• facebook
  • whatsapp
  • telegram

డిజైన్‌ కోర్సుల్లోకి డాట్‌ దారి

‣ ప్రవేశాలకు ఎన్‌ఐడీ ప్రకటన విడుదల

సృజనకు పట్టం కట్టేవాటిలో డిజైన్‌ కోర్సులు ముందుంటున్నాయి. వీటిని జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో వివిధ సంస్థలు అందిస్తున్నాయి. అయితే ఈ కోర్సుల కోసమే ప్రత్యేకంగా కొన్ని సంస్థలు నెలకొల్పారు. వాటిలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్, అహ్మదాబాద్‌ ముఖ్యమైంది. దీనికి ఆంధ్రప్రదేశ్, హరియాణ, మధ్యప్రదేశ్, అసోంల్లో శాఖలు ఉన్నాయి. ఈ సంస్థల్లో బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్, మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సులు అందిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో వీటిలో ప్రవేశానికి ప్రకటన వెలువడింది. డిజైన్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు (డాట్‌) లో చూపిన ప్రతిభతో అవకాశం కల్పిస్తారు!

డాట్‌ ద్వారా అభ్యర్థుల పరిజ్ఞానం, నైపుణ్యాలు, ఆలోచనా సామర్థ్యం పరీక్షిస్తారు. బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌లో అన్ని సంస్థల్లోనూ కలిపి 425 సీట్లు ఉన్నాయి. వీటికి ఇంటర్‌ అన్ని గ్రూప్‌ల విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం కోర్సులు చదువుతున్న వారూ అర్హులే. వయసు 20 ఏళ్లలోపు ఉండాలి. అంటే జులై 1, 2002 తర్వాత జన్మించాలి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మూడేళ్లు; దివ్యాంగులకు అయిదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది.

డిజైన్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టులో ప్రిలిమ్స్, మెయిన్స్‌ ఉంటాయి. ప్రిలిమ్స్‌ పేపర్‌ వంద మార్కులకు ఉంటుంది. వ్యవధి 3 గంటలు. పరీక్ష పేపర్‌పై పెన్సిల్‌/ పెన్నుతో సమాధానాలు రాయాలి. ప్రశ్నపత్రం ఆంగ్లంలో ఉంటుంది. ప్రిలిమ్స్‌లో చూపిన ప్రతిభతో షార్ట్‌ లిస్టు చేసిన అభ్యర్థులకు మెయిన్స్‌ నిర్వహిస్తారు. తుది నియామకాలు ప్రిలిమ్స్, మెయిన్స్‌లో సాధించిన మార్కుల మెరిట్‌ ప్రకారం ఉంటాయి. మాదిరి ప్రశ్నపత్రాలను నిడ్‌ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. వాటితో పరీక్షపై అవగాహనకు రావచ్చు. 

ఇవీ కోర్సులు: 

బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ (బీడిజ్‌): ఈ కోర్సులన్నీ నాలుగేళ్ల వ్యవధితో ఉంటాయి. అహ్మదాబాద్‌ క్యాంపస్‌లో మొత్తం 125 సీట్లు ఉన్నాయి. వీటిలో యానిమేషన్‌ ఫిల్మ్‌ డిజైన్, సిరామిక్‌ అండ్‌ గ్లాస్‌ డిజైన్, ఎగ్జిబిషన్‌ డిజైన్, ఫిల్మ్‌ అండ్‌ వీడియో కమ్యూనికేషన్, ఫర్నిచర్‌ అండ్‌ ఇంటీరియర్‌ డిజైన్, గ్రాఫిక్‌ డిజైన్, ప్రొడక్ట్‌ డిజైన్, టెక్స్‌టైల్‌ డిజైన్‌ స్పెషలైజేషన్లు ఎంచుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, హరియాణ, మధ్యప్రదేశ్, అసోం క్యాంపస్‌ల్లో ఇండస్ట్రియల్‌ డిజైన్, కమ్యూనికేషన్‌ డిజైన్, టెక్స్‌టైల్‌ అండ్‌ అపారెల్‌ డిజైన్‌ కోర్సులు అందిస్తున్నారు. ప్రతి సంస్థలోనూ 75 సీట్లు ఉన్నాయి. ఒక్కో విభాగానికీ 25 సీట్లు లభిస్తున్నాయి. ఏపీలో నిడ్‌ క్యాంపస్‌ విజయవాడలో ఉంది.  

మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌: ఈ కోర్సుల వ్యవధి రెండున్నరేళ్లు. అయితే వీటిని అహ్మదాబాద్, బెంగళూరు, గాంధీనగర్‌ క్యాంపస్‌ల్లోనే అందిస్తున్నారు. యూజీలో ఉన్న కోర్సులన్నీ పీజీలో ఉన్నాయి. అదనంగా అపారెల్‌ డిజైన్, రిటైల్‌ ఎక్స్‌పీరియన్స్‌ డిజైన్, డిజిటల్‌ గేమ్‌ డిజైన్, ఇన్ఫర్మేషన్‌ డిజైన్, ఇంటరాక్షన్‌ డిజైన్, లైఫ్‌స్టైల్‌ డిజైన్, యాక్సెసరీస్‌ డిజైన్, న్యూ మీడియా డిజైన్, ఫొటోగ్రఫీ డిజైన్, స్ట్రాటజిక్‌ డిజైన్‌ మేనేజ్‌మెంట్, టాయ్‌ అండ్‌ గేమ్‌ డిజైన్, ట్రాన్స్‌పోర్టేషన్‌ అండ్‌ ఆటోమొబైల్‌ డిజైన్, యూనివర్సల్‌ డిజైన్‌ కోర్సులు ఉన్నాయి. ఒక్కో సంస్థలో ఒక్కో విభాగానికీ 19 చొప్పున సీట్లు కేటాయించారు. సిరామిక్‌ అండ్‌ గ్లాస్‌ డిజైన్, టాయ్‌ అండ్‌ గేమ్‌ డిజైన్‌ల్లో మాత్రం 12 చొప్పున సీట్లు లభిస్తున్నాయి. ఇంటర్‌ తర్వాత నాలుగేళ్ల బీడిజైన్‌ లేదా అనుబంధ కోర్సులు చదివినవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉపాధి అవకాశాలు

ఈ సంస్థల్లో చదివినవారు ప్రాంగణ నియామకాల్లో మేటి అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు. వర్ల్‌పూల్, విప్రో, టైటాన్, ఫిలిప్స్, టాటా, ఈబే, గోద్రెజ్, జేపీ మోర్గాన్, ఎల్‌జీ, మారుతీ సుజుకీ, మైక్రోసాఫ్ట్, మైండ్‌ట్రీ, ఒరాకిల్, రంగోలీ, రెడ్‌ బస్, తనిష్క్, వెల్‌స్పన్, జొమాటో...ఇలా ఎన్నో సంస్థలు వీరిని ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి. చదువుకున్న స్పెషలైజేషన్‌ ప్రకారం సంబంధిత సంస్థల్లో అవకాశాలు లభిస్తాయి. పీజీ పూర్తిచేసుకున్నవారు ఆకర్షణీయ వేతనాలతో, అత్యున్నత హోదాలు సొంతం చేసుకుంటున్నారు. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: డిసెంబరు 6

పరీక్ష తేదీ: జనవరి 2

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ. 

దరఖాస్తు ఫీజు: రూ.3000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.1500. 

వెబ్‌సైట్‌: https://www.nid.edu/home
 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అది... జవాబులో తొలి భాగం!

‣ సర్కారీ కొలువు సాధ్యం ఇలా!

Posted Date: 01-12-2021


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌