఇందులో ప్రవేశం నేరుగా లభిస్తుంది. ఏఎన్ఎం అనంతరం వరుసగా జీఎన్ఎం, పోస్టు బేసిక్ బీఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్, పీహెచ్డీ కోర్సులు పూర్తిచేసుకోవచ్చు. ఏఎన్ఎం కోర్సు పూర్తిచేసుకున్నవారికి ప్రభుత్వ పరంగా.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వాటి పరిధిలోని ఉప కేంద్రాల్లో (హెల్త్ సబ్ సెంటర్స్) అవకాశం ఉంటుంది. చిన్నారులకు టీకాలు వేయించడం, బాలింతలకు పౌష్టికాహారం, సప్లిమెంట్లు ఇవ్వడం, సహజ కాన్పులను ప్రోత్సహించడం, ప్రభుత్వ పథకాలు అందేలా చూడడం.. వీరి విధుల్లో భాగం. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ వీరిని సీనియర్ నర్సులకు సహాయకులుగా తీసుకుంటారు.
జీఎన్ఎం
జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ (జీఎన్ఎం) కోర్సు వ్యవధి మూడేళ్లు. ఇంటర్ అన్ని గ్రూపుల వాళ్లూ అర్హులే. తెలుగు రాష్ట్రాల్లో పలు కళాశాలలు ఈ కోర్సు అందిస్తున్నాయి. ఇంటర్మీడియట్ మార్కుల మెరిట్‌తో అవకాశం లభిస్తుంది. దీన్ని పూర్తిచేసుకున్నవారు రెండేళ్ల వ్యవధితో పోస్టు బేసిక్ బీఎస్సీ నర్సింగ్ కోర్సు నర్సింగ్ కళాశాలలో చదువుకోవచ్చు లేదా ఏదైనా సంస్థలో ఉద్యోగం చేసుకుంటూ దూరవిద్యలో ఇగ్నో నుంచి మూడేళ్ల వ్యవధితో పోస్టు బేసిక్ బీఎస్సీ నర్సింగ్ పూర్తిచేసుకోవచ్చు. అనంతరం పోస్టు బేసిక్ డిప్లొమా లేదా ఎమ్మెస్సీ నర్సింగ్‌లో చేరవచ్చు. ఆ తర్వాత ఆసక్తి ఉంటే నర్సింగ్‌లో పీహెచ్డీ చేయవచ్చు. జీఎన్ఎం అర్హతతో ప్రభుత్వ వైద్యశాలలు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో అవకాశాలు లభిస్తాయి.
బీఎస్సీ నర్సింగ్
నర్సింగ్ విద్యలో ప్రాధాన్యం ఉన్న కోర్సు ఇది. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్లో 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు వ్యవధి నాలుగేళ్లు. జాతీయ సంస్థలతోపాటు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు ఈ కోర్సు అందిస్తున్నాయి. రాష్ట్ర స్థాయి సంస్థల్లో సీటు పొందాలంటే ఎంసెట్/ ఈఏపీసెట్/ నీట్ స్కోరు తప్పనిసరి. కౌన్సెలింగ్‌తో ప్రవేశం లభిస్తుంది. ఎయిమ్స్, జిప్మర్ మొదలైన జాతీయ స్థాయి సంస్థలు ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించి అవకాశం కల్పిస్తున్నాయి. బీఎస్సీ నర్సింగ్ తర్వాత పోస్టు బేసిక్ డిప్లొమా లేదా ఎమ్మెస్సీ నర్సింగ్ ఆ తర్వాత పీహెచ్డీ పూర్తిచేసుకోవచ్చు.
ఉన్నత విద్య
పోస్టు బేసిక్ డిప్లొమా: ప్రత్యేక విభాగంలో స్పెషలిస్ట్ సేవలు అందించాలనుకున్నవారు బీఎస్సీ నర్సింగ్ తర్వాత ఏడాది వ్యవధితో ఉన్న పోస్టు బేసిక్ డిప్లొమా కోర్సులో చేరవచ్చు. కార్డియో థొరాసిక్, క్రిటికల్ కేర్, మిడ్ వైఫరీ, న్యూరో సైన్స్, అంకాలజీ, ఆర్థోపెడిక్ అండ్ రిహాబిలిటేషన్, సైకియాట్రిక్, నియోనటాల్, ఆపరేషన్ రూమ్, ఎమర్జెన్సీ అండ్ డిజాస్టర్, ఆప్తాల్మిక్, టీబీ, లెప్రసీ.. ఇలా కోరుకున్న స్పెషలైజేషన్ ఎంచుకోవచ్చు. వీరు కోర్సు అనంతరం ఆ విభాగానికి చెందిన స్పెషల్ డాక్టర్లు/ప్రత్యేక వార్డుల్లో సేవలు అందించవచ్చు.
ఎమ్మెస్సీ నర్సింగ్: ఇందులో కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, మెడికల్ సర్జికల్ నర్సింగ్, ఆబ్సెస్ట్రిక్ అండ్ గైనకాలాజికల్ నర్సింగ్, మెంటల్ హెల్త్ నర్సింగ్, చైల్డ్ హెల్త్ నర్సింగ్.. తదితర స్పెషలైజేషన్లు ఉంటాయి. కోర్సుల వ్యవధి రెండేళ్లు. బీఎస్సీ నర్సింగ్, పోస్టు బేసిక్ బీఎస్సీ నర్సింగ్ పూర్తిచేసుకున్నవారు వీటిలో నచ్చిన స్పెషలైజేషన్ ఎంచుకోవచ్చు. అనంతరం సంబంధిత విభాగాల్లో విధులు నిర్వర్తించవచ్చు. అనుభవంతో హెచ్ఓడీ కావచ్చు.
ఇటీవల నర్స్ ప్రాక్టీషనర్ క్రిటికల్ కేర్ పోస్టు గ్రాడ్యుయేట్ రెసిడెన్సీ ప్రోగ్రాం బాగా ప్రాధాన్యం పొందుతోంది. డాక్టర్లు అందుబాటులో లేనప్పుడు అత్యవసర సేవలు సమర్థంగా నిర్వహించగలిగేలా ఈ కోర్సు రూపొందించారు. ఆసుపత్రుల నిర్వహణపై ఆసక్తి ఉన్నవారు ఎంబీఏ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సునూ చదువుకోవచ్చు. ఇగ్నో నర్సింగ్ అడ్మినిస్ట్రేషన్‌లో డిప్లొమా కోర్సు అందిస్తోంది. దీనిద్వారా అదనపు నైపుణ్యాలు పొందవచ్చు.
ఉపాధికి ఏ అవకాశాలు?
2030 నాటికి మన దేశ అవసరాలు తీర్చడానికి ఇరవై లక్షల మంది నర్సులు ఉండాలని పలు నివేదికలు పేర్కొన్నాయి. సుశిక్షితులైన నర్సులకు ప్రపంచ వ్యాప్తంగా గిరాకీ ఉంది. భారత్ సహా, అన్ని దేశాలూ వీరి కొరతను ఎదుర్కొంటున్నాయి. అందువల్ల వీరికి విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. శ్రమించే తత్వం, సహనం, వృత్తి నైపుణ్యం ఉన్నవారు తక్కువ వ్యవధిలోనే ఉన్నత స్థాయికీ చేరుకుంటున్నారు. ఆసుపత్రులు, నర్సింగ్ హోంలు, హెల్త్ సెంటర్లు, విద్యా సంస్థలు, ఓల్డేజ్ హోంలు, ఎన్జీవోలు, సేవా సంస్థలు, కార్పొరేట్ సంస్థలు.. అన్ని చోట్లా వీరికి అవకాశాలుంటాయి.
బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం కోర్సులు పూర్తిచేసుకున్నవారు ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ రంగాల్లో ఆకర్షణీయ వేతనంతో రాణించవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులు, రైల్వేలు, ఇతర కేంద్రీయ సంస్థల్లో నర్సు ఉద్యోగం పొందినవారు రూ.44,900 మూలవేతనంతో మొదటి నెల నుంచే సుమారు రూ.80 వేలు అందుకోవచ్చు. బీఎస్సీ నర్సింగ్ పూర్తిచేసుకున్నవారిని పరీక్ష ద్వారా ఆర్మీలో నేరుగా లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుని రూ.లక్షకు పైగా వేతనం చెల్లిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆసుపత్రులు, హెల్త్ సెంటర్లు, సంక్షేమ వసతి గృహాల్లో సేవలు అందించడానికి నర్స్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. వీరికి ప్రారంభ మూలవేతనం సుమారు రూ.30 వేలు లభిస్తోంది. డీఏ, హెచ్ఆర్ఎ, ఇతర అలవెన్సులతో మొదటి నెల నుంచే దాదాపు రూ.45 వేలు జీతం పొందవచ్చు. కార్పొరేట్ ఆసుపత్రులు బీఎస్సీ నర్సింగ్ పూర్తిచేసినవారికి ప్రారంభంలో రూ.18 వేల నుంచి రూ.25 వేల వరకు వేతనం అందిస్తున్నాయి. పీజీ పూర్తిచేసుకున్నవారు ఆకర్షణీయ జీతంతో కార్పొరేట్ స్పెషాలిటీ వైద్య విభాగాల్లో ప్రత్యేక సేవలు అందించవచ్చు. బోధన రంగాన్నీ ఎంచుకోవచ్చు. పీహెచ్‌డీతో నర్సింగ్ కళాశాలలకు ప్రిన్సిపల్‌గానూ, ఆసుపత్రుల్లో హెచ్ఓడీలుగానూ రాణించగలరు.
విదేశాల్లో..
నర్సింగ్ సేవలపై పూర్తి అవగాహన, ఆంగ్ల భాషలో కమ్యూనికేషన్ నైపుణ్యం ఉంటే అమెరికా, కెనడా, సింగపూర్, గల్ఫ్, మిడిల్ ఈస్ట్.. దేశాల్లో పెద్ద మొత్తంలో వేతనాలు అందుకోవచ్చు. విదేశాల్లో ఉద్యోగాన్ని ఆశించేవారు ఆ దేశం నిర్వహించే పరీక్షలో అర్హత సాధించాలి.
‣ అమెరికాలో సేవలు అందించడానికి ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ టెస్టు (టోఫెల్ లేదా ఐఈఎల్టీఎస్) స్కోరు, నేషనల్ కౌన్సిల్ లైసెన్సింగ్ ఎగ్జామినేషన్ - రిజిస్టర్డ్ నర్స్ (ఎన్‌సీఎల్‌ఈఎక్స్ - ఆర్ఎన్)లో ఉత్తీర్ణత సాధించాలి.
‣ కెనడాలో కెరియర్ ఆశించేవారు కెనడియన్ రిజిస్టర్డ్ నర్సెస్ ఎగ్జామ్ (సీఆర్‌ఎన్‌ఈ).
‣ దుబాయ్‌లో పనిచేయడానికి దుబాయ్ హెల్త్ అథారిటీ నిర్వహించే పరీక్ష,
‣ సౌదీ అరేబియాకు ప్రొమెట్రిక్ పరీక్ష.
‣ ఖతార్‌కు సుప్రీం కౌన్సిల్ ఆఫ్ హెల్త్ పరీక్ష రాయాలి.
ఇలా దేశాన్ని బట్టి పరీక్షలు, నిబంధనలు ఉంటాయి. కొన్ని దేశాలు రెండు మూడేళ్ల అనుభవంతో పరీక్షలూ లేకుండా ఇంటర్వ్యూతోనే అవకాశమిస్తున్నాయి.
మేటి విద్యాసంస్థలు
‣ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) న్యూదిల్లీతోపాటు భోపాల్, భువనేశ్వర్, జోధ్‌పూర్, పట్నా, రాజ్పూర్, రుషికేష్‌ల్లో బీఎస్సీ నర్సింగ్ ఆనర్స్ కోర్సు మహిళల కోసం అందిస్తున్నారు. పరీక్షతో ప్రవేశం కల్పిస్తారు.
‣ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ (సీఎంసీ), వెల్లూరు
‣ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ (ఏఎఫ్ఎంసీ), పుణె
‣ జిప్మర్, పుదుచ్చెరి
‣ పీజీఐఎంఆర్, చండీగఢ్
‣ మణిపాల్ అకాడెమీ
‣ తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల ఆధ్వర్యంలో నడుస్తోన్న కళాశాలలు
‣ నిమ్స్, అపోలో, యశోదా.. తదితర సంస్థలు నర్సింగ్ కోర్సులు అందిస్తున్నాయి.
-----------------------------------------------------------------------------------------------------------
మరింత సమాచారం... మీ కోసం!
‣ డేటా సైన్స్‌లో ప్రత్యేకతలివిగో!
‣ ఆర్మీలో ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీం