• facebook
  • whatsapp
  • telegram

ఆక‌ర్ష‌ణీయ‌మైన కెరియ‌ర్‌కు యాక్చూరియ‌ల్ సైన్స్‌!

ఏసెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌

అర్హ‌త ఇంట‌ర్మీడియ‌ట్‌

బీమా, అనుబంధ రంగాలపై ఆసక్తి ఉన్నవారు యాక్చూరియల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (ఏసెట్‌)లో అర్హత సాధించడం తప్పనిసరి. ఇంటర్మీడియట్‌ పూర్తిచేసుకున్నవారు ఈ పరీక్ష రాసుకోవచ్చు. ఏసెట్‌ ప్రకటన వెలువడిన నేపథ్యంలో ఆ వివరాలు...

భవిష్యత్తులో ఆకర్షణీయ అవకాశాలు అందించే కెరియర్లలో యాక్చూరియల్‌ సైన్స్‌ ఒకటి. బీమా, అనుబంధ రంగాలు, ఆర్థిక, మదింపు సంస్థల్లో మంచి భవితను ఆశించేవారూ యాక్చూరియల్‌ సైన్స్‌తో తమ ఆశయాలను నెరవేర్చుకోవచ్చు. అంకెలపై ఆసక్తి, గణితంపై పట్టు, తర్క పరిజ్ఞానం ఉన్నవారు ఈ కోర్సులో చేరడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. ఆసక్తి ఉన్నవారు ముందుగా ఏసెట్‌లో అర్హత సాధించాలి. 

ఇంట్లోంచే ఆన్‌లైన్‌ పరీక్ష ..

ఏసెట్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. కొవిడ్‌ నేపథ్యంలో ఇంటి నుంచే దీన్ని రాసుకోవచ్చు. పరీక్ష వ్యవధి 3 గంటలు. ఇందులో 70 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున సెక్షన్‌ ఎలో 45 ప్రశ్నలు అడుగుతారు. సెక్షన్‌ బిలో 20 ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నకు రెండేసి మార్కులు కేటాయించారు. సెక్షన్‌ సిలో 5 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కోదానికి 3 మార్కులు. సబ్జెక్టులవారీ మ్యాథ్స్‌ 30, స్టాటిస్టిక్స్‌ 30, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ 15, ఇంగ్లిష్‌ 15, లాజికల్‌ రీజనింగ్‌ 10 మార్కులకు ఉంటాయి. రుణాత్మక మార్కులు లేవు. పరీక్షలో అర్హత సాధించడానికి కనీసం 50 శాతం మార్కులు తప్పనిసరి.  ఈ పరీక్షకు సంబంధించిన సిలబస్, చదవాల్సిన రిఫరెన్స్‌ పుస్తకాలు వెబ్‌సైట్‌లో లభిస్తాయి. స్కోరు మూడేళ్లపాటు చెల్లుబాటవుతుంది. ఈ వ్యవధిలోగా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యాక్చురీస్‌ ఆఫ్‌ ఇండియా (ఐఏఐ)లో సభ్యత్వాన్ని పొందవచ్చు. ఇలా చేరినవారు యాక్చూరియల్‌ సైన్స్‌ కోర్సులో వివిధ పేపర్లను పూర్తిచేసుకోవడానికి వీలవుతుంది.  

13 పేపర్లు...

ప్రవేశ పరీక్షలో అర్హత సాధించినవారు యాక్చూరీ ఫెలో కావడానికి వివిధ దశల్లో 13 పేపర్లు పూర్తిచేయాలి. స్టేజ్‌ 1 కోర్‌ ప్రిన్సిపల్స్‌లో 7, స్టేజ్‌ 2 కోర్‌ ప్రాక్టీసెస్‌లో 3 పేపర్లు అందరికీ ఉమ్మడిగా ఉంటాయి. ఈ రెండు దశలనూ పూర్తిచేసినవారిని అసోసియేట్‌గా పరిగణిస్తారు. స్టేజ్‌ 3 స్పెషలిస్ట్‌ ప్రిన్సిపల్స్‌లో 8 పేపర్లు ఉంటాయి. వీటిలో నచ్చిన రెండింటిని ఎంపిక చేసుకుని పూర్తిచేయాలి. స్టేజ్‌ 4 స్పెషలిస్ట్‌ అడ్వాన్స్‌డ్‌లో ఏదైనా ఒక పేపర్‌ పూర్తిచేయాలి. నాలుగు దశలూ (13 పేపర్లు) పూర్తిచేసుకుంటే ఫెలోగా వ్యవహరిస్తారు. అయితే ఒక్క స్టేజ్‌-1 పాసైనా కొలువు లభిస్తుంది. 13 పేపర్లూ పూర్తిచేసుకున్నవారికి నెల జీతం లక్షల్లో ఉంటుంది. వీరికి ఇన్సూరెన్స్, రీ ఇన్సూరెన్స్, ఫైనాన్స్, అకడమిక్, రెగ్యులేటరీ.. తదితర సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయి.

అర్హత: ఇంటర్‌ ఉత్తీర్ణత. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.

రిజిస్ట్రేషన్లు: అక్టోబరు 26 సాయంత్రం 3 వరకు స్వీకరిస్తారు.

పరీక్ష తేదీ: డిసెంబరు 11

ప్రవేశపత్రాలు: నవంబరు 26 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఫలితాలు: డిసెంబరు 18న వెలువడతాయి

వెబ్‌సైట్‌: http://www.actuariesindia.org/index.aspx

Posted Date: 31-08-2021


 

ప్రవేశ పరీక్షలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌