• facebook
  • whatsapp
  • telegram

ఇంట‌ర్ త‌ర్వాత‌.. ఐఐఎం బాట‌!

మేనేజ్‌మెంట్ సంస్థ‌ల్లో ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ

ఐఐఎంలతోపాటు వివిధ సంస్థల్లో ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు మేనేజ్‌మెంట్‌ విద్యకు దేశంలో ఐఐఎంలు అగ్రగామి సంస్థలు. ఇప్పుడివి ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ బాట పట్టాయి. ముందుగా ఐఐఎం ఇండోర్‌ 2011లో ఈ విధానానికి శ్రీకారం చుట్టింది. అనంతరం ఐఐఎం రోహ్‌తక్‌ 2019 నుంచి ఈ కోర్సు అందిస్తోంది. ఇప్పుడు తాజాగా రాంచీ, బుద్ధగయ, జమ్ము ఐఐఎంలు ఈ జాబితాలో చేరాయి. ఐఐఎంలే కాకుండా దేశంలో పలు సంస్థలు చాలా ఏళ్లుగా ఇంటిగ్రేటెడ్‌ విధానంలో మేనేజ్‌మెంట్‌ కోర్సులు అందిస్తున్నాయి. ఇంటర్మీడియట్‌ అన్ని గ్రూపులవారికీ అవకాశం ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా కోర్సులో చేరొచ్చు.  ప్రవేశ ప్రకటనలు వెలువడిన నేపథ్యంలో ఆ వివరాలు చూద్దాం! 

దేశంలో ఎక్కువమంది విద్యార్థులు మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో సాధారణంగా బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తయ్యాకే చేరుతున్నారు. మేటి సంస్థలు యూజీ స్థాయిలో ఈ చదువులు అందించకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. అలాగే యూజీ స్థాయిలో మేనేజ్‌మెంట్‌ విద్య చదవడానికి బీబీఏ, బీబీఎం కోర్సులు ఉన్నప్పటికీ తక్కువ సంఖ్యలో సంస్థలే వీటిని అందిస్తున్నాయి. పీజీలో మేనేజ్‌మెంట్‌ కోర్సులు చదవడానికి డిగ్రీ అన్ని గ్రూపులవారికీ అవకాశం ఉండడంతో బీఏ, బీకాం, బీఎస్సీ, బీటెక్‌ తదితర కోర్సులు పూర్తిచేసుకున్న తర్వాతే ఎక్కువమంది ఎంబీఏలో చేరుతున్నారు. 

అయితే మిగిలిన కోర్సుల్లో ఉన్నట్టుగానే మేనేజ్‌మెంట్‌ విద్యలో ఇంటిగ్రేటెడ్‌ విధానం ఇటీవల విస్తరిస్తోంది. ఇందుకు దేశంలో పేరొందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)లు తెర లేపాయి. సోషల్‌ సైన్సెస్, మేనేజ్‌మెంట్‌ విద్యలో ప్రపంచ స్థాయి చదువులు అందించి, క్రియాశీలకమైన భావి మేనేజర్లను తయారుచేసే లక్ష్యంతో ఇంటిగ్రేటెడ్‌ కోర్సులకు కొన్ని ఐఐఎంలు శ్రీకారం చుట్టాయి. ఎంబీఏ/మేనేజ్‌మెంట్‌ కోర్సులపై ఆసక్తి ఉన్న ఇంటర్‌ విద్యార్థులు వీటిలో చేరడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. ఐఐఎంల్లో ఉన్నత విద్యను లక్ష్యంగా చేసుకున్నవారు డిగ్రీ పూర్తయ్యేవరకూ ఆగకుండా ఇంటర్మీడియట్‌ అర్హతతోనే ప్రయత్నించవచ్చు. 

కోర్సులను ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రాం ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (ఐపీఎం) పేరుతో కొన్ని ఐఐఎంలు అందిస్తున్నాయి. కొన్ని సంస్థలు బీబీఏ+ఎంబీఏ, బీఎంఎస్‌+ఎంబీఏ పేర్లతో నడుపుతున్నాయి.

ఫీజు, సీట్లు...

ఆయా సంస్థను బట్టి కొద్ది మార్పులు ఉంటాయి. కోర్సుతోపాటు, వసతి, ఇతర సౌకర్యాల నిమిత్తం అన్ని ఐఐఎంల్లోనూ మొదటి మూడేళ్లు ఏడాదికి రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. చివరి రెండేళ్ల ఫీజు మాత్రం ఆ సంస్థలో  పీజీపీ/ఎంబీఏలో చేరినవారికి నిర్ణయించిన ప్రకారం తీసుకుంటారు. రుణ సౌకర్యం ఉంది. ఐఐఎం ఇండోర్, రోహ్‌తక్‌ ఒక్కో సంస్థలో 150 చొప్పున సీట్లు ఉన్నాయి. బుద్ధగయ, జమ్మూ ఒక్కో సంస్థలో 60 మందికి చొప్పున అవకాశం లభిస్తుంది. ఐఐఎం రాంచీలో 120 మందికి ప్రవేశం కల్పిస్తారు. 

ఎంపిక ఇలా...

చేరాలనుకుంటున్న సంస్థను బట్టి ఎంపిక విధానంలో కొద్దిపాటి వ్యత్యాసాలుంటాయి. అలాగే ఎంపికలో అకడమిక్‌ సామర్థ్యాలు, కో కరిక్యులర్‌ యాక్టివిటీస్‌ గమనిస్తారు. ఏ సంస్థలో చేరాలన్నా ప్రవేశ పరీక్షలో ప్రతిభ తప్పనిసరి. పరీక్షలో ఆప్టిట్యూడ్, లాజికల్‌ రీజనింగ్, ఇంగ్లిష్, మ్యాథ్స్‌ నైపుణ్యాలు తెలుసుకునేలా ప్రశ్నలు వస్తాయి. కొన్ని సంస్థలకు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఇందులో ప్రధానంగా ఆత్మవిశ్వాసం, భావవ్యక్తీకరణ నైపుణ్యం, సాధారణ అవగాహన, ఒప్పించగలిగే నైపుణ్యాలు గమనిస్తారు. 

లాభమేంటి?

ఐఐఎంల్లో ఇంటిగ్రేటెడ్‌ కోర్సులో చేరినవారు డిగ్రీ అనంతరం ప్రవేశ పరీక్ష (క్యాట్‌) అవసరం లేకుండా చేరిన సంస్థలోనే పీజీ కొనసాగించుకోవచ్చు. మూడేళ్లు ముందు నుంచే మేటి సంస్థల్లో చదువుకోవడం వల్ల మేనేజ్‌మెంట్‌ సబ్జెక్టులతోపాటు వివిధ నైపుణ్యాలపై పట్టు పెంచుకోవడం సాధ్యమవుతుంది. క్యాట్‌తో పోలిస్తే ఇంటిగ్రేటెడ్‌ కోర్సులకు పోటీ తక్కువగా ఉండడం విద్యార్థులకు కలిసొస్తుంది. ఒకవేళ చేరిన సంస్థలో ఉన్నత చదువులు కొనసాగించడానికి ఆసక్తి లేకపోతే మూడేళ్ల అనంతరం బ్యాచిలర్‌ డిగ్రీ (బీబీఏ/బీబీఎం/బీఎంఎస్‌)తో వైదొలగవచ్చు. వీరు క్యాట్‌ రాసి మెరుగైన సంస్థలో సీటు కోసం ప్రయత్నించవచ్చు. లేదా నచ్చిన కోర్సులు ఇతర సంస్థల్లో చదువుకోవచ్చు. 

ఐఐఎం ఇండోర్‌

ఇక్కడ 150 సీట్లు ఉన్నాయి. పరీక్షలో బహుళ ఐచ్ఛిక, లఘు సమాధాన (మల్టిపుల్‌ చాయిస్, షార్ట్‌ ఆన్సర్‌) ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. ప్రతి తప్పు జవాబుకూ ఒక మార్కు చొప్పున తగ్గిస్తారు. లఘు సమాధాన ప్రశ్నలకు రుణాత్మక మార్కులు లేవు. పరీక్షలో వంద ప్రశ్నలు వస్తాయి. ఇందులో క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ మల్టిపుల్‌ చాయిస్‌ విభాగంలో 40 ప్రశ్నలను 40 నిమిషాల్లో పూర్తిచేయాలి. క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ షార్ట్‌ ఆన్సర్‌ ప్రశ్నలు 20 వస్తాయి. వీటికి 40 నిమిషాల వ్యవధి ఉంటుంది. వెర్బల్‌ ఎబిలిటీ మల్టిపుల్‌ చాయిస్‌ 40 ప్రశ్నలకు 40 నిమిషాల వ్యవధి ఉంటుంది. మొత్తం వంద ప్రశ్నలను 2 గంటల్లో పూర్తిచేయాలి. పాత ప్రశ్నపత్రాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. పరీక్షలో అర్హత సాధించినవారికి ఇంటర్వ్యూ ఉంటుంది. సీట్ల కేటాయింపులో ఆప్టిట్యూడ్‌ విభాగానికి 65, పర్సనల్‌ ఇంటర్వ్యూ 35 శాతం వెయిటేజీ ఉంటుంది.  

అర్హత: 2019, 2020లో ఇంటర్‌ ఉత్తీర్ణులు, ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం కోర్సులు పూర్తిచేసుకుంటున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతి, ఇంటర్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించడం తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 55 శాతం మార్కులు ఉంటే చాలు. 

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: మే 31 

దరఖాస్తు ఫీజు: రూ.4130. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.2065. 

పరీక్ష తేదీ: తర్వాత ప్రకటిస్తారు. 

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం. 

వెబ్‌సైట్‌: www.iimidr.ac.in

ఏం నేర్చుకుంటారంటే...

ఐఐఎం ఇండోర్‌నే తీసుకుంటే ఇక్కడి అయిదేళ్ల కోర్సులో రెండు భాగాలుంటాయి. మొదటి మూడేళ్లు ఫౌండేషన్, తర్వాత రెండేళ్లు మేనేజ్‌మెంట్‌ విద్యపై ఫోకస్‌ ఉంటుంది. తొలి భాగంలో భాష, భావవ్యక్తీకరణ నైపుణ్యాలు; మేనేజ్‌మెంట్‌ విద్య ప్రాథమికాంశాలు, నైతిక విలువలు అర్థం చేసుకునే నైపుణ్యం, శారీరకంగా ఆరోగ్యంగా ఉండేలా చేయడంపై దృష్టి సారిస్తారు. చివరి రెండేళ్లు లక్ష్యం దిశగా బోధన ఉంటుంది. ఈ రెండేళ్లూ క్యాట్‌ ద్వారా పోస్టు గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రాం (పీజీపీ)లో చేరిన వారి కరిక్యులమే ఐపీఎంలో చేరినవారికీ ఉంటుంది. 

అన్ని సంస్థల్లోనూ అయిదేళ్ల కోర్సులో ఏడాదికి 3 చొప్పున 15 టర్మ్‌లు ఉంటాయి. ఒక్కో టర్మ్‌ వ్యవధి 3 నెలలు. మొదటి మూడేళ్లు మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, సైకాలజీ, సోషియాలజీ, పొలిటికల్‌ సైన్స్, హ్యుమానిటీస్, లిటరేచర్, ఫైన్‌ ఆర్ట్స్‌ సబ్జెక్టుల్లో మేనేజ్‌మెంట్‌ అంశాలను బోధిస్తారు. రెండేళ్ల కోర్సు అనంతరం సోషల్‌ ఇంటర్న్‌షిప్, నాలుగేళ్ల తర్వాత బిజినెస్‌ ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేయాల్సి ఉంటుంది. 

ఇండోర్‌లో అయిదేళ్ల కోర్సు పూర్తిచేసుకున్నవారికి బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ (ఫౌండేషన్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌), మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎంబీఏ) డ్యూయల్‌ డిగ్రీలను ప్రదానం చేస్తారు. దాదాపు అన్ని ఐఐఎంల్లోనూ ఇదే విధానం ఉంటుంది. 

జిప్‌మ్యాట్‌ 

జాయింట్‌ ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రాం ఇన్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ టెస్టు (జిప్‌మ్యాట్‌) పేరుతో ఐఐఎం బుద్ధగయ, జమ్ముల్లో ప్రవేశం లభిస్తుంది. ఈ రెండు సంస్థలు తొలిసారిగా ఈ ఏడాది నుంచే ఐపీఎం కోర్సు అందిస్తున్నాయి. కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష, అకడమిక్‌ మార్కులతో సీట్లు కేటాయిస్తారు. పరీక్షను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నిర్వహిస్తుంది. పరీక్షలో వంద ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌లో 33, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌లో అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌లో 33, వెర్బల్‌ ఎబిలిటీ అండ్‌ రీడింగ్‌ కాంప్రహెన్షన్‌లో 34 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. 

ఐఐఎం బుద్ధగయ, జమ్ము రెండు సంస్థలూ ఇంటర్వ్యూ అవసరం లేకుండా కోర్సులోకి తీసుకుంటాయి. ఈ సంస్థల్లో ప్రవేశానికి జిప్‌మ్యాట్‌ స్కోర్‌కు 60 శాతం, పదో తరగతి మార్కులకు 15, ఇంటర్మీడియట్‌ మార్కులకు 15, జండర్‌ డైవర్సిటీ (మహిళలకు) 10 శాతం వెయిటేజీ ఉంటుంది. ఇక్కడ మొదటి ఏడాది కోర్సు విజయవంతంగా పూర్తిచేసుకుంటే సర్టిఫికెట్‌ ఇన్‌ బేసిక్స్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్, రెండేళ్ల చదువులకు అడ్వాన్స్‌డ్‌ సర్టిఫికెట్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్, మూడేళ్లు విజయవంతంగా పూర్తిచేసుకుంటే బీబీఏ ప్రదానం చేస్తారు. అయిదేళ్లు చదివినవారికి ఎంబీఏ డిగ్రీ అందిస్తారు. 

అర్హత: 60 శాతం మార్కులతో ఇంటర్, పదో తరగతి ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీలైతే 55 శాతం మార్కులు. 2019, 2020లో ఇంటర్‌ పూర్తిచేసుకున్నవారు, 2021లో పరీక్షలు రాస్తున్నవారు అర్హులు. 

దరఖాస్తుకు చివరి తేదీ: మే 31 దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జండర్లకు రూ.వెయ్యి. మిగిలిన అందరికీ రూ.2000 పరీక్ష తేదీ: జూన్‌ 20 

పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, కర్నూల్‌

వెబ్‌సైట్‌: http://jipmat.nta.ac.in

ఐఐఎం రాంచీ

ఈ సంస్థ ఈ విద్యా సంవత్సరం నుంచే ఐపీఎం కోర్సులను ప్రారంభించింది. ఇక్కడ చదవడానికి ఐఐఎం ఇండోర్‌ నిర్వహించే ఐపీఎం లేదా ఎస్‌ఏటీ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఆ పరీక్షల్లో చూపిన ప్రతిభ, అకడమిక్‌ మెరిట్,   ఇంటర్వ్యూలతో సీట్లు కేటాయిస్తారు. ఆసక్తి ఉన్నవారు జూన్‌ 30లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఫీజు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.వెయ్యి. మిగిలిన అందరికీ రూ.2000. 

వెబ్‌సైట్‌: https://iimranchi.ac.in

ఐఐఎం రోహ్‌తక్‌

ఈ సంస్థ కోర్సు పూర్తిచేసుకున్నవారికి ఎంబీఏతోపాటు బీబీఏ డిగ్రీ ప్రదానం చేస్తుంది. ప్రవేశ పరీక్షలో క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ, లాజికల్‌ రీజనింగ్, వెర్బల్‌ ఎబిలిటీ ఒక్కో విభాగం నుంచి 40 చొప్పున ప్రశ్నలు వస్తాయి. ప్రతి విభాగాన్నీ 40 నిమిషాల్లో పూర్తిచేయాలి. మొత్తం పరీక్ష వ్యవధి రెండు గంటలు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలోనే అడుగుతారు. సరైన సమాధానానికి 4 మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు జవాబుకు ఒక మార్కు చొప్పున తగ్గిస్తారు. అర్హులకు ఇంటర్వ్యూలో భాగంగా అకడమిక్స్, జనరల్‌ అవేర్‌నెస్, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పరిశీలిస్తారు. తుది నియామకాల్లో ఆప్టిట్యూడ్‌ టెస్టు స్కోర్‌కు 45 శాతం, పర్సనల్‌ ఇంటర్వ్యూ 15 శాతం, అకడమిక్స్‌ అంటే పదోతరగతి, ఇంటర్‌లో చూపిన ప్రతిభకు 40 శాతం వెయిటేజీ ఉంటాయి. దరఖాస్తు గడువు తేదీ ముగిసింది

ఇతర సంస్థలు: నార్సీ మోంజీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్, జిందాల్‌ గ్లోబల్‌ బిజినెస్‌ స్కూల్, దేవీ అహల్య విశ్వవిద్యాలయ, ఎన్‌ఐఐటీ యూనివర్సిటీ...  తదితర సంస్థలు ఇంటిగ్రేటెడ్‌ విధానంలో ఎంబీఏ కోర్సు అందిస్తున్నాయి
 

Posted Date: 04-09-2021


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌