• facebook
  • whatsapp
  • telegram

లెక్కలొస్తే.. లక్షల్లో జీతం!

ఆర్థిక గణకులకు మంచి డిమాండ్ 

కనీస విద్యార్హత ఇంటర్మీడియట్

ఏసెట్-2021 దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 27

యాక్చూరియల్ సైన్స్.. అతి కొద్ది మందికే తెలిసిన కోర్సుల్లో ఇదీ ఒకటి. గత అనుభవాలు, వర్తమాన పరిస్థితుల ఆధారంగా అంచనాలను జోడించి రాబోయే ఆర్థిక చిత్రాన్ని విశ్లేషించేవారే యాక్చురీలు (గ‌ణ‌కులు). దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ వీరికి చాలా డిమాండ్ ఉంది. ఆర్థిక సేవలందిస్తున్న సంస్థలన్నీ యాక్చూరియల్ నిపుణుల నివేదికల ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటాయి. ఆ నైపుణ్యాన్ని సంపాదించాలంటే కోర్సు చదవాల్సిందే. ఇన్‌స్టిట్యూట్ ‌ఆఫ్ యాక్చూరీస్ ఆఫ్ ఇండియా (ఐఏఐ) ఆధ్వర్యంలో నిర్వహించే యాక్చూరియల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏఎస్ట్) ద్వారా వివిధ విశ్వ‌విద్యాయాలు ప్రవేశాలు కల్పిస్తాయి. ప్ర‌స్తుతం ఈ కోర్సుకు సంబంధించి నోటిఫికేష‌న్ వెలువ‌డింది.

కోర్సులో చేరాలంటే అర్హత?

ఆసక్తి ఉండి ఈ కోర్సులో చేరాలనుకునే అభ్యర్థులు ఐఏఐ నిర్వహించే ఏసెట్-2021 ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇందుకు ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా ఇంటర్మీడియట్‌/ త‌త్సమాన ప‌రీక్ష‌ల్లో అర్హత సాధించి ఉండాలి. మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్ సబ్జెక్టులపై పట్టున్నవారు యాక్చూరియల్ సైన్స్‌ను సులువుగా అర్థం చేసుకోవచ్చు. 

దరఖాస్తు ఎలా చేయాలి?

అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత వెబ్‌సైట్‌లో గడువులోగా తమ వివరాలను నమోదు చేయాలి. ఆన్‌లైన్‌రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 27, 2021తో ముగుస్తుంది. మార్చి 27, 2021 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష నిర్వహిస్తారు. 

పరీక్ష విధానం

యాక్చూరియల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏసెట్) ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అభ్యర్థులు హోమ్ బేస్డ్ ఆన్ ‌లైన్‌ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్ష రాసే అభ్యర్థులు టెక్నికల్ వెబ్ కెమెరా, మైక్రోఫోన్ ఉన్న పర్సనల్ ల్యాప్‌టాప్‌లేదా డెస్క్‌టాప్ సౌక‌ర్యం కలిగి ఉండాలి. ఇంటర్నెట్, 2జీబీ ర్యామ్, కనీసం 64ఎంబీ గ్రాఫిక్ మెమొరీ, సౌండ్ కార్డ్ సదుపాయం తప్పనిసరి. అలాగే విండోస్ 10/8/7 వర్షన్, వెబ్ బ్రౌజర్ క్రోమ్ ఉంటే పరీక్ష రాయడానికి అనుమతిస్తారు. 

ఈ ప్రవేశ పరీక్ష 100 మార్కులకు నిర్వహిస్తారు. 70 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలుంటాయి. సెక్షన్‌ఏలో ఒక మార్కు ప్రశ్నలు 45, సెక్షన్-బీలో రెండు మార్కుల ప్రశ్నలు 20, సెక్షన్-సీలో మూడు మార్కుల ప్రశ్నలు 5 ఉంటాయి. సబ్జెక్టుల వారీగా మ్యాథ్స్(30 మార్కులు), స్టాటిస్టిక్స్(30 మార్కులు), డేటా ఇంటర్‌ప్రెటేషన్(15 మార్కులు), ఇంగ్లిష్(15 మార్కులు), లాజికల్ రీజనింగ్(10 మార్కులు) నుంచి ప్రశ్నలొస్తాయి. తప్పు సమాధానాలకు రుణాత్మక మార్కులు ఉండవు. అభ్యర్థులకు కనీసం 50 శాతం వ‌స్తే అర్హత సాధించిన‌ట్టు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు

ఏసెట్ పరీక్షను దేశంలోని 24 కేంద్రాల్లో ఒకే రోజు నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నంలో పరీక్ష కేంద్రాలున్నాయి.

రిస్క్ మేనేజ్‌మెంట్ కోసం..

బీమా, ఆర్థిక సంస్థలే కాకుండా కార్పొరేట్ కంపెనీలు సైతం రిస్క్ నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి యాక్చురీలను నియమించుకుంటున్నాయి. ఆయా సంస్థలకు ఆర్థిక సమస్యలు ఎదురైనప్పుడు వీరు పరిష్కార మార్గాలను చూపుతారు. లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, మార్ట్ గేజ్‌, పెన్షన్, ఆటో మొబైల్ ఇన్సూరెన్స్.. ఇలా అన్నింటికీ వీరి సేవలు కీలకం. రిస్క్ గురించి అధ్యయనం చేసి దాని స్థాయిని తగ్గించడమే యాక్చూరియల్ పని. మ్యాథ్స్‌లో అల్గారిథమ్స్, స్టాటిస్టిక్స్ మోడల్స్ ఉపయోగించి గణాంక విశ్లేషణ చేస్తారు. ఏదైనా ఒక బీమా కంపెనీ టర్మ్ పాలసీని తక్కువ ధరకే అందించాలనుకుంటే భవిష్యత్తులో జరిగే పరిణామాలను యాక్చూరియల్ నిపుణులు అంచనా వేసి వివరిస్తారు. ఊహకందని పరిణామాలనూ పరిగణనలోకి తీసుకుని సంస్థకు, పాలసీదారునికి అనువైన స్కీములు, పాలసీలను తయారుచేస్తారు. 

నెల వేతనం రూ.లక్షల్లో

ప్రవేశ పరీక్షలో అర్హత సాధించినవారు యాక్చూరీ ఫెలో కావడానికి వివిధ దశల్లో 13 పేపర్లు పూర్తిచేయాలి. స్టేజ్-1 కోర్ ప్రిన్సిపల్స్‌లో 7, స్టేజ్-2 కోర్ ప్రాక్టీసెస్‌లో 3 పేపర్లు అందరికీ ఉమ్మడిగా ఉంటాయి. ఈ రెండు దశలనూ పూర్తిచేసిన వారిని అసోసియేట్‌గా పరిగణిస్తారు. స్టేజ్-3 స్పెషలిస్ట్ ప్రిన్సిపల్స్‌లో 8 పేపర్లు ఉంటాయి. వీటిలో నచ్చిన రెండింటిని ఎంపిక చేసుకుని పూర్తిచేయాలి. స్టేజ్-4 స్పెషలిస్ట్ అడ్వాన్స్ డ్ లో ఏదైనా ఒక పేపర్ పూర్తిచేయాలి. నాలుగు దశలూ (13 పేపర్లు) పూర్తిచేసుకుంటే ఫెలోగా వ్యవహరిస్తారు. అయితే ఒక్క స్టేజ్-1 పాసైనా ఉద్యోగం వ‌స్తుంది. 13 పేపర్లూ పూర్తిచేసుకున్న వారికి నెల వేతనం లక్షల్లో ఉంటుంది. వీరికి ఇన్సూరెన్స్, రీ-ఇన్సూరెన్స్, ఫైనాన్స్, అకడమిక్, రెగ్యులేటరీ.. తదితర సంస్థల్లో కొలువులు లభిస్తాయి.

ఉద్యోగావకాశాలు ఎక్కడ?

యాక్చూరియల్ సైన్స్ కోర్సు చేసిన వారికి ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్‌, ఎంట‌ర్‌ప్రైజ్‌రిస్క్ మేనేజ్‌మెంట్‌, అకడమిక్స్, రెగ్యులేటరీ, రీ-ఇన్సూరెన్స్ కంపెనీలు, కన్సల్టింగ్ సంస్థలు వీరిని చేర్చుకోవడానికి ఆసక్తి చూపుతాయి. అకౌంటింగ్, ఇన్వెస్ట్‌మెంట్‌సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్, క్రెడిట్ రిస్క్ అండ్ వెల్త్ మేనేజ్‌మెంట్‌కంపెనీలు, స్టాక్ మార్కెట్లు, సోషల్ సెక్యూరిటీ స్కీమ్‌ల‌ల్లో వీరి సేవలు వినియోగించుకుంటారు. 

వెబ్‌సైట్‌: http://www.actuariesindia.org/index.aspx

Posted Date: 25-02-2021


 

ప్రవేశ పరీక్షలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌