• facebook
  • whatsapp
  • telegram

నాలుగేళ్లకే డిగ్రీ + బీఎడ్‌!

 ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు
 


 

ఇంజినీరింగ్‌ విద్యలో ప్రతిష్ఠాత్మక సంస్థలైన ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ఇంటర్మీడియట్‌ అర్హతతో ఇంటిగ్రేటెడ్‌ బీఎడ్‌ కోర్సులు చదువుకునే అవకాశం వచ్చింది. వీటితోపాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలలు ఇంటర్మీడియట్‌ తర్వాత నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఏ బీఎడ్, బీఎస్సీ బీఎడ్, బీకాం బీఎడ్‌ కోర్సు అందిస్తున్నాయి. వీటిలో ప్రవేశానికి నేషనల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (ఎన్‌సీఈటీ)లో ప్రతిభ చూపాలి. ఈ విధానంలో బీఎడ్‌ చదవడానికి ప్రాధాన్యమిచ్చేవాళ్లు ఏడాది సమయం ఆదా చేసుకోవడంతోపాటు, మేటి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. ఇటీవలే వెలువడిన ఎన్‌సీఈటీ-2024 ప్రకటన వివరాలు...


బోధన రంగంలో రాణించాలనుకున్న ఇంటర్మీడియట్‌ విద్యార్థులు ఇంటిగ్రేటెడ్‌ బీఎడ్‌ కోర్సుల్లో చేరడానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. ఈ చదువులతో నాలుగేళ్లకే డిగ్రీతోపాటు బీఎడ్‌ పూర్తిచేసుకోవచ్చు. సాధారణ పద్ధతుల్లో ముందు డిగ్రీ, అనంతరం బీఎడ్‌ పూర్తిచేయడానికి మొత్తం ఐదేళ్లు అవసరమవుతాయి. ఇంటిగ్రేటెడ్‌ చదువుల కారణంగా నాణ్యమైన ఉపాధ్యాయ విద్య అభ్యసించడానికి వీలవుతుంది. పేరున్న సంస్థల్లో ఈ కోర్సులు పూర్తిచేసుకున్నవారు బోధనలో మేటి నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చు. ఎందుకంటే.. వీరికి మొదటి ఏడాది తొలి సెమిస్టరు నుంచే బోధనపై ప్రత్యేక శిక్షణ అందిస్తారు. దీంతో ఉపాధ్యాయ ఉద్యోగానికీ వీరు సులువుగా పోటీ పడగలరు. విద్యార్థులను ఆకట్టుకునేలా చెప్పగలిగే నైపుణ్యాన్నీ పొందగలరు. ప్రసిద్ధ సంస్థల్లో ఇంటిగ్రేటెడ్‌ టీచింగ్‌ కోర్సులు చదివినవారిని.. జాతీయ స్థాయిలో పేరున్న కార్పొరేట్‌ విద్యా సంస్థలు ప్రాంగణ నియామకాల్లో ఆకర్షణీయ వేతనాలతో బోధకులుగా అవకాశం కల్పిస్తున్నాయి. గత విద్యా సంవత్సరం (2023-2024) నుంచి దేశవ్యాప్తంగా పలు సంస్థలు నాలుగేళ్ల డిగ్రీ+ బీఎడ్‌ కోర్సును ఇంటిగ్రేటెడ్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రాం(ఐటీఈపీ) పేరుతో అందిస్తున్నాయి. ఈ కోర్సుల్లో ప్రవేశానికి నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఆధ్వర్యంలో నేషనల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (ఎన్‌సీఈటీ) నిర్వహిస్తున్నారు. ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్షతో దేశవ్యాప్తంగా 64 సంస్థల్లో 6100 సీట్లు భర్తీ చేస్తారు.


పరీక్ష ఏ విధంగా? 

దీన్ని ఆన్‌లైన్‌లో ఆబ్జెక్టివ్‌ విధానంలో మల్టిపుల్‌ ఛాయిస్‌తో నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి 3 గంటలు. మొత్తం 181 ప్రశ్నలు వస్తాయి. వీటిలో 160 ప్రశ్నలకు జవాబులు గుర్తిస్తే సరిపోతుంది. సరైన సమాధానానికి 4 మార్కులు. తప్పు జవాబుకు ఒక మార్కు తగ్గిస్తారు. తెలుగు మాధ్యమంలోనూ పరీక్ష రాసుకోవచ్చు. భాషలు, సబ్జెక్టుల ప్రశ్నలన్నీ రెండేళ్ల ఇంటర్మీడియట్‌ సిలబస్‌ నుంచే వస్తాయి. అందువల్ల పాఠ్యాంశాలపై పట్టున్నవారు ఈ పరీక్షలో రాణించగలరు. తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తోన్న డైట్‌ సెట్‌ సన్నద్ధతతోనే ఈ పరీక్షను ఎదుర్కోవచ్చు. సిలబస్‌ వివరాలు ఎన్‌సీఈటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. వాటినే శ్రద్ధగా చదువుకుంటే సరిపోతుంది. ప్రశ్నలను నాలుగు సెక్షన్ల నుంచి అడుగుతారు. 

సెక్షన్‌-1: ఇందులో 38 భాషల నుంచి ఏవైనా 2 ఎంచుకోవచ్చు. వీటిలో తెలుగు, ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ మొదలైనవి ఉన్నాయి. ఒక్కో భాష నుంచి 23 చొప్పున విడిగా ప్రశ్నలు వస్తాయి. ఒక్కో భాషలో 20 ప్రశ్నలకు సమాధానం గుర్తిస్తే సరిపోతుంది. ఎంచుకున్న భాషలో కాంప్రహెన్షన్, లిటరేచర్, ఒకాబ్యులరీ అంశాల్లో అభ్యర్థిని పరీక్షిస్తారు.

సెక్షన్‌-2: ఇది ఎంచుకున్న విభాగానికి చెందినది. ఇందులో 26 సబ్జెక్టులు ఉంటాయి. ఇంటర్మీడియట్‌ నేపథ్యాన్ని అనుసరించి, వీటిలో ఏవైనా 3 ఎంచుకోవాలి. ఒక్కో సబ్జెక్టు నుంచి 28 చొప్పున ప్రశ్నలు అడుగుతారు. సబ్జెక్టుల వారీ 25 ప్రశ్నలకు సమాధానం గుర్తిస్తే సరిపోతుంది. 

సెక్షన్‌-3: ఇది అభ్యర్థులందరికీ ఉమ్మడిగా ఉంటుంది. జనరల్‌ టెస్టు. ఇందులో 28 ప్రశ్నలు వస్తాయి. వీటిలో 25కి సమాధానం ఇస్తే చాలు. కరెంట్‌ అఫైర్స్, జనరల్‌ నాలెడ్జ్, మెంటల్‌ ఎబిలిటీ, న్యూమరికల్‌ ఎబిలిటీ, క్వాంటిటేటివ్‌ రీజనింగ్, లాజికల్, అనలిటికల్‌ రీజనింగ్‌ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.

సెక్షన్‌-4: ఇది కూడా అందరు అభ్యర్థులకూ ఉమ్మడిగా నిర్వహిస్తారు. టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌లో 23 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో 20కి సమాధానం గుర్తించాలి. 


ముఖ్య వివరాలు

అర్హత: ఇంటర్మీడియట్‌ లేదా సమాన స్థాయి కోర్సు ఉత్తీర్ణత. ఎన్‌ఐఓఎస్‌ ద్వారా సీనియర్‌ సెకెండరీ పూర్తిచేసుకున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు నిబంధన లేదు. 

దరఖాస్తుకు చివరి తేదీ: మే 15

పరీక్ష తేదీ: జూన్‌ 12

పరీక్ష కేంద్రాలు: ఏపీలో.. అనంతపురం, చిత్తూరు, గూడూరు, గుంటూరు, కాకినాడ, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. తెలంగాణలో.. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్‌. 

దరఖాస్తు ఫీజు: జనరల్‌ రూ.1200, ఓబీసీ-ఎన్‌సీఎల్, ఈడబ్ల్యుఎస్‌ రూ.1000, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్‌ జండర్‌ రూ.650.

వెబ్‌సైట్‌: https://ncet.samarth.ac.in/


ఏ సంస్థల్లో? 

ఐఐటీలు: ఖరగ్‌పూర్, భువనేశ్వర్, జోధ్‌పూర్, రోపార్‌. 

కేంద్రీయ విశ్వవిద్యాలయాలు: అలీఘర్‌ ముస్లిం యూనివర్సిటీ, సెంట్రల్‌ సంస్కృత యూనివర్సిటీ, హర్యానా, కశ్మీర్, కేరళ, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇగ్నో. 

ఎన్‌ఐటీలు: వరంగల్, కాలికట్, పుదుచ్చేరి, త్రిపుర, జలంధర్‌ ఇంటిగ్రేటెడ్‌ బీఎడ్‌ కోర్సులు అందిస్తున్నాయి. ఇవే కాకుండా పలు రాష్ట్రీయ సంస్థలూ ఉన్నాయి.


తెలుగు రాష్ట్రాల నుంచి..

తెలంగాణలో.. మౌలానా అజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ, హైదరాబాద్‌.. బీఏ బీఎడ్, బీఎస్సీ బీఎడ్, బీకాం బీఎడ్‌ కోర్సులు అందిస్తోంది. ఒక్కో విభాగంలో 50 చొప్పున సీట్లు ఉన్నాయి. ఎన్‌ఐటీ, వరంగల్‌లో బీఎస్సీ బీఎడ్‌లో 50 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, లక్సెట్టిపేట (మంచిర్యాల)కు బీఏ బీఎడ్‌లో 50 సీట్లు కేటాయించారు 

ఏపీలో.. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, తిరుపతి 

బీఏ బీఎడ్‌ కోర్సు అందిస్తోంది. 50 సీట్లు ఉన్నాయి. బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ, ఎచ్చెర్లలో బీఎస్సీ బీఎడ్, బీఏ బీఎడ్‌ కోర్సులు ఉన్నాయి. ఒక్కో దాంట్లో 50 చొప్పున సీట్లు లభిస్తున్నాయి. 


నోట్‌: ఐఐటీలు, ఎన్‌ఐటీలు బీఎస్సీ బీఎడ్‌ కోర్సు అందిస్తున్నాయి. వీటిలో ఒక్కో సంస్థలో 50 చొప్పున సీట్లు ఉన్నాయి. దాదాపు అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాలూ బీఏ బీఎడ్‌ కోర్సు అందిస్తున్నాయి. కొన్ని సంస్థల్లో రెండు లేదా మూడు కోర్సులూ అందుబాటులో ఉన్నాయి. 

Some more information

‣  "From Classrooms to Boardrooms: Yasir M.'s Triumph"

Posted Date: 14-05-2024


 

ఇంటర్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌