• facebook
  • whatsapp
  • telegram

ఆసుపత్రులకు మేనేజర్లు!

కొవిడ్‌ నేపథ్యంలో ఆసుపత్రుల సమర్థ నిర్వహణకు ప్రాధాన్యం బాగా పెరిగింది. రోగులు, వైద్యులు, సహాయక సిబ్బంది...అందరి మధ్య సమన్వయం ఉన్నప్పుడే వైద్యశాలల కార్యకలాపాలు సజావుగా సాగుతాయి. ఈ వ్యవహారాలను పకడ్బందీగా నిర్వహించడానికి ప్రత్యేక కోర్సులూ, వాటిని పూర్తిచేసుకున్నవారికి మంచి హోదాతో ఉద్యోగాలూ ఉన్నాయి. ఆసుపత్రుల్లో, వైద్య విభాగాల్లో మేనేజీరియల్‌ సేవలందించాలనుకునేవారికి హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ మంచి ఎంపిక. కొన్ని కార్పొరేట్‌ వైద్య సంస్థలతోపాటు విశ్వవిద్యాలయాలు ఈ కోర్సును అందిస్తున్నాయి. దీన్ని పూర్తి  చేసుకున్నవారికి మంచి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. తాజాగా వివిధ సంస్థల ప్రవేశ ప్రకటనలు విడుదలైన సందర్భంలో వివరాలు..!

ఈ కెరియర్‌కు ఏం ఉండాలి? 

వైద్యరంగంపై ఆసక్తి, రోగులపై శ్రద్ధ 

సేవా దృక్పథం, సహనం 

ఎక్కువ సమయం విధుల నిర్వహణకు సంసిద్ధత

భావవ్యక్తీకరణ నైపుణ్యాలు

నాయకత్వ లక్షణాలు, మేనేజీరియల్‌ పరిజ్ఞానం

ఒత్తిడిలోనూ పనిచేయగలిగే నేర్పు

గడువులోగా పని పూర్తిచేయగల సమర్థత 

ప్రస్తుతం భారత్‌లో వైద్యరంగం మంచి వృద్ధి కనబరుస్తోంది. మన దగ్గర మెడికల్‌ టూరిజానికి ఆదరణ లభిస్తోంది. జీవనశైలి, కాలుష్యం, మారుతోన్న పరిస్థితులు...తదితరాల కారణంగా రోగాలబారినపడేవారి సంఖ్య పెరుగుతోంది. ఆరోగ్య స్పృహతో ముందస్తు వైద్యసేవలు వినియోగించుకునేవాళ్లు అధికమయ్యారు. దీంతో ఉన్న ఆసుపత్రులు వాటి సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయి. కొత్తవి ఏర్పాటవుతున్నాయి. రోజంతా, ఏడాది మొత్తమూ తెరిచే స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ వైద్య సంస్థలు విస్తరించాయి. దీంతో హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌/ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులకు గిరాకీ పెరిగింది.

మన దగ్గర ఆసుపత్రుల నిర్వహణ కోర్సులు పీజీ స్థాయిలోనే ఉన్నాయి. ఎక్కువ సంస్థలు ఏదైనా డిగ్రీ పూర్తిచేసుకున్నవారికి అవకాశం కల్పిస్తున్నాయి. కొన్నింటికి ఎంబీబీఎస్‌ లేదా ఇతర వైద్య, అనుబంధ కోర్సులు చదివినవారే అర్హులు. మాస్టర్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎంహెచ్‌ఏ), ఎంబీఏ (హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌) పేరుతో ఆసుపత్రులతోపాటు, ప్రసిద్ధ విద్యాసంస్థలు ఈ చదువులు అందిస్తున్నాయి. ఇప్పుడు పరిమిత సంఖ్యలో సంస్థలు బీఎస్‌సీ/ బీబీఏ హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోర్సు ప్రారంభించాయి.

ఈ కోర్సుల్లో చేరినవారు ఆసుపత్రులను సమర్థంగా ఎలా నిర్వహించాలో తెలుసుకుంటారు. సాంకేతికత, ఆర్థిక అంశాలు, నిర్వహణ నైపుణ్యాలు వీరికి బోధిస్తారు. ఫైనాన్స్‌ అకౌంటింగ్‌లో ప్రాథమికాంశాలు, హాస్పిటల్‌ సర్వీసులు, హెల్త్‌కేర్‌ మార్కెటింగ్, జనరల్‌ మేనేజ్‌మెంట్, ఆర్గనైజేషనల్‌ బిహేవియర్, హాస్పిటల్‌ ప్లానింగ్, పబ్లిక్‌ హెల్త్‌... తదితర అంశాలు కోర్సులో నేర్పుతారు. ముందుగా మేనేజ్‌మెంట్‌ రంగంలోని ఉమ్మడి అంశాలను బోధిస్తారు. వైద్యరంగ నిపుణులు, హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌లో అనుభవం ఉన్నవారితో తరగతులు నిర్వహిస్తారు. అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ సభ్యులు, మౌలిక వసతులు ఉన్న విద్యాసంస్థను ఎంచుకోవాలి.పేరున్న సంస్థల్లో కోర్సు పూర్తిచేసుకున్నవారికి ప్లేస్‌మెంట్లు దక్కుతున్నాయి. 

ఉద్యోగాలు ఎక్కడెక్కడ?

ఈ కోర్సులు చదివినవారికి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులతోపాటు హెల్త్‌ ఏజెన్సీలు, లేబొరేటరీలు, క్లినిక్‌లు, జాతీయ, అంతర్జాతీయ వైద్య విభాగ సంస్థలు, ఆరోగ్య బీమా సంస్థలు, వైద్య కళాశాలలు, హెల్త్‌కేర్‌ సెంటర్లు, నర్సింగ్‌ హోమ్‌లు, మానసిక చికిత్స కేంద్రాలు, పునరావాస కేంద్రాలు, పబ్లిక్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్లు, ఫార్మా సంస్థలు, హాస్పిటల్‌ సప్లై ఫర్మ్‌లు, మెడికల్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, హాస్పిటల్‌ కన్సల్టింగ్‌ ఫర్మ్‌లు, కార్పొరేట్‌ ఫార్మసీలు, డయాగ్నొస్టిక్‌ సెంటర్లు...మొదలైన చోట్ల అవకాశాలు లభిస్తాయి. నైపుణ్యం ఉన్నవారు విదేశాల్లోనూ ఉద్యోగాలు పొందుతున్నారు. పీజీ అనంతరం అనుభవం పొంది, సంబంధిత సర్టిఫికేషన్‌ కోర్సులు పూర్తిచేసుకున్నవారు లక్షల్లో వేతనాలు అందుకోవచ్చు. 

అడ్మినిస్ట్రేషన్‌ అసిస్టెంట్, ఆపరేషన్స్‌ అసిస్టెంట్‌ హోదాతో వీరి కెరియర్‌ ప్రారంభమవుతుంది. కొందరికి మేనేజర్‌ ఆపరేషన్స్, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ పోస్టులూ కేటాయిస్తారు. ఎంబీబీఎస్‌ అర్హతతో కోర్సులు చదివినవారికి అసిస్టెంట్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ హోదా కేటాయిస్తారు. తర్వాత డెప్యూటీ మెడికల్‌ సూపరింటెండెంట్, మెడికల్‌ సూపరింటెండెంట్‌ హోదాలు వస్తాయి. మంచి పనితీరు, అనుభవంతో చీఫ్‌ అడ్మినిస్ట్రేటర్‌ లేదా సీఈఓ స్థాయి వరకు చేరుకోవచ్చు.

కోర్సులందించే విద్యాసంస్థలు

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఎంబీఏ హెల్త్‌కేర్‌ అండ్‌ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు అందిస్తోంది. 60 శాతం మార్కులతో ఆయుర్వేద, హోమియో, యునాని, డెంటల్, ఫిజియోథెరపీ, నర్సింగ్, ఫార్మసీ, ఫార్మ్‌ డి, మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ, బయోమెడికల్, బయోటెక్నాలజీ బ్యాచిలర్‌ కోర్సులు పూర్తిచేసుకున్నవారు అర్హులు. ఎంబీబీఎస్‌లో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే మెడికల్‌/ హెల్త్‌ సెక్టార్‌లో పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూల్లో చూపిన ప్రతిభ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.  

ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో అపోలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్, హైదరాబాద్‌; డెక్కన్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్, హైదరాబాద్‌ మాస్టర్‌ డిగ్రీ ఇన్‌ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ (ఎండీహెచ్‌ఎం) కోర్సు అందిస్తున్నాయి. ఈ రెండు సంస్థల్లోకీ ఆగస్టు 30లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా అభ్యర్థులను కోర్సులోకి తీసుకుంటారు.సెప్టెంబరు 18న పరీక్ష నిర్వహిస్తారు..

అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా, హైదరాబాద్‌ (ప్రకటన వెలువడింది)

విశ్వవిశ్వాని, హైదరాబాద్‌ (ప్రకటన వెలువడింది. హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌లో ఎంబీఏతోపాటు బీబీఏ)

నిజామ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్, హైదరాబాద్‌ (ప్రకటన వెలువడుతుంది)

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రిసెర్చ్, జైపూర్‌ (ప్రకటన వెలువడింది)

దేవీ అహల్య విశ్వవిద్యాలయ, ఇండోర్‌ (ప్రకటన వెలువడింది)

టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్, ముంబై

భారతీ విద్యాపీఠ్‌ వర్సిటీ

సింబయాసిస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్, పుణె   

బిట్స్, పిలానీ  

దూరవిద్యలోనూ...

డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ఎంబీఏ హాస్పిటల్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సును అపోలో, కిమ్స్‌లతో కలిసి రెండేళ్ల వ్యవధితో అందిస్తోంది. ఒక్కో సంస్థ ద్వారా 78 మందిని కోర్సులోకి చేర్చుకుంటారు. ఫైన్‌ ఆర్ట్స్, ఓరియంట్‌ లాంగ్వేజ్‌లు మినహా ఏదైనా డిగ్రీలో 50 (ఎస్సీ, ఎస్టీలు 45) శాతం మార్కులతో ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూలతో కోర్సులోకి తీసుకుంటారు. ఆలస్య రుసుము లేకుండా ఆగస్టు 5లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.300 అపరాధ రుసుముతో ఆగస్టు 20 వరకు అవకాశం ఉంది. 

ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఎంబీఏ హాస్పిటల్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు అందిస్తోంది.  

సింబయాసిస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ ఏడాది వ్యవధి ఉన్న హాస్పిటల్‌ అండ్‌ హెల్త్‌ కేర్‌ మేనేజ్‌మెంట్‌ పీజీ డిప్లొమా కోర్సు అందిస్తోంది. 

ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ హెల్త్‌కేర్‌ అడ్మినిస్ట్రేటర్స్, ఏడాది వ్యవధి ఉన్న హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోర్సు అందిస్తోంది.

ఎంబీబీఎస్‌తో...

ఎంబీబీఎస్‌ పూర్తిచేసుకున్నవారు పీజీలో ఎండీ హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోర్సులో చేరవచ్చు. మూడేళ్ల వ్యవధితో ఈ కోర్సును కొన్ని వైద్య కళాశాలలు అందిస్తున్నాయి. పీజీ నీట్‌తో ప్రవేశాలు లభిస్తాయి. ఆర్మ్‌డ్‌ మెడికల్‌ కాలేజ్, పుణె; కస్తూర్బా మెడికల్‌ కాలేజ్, మణిపాల్‌; నిజామ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్, హైదరాబాద్‌; నారాయణ మెడికల్‌ కాలేజ్, నెల్లూరు తదితర సంస్థలు వైద్యుల కోసం కోర్సులు నడుపుతున్నాయి. ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్, న్యూదిల్లీ సొంత పరీక్షతో ఎండీ (హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌) కోర్సులో ప్రవేశం కల్పిస్తోంది.

Posted Date: 05-08-2021


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌