‣ వెయ్యి సంస్థల్లో ప్రవేశాలకు అవకాశం
దేశంలో మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి వివిధ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వాటిలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించే కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్టు (సీమ్యాట్) ప్రకటన ఇటీవల వెలువడింది. ఈ స్కోరుతో దేశవ్యాప్తంగా వెయ్యి సంస్థల్లో మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ పూర్తిచేసుకున్నవారు, ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారు అర్హులు.
సీమ్యాట్‌లో 400 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు చొప్పున వంద ప్రశ్నలు వస్తాయి. ఇందులో ఒక్కో సెక్షన్ నుంచి 20 చొప్పున 5 విభాగాల్లో ప్రశ్నలు ఉంటాయి. క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్, లాజికల్ రీజనింగ్, లాంగ్వేజ్ కాంప్రహెన్షన్, జనరల్ అవేర్నెస్, ఇన్నొవేషన్ అండ్ ఆంత్రప్రెన్యూర్‌షిప్ విభాగాల్లో ఈ ప్రశ్నలు అడుగుతారు. ఆన్లైన్ పరీక్ష వ్యవధి 3 గంటలు. రుణాత్మక మార్కులు ఉన్నాయి. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికీ ఒక్కో మార్కు చొప్పున తగ్గిస్తారు. ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది.
వీలైనన్ని మాక్ టెస్టులు
ప్రాథమిక అధ్యయనం పూర్తయిన తర్వాత సీమ్యాట్ పాత ప్రశ్నపత్రాలు పరిశీలించాలి. వీటిద్వారా ప్రశ్నలు ఏ విధంగా అడగవచ్చు, వాటి స్థాయి, అందుకు ఎలా సన్నద్ధం కావాలో తెలుస్తుంది. పరీక్షకు ముందు వీలైనన్ని మాక్ టెస్టులు రాయాలి. సూత్రాలు ఉపయోగించే విధానం తెలుసుకోవాలి. షార్ట్ కట్ మెథడ్స్‌పై పట్టు సాధించాలి.
ఐసెట్, మ్యాట్ సన్నద్ధత సీమ్యాట్‌కు ఉపయోగపడుతుంది. అందువల్ల ఆ పరీక్షల పాత, మాదిరి ప్రశ్నపత్రాలను అధ్యయనం చేయడం వల్ల ఎక్కువ మార్కులు పొందవచ్చు.
సీమ్యాట్ స్కోరుతో జమన్‌లాల్ బజాజ్, సిడెన్ హమ్, కేజే సోమయ, వెలింగ్కర్ - ముంబయి, గోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, గ్రేట్ లేక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ చెన్నై, ఐఎఫ్ఎంఆర్ చెన్నై, ఎంఐఎస్బీ ముంబయి, ఐఎంటీ నాగ్‌పూర్... తదితర సంస్థల్లో చేరవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఐపీఈ, గీతం..మొదలైన బీ స్కూళ్లలో అవకాశం ఉంటుంది.
ముఖ్యమైన అంశాలు
అర్హత: ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 17
దరఖాస్తు ఫీజు: జనరల్ పురుష అభ్యర్థులకు రూ.2000. మిగిలిన అందరికీ రూ.1000
పరీక్ష తేదీ: తర్వాత ప్రకటిస్తారు.
పరీక్ష కేంద్రాలు: ఏపీలో గుంటూరు, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. (అభ్యర్థులు ప్రాధాన్యం ప్రకారం 4 పరీక్ష కేంద్రాలు ఎంచుకోవాలి)
వెబ్సైట్: https://cmat.nta.nic.in/
ఈ అంశాల నుంచే ప్రశ్నలు..
‣ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్: అభ్యర్థి ప్రాథమిక ఆంగ్ల పరిజ్ఞానాన్ని పరిశీలించేలా ప్రశ్నలు వస్తాయి. ఖాళీలు పూరించడం, వ్యాక్యంలో తప్పును గుర్తించడం, సమానార్థాలు, వ్యతిరేక పదాలు, జాతీయాలు, సామెతలు, ప్రత్యక్ష, పరోక్ష వాక్యాలుగా మార్చడం, వాక్యంలో పదాలను క్రమ పద్ధతిలో అమర్చడం, కాంప్రహెన్షన్..తదితర విభాగాల్లో ప్రశ్నలు వస్తాయి. హైస్కూల్ స్థాయి ఆంగ్ల పాఠ్యపుస్తకాల్లోని వ్యాకరణాంశాలు బాగా చదువుకుంటే ఎక్కువ మార్కులు కష్టమేమీ కాదు.
‣ క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్: శాతాలు, నిష్పత్తి, సరాసరి, లాభనష్టాలు, కాలం -పని, కాలం-దూరం, వయసు నిర్ణయించడం, రైళ్లు, పడవ వేగాలు, క.సా.గు., గ.సా.భా., వైశాల్యాలు, ఘనపరిమాణాలు మొదలైన అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. వీటిలో దాదాపు అన్ని అంశాలూ హైస్కూల్ మ్యాథ్స్ పుస్తకాల్లోనివే. వాటిని బాగా చదువుకుని వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేస్తే సరిపోతుంది. నంబర్ ఎనాలజీ, నంబర్ క్లాసిఫికేషన్, ఫిగర్ ఎనాలజీ, వెన్ డయాగ్రమ్స్, నంబర్ సిరీస్, కోడింగ్ డీకోడింగ్, వర్డ్ బిల్డింగ్...మొదలైన విభాగాల నుంచీ ప్రశ్నలు అడుగుతారు. సంఖ్యలు, అంకెలపైనే ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. గణితంలోని ప్రాథమికాంశాలపై పట్టు సాధించడం ద్వారా వీటికి సమాధానాలు గుర్తించవచ్చు.
‣ లాజికల్ రీజనింగ్: ఇందులో అజంప్షన్స్, కన్క్లూజన్లు, ఇన్ఫరెన్సెస్, కాజ్ అండ్ ఎఫెక్ట్, ఎనలిటికల్ రీజనింగ్, లీనియర్ అరేంజ్మెంట్, బ్లడ్ రిలేషన్స్, నంబర్ సిరీస్, నాన్ వెర్బల్ రీజనింగ్.. తదితర అంశాల్లో ప్రశ్నలు ఉంటాయి.
‣ జనరల్ అవేర్నెస్: ఈ విభాగంలోని ప్రశ్నలకు ప్రత్యేక ప్రావీణ్యం అవసరం లేదు. సాధారణ పరిజ్ఞానంతోనే చాలావరకు ప్రశ్నలకు జవాబులు గుర్తించవచ్చు. ఎక్కువ ప్రశ్నలు దైనందిన జీవితంతో ముడిపడే ఉంటాయి. పర్యావరణాంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. వర్తమాన వ్యవహారాలనే ప్రశ్నలుగా అడుగుతారు. వీటితోపాటు భారత్- పొరుగు దేశాలు, చరిత్ర, సంస్కృతి, భూగోళం, ఆర్థిక వ్యవహారాలు, పాలిటీ, సైన్స్ అంశాల నుంచీ ప్రశ్నలు ఉంటాయి. హైస్కూల్ సోషల్, సైన్స్ పాఠ్యపుస్తకాలు చదువుకుంటే సరిపోతుంది. తాజా పరిణామాలపై అవగాహన పెంచుకోవాలి.
‣ ఇన్నొవేషన్ అండ్ ఆంత్రప్రెన్యూర్‌షిప్: ఇందులో ఏదైనా సందర్భానికి ఎలా స్పందిస్తారో తెలుసుకునేలా ప్రశ్నలు వస్తాయి. వివిధ కొత్త ఆవిష్కరణలపై అవగాహన పెంచుకోవాలి. కొత్త వ్యాపారం, స్టార్ట్అప్లకు సంబంధించి పథకాలు, ప్రోత్సాహకాలపై పరిజ్ఞానం ఉండాలి. తాజా వ్యాపార ధోరణులు, పెట్టుబడులు, ఎఫ్‌డీఐ, స్కిల్ డెవలప్మెంట్, వెంచర్ క్యాపిటలిస్ట్, ఫైనాన్షియల్ అసిస్టెన్స్...తదితర అంశాలు తెలుసుకోవాలి.
‣ Read Latest job news, Career news, Education news and Telugu news
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.