• facebook
  • whatsapp
  • telegram

దూరవిద్యతో ప్రయోజనం పొందాలంటే..?

దూరవిద్య పద్ధతిలో విద్యను అందించడానికి మనదేశంలో అనేక యూనివర్సిటీలు ఏర్పాటయ్యాయి. వీటితోపాటు రెగ్యులర్ ప్రోగ్రామ్‌లను అందించే వందలకొద్దీ యూనివర్సిటీలు కూడా దూరవిద్య కోర్సులను నిర్వహిస్తున్నాయి. ఆర్ట్స్, సైన్స్ కోర్సులతోపాటు ఇంజినీరింగ్, ఎంబీఏ, లా, తదితర ప్రొఫెషనల్ కోర్సులు కూడా దూరవిద్య పద్ధతిలో అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సుల్లో చేరడం వల్ల ఏ మేరకు ప్రయోజనం ఉంటుంది?

మనదేశంలో దాదాపు 40 లక్షల మంది విద్యార్థులు వివిధ దూరవిద్య కోర్సుల్లో పేర్లు నమోదు చేసుకున్నట్లు అంచనా. ఇతర దూరవిద్య కోర్సుల సంగతి ఎలా ఉన్నా, ప్రొఫెషనల్ ప్రోగ్రామ్‌ల విషయంలో అభ్యర్థులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దూరవిద్య కోర్సులు చేస్తున్నవారిలో సుమారు పది శాతం మంది వృత్తి విద్యా కోర్సులు చేస్తున్నారు. వృత్తి విద్యా సంస్థలకు, కోర్సులకు ఏఐసీటీఈ గుర్తింపు ఇస్తుంది. ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, టౌన్ ప్లానింగ్, మేనేజ్‌మెంట్, తదితర సబ్జెక్టులు వృత్తి విద్యా కోర్సుల పరిధిలోకి వస్తాయి.

నిబంధనల ప్రకారం ఎంబీఏ, ఎంసీఏలను మినహాయిస్తే, దూరవిద్య పద్ధతిలో అందించే టెక్నికల్ ప్రోగ్రామ్‌లకు (ఇంజినీరింగ్‌తో సహా) ఏఐసీటీఈ గుర్తింపు ఇవ్వదు. మరోవైపు దూరవిద్య కోర్సులకు గుర్తింపును ఇవ్వడానికి ఇగ్నో పరిధిలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (డీఈసీ) పనిచేస్తుంది. దూరవిద్య ద్వారా అందించే ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు ఏఐసీటీఈ, డీఈసీ రెండింటి గుర్తింపు అవసరం. అనేక సంస్థలు కేవలం డీఈసీ గుర్తింపుతో వివిధ రకాల ప్రొఫెషనల్, టెక్నికల్ కోర్సులను అందిస్తుంటాయి. వీటిలో చేరేముందు విద్యార్థులు వాటి గుర్తింపు గురించి ఒకటికి రెండుసార్లు విచారించాలి.

¤* అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ (ఏఐయూ) నిబంధనల ప్రకారం దూరవిద్య డిగ్రీలకు రెగ్యులర్ కోర్సులతో సమాన గుర్తింపు ఉంటుంది.

¤* కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం... డీఈసీ గుర్తింపు పొందిన దూరవిద్య డిగ్రీలు చేసిన అభ్యర్థులు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు.
                 

                         

ఏ కోర్సులకు డిమాండ్?

      దూరవిద్యలో మేనేజ్‌మెంట్ కోర్సులకు (ఎంబీఏ, పీజీ డిప్లొమాలు) చాలా డిమాండ్ ఉంది. బీబీఏ, బీసీఏ కోర్సులకు కూడా ఆదరణ పెరుగుతోంది. ఎంసీఏకి ప్రాచుర్యం తగ్గుతోంది. సాధారణ బి.ఎ, బి.కాం, బీఎస్సీ కోర్సుల్లో చేరేవారి సంఖ్య కూడా ఎక్కువవుతోంది. ప్రొఫెషనల్ ప్రోగ్రామ్‌లకు కూడా డిమాండ్ పెరుగుతున్నప్పటికీ, వీటి గుర్తింపు విషయంలో గందరగోళం ఉంది. అంతేగాక ప్రొఫెషనల్ కోర్సులు దూరవిద్యలో చేయడం ద్వారా, వాటి ఆధారంగా ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు సాధించడం దాదాపు అసాధ్యంగా మారింది. అనేక కంపెనీలు దూరవిద్య డిగ్రీలు ఉన్న అభ్యర్థులను దరఖాస్తు దశలోనే తిరస్కరిస్తున్నాయి. దూరవిద్య కోర్సుల్లో చేరే ముందు సిలబస్, మూల్యాంకనం, కోర్సు అందించే పద్ధతులను కూడా పరిశీలించాలి. యూజీ, పీజీ కోర్సులు రెండూ దూర విద్యలో చేయకపోవడం మంచిది. వీటిలో ఏదైనా ఒక కోర్సు రెగ్యులర్ పద్ధతిలో చేయడం వల్ల అవకాశాలు కొంత మెరుగవుతాయి.

 ప్రయోజనాలు, ప్రతికూలతలు

     రెగ్యులర్ కోర్సులతో సమాన స్థాయిలో ఆదరణ లేకపోయినా, దూరవిద్య వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఉద్యోగాలు చేస్తూ ఉన్నత కోర్సులు చేయాలనుకునేవారికి దూరవిద్య బాగా ఉపయోగపడుతుంది. అనేక ఇతర కారణాల వల్ల ఫుల్ టైమ్ కోర్సులు చేయలేని అభ్యర్థులు దూరవిద్య వైపు మొగ్గు చూపవచ్చు. దూరవిద్య వల్ల లభించే కొన్ని ప్రయోజనాలు...

* సంపాదిస్తూనే చదువుకునే సౌలభ్యం ఉంటుంది.

¤* రోజూ గంటల తరబడి ప్రయాణం చేసి తరగతులకు హాజరు కావాల్సిన అవసరం ఉండదు. తద్వారా చాలా సమయం, శక్తి ఆదా అవుతాయి.

¤* దూరవిద్యలో ఫీజులు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి డబ్బు కూడా ఆదా చేయవచ్చు.

* వీలైన సమయంలో చదువుకోవచ్చు. అసైన్‌మెంట్లు పూర్తిచేయడానికి ఒత్తిడి ఉండదు. సమయానుకూలంగా చేయవచ్చు.

 ప్రతికూల అంశాలు ...

¤* విద్యార్థులకు ఉపాధ్యాయులు అందుబాటులో ఉండరు. కోర్సు పూర్తిచేసి, దాన్నుంచి ప్రయోజనం పొందాలంటే స్వీయ క్రమశిక్షణ, ప్రేరణ అవసరం.

* విద్యార్థులు కోర్సు ఇన్‌స్ట్రక్టర్‌తో నేరుగా మాట్లాడటం, సందేహాలు నివృతి చేసుకోవడం వీలుకాదు. పాఠ్యాంశాలను తనంతటతానే చదివి అర్థం చేసుకోగలగాలి.

* ఒంటరిగా చదువుకోవాల్సి ఉంటుంది. తోటి విద్యార్థులు అందుబాటులో ఉండరు. మిత్రులతో కలిసి చదువుకోవడం, గ్రూప్ డిస్కషన్‌లు వీలు కాదు.

¤* టెక్నాలజీ, ల్యాబ్‌లు అన్ని వేళలా అందుబాటులో ఉండవు.

* చాలా ప్రైవేటు కంపెనీలు దూరవిద్య ద్వారా సాధించిన డిగ్రీలను గుర్తించడం లేదు. ఈ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ముందుకు రావడం లేదు.

* వందల కొద్దీ సంస్థలు ఉన్నందువల్ల గుర్తింపు లేని సంస్థలు, కోర్సుల్లో చేరి నష్టపోయే ప్రమాదం కూడా ఎక్కువ. అలాంటి సందర్భాల్లో సమయం, డబ్బు వృధా అవుతాయి.

* పరిశ్రమలకు అవసరమైన కమ్యూనికేషన్, ఇంటర్ పర్సనల్ సామర్థ్యాలను దూరవిద్య కోర్సుల ద్వారా పెంపొందించుకోవడం వీలు కాదు. దీనికోసం విద్యార్థులు అదనంగా శ్రమించడం తప్పనిసరి.

Posted Date: 22-11-2021


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌