• facebook
  • whatsapp
  • telegram

సైబ‌ర్ సంర‌క్ష‌ణ కొలువులు

స‌మ‌ర్థ నిపుణుల‌కు డిమాండ్‌

 

 

దాదాపు అన్ని రంగాలూ, సకల కార్యకలాపాలూ అంతర్జాలంతో అనుసంధానమైవున్న డిజిటల్‌ ప్రపంచంలో జీవిస్తున్నాం. వేగవంతమైన అద్భుత ప్రయోజనాలు ఒక కోణమైతే.. హ్యాకింగ్‌లూ, వైరస్‌ దాడులూ, మోసాలూ దీని మరో కోణం. దీంతో సైబర్‌ భద్రత అనివార్యమైపోయింది. ‘ప్రపంచ దేశాలు సమర్థులైన సైబర్‌ భద్రత నిపుణుల కొరతను ఎదుర్కొంటున్నా’యని మైక్రోసాఫ్ట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కేట్‌ బెన్కెన్‌ ఇటీవలే హైదరాబాద్‌లో చెప్పారు. ఈ రంగంలో తగిన శిక్షణ పొందితే ఆకర్షణీయమైన కెరియర్‌ అవకాశాలు మీ సొంతమవుతాయి!  

 

మీరు క్లిక్‌ చేసిన లింకులు సురక్షితం కావా?

మీ మొబైల్‌ లేదా ల్యాప్‌టాప్‌ సురక్షితంగా లేదా?

మీ సిస్టమ్‌లో ఏదైనా ముప్పు ఉన్నట్లయితే...?

వీటన్నిటికీ పరిష్కారం సైబర్‌ సెక్యూరిటీ! 

ఈ డిజిటల్‌ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ సైబర్‌ భద్రత తప్పనిసరి అవసరంగా మారింది. 

 

ఆసియాలో అత్యధికంగా సైబర్‌ దాడులకు గురవుతున్న మొదటి మూడు దేశాల్లో భారతదేశం ఒకటి. 

 

మనదేశంలో గత మూడేళ్లలో సైబర్‌ నేరాలు సుమారు 572 శాతం పెరిగాయి. 2021లో 14 లక్షల కేసులు నమోదయ్యాయి.

 

2022లో సైబర్‌ భద్రతకు సంబంధించి 2.12 లక్షల సంఘటనలపై ఫిర్యాదులు వచ్చాయని భారత ప్రభుత్వం ప్రకటించింది.   

 

డిజిటల్‌ దాడుల నుంచి క్లిష్టమైన సిస్టమ్‌లనూ, సున్నితమైన సమాచారాన్నీ రక్షించే పద్ధతి.. సైబర్‌ సెక్యూరిటీ. కంప్యూటర్లు, సర్వర్లు, మొబైల్‌ పరికరాలు, ఎలక్ట్రానిక్‌ సిస్టమ్‌లు, నెట్‌వర్క్‌లు, డేటా లాంటి అంతర్జాల అనుసంధాన సిస్టమ్‌లను హానికరమైన దాడుల నుంచి రక్షించే ప్రక్రియలో- కేంద్రీకృత రక్షణ వ్యవస్థలా సైబర్‌ సెక్యూరిటీ పనిచేస్తుంది. సైబర్‌ అనేది సిస్టమ్‌లు, నెట్‌వర్క్‌లు, ప్రోగ్రామ్‌లు, డేటాను కలిగివున్న సాంకేతికతను సూచిస్తుంది. సెక్యూరిటీ అనేది ఇక్కడ భద్రత వ్యవస్థలు, నెట్‌వర్క్‌లు, అప్లికేషన్‌లు, సమాచారాల రక్షణను సూచిస్తుంది. అందుకే ‘ఎలక్ట్రానిక్‌ ఇన్‌ఫర్మేషన్‌ సెక్యూరిటీ/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ సెక్యూరిటీ’ అని కూడా పిలుస్తారు.

 

ఎలా పని చేస్తుంది?

సైబర్‌ సెక్యూరిటీ డిజిటల్‌ డేటాను మాత్రమే రక్షిస్తుంది. ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ అయితే డిజిటల్‌ డేటానూ, భౌతిక డేటానూ రక్షిస్తుంది. ముఖ్యంగా ఏదైనా రూపంలో డేటాను- అనధికారిక యాక్సెస్, ఉపయోగం, మార్పు, బహిర్గతం, తొలగింపు లేదా చొరబాటుదారుల నుంచీ, ఇతర రకాల హానికరమైన ఉద్దేశాల నుంచీ రక్షిస్తుంది. ఈ డిజిటల్‌ యుగంలో సైబర్‌ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీల కలయిక సంపూర్ణ భద్రతకు సహాయకారిగా ఉంటుంది.  

 

ఐదు రకాల పద్ధతులు

సైబర్‌ భద్రత ఐదు విభిన్న రకాలుగా ఉంటుంది. 

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సెక్యూరిటీ 

అప్లికేషన్‌ సెక్యూరిటీ 

నెట్‌వర్క్‌ సెక్యూరిటీ 

క్లౌడ్‌ సెక్యూరిటీ 

ఐఓటీ (ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌) సెక్యూరిటీ 

 

ఉదాహరణకు క్లౌడ్‌లో సైబర్‌ సెక్యూరిటీ గురించి చూద్దాం. క్లౌడ్‌-ఆధారిత సిస్టమ్‌లు, డేటా, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను రక్షించడానికి కలిసి పనిచేసే విధానాలు, నియంత్రణలు, విధానాలు, సాంకేతికతల సమ్మేళనమిది. క్లౌడ్‌ భద్రతను అందించే విధానం వ్యక్తిగత క్లౌడ్‌ ప్రొవైడర్‌ లేదా క్లౌడ్‌ సెక్యూరిటీ సొల్యూషన్‌లపై ఆధారపడి ఉంటుంది. క్లౌడ్‌ సెక్యూరిటీ అనేది విభిన్న సాంకేతికతల కలయిక. వాటిని నిర్వహించడం, ట్రాక్‌ చేయడం ఏ సైబర్‌ నిపుణుడికైనా నిరంతర ప్రక్రియ.

 

 

క్లౌడ్‌ సెక్యూరిటీలో ఉపయోగించే కీలక టెక్నాలజీలు 

ఎన్‌క్రిప్షన్‌: ఇది డేటాను విభజించే మార్గం, తద్వారా తెలిసిన వ్యక్తులు మాత్రమే సమాచారాన్ని అర్థం చేసుకోగలరు. దాడి చేసే వ్యక్తి కంపెనీ సమాచారాన్ని ఉపయోగించడానికి ప్రయత్నించి, ఎన్‌క్రిప్ట్‌ చేయని డేటాను కనుగొంటే, దాన్ని ఉపయోగించటం కానీ, ఇతరులకు విక్రయించటం కానీ చేయవచ్చు. కానీ కంపెనీ డేటా ఎన్‌క్రిప్ట్‌ చేసివుంటే దాడి చేసే వ్యక్తి స్క్రాప్‌ చేసిన డేటాను మాత్రమే కనుగొంటాడు. దాన్ని ఉపయోగించలేరు. డిక్రిప్షన్‌ కీని కనుగొనటం దాదాపు అసాధ్యం. ఈ విధంగా, ఇతర భద్రతా చర్యలు విఫలమైనప్పటికీ ఎన్‌క్రిప్షన్‌.. డేటా లీకేజీని నిరోధించడంలో సహాయపడుతుంది. 

ఐడెంటిటీ అండ్‌ యాక్సెస్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఏఎమ్‌): ఇది సరైన వ్యక్తులు, సరైన ఐటీ వనరులు, సరైన కారణాల కోసం, సరైన సమయంలో యాక్సెస్‌ ఉందని నిర్థరించడానికి సహాయపడుతుంది.

ఫైర్‌వాల్‌: ముందుగా నిర్ణయించిన భద్రతా నియమాల ఆధారంగా ఇన్‌కమింగ్, అవుట్‌ గోయింగ్‌ నెట్‌వర్క్‌ ట్రాఫిక్‌ను పర్యవేక్షించే, నియంత్రించే నెట్‌వర్క్‌ సెక్యూరిటీ సిస్టమ్‌ ఇది. ఫైర్‌వాల్‌ సాధారణంగా విశ్వసనీయ నెట్‌వర్క్‌కూ, ఇంటర్నెట్‌ లాంటి అవిశ్వసనీయ నెట్‌వర్క్‌కూ మధ్య అడ్డంకిని ఏర్పాటు చేస్తుంది.

 

సైబర్‌ భద్రతలో కొన్ని కోర్సులు 

1. Introduction to Cybersecurity from Udacity

2. Introduction to Cyber Security Specialization from Coursera

3. https://opensecuritytraining. info/Training.html

4. https://www.cybrary.it/

ఇంకా చాలా కోర్సులు వివిధ విద్యాసంస్థల్లో అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు అవసరమైన అర్హతలూ, విశ్వవిద్యాలయాల్లో కోర్సుల గడువులను పరిశీలించి చేరవచ్చు.

‘నా డిజిటల్‌ ప్రపంచం సురక్షితంగా ఉందా? నేను ముందుగా నా సిస్టమ్‌ను రక్షించుకోవచ్చా?’ - అనే ఆలోచనలు సైబర్‌ భద్రత నైపుణ్యం పొందే శిక్షణ ఆరంభించడానికి కీలకమైన పునాదులు.

 

ఈ రంగంలో రాణించాలంటే?

ఈ రంగంలో రాణించాలంటే ఎంతో కృషి చేయాలి. కేవలం పుస్తకాలు చదివితే అవగాహన రావొచ్చు కానీ సబ్జెక్టుపై పట్టు రాదు. విషయాలు తెలిసినా ఆచరణాత్మకంగా నిరూపించలేకపోవడం వల్లే ఈ రంగంలో కొందరు విఫలమవుతున్నారు. పెద్ద మొత్తంలో డేటాను నిర్వహించటం, క్లయింట్ల, ఉద్యోగుల, డేటాబేస్‌ల సున్నితమైన సమాచారాన్ని రక్షించడానికి వివిధ భద్రతా చర్యలను అమలు చేయటం దీనిలో తప్పనిసరి. ఈ ప్రక్రియలో చిన్న పొరపాటు కూడా భారీ డేటా నష్టానికీ, డబ్బు నష్టానికి దారి తీస్తుంది. కోల్పోయిన డేటాను తిరిగి పొందడం అనేది అంత సులభమైన పని కాదు. దీనికి చాలా సమయం పడుతుంది. అందుకే 24/7 పర్యవేక్షణ తప్పనిసరి.

 

అవసరమైన కొన్ని నైపుణ్యాలు

1. కోడింగ్‌: హెచ్‌టీఎంఎల్, జావాస్క్రిప్ట్‌ లాంటి భాషల్లో కోడింగ్‌/స్క్రిప్టింగ్‌ ప్రాథమిక సూత్రాలను అవగాహన చేసుకోవడంలో, అప్లికేషన్‌లు, వెబ్‌సైట్‌లు ఎలా రూపొందుతాయో అర్థం చేసుకోవడంలో ఇది సహాయం చేస్తుంది.

2. నెట్‌వర్కింగ్‌: వ్యాపార సంస్థలు రోజువారీ కార్యకలాపాల్లో వివిధ రకాల నెట్‌వర్క్‌లను ఉపయోగిస్తున్నందున LAN, WAN, VPN ఎలా పనిచేస్తాయనేదానిపై పూర్తి స్పష్టత ఉండాలి.

3. సిస్టమ్స్‌: ప్రత్యేక లక్షణాలను అధ్యయనం చేయడం ద్వారా డెస్క్‌టాప్, మొబైల్‌ సిస్టమ్‌లను అర్థం చేసుకోవాలి. ఇది సిస్టమ్స్‌పై పూర్తి నియంత్రణ పొందడానికి ఉపకరిస్తుంది. 

 

సైబర్‌ సెక్యూరిటీ ఇంజినీర్‌ కావడానికి ఏ అర్హతలుండాలి?

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీటెక్‌/ బీఎస్‌సీ/సీఎస్‌/ఐటీ/ఎంఎస్‌సీ/ఎంసీఏ డిగ్రీ ఉండాలి. 

అయితే ఈ తరంలో 12వ తరగతి నుంచి కూడా నిపుణులు రావడం మనం గమనిస్తున్నాం. కాబట్టి, తగిన విద్యార్హత లేకపోవడడం అనేది ఔత్సాహికులకు ఎప్పుడూ అవరోధం కాదు. అభిరుచితో పాటు డిజిటల్‌ ప్రపంచంలో సాంకేతికంగా మీరు ఎక్కడ ఉన్నారో అర్థం చేసుకోవడం అవసరం. పరిశోధనాత్మక విధానం, విశ్లేషణ దృక్పథం ఉండాలి.

మీరు సైబర్‌ భద్రత నిపుణులు అయితే, మిమ్మల్ని మీరు రక్షించుకోవడమే కాకుండా ఇతరులనూ కాపాడటం సాధ్యమవుతుంది!
 


********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కుదురుగా కూర్చుంటున్నారా?

‣ చదువుకునే వారికి చక్కటిచోటు ముంబయి

‣ ఈ డిప్లొమాలు ప్రత్యేకం

‣ నవోదయలో ఉపాధ్యాయ ఉద్యోగాలు

‣ బీటెక్‌లకు సైంటిస్టు కొలువులు

‣ ఉపాధికి డిప్లొమా మార్గాలు

‣ గురిపెట్టండి క్లర్కు కొలువుకు!

Posted Date: 10-07-2022


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌