• facebook
  • whatsapp
  • telegram

ఐఐటీల్లో కోర్సుల డిజైన్‌

ఇంటర్‌ అర్హతతో 'యూసీడ్‌' ద్వారా ప్రవేశం

కొన్ని వస్తువులు చూడగానే కొనేయాలనిపిస్తుంది. తొలి చూపులోనే వాటిపై మనసు పారేసుకోవడమే ఇందుకు కారణం. ‘వావ్‌’ అనుకుంటూ ఆ రూపాన్ని చూస్తూ మురిసిపోతాం. ఆకృతి నచ్చితే  అవసరం ఉన్నా, లేకున్నా సొంతం చేసుకుంటాం. ఆ ఆకర్షణీయరూపం వెనుక కొందరి నిపుణుల సృజనాత్మకత దాగి ఉంది. అందుకు డిజైన్‌ కోర్సులు దోహదపడుతున్నాయి. ఈ విభాగంలో ఆసక్తి ఉన్నవారికి మేటి సంస్థల్లో నేర్చుకునే అవకాశం వచ్చింది!

ఆకట్టుకునే ఆకృతులు

విస్తరాకు నుంచి విమానం దాకా... సెల్‌ఫోన్‌ నుంచి సెమీ కండక్టర్ల వరకూ ప్రతి వస్తువుకీ ఒక ఆకారం ఉంటుంది. అయితే దాని పరిమాణం మెరుగ్గా ఉండేలా, తక్కువ స్థలంలో ఇమిడేలా, ఉపయోగించడానికి సౌకర్యవంతంగా ఉండేలా... డిజైనర్లు తీర్చిదిద్దుతున్నారు. ఈ విభాగంలో ఆసక్తి ఉన్నవారికోసం యూజీ, పీజీ, పీహెచ్‌డీ స్థాయుల్లో కోర్సులను చాలా సంస్థలు అందిస్తున్నాయి. ప్రవేశాల నిమిత్తం ఆయా సంస్థల వారీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వాటిలో ముఖ్యమైనవి ఐఐటీ బాంబే నిర్వహించే యూసీడ్, సీడ్‌. ఇందులో ప్రతిభ చూపినవారు ఐఐటీలు, ఐఐఎస్సీతోపాటు పలు పేరున్న సంస్థల్లో డిజైన్‌ కోర్సులు చదువుకోవచ్చు. ఇటీవలే వీటి ప్రకటన వెలువడింది. 

యూసీడ్‌

డిజైన్‌ కోర్సుల్లో రాణించాలనుకునే ఇంటర్‌ విద్యార్థులు అండర్‌ గ్రాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ ఫర్‌ డిజైన్‌ (యూసీడ్‌)తో అడుగులేయవచ్చు. ఐఐటీ-బాంబే, గువాహటితోపాటు పేరున్న సంస్థల్లో బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ (బి.డిస్‌.) కోర్సులో ప్రవేశం లభిస్తుంది. అలాగే ఈ స్కోరును ఎన్నో విద్యాసంస్థలు ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. 

అర్హత: 2021లో ఇంటర్‌ పూర్తిచేసుకున్నవారు, ప్రస్తుతం ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం కోర్సులు చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సైన్స్, కామర్స్, ఆర్ట్స్, హ్యుమానిటీస్‌.. అన్ని గ్రూపులవాళ్లూ అర్హులే. మూడేళ్ల డిప్లొమా, రెండేళ్ల ఒకేషనల్‌ కోర్సులు పూర్తిచేసుకున్న, చదువుతున్నవారికీ అవకాశం ఉంది. ఐఐటీ-గువాహటి కోర్సుల్లో చేరడానికి ఇంటర్‌ ఎంపీసీ తప్పనిసరి. 

వయసు: అక్టోబరు 1, 1997 తర్వాత జన్మించినవాళ్లే అర్హులు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే అక్టోబరు 1, 1992 తర్వాత జన్మించినప్పటికీ దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రశ్నలడిగే విభాగాలు...

విజువలైజేషన్‌ అండ్‌ స్పేషియల్‌ ఎబిలిటీ, అబ్జర్వేషన్‌ అండ్‌ డిజైన్‌ సెన్సిటివిటీ, ఎన్విరాన్‌మెంటల్‌ అండ్‌ సోషల్‌ అవేర్‌నెస్, ఎనలిటికల్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్, లాంగ్వేజ్‌ అండ్‌ క్రియేటివిటీ, డిజైన్‌ థింకింగ్‌ అండ్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్, డ్రాయింగ్‌ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. పాత ప్రశ్నపత్రాలు-జవాబులు యూసీడ్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. వాటిని పరిశీలిస్తే పరీక్ష విధానం, ప్రశ్నల స్వరూపంపై అవగాహన వస్తుంది. సృజన, ఆలోచన, తార్కికతలపై ముడిపడి ఎక్కువ ప్రశ్నలు అడుగుతారు.

ప్రవేశం కల్పించే సంస్థలు, సీట్లు 

ఐఐబీ-బాంబే, గువాహటి, హైదరాబాద్, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, డిజైన్‌ అండ్‌ మాన్యుఫాక్చరింగ్‌ - జబల్‌పూర్‌.. ఈ సంస్థలు నేరుగా యూసీడ్‌తో అవకాశం కల్పిస్తున్నాయి. వాటిలో మొత్తం 179 సీట్లు ఉన్నాయి. ఐఐటీ-బాంబే 37, ఐఐటీ-గువాహటి 56, ఐఐటీ- హైదరాబాద్‌ 20, ఐఐఐటీడీఎం-జబల్‌పూర్‌లో 66 చొప్పున సీట్లు కేటాయించారు. ఐఐటీ-బాంబేలో చేరినవాళ్లు కావాలనుకుంటే బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ అనంతరం మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సులో చేరవచ్చు. కోర్సు మూడో సంవత్సరంలో ఈ ఐచ్ఛికాన్ని ఎంచుకోవాలి. ఇలా చేరినవారికి బీడిస్‌ + ఎండిస్‌ డ్యూయల్‌ డిగ్రీ కోర్సు అయిదేళ్లలో పూర్తవుతుంది. యూసీడ్‌ స్కోర్‌తో దేశవ్యాప్తంగా పలు ఇతర సంస్థలు సైతం ప్రవేశం కల్పిస్తున్నాయి. యూనివర్సిటీ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ స్టడీస్, సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, విట్, లవ్‌ లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ, శ్రేష్ఠ, ఇంద్రప్రస్థ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, చండీగఢ్‌ యూనివర్సిటీ, మిట్, యూపీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌...తదితర సంస్థలు ఇందులో ఉన్నాయి. 

పరీక్ష ఇలా

ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమంలో 300 మార్కులకు ఉంటుంది. వ్యవధి మూడు గంటలు. ఇందులో రెండు భాగాలు (ఎ, బి) ఉంటాయి. 

పార్ట్‌-ఎ: ఈ విభాగానికి 240 మార్కులు కేటాయించారు. దీని వ్యవధి రెండున్నర గంటలు. పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఇందులో 3 సెక్షన్లు ఉన్నాయి.

సెక్షన్‌ 1 (న్యూమరికల్‌ ఆన్సర్‌ టైప్‌): ఈ విభాగానికి 72 మార్కులు కేటాయించారు. 18 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. ఆప్షన్లు ఉండవు. జవాబును నేరుగా ఖాళీపై పూరించాలి. రుణాత్మక మార్కులు లేవు. ఆన్‌లైన్‌ కీ బోర్డు ఉపయోగించి సమస్యను సాధించుకోవచ్చు. 

సెక్షన్‌ 2 (మల్టిపుల్‌ సెలక్ట్‌ ప్రశ్నలు): ఈ విభాగానికీ 72 మార్కులు కేటాయించారు. మొత్తం 18 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 4 ఆప్షన్లు ఉంటాయి. వాటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సరైన జవాబులు ఉండవచ్చు. అభ్యర్థులు సరైన ఆప్షన్లు అన్నీ గుర్తిస్తే 4 మార్కులు సొంతమవుతాయి. అలాగే ఒకవేళ సరైన ఆప్షన్లలో కొన్ని గుర్తించి, సరికానివి వదిలేస్తే వాటి ప్రకారం పాక్షిక మార్కుల కేటాయింపు ఉంటుంది. తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు. 

సెక్షన్‌ 3 (మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు): ఈ విభాగానికి 96 మార్కులు కేటాయించారు. ఇందులో 32 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకూ 4 ఆప్షన్లు ఉంటాయి. అయితే వీటిలో ఒకటే సరైనది. అందువల్ల ఈ విభాగానికి రుణాత్మక మార్కులు ఉన్నాయి. ప్రతి సరైన జవాబుకు 3 మార్కులు ఉంటాయి. తప్పు సమాధానానికి 0.71 మార్కులు చొప్పున తగ్గిస్తారు. 

పార్ట్‌-బి: ఈ విభాగానికి కేటాయించిన మార్కులు 60. వ్యవధి 30 నిమిషాలు. ఇందులో ఒక ప్రశ్న వస్తుంది. అభ్యర్థి డ్రాయింగ్‌ నైపుణ్యాలను పరిశీలిస్తారు. ప్రశ్న ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌పై కనిపిస్తుంది. అయితే సమాధానం (డ్రాయింగ్‌) జవాబు పత్రంపై రాయాలి.

పీజీ, పీహెచ్‌డీలకు సీడ్‌

డిజైన్‌లో యూజీ కోర్సులు చదువుతున్న విద్యార్థులు పీజీ చదవడానికి, అలాగే పీజీవాళ్లు పీహెచ్‌డీ కోసం సీడ్‌ దారి చూపుతుంది. ఐఐఎస్సీ బెంగళూరు, ఐఐటీ-బాంబే, దిల్లీ, గువాహటి, హైదరాబాద్, కాన్పూర్, ఐఐటీడీఎం జబల్‌పూర్‌లో డిజైన్‌కు సంబంధించి పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ ఫర్‌ డిజైన్‌ (సీడ్‌) రాయడం తప్పనిసరి.  

సంస్థలవారీ కోర్సులు/ స్పెషలైజేషన్లు

ఐఐఎస్సీ బెంగళూరు: ఎండిజైన్‌- ప్రొడక్ట్‌ డిజైన్‌ అండ్‌ ఇంజినీరింగ్, పీహెచ్‌డీ- డిజైన్‌

ఐఐటీ బాంబే: ఎండిజైన్‌- ఇండస్ట్రియల్‌ డిజైన్, కమ్యూనికేషన్‌ డిజైన్, యానిమేషన్, ఇంటరాక్షన్‌ డిజైన్, మొబిలిటీ అండ్‌ వెహికల్‌ డిజైన్‌; పీహెచ్‌డీ- డిజైన్‌

ఐఐటీ దిల్లీ: ఎండిజైన్‌- ఇండస్ట్రియల్‌ డిజైన్‌

ఐఐటీ గువాహటి: ఎండిజైన్‌- డిజైన్, పీహెచ్‌డీ- డిజైన్‌

ఐఐటీ హైదరాబాద్‌: ఎండిజైన్‌- విజువల్‌ డిజైన్, పీహెచ్‌డీ- డిజైన్‌

ఐఐటీ కాన్పూర్‌: ఎండిజైన్‌- డిజైన్, పీహెచ్‌డీ- డిజైన్‌

ఐఐఐటీడీఎం జబల్‌పూర్‌: ఎండిజైన్‌- డిజైన్, పీహెచ్‌డీ- డిజైన్‌

ప్రశ్నపత్రం ఇలా

ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది. ఇందులో 2 విభాగాలున్నాయి. పార్ట్‌ - ఏ ఆన్‌లైన్‌లో ఉంటుంది. ఈ విభాగంలో న్యూమరికల్‌ ఆన్సర్‌ టైప్, మల్టిపుల్‌ సెలక్ట్, మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నపత్రం వంద మార్కులకు ఉంటుంది. పరీక్ష వ్యవధి ఒక గంట. మొత్తం 41 ప్రశ్నలు వస్తాయి. న్యూమరికల్‌ ప్రశ్నలు 8 ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 3 మార్కులు. రుణాత్మక మార్కులు లేవు. మల్టిపుల్‌ సెలెక్ట్‌ ప్రశ్నలు 10 వస్తాయి. ఒక్కో ప్రశ్నకు 3 మార్కులు. తప్పు సమాధానానికి 0.2 మార్కులు తగ్గిస్తారు. మల్టిపుల్‌ ఛాయిస్‌ విభాగంలో 23 ప్రశ్నలు. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. తప్పు సమాధానానికి అర మార్కు చొప్పున తగ్గిస్తారు. పార్ట్‌ ఏలో విజువలైజేషన్‌ అండ్‌ స్పేషియల్‌ ఎబిలిటీ, ఎన్విరాన్‌మెంటల్, సోషల్‌ అవేర్‌నెస్, ఎనలిటికల్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్, లాంగ్వేజ్‌ అండ్‌ క్రియేటివిటీ, అబ్జర్వేషన్‌ అండ్‌ డిజైన్‌ సెన్సిటివిటీ అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. 

పార్ట్‌ బీ ప్రశ్నలు ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌పై డిస్‌ప్లే అవుతాయి. అయితే వీటికి సమాధానాలు (డ్రాయింగ్స్‌) బుక్‌లెట్‌లో రాయాలి. ప్రతి ప్రశ్నకు 20 మార్కుల చొప్పున వంద మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. స్కెచింగ్, క్రియేటివిటీ, ఫామ్‌ సెన్సిటివిటీ, విజువల్‌ సెన్సిటివిటీ, ప్ల్రాబ్లమ్‌ ఐడెంటిఫికేషన్‌ ఒక్కో విభాగంలో ఒక ప్రశ్న చొప్పున ఉంటాయి. వ్యవధి 2 గంటలు. పార్ట్‌ ఏను స్క్రీనింగ్‌ టెస్టుగా పరిగణిస్తారు. పార్ట్‌ ఏ పరీక్షలోని ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. ఎంపికైనవారి పార్ట్‌ బీ సమాధానాలు మూల్యాంకనం చేస్తారు. తుది ఎంపికలో పార్ట్‌ ఏకు 25, పార్ట్‌ బీకి 75 శాతం వెయిటేజీ లభిస్తుంది. 

అర్హత: గ్రాడ్యుయేట్లు ఎవరైనా దరఖాస్తు చేసుకవోవచ్చు. ప్రవేశం కల్పించే సంస్థల వారీ స్వల్ప వ్యత్యాసాలు ఉంటాయి. బీటెక్, బీఆర్క్, డిజైన్, ఇంటీరియర్‌ డిజైన్, బీఎఫ్‌ఏ వీటిలో ఏదైనా నాలుగేళ్ల కోర్సు లేదా జీడీ ఆర్ట్స్‌ డిప్లొమా ప్రొగ్రాం (10+5 విధానంలో) చదివినవారికి అన్ని సంస్థల్లోనూ అవకాశం ఉంటుంది. అభ్యర్థులు ఎన్నిసార్లైనా పరీక్ష రాసుకోవచ్చు. వయసు నిబంధన లేదు.

ముఖ్యమైన తేదీలు (యూసీడ్, సీడ్‌)

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబరు 17

పరీక్ష తేదీ: జనవరి 23

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం

వెబ్‌సైట్లు: http://www.uceed.iitb.ac.in/, http://www.ceed.iitb.ac.in/
 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అది... జవాబులో తొలి భాగం!

‣ సర్కారీ కొలువు సాధ్యం ఇలా!

Posted Date: 12-10-2021


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌