• facebook
  • whatsapp
  • telegram

త్రివిధ ద‌ళాలు  

దేశ రక్షణకు శ్రమించే ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాల్లో ఏటా ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. పదో తరగతి, ఇంటర్ ఆపై అర్హతలున్న వారికి ఈ విభాగాల్లో వివిధ పోస్టులు అందుబాటులో ఉంటున్నాయి. వీటిలో పదో తరగతి ఆధారంగా లభించే ఉద్యోగాల వివరాలు...

ఇండియన్ ఆర్మీ:
కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ ఆర్మీ వివిధ రకాల ఉద్యోగాల భర్తీ నిమిత్తం ప్రకటనలు జారీ చేస్తుంది. జిల్లా ప్రధాన కేంద్రాలు, పట్టణాల్లో వాక్-ఇన్/ ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తుంది. ఆర్మీ పోస్టుల్లో ప్రధానంగా అందరికీ అందుబాటులో ఉండేవి... సోల్జర్లు (జనరల్ డ్యూటీ).

అర్హతలు: కనీసం 45 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 17 1/2 నుంచి 21 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక: కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (సీఈఈ) నిర్వహంచి ఎంపిక చేస్తారు. దీన్లో రెండు పేపర్లు ఉంటాయి.

పేపర్-1 సోల్జర్ జనరల్ కేటగిరీలకు చెందింది.

పేపర్-2 టెక్నికల్ సోల్జర్ విభాగాలకు చెందింది.

రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి శారీరక సామర్థ్య పరీక్షలు ఉంటాయి. వీటిలో అర్హత పొందినవారిని ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

వెబ్‌సైట్: www.indianarmy.nic.in

ఎయిర్‌ఫోర్స్:
భారత వాయుసేన (ఇండియన్ ఎయిర్‌ఫోర్స్) పదో తరగతి ఉత్తీర్ణులైన వారికి ఎయిర్‌మన్ (మ్యుజీషియన్) ఉద్యోగాలను కల్పిస్తోంది. ఎయిర్‌ఫోర్స్‌లో ఇది గ్రూప్ - వై ట్రేడ్‌కు చెందింది.

అర్హతలు: కనీసం 45 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 17 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

గిటార్, క్లారినెట్, వయోలిన్ లేదా ఇతర సంగీత వాయిద్య పరికరాల ప్రయోగం తెలిసి ఉండాలి. శారీరకప్రమాణాల్లో భాగంగా ఎత్తు 157 సెం.మీ., ఛాతీ సాధారణ స్థితిలో 80 సెం.మీ., గాలి పీల్చినప్పుడు 85 సెం.మీ. ఉండాలి.

ఎంపిక: మొదట రాత పరీక్ష తర్వాత శారీరక సామర్థ్య పరీక్ష నిర్వహిస్తారు. వీటిలో అర్హత సాధించిన వారికి వైద్య పరీక్షలు జరిపి ఎంపిక చేస్తారు.

వెబ్‌సైట్: www.indianairforce.nic.in

ఇండియన్ నేవీ:
భారత నౌకాదళం (ఇండియన్ నేవీ) పదో తరగతి ఉత్తీర్ణులైన వారికి ఉద్యోగాలను అందిస్తోంది. ఈ పోస్టులకు అవివాహిత పురుషులు మాత్రమే అర్హులు.

1) కుక్స్: పదో తరగతి ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు. విధుల్లో భాగంగా ఆహార పదార్థాలను తయారుచేయగలగాలి.

2) స్టీవార్డ్స్: పదో తరగతి ఉత్తీర్ణులు అర్హులు. ఆఫీసర్ల మెస్‌లకు అవసరమైనప్పుడు ఆహార పదార్థాలను సరఫరా చేయాల్సి ఉంటుంది.

వెయిటర్లుగా, హౌస్‌కీపింగ్, విధుల నిర్వహణ తదితర బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది. దీనికి తగిన శిక్షణ ఇస్తారు.

వయసు: అన్ని రకాల పోస్టులకు అభ్యర్థుల వయసు 17 నుంచి 21 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక: ఆబ్జెక్టివ్ విధానంలో రాత పరీక్ష నిర్వహిస్తారు. దీన్లో అర్హత సాధించిన వారికి శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తారు.

వెబ్‌సైట్: nausena-bharti.nic.in

Posted Date: 04-09-2021


 

టెన్త్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌