• facebook
  • whatsapp
  • telegram

విజువల్‌ కమ్యూనికేషన్‌ మీడియా

సృజనాత్మకత, సాంకేతికతల అద్భుత మేళవింపే విజువల్‌ మీడియా. సమాచార సాంకేతికత (ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ) వేగంగా అభివృద్ధి చెందడంలో విజువల్‌ మీడియా ప్రాచుర్యం పొంది యువతకు చక్కటి ఉపాధి మార్గంగా నిలుస్తోంది. దీని వినియోగ ప్రాముఖ్యం లేని రంగమే లేదని చెప్పవచ్చు. ఫిల్మ్‌ మేకింగ్‌, టెలివిజన్‌ చానల్స్‌ కంటెంట్‌ ప్రొడక్షన్‌, వీడియో అండ్‌ మొబైల్‌ గేమింగ్‌ లాంటి వినోద రంగాల్లోనూ దృశ్యమాధ్యమ ప్రాముఖ్యం పెరిగింది. ఇంకా ఎడ్యుకేషన్‌, ఆర్కిటెక్చర్‌, ఇంజినీరింగ్‌, మెడికల్‌ టెక్నాలజీ, అడ్వర్‌టైజింగ్‌, వెబ్‌ డిజైనింగ్‌, ఫ్యాషన్‌ డిజైనింగ్‌ వంటి రంగాల్లో విజువలైజేషన్‌ ప్రాముఖ్యం ఎంతో!
 

విజువల్‌ కమ్యూనికేషన్‌ మీడియాలో ఇమేజ్‌, వీడియో, ఆడియో, గ్రాఫిక్స్‌ యానిమేషన్‌ మొదలైన మాధ్యమాల ద్వారా దృశ్యం (వీడియో), శబ్దం (ఆడియో), సమాచారం (కంటెంట్‌) అనేవాటిని అత్యున్నత స్థాయిలో చూపరులను ఆకట్టుకునేలా వ్యక్తీకరిస్తారు.ఈ రంగంలోకి ప్రవేశించాలనే ఆసక్తి ఉన్నవారికి ఫిల్మ్‌మేకింగ్‌ అండ్‌ టీవీ చానల్స్‌ కంటెంట్‌, ప్రొడక్షన్‌ టెక్నాలజీ, యానిమేషన్‌, వీఎఫ్‌ఎక్స్‌ లాంటి సాంకేతిక విభాగాల్లో శిక్షణ అవసరం. దీనికి ఎటువంటి ప్రత్యేక విద్యార్హతతో, వయసుతో నిమిత్తం లేదు. ఆసక్తి, అంకితభావం, శ్రమించే గుణం, పోటీతత్వం, విషయాన్ని స్పష్టంగా సృజనాత్మకతతో వ్యక్తీకరించగల నైపుణ్యం వంటివే అర్హతలు.

ఫిల్మ్‌మేకింగ్‌ & టీవీ ప్రొడక్షన్‌ టెక్నాలజీ

   వూహలకు అందని అద్భుతాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తూ హాలీవుడ్‌, బాలీవుడ్‌, టాలీవుడ్‌ సాంకేతిక నిపుణులు తమ ప్రతిభకు పదును పెడుతూనే ఉన్నారు.

   సాంకేతికతను జోడించి వెండితెరపై ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తున్న ఈ పరిశ్రమకు తెర వెనుక బోలెడు అవకాశాలున్నాయి. ఫిల్మ్‌& టెలివిజన్‌ టెక్నాలజీ రంగంలో దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, యానిమేషన్‌ గ్రాఫిక్స్‌, కంపోజిటింగ్‌, ఎడిటింగ్‌ విభాగాల్లో అవకాశాలు అనేకం. ఈ విభాగాలకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ పొంది, సృజన ప్రదర్శిస్తే ఉన్నత స్థానానికి ఎదగడం ఖాయం.

   సినిమా, బ్రాడ్‌కాస్ట్‌ కెరియర్‌ పరిమితి విస్తృతంగా ఉండటంతో ఆకాశవాణి, దూరదర్శన్‌, ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో, ఫొటో మీడియా డివిజన్‌, నేషనల్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌, చిల్డ్రన్స్‌ ఫిల్మ్‌ సొసైటీ, డైరక్టరేట్‌ ఆఫ్‌ అడ్వర్‌టైజింగ్‌, విజువల్‌ పబ్లిసిటీ లాంటి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలున్నాయి. ఇంకా వివిధ ఫిల్మ్‌-ప్రొడక్షన్స్‌, టెలివిజన్‌ ఛానల్స్‌, అడ్వర్త్టెజింగ్‌ కార్పొరేట్‌ సంస్థల్లో కొలువులు పొందే అవకాశముంది. సరైన శిక్షణ పొందితే ప్రతిభను బట్టి టాలీవుడ్‌ స్థాయి నుంచి హాలీవుడ్‌ చిత్రాలకు పనిచేయగల నిపుణులుగా తయారుకావొచ్చు. ఈ రంగంలో జీతభత్యాలు ఆకర్షణీయం. పేరు ప్రఖ్యాతులు సంపాదించగలిగే అవకాశాలు పుష్కలం. అందుకే యువతరం ఉత్సాహంతో ఈ రంగం వైపు ఆసక్తి చూపుతోంది.

Posted Date: 27-08-2021


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌