• facebook
  • whatsapp
  • telegram

హునార్ సె రోజ్‌గార్ తక్‌


* 8వ తరగతి చదివితే చాలు ఉద్యోగం

* 'హునార్ సె రోజ్‌గార్ తక్‌'తో సాధ్యం

* ఉపాధి కల్పిస్తున్న కేంద్ర పర్యాటక శాఖ

* శిక్షణ ఇచ్చి తీర్చి దిద్దుతున్న ఐహెచ్ఎం

ఈనాడు, హైదరాబాద్: ఇంజినీరింగ్, ఎంసీఏ, ఎంఏ, ఎమ్మెస్సీలు చదివి మంచి ఉద్యోగం దొరక్క... ఉపాధి అవకాశాలు పొందడానికి దారి లేక... నిరుద్యోగులుగా... చిరుద్యోగులుగా అనేకమంది మిగిలిపోతున్నారు. చదువుకు తగ్గ ఉద్యోగం దొరక్క... దొరుకుతుందనే నమ్మకం లేక అవస్థలు పడుతున్న వారు చాలామందే. అలాంటిది 8వ తరగతి చదివిన ఉద్యోగాలు వస్తున్నాయి. పలు హోటళ్లు వీరికి ప్రారంభ వేతనం రూ.8 వేలతో ఉపాధి కల్పిస్తున్నాయంటే ఆశ్చర్యంగా ఉంది కదూ...

యువతలో ఆత్మస్త్థెర్యాన్ని నింపుతూ, వారి కాళ్లపై వాళ్లను నిలబెడుతోంది... కేంద్ర పర్యాటక శాఖ. 'హునార్ సె రోజ్‌గార్ తక్' పథకాన్ని వారికోసం సిద్ధం చేసింది. ఒక్కొక్కరిపైనా రూ.20 వేల వరకూ వ్యయం చేస్తోంది. పలు కోర్సుల్లో ఉచిత వసతితో పాటు ఉచితంగా శిక్షణ ఇస్తోంది. రెండు నెలల కోర్సు పూర్తి చేసిన వారికి రూ.2 వేలు ఉపకార వేతనం లభిస్తుంది.

* ఇవీ కోర్సులు...

   ఫుడ్ ప్రొడక్షన్(ఆహారం తయారీ) 8 వారాలు కోర్సు, ఫుడ్, బేవరేజి సర్వీసు 6 వారాల కోర్సు, బేకరీ పదార్థాల తయారీ 8 వారాల కోర్సు, హౌస్‌కీపింగ్, ఈవెంట్ సహాయకులకు సంబంధించిన 6 వారాల కోర్సులు ఉన్నాయి. వీటి నిర్వహణకు ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ కేటరింగ్ టెక్నాలజీ, అప్త్లెడ్ న్యూట్రిషన్(ఐహెచ్ఎం) సహకారం తీసుకుంటోంది కేంద్ర పర్యాటక శాఖ. వీటిలో చేరాలంటే 8వ తరగతి చదివి, 18 ఏళ్ల నుంచి 28 ఏళ్ల లోపువారై ఉండాలి. టీసీ నకలు కాపీని, పై చదువులు చదివిన వారు పదో తరగతి ధ్రువపత్రం నకలు కాపీని, పాస్‌పోర్టు సైజు ఫొటోను దరఖాస్తుతో పాటు జతపరచాలి.
 

* ఎక్కడెక్కడ

   నగరంలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్‌తో పాటు హునార్ సే రోజ్‌గార్ తక్ పథకం కింద స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ తిరుపతిలోనూ.. మెదక్ జిల్లా కవేలీ గ్రామంలో స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్‌లో శిక్షణ అందిస్తున్నారు.
 

* శిక్షణ ఇలా...

   కోర్సుల్లో చేరిన వారికి ప్రతిరోజూ తరగతులు, ప్రాక్టికల్స్ ఉంటాయి. వారికి కూరలు, వివిధ ఆహార పదార్థాలు, బేకరీ తినుబండారాల తయారీ నేర్పిస్తారు. అతిథులకు స్వాగతం పలకడం మొదలు... వారికి వడ్డించే తీరు వరకూ అన్నీ చెబుతారు. అర్థమయ్యే రీతిలో పూర్తిగా ఇంగ్లిషులోనే శిక్షణ ఉంటుంది. ఇదే సమయంలో ఇంగ్లిషు నేర్చుకునే అవకాశం కల్పిస్తారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్(ఐహెచ్ఎం) బోధనా సిబ్బంది తరగతులు నిర్వహిస్తారు. ఇక్కడే వంటల తయారీ నుంచి వాటిని వడ్డించే వరకూ.. అన్ని విభాగాల్లోనూ శిక్షణ ఇస్తారు.
 

* నిరుద్యోగ యువతకు ఊతం -శంకర్‌రెడ్డి, సహాయ సంచాలకులు, కేంద్ర పర్యాటక శాఖ

   యువతలో నైపుణ్యం పెంపొందించి వారికి పర్యాటక రంగంలో ఉపాధి అవకాశాలను కల్పించడానికి కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ 'హునార్ సే రోజ్‌గార్ తక్' అనే పథకాన్ని చేపట్టి అమలు చేస్తోంది. 2010 నుంచి ఈ పథకం అమలులో ఉంది. శిక్షణ పూర్తి చేసుకున్న వారు ఇష్టపడితే ఆరు నెలల కోర్సులనూ ఐహెచ్ఎం సహకారంతో అందిస్తున్నాం. గైడింగ్, గోల్ఫ్ క్యాడీ మొదలైన అంశాల్లోనూ రెండు నుంచి 3 నెలల ఉచిత తర్ఫీదు ఇస్తున్నాం. వసతి, భోజనం, కోర్సుకు సంబంధించిన దుస్తులు, టూల్‌కిట్‌నూ అందిస్తున్నాం. మంచి ఉపాధి అవకాశాలనుచూపెడుతున్నాం. ఇది నిరుద్యోగ యువతకు ఊతం.
 

* పూర్తి స్థాయిలో... - సంజయ్ కె.ఠాకూర్, ఐహెచ్ఎం ప్రిన్సిపాల్

   విద్యానగర్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్‌లో దీర్ఘకాలిక కోర్సులు చేసే వారితో సమానంగా వీరికి శిక్షణ ఇస్తున్నాం. ఏడాదికి రూ.80 వేలు చెల్లించి బీఎస్‌సీ హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో చేరినవారికి ఎవరైతే పాఠాలు చెబుతారో వారే 'హునార్ సే రోజ్‌గార్ తక్' పథకం కింద ఎంపికైన వారికీ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకూ 1,904 మందికి శిక్షణ ఇచ్చాం. ప్రస్తుతం 168 మంది ఉన్నారు. నేరుగా స్టార్ హోటళ్ల వారు వచ్చి వీరిని ఉద్యోగులుగా ఎంపిక చేసుకుంటారు.
 

* కేకుల తయారీ వచ్చేసింది- మమత

   పదో తరగతి చదువుకున్నా. తర్వాత చదువుకుందామంటే కుదర్లేదు. మా ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఉద్యోగం చేయాల్సి వచ్చింది. ఇక్కడి శిక్షణ గురించి తెలుసుకున్నా. ప్రకటన రాగానే దరఖాస్తు చేసుకున్నా కేకుల తయారీ వచ్చేసింది.
 

* బేకరీ వంటకాల తయారీ నేర్చుకుంటున్నా- కుమారి

   మా వారు మార్కెటింగ్ ఆఫీసరు. ఇద్దరు పిల్లలున్నారు. ఏదైనా మంచి వ్యాపారం చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉండాలనుకుంటున్నా. ఇక్కడ బేకరీ వంటకాల తయారీ నేర్చుకుంటున్నా. పదో తరగతి చదువుతోనే సంపాదన పరురాలిని అవుతున్నందుకు సంతోషంగా ఉంది.
 

* స్టార్ హోటల్‌లో చేరతా - అభిషేక్

నేను డిగ్రీ చదువుతుండగా ఈ ప్రకటన చూశా. వెంటనే ఇక్కడికి వచ్చా. ఇంతకు ముందు కోర్సు పూర్తి చేసిన వారిని సంప్రదించా. వారికి ఇప్పటికే ఉద్యోగావకాశాలు లభించాయి. మాది మహారాష్ట్ర... అక్కడ మాకో రెస్టారెంటు ఉంది. శిక్షణపూర్తయ్యాక అందులో కానీ, ఏదైనా స్టార్ హోటల్‌లో కానీ చేరతా.
 

* పూర్తి వివరాలకు

   బేగంపేటలోని పర్యాటక భవన్‌లో ఉన్న కేంద్ర పర్యాటక శాఖ కార్యాలయం (ఇండియన్ టూరిజం), ఫోన్: 040-2340 9199. విద్యానగర్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్, ఫోన్: 040-27427569, స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ తిరుపతి 9701343043, మెదక్‌లోని ఇన్‌స్టిట్యూట్, ఫోన్ 9553107090.
 

Posted Date: 16-03-2022


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌