• facebook
  • whatsapp
  • telegram

పర్యాటక కోర్సుల్లో ప్రవేశాలు

ఎన్‌సీహెచ్‌ఎం- జేఈఈ 2024 నోటిఫికేషన్‌ వివరాలు


ఎక్కువమందికి ఉపాధి కల్పిస్తూ ఆతిథ్య రంగం విస్తరిస్తోంది. పర్యాటకానికి సమాజంలో ఆదరణ పెరుగుతోంది. బయట తినడం, నచ్చిన ప్రాంతల్లో సేదదీరడం సాధారణమయ్యాయి. దీంతో ఈ రంగంలో నైపుణ్యం ఉన్నవారికి కొలువులు లభిస్తున్నాయి. ఆసక్తి ఉన్న ఇంటర్మీడియట్‌ విద్యార్థులు జాతీయ స్థాయిలో పేరున్న సంస్థల్లో హాస్పిటాలిటీ అండ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు పూర్తిచేసుకుని అవకాశాల బాట పట్టవచ్చు. వీటిలో ప్రవేశానికి ఎన్‌సీహెచ్‌ఎం- జేఈఈ 2024 ప్రకటన వెలువడింది! 


సందర్భం ఎలాంటిదైనప్పటికీ దాన్ని మరపురాని వేడుకగా జరుపుకునే సంస్కృతి పెరుగుతోంది. ఇష్టమైన ప్రాంతాలకు వెళ్లటం ఇప్పుడు కాకుంటే మరెప్పుడంటూ ప్రయాణాలకు సై అంటున్నారు. బయట ఆహారాన్ని భలేగా ఆస్వాదిస్తున్నారు. దీంతో ఆతిథ్యరంగంలో కొలువులకు గిరాకీ పెరుగుతోంది. మేటి సంస్థల్లో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు పూర్తిచేసుకున్నవారు సులువుగానే ఉద్యోగాలు పొందుతున్నారు. అలాగే స్వయం ఉపాధితోనూ రాణిస్తున్నారు. అందువల్ల ఆసక్తి ఉన్నవారు దేశంలో పేరున్న ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ (ఐహెచ్‌ఎం) సంస్థల్లో చదవడానికి తొలి ప్రాధాన్యం ఇవ్వొచ్చు. ఇవన్నీ నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహించే నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ - జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (ఎన్‌సీహెచ్‌ఎం- జేఈఈ)తో ప్రవేశం కల్పిస్తున్నాయి. 78 సంస్థల్లో 12 వేల సీట్లు 

పరీక్షలో ప్రతిభతో బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్‌ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోర్సులో చేరవచ్చు. దీనికి జేఎన్‌యూ గుర్తింపు ఉంది. ఈ స్కోరుతో మొత్తం 78 సంస్థల్లో అవకాశం లభిస్తుంది. వీటిలో కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తోన్న 21 జాతీయ ఐహెచ్‌ఎంలు ఉన్నాయి. మిగిలినవి రాష్ట్ర స్థాయి, పబ్లిక్‌ సెక్టార్‌ అండర్‌ టేకింగ్, ప్రైవేటు సంస్థలు. తెలుగు రాష్ట్రాల్లో కేంద్రం ఆధ్వర్యంలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ (ఐహెచ్‌ఎం) హైదరాబాద్, రాష్ట్రీయ సంస్థలైన డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ హైదరాబాద్, స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ తిరుపతి, తెలంగాణ స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ సంగారెడ్డి, శ్రీశక్తి హైదరాబాద్‌.. ఎన్‌సీహెచ్‌ఎం-జేఈఈతో ప్రవేశం కల్పిస్తున్నాయి. ఈ పరీక్ష స్కోరుతో దేశవ్యాప్తంగా పలు ఇతర సంస్థల్లోనూ చేరవచ్చు.
దేశవ్యాప్తంగా అన్ని సంస్థల్లోనూ మొత్తం 11995 సీట్లు ఉన్నాయి. ఐహెచ్‌ఎం- హైదరాబాద్‌లో 285, వైఎస్‌ఆర్‌ నిథమ్, హైదరాబాద్‌లో 120, తిరుపతి, మెదక్‌ ఐహెచ్‌ఎంలు ఒక్కో దానిలో 60, శ్రీశక్తిలో 120 సీట్లు ఉన్నాయి.  ఆన్‌లైన్‌ పరీక్షలో

పరీక్ష ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. మొత్తం 200 ప్రశ్నలు. ఇందులో న్యూమరికల్‌ ఎబిలిటీ అండ్‌ ఎనలిటికల్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి 30, రీజనింగ్‌ అండ్‌ లాజికల్‌ డిడక్షన్‌ 30, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌ 30, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 60, సర్వీస్‌ సెక్టార్‌ ఆప్టిట్యూడ్‌ 50 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 3 గంటలు. ప్రతి సరైన సమాధానానికీ 4 మార్కులు. తప్పు జవాబుకు ఒక మార్కు తగ్గిస్తారు. ప్రశ్నలు ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటాయి.కోర్సులో ఇలా..

బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్‌ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోర్సు వ్యవధి మూడేళ్లు. మొత్తం 6 సెమిస్టర్లు. ఇందులో.. ఫుడ్‌ ప్రొడక్షన్, ఫుడ్‌ అండ్‌ బేవరేజ్‌ సర్వీస్, అకామడేషన్‌ ఆపరేషన్, ఫ్రంట్‌ ఆఫీస్, అకౌంటింగ్, కమ్యూనికేషన్, హోటల్‌ ఇంజినీరింగ్, న్యూట్రిషన్, ఫుడ్‌ సైన్స్, కంప్యూటర్స్, ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ క్వాలిటీ, ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్, ఫెసిలిటీ ప్లానింగ్, స్ట్రాటజిక్‌ మేనేజ్‌మెంట్‌ అంశాల్లో అధ్యయనం చేస్తారు. కోర్సు చివరలో పేరున్న హోటల్‌లో ప్రాజెక్టు వర్కు పూర్తిచేయాలి. బీఎస్సీ హాస్పిటాలిటీ కోర్సు విడిగా శాకాహారుల కోసమూ అందుబాటులో ఉంది. ఏయే ఉద్యోగాలు?

మేటి సంస్థల్లో కోర్సు పూర్తిచేసుకున్నవారికి అవకాశాలకు ఇబ్బంది లేదు. జాతీయ సంస్థల్లో చదువుకున్నవారిలో ఎక్కువమంది ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాలు సొంతం చేసుకుంటున్నారు. ఫైవ్‌ స్టార్‌ హోటళ్లు, రిసార్ట్‌లు, ఫుడ్‌ చెయిన్‌ సంస్థలు, హాలీడే హోమ్‌లు వీరిని తీసుకుంటున్నాయి. చదివిన స్పెషలైజేషన్‌ ప్రకారం... కిచెన్‌ మేనేజ్‌మెంట్, హౌస్‌ కీపింగ్‌ మేనేజ్‌మెంట్, ఫ్లైట్‌ కిచెన్స్‌/ ఆన్‌బోర్డ్‌ ఫ్లైట్‌ సర్వీసెస్, వివిధ సేవా పరిశ్రమల్లో గెస్ట్‌/ కస్టమర్‌ రిలేషన్‌ ఎగ్జిక్యూటివ్, ఫాస్ట్‌ఫుడ్‌ చెయిన్స్‌లో ఎగ్జిక్యూటివ్‌గా చేరవచ్చు. క్యాటరింగ్‌ సంస్థలు, షిప్పుల్లో సప్లై, కిచెన్‌ సెక్షన్‌ ఉద్యోగాలు; పర్యాటక సంస్థలు, కేంద్రాల్లో వివిధ రకాల సేవలు, బహుళజాతి కంపెనీల క్యాంటీన్లు, హౌస్‌ కీపింగ్‌ నిర్వహణ, హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాలల్లో ఫ్యాకల్టీ, సొంతంగా ఫుడ్‌ చెయిన్‌ ప్రారంభించడం...తదితర అవకాశాలు దక్కుతాయి. వీరు ఆర్మీలో జూనియర్‌ కమిషన్డ్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు పోటీపడవచ్చు.ఎలా సిద్ధం కావాలి?

  ముందుగా పాత ప్రశ్నపత్రాలు నిశితంగా పరిశీలించాలి. ప్రశ్నలు ఏ అంశాల నుంచి, ఏ స్థాయిలో అడుగుతున్నారో తెలుసుకుని సన్నద్ధతను అందుకు తగ్గట్టుగా మలచుకోవాలి. 
  సగం ప్రశ్నలు సులువుగా, మిగిలినవి మధ్యస్థంగా ఉంటాయి. కేంద్రీయ ఐహెచ్‌ఎంల్లో సీటు పొందడానికి మేటి స్కోరు    తప్పనిసరి. 
 న్యూమరికల్‌ ఎబిలిటీ, ఎనలిటికల్‌ ఆప్టిట్యూడ్‌ విభాగంలోని ప్రశ్నలకు 8, 9, 10 తరగతుల గణిత పుస్తకాలు బాగా చదవాలి. వయసు, పని-వేతనం, చైన్‌ రూల్, సమయం-పని విభాగాల్లో ప్రశ్నలు వస్తున్నాయి. గుణింతాలు, కూడికలు, తీసివేతలు, భాగహారం, కసాగు, గసాభా, సగటు, నిష్పత్తి, భిన్నాలు మొదలైనవాటిలో ప్రాథమికాంశాలపై దృష్టి సారించాలి. ప్రతి అంశంలోనూ వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి. 
 రీజనింగ్‌ అండ్‌ లాజికల్‌ డిడక్షన్‌ విభాగంలోని ఎక్కువ ప్రశ్నలకు బాగా ఆలోచించి సమాధానం గుర్తించవచ్చు. బ్లడ్‌ రిలేషన్లు, సిరీస్, స్టేట్‌మెంట్‌ అండ్‌ అజంప్షన్స్, వెర్బల్‌ రీజనింగ్‌ విభాగాలపై ఎక్కువ దృష్టి సారించాలి. 
 జీకే, కరంట్‌ అఫైర్స్‌ విభాగంలో జనరల్‌ నాలెడ్జ్‌ (స్టాక్‌ జీకే) నుంచే ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. హిస్టరీ, పాలిటీ, జనరల్‌ సైన్స్‌ల్లోని ప్రాథమికాంశాల నుంచి వీటిని అడుగుతున్నారు. అందువల్ల 8,9,10 తరగతుల సైన్స్, సోషల్‌ పుస్తకాల్లోని ముఖ్యాంశాలు బాగా చదువుకోవాలి. రాజధానులు, కరెన్సీ, పార్లమెంట్లు, క్రీడలు-విజేతలు, అవార్డులు, పుస్తకాలు-రచయితలు..వీటిని ప్రాధాన్యంతో చదివితే సరిపోతుంది. 
 ఆంగ్ల విభాగంలో ప్రశ్నలు మరీ కష్టమేమీ కాదు. సమానార్థాలు, వ్యతిరేక పదాలు, కంజెంక్షన్లు, ప్రిపొజిషన్లు, పాసేజ్‌ మొదలైన విభాగాల నుంచి వీటిని అడుగుతారు. హైస్కూల్‌ పాఠ్యాంశాల్లోని వ్యాకరణాంశాలు బాగా అధ్యయనం చేయాలి.  
 సర్వీస్‌ సెక్టార్‌ ఆప్టిట్యూడ్‌ విభాగంలోని ప్రశ్నలు ఆతిథ్య, సేవా రంగాల నుంచి వస్తాయి. ప్రశ్నను బాగా చదివి, ఆలోచించి, విచక్షణతో సమాధానం గుర్తించవచ్చు. ఆతిథ్య పరిశ్రమ, సేవరంగంపై అవగాహన పెంచుకుంటే ఎక్కువ మార్కులు పొందవచ్చు. 
 పరీక్షకు ముందు ఆరేడు మాక్‌ టెస్టులు రాస్తే ప్రయోజనం. పరీక్షవారీ మార్కులు సరిచూసుకుని, ఫలితాలు విశ్లేషించుకుంటూ, సన్నద్ధతను మెరుగుపరచుకోవాలి. ఇలా పరీక్ష రాస్తే మంచి ర్యాంకుతో మేటి సంస్థలో సీటు సొంతం చేసుకోవచ్చు. ఉన్నత విద్య

బీఎస్సీ తర్వాత మరింత ప్రావీణ్యం, స్పెషలైజేషన్‌ కోరుకున్నవారు రెండేళ్ల వ్యవధితో ఎమ్మెస్సీ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు పూర్తి చేసుకోవచ్చు. చాలా ఐహెచ్‌ఎంలు దీన్ని అందిస్తున్నాయి. కోర్సు అనంతరం వీరు బోధనలో రాణించవచ్చు లేదా ఆతిథ్య రంగంలో ఉన్నత స్థాయి హోదాలతో అవకాశం పొందవచ్చు. బీఎస్సీ తర్వాత పీజీ డిప్లొమా కోర్సుల్లోనూ చేరవచ్చు. వీటిని ఏడాది/ ఏడాదిన్నర వ్యవధితో పలు సంస్థలు అందిస్తున్నాయి. కొన్ని కార్పొరేట్‌ హోటళ్లలోనూ ఈ కోర్సులు పూర్తిచేసుకుని అక్కడే ఉపాధి పొందవచ్చు. ఐటీసీ, వెల్‌కమ్‌ గ్రూపులు వీటిని ప్రత్యేకంగా అందిస్తున్నాయి. కోర్సు పూర్తయిన వెంటనే ఆ సంస్థల్లోనే మంచి హోదా, వేతనంతో ఉద్యోగంలోకి చేరిపోవచ్చు. 

కోర్సు: బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్‌ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అర్హత: ఇంటర్మీడియట్‌. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్‌ జండర్‌    రూ.450. ఈడబ్ల్యుఎస్‌ రూ.700. మిగిలిన అందరికీ రూ.1000 ఆన్‌లైన్‌ దరఖాస్తులు: మార్చి 31 సాయంత్రం 5 వరకు స్వీకరిస్తారు. 

పరీక్ష తేదీ: మే 11పరీక్ష కేంద్రాలు: ఏపీలో.. గుంటూరు, నెల్లూరు, తిరుపతి, విశాఖపట్నం. తెలంగాణలో.. హైదరాబాద్, వరంగల్‌. 

వెబ్‌సైట్‌: https://exams.nta.ac.in/NCHM
 

 

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ బెల్‌లో ఇంజినీర్‌ నియామకాలు

‣ సివిల్స్‌ సన్నద్ధత!

‣ ఉద్వేగాల నియంత్రణ.. ఉద్యోగాలకు సాధన

‣ పీఎన్‌బీలో 1,025 కొలువులు

Posted Date: 22-02-2024


 

కోర్సులు

మరిన్ని