• facebook
  • whatsapp
  • telegram

నేపథ్యం ఏదైనా... సైబర్ సెక్యూరిటీలో సై!

నిపుణులకు పెరుగుతున్న డిమాండ్

ప్రస్తుత కరోనా కాలంలో డిజిటల్ సేవల డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరగాలన్నా ఇంటర్నెట్పైనే ఆధారపడుతున్నారు. డిజిటల్ రంగానికి సంబంధించి మౌలిక వసతుల అవసరం, వినియోగం కూడా పెరిగింది. దీంతో డిజిటల్ సేవల కోసం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) తప్పనిసరి అయింది. ఇంటర్నెట్ను ఎలక్ట్రానిక్సాధనాలను అనుసంధానించడమే దీని పని కాగా సేవలను వేగవంతం చేయడానికి, అత్యుత్తమ వినియోగదారుల సేవలను అందించేందుకు ఇది తోడ్పడుతుంది. అయితే సైబర్ దాడులు సైతం ఇదే తరహాలో జరుగుతున్న సందర్భాలూ తరచూ చూస్తున్నాం.

ఈ నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీ నిపుణుల అవసరం భారీగా ఏర్పడుతోంది. సంస్థల రహస్య సమాచారాన్ని దొంగిలించడానికి ఎప్పుడూ సైబర్ దాడులు జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి చర్యల వల్లసైబర్ నిపుణుల అవసరం పెరిగింది. ప్రస్తుతం అత్యధిక మందికి ఉపాధి కల్పించే రంగంగా ఇది మారింది.  ఇందులో ఉపాధి కావాలనుకునేవారు ముందుగా బేసిక్ స్కిల్స్ తో మొదలు పెట్టి తర్వాత ఏ విభాగంలో నైపుణ్యం సాధించాలనుకుంటున్నారో చూసుకోవాలి. అలాగే మార్కెట్లో డిమాండ్ ఉన్న విభాగాన్నే ఎంచుకోవాలి. ఈ రంగంలో నైపుణ్యం సాధిస్తే మంచి కెరియర్ను సొంతం చేసుకోవచ్చు. 

అధికార వర్గాల సమాచారం ప్రకారం 2020 ఆగస్టులో భారత్ సుమారు ఏడు లక్షల సైబర్ దాడులను ఎదుర్కొంది. ఆ లెక్కల ప్రకారం సైబర్ దాడులకు అత్యంత ప్రభావిత దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. దీంతో ఇటీవలి కాలంలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు దేశవ్యాప్తంగా 204 కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాముల్లో భాగంగా సైబర్ సెక్యూరిటీ కోర్సులను అందిస్తున్నాయి. వీటిని పార్ట్టైమ్, దూరవిద్య, ఆన్లైన్ తదితర విధానాల్లో సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ ప్రోగ్రాములుగా అందిస్తున్నాయి. ఆయా కోర్సులకు ప్రాధాన్యం పెరగడంతో విద్యార్థులు వాటిల్లో చేరడానికి ఆసక్తి చూపడంతోపాటు కెరియర్ ప్రొఫెషనల్స్గా స్థిరపడుతున్నారు. 

ఆదరణ పెరిగినా..

సున్నితమైన సమాచారాన్ని కాపాడేందుకు, వ్యాపార కార్యకలాపాలను కొనసాగించేందుకు సహాయపడే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంపై ఈ నిపుణులు దృష్టి సారిస్తున్నారు. అయితే దేశంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, ఇన్స్టిట్యూట్లలో  సైబర్ సెక్యూరిటీ కోర్సులకు ఆదరణ పెరిగినప్పటికీ తగిన పరిస్థితులు ఉండటం లేదు. పెద్ద ఎత్తున సైబర్ సెక్యూరిటీ నిపుణుల అవసరం ఉన్న మన దేశంలో ప్రస్తుతానికి సుమారు పది వేల కంటే తక్కువమంది మాత్రమే అందుబాటులో ఉండటం గమనార్హం. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండో దేశమైన భారత్, రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా సాగడానికి ఇంత తక్కువ సంఖ్యలో  సైబర్ నిపుణులు సరిపోరని సర్వేలు చెబుతున్నాయి. కాబట్టి విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థలోని ఐటీ సిలబస్లో ఇందుకోసం ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. 

వీటిపై దృష్టి సారిస్తే..

మరోవైపు టెక్నాలజీలో కొత్త విధానాలు, ఆవిష్కరణల ప్రభావం నేరుగా డిజిటల్ సెక్యూరిటీపై పడుతుంది. అయితే డిజిటలైజేషన్, ఇంటర్నెట్ విధానాలఇటీవలి పురోగతి సైబర్సెక్యూరిటీ పరిష్కారాల్లో గణనీయమైన పెరుగుదలకు ఆస్కారం ఉంటోంది. ఇలాగే ముందుకు సాగితే రానున్న రోజుల్లో సైబర్ దాడులకు అవకాశం లేకుండా డిజిటల్, స్మార్ట్ వరల్డ్ ను రూపొందించవచ్చు. ముఖ్యంగా ఈ రంగంలో స్థిరపడాలనుకునే విద్యార్థులకు టెక్నాలజీలో సంబంధిత డిగ్రీ లేకపోయినా ఫర్వాలేదు.  అయితే అధునాతన సైబర్సెక్యూరిటీ కాన్సెప్ట్లు తెలిసి ఉండాలి. పని అనుభవంతోపాటు సర్టిఫికెట్లు, రెగ్యులేటరీ పాలసీల పరిజ్ఞానం ఉంటే సులభంగా రాణించవచ్చు. రోజు రోజుకీ ఎక్కువవుతున్న సైబర్ దాడులు నిపుణులకు అవకాశాలు పెంచుతున్నాయి. అందుకే ఎలాంటి నేపథ్యం ఉన్నవారైన తగిన స్కిల్స్ పెంపొందించుకుంటే వాటిని అందుకోవచ్చు. 
 

Posted Date: 10-03-2021


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌