• facebook
  • whatsapp
  • telegram

సైబ‌ర్ ర‌క్ష‌కులు

యువ‌త‌ను ఆక‌ట్టుకుంటున్న ఆధునిక కెరియ‌ర్‌

సైబ‌ర్ సెక్యూరిటీ కోర్సులు

అంతర్జాల ఆధారిత కార్యకలాపాల విస్తృతితోపాటే సంబంధిత నేరాలూ పెరుగుతున్నాయి. వీటిని అరికట్టడానికి ప్రపంచవ్యాప్తంగా నిపుణుల అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. ఉపాధి అవకాశాలు అద్భుతంగా ఉండే సైబర్‌ సెక్యూరిటీని యువతరం చక్కని కెరియర్‌గా మల్చుకోవచ్చు. దీనికి ఎలా ముందడుగు వేయాలి? ఏమేం నేర్చుకోవాలి?

కంప్యూటరీకరణ, మొబైల్‌ ఫోన్ల విస్తృతి, అంతర్జాల ఆధారిత వ్యాపారాలు, సామాజిక మాధ్యమాల వాడకం, డిజిటల్‌ వ్యవస్థలో వస్తున్న పెనుమార్పుల కారణంగా ఎన్నో పనులు సులభతరమవున్నాయి. కానీ వాటితో పాటు సమాచార అభద్రత లాంటి ముప్పు కూడా పెరుగుతోంది. అందుకే వీటి నుంచి రక్షించే నిపుణుల అవసరం ఎక్కువవుతోంది.  

ఐఎస్‌సీ2 సైబర్‌ సెక్యూరిటీ స్టడీ- 2020 ప్రకారం- ప్రపంచవ్యాప్తంగా సైబర్‌ సెక్యూరిటీలో 30 లక్షలకు పైగా ఉద్యోగాలు రాబోతున్నాయి. సైబర్‌ సెక్యూరిటీ అన్న పేరు వినగానే హ్యాకింగ్‌ ముప్పు అనీ, ఎటాక్‌ అనీ ఇలా చాలా గుర్తొస్తాయి. డిజిటల్‌ వ్యవస్థలో భాగంగా ఉన్న అన్నింటినీ కలిపి సైబర్‌ అనవచ్చు. దీనిలో భాగంగా ఉన్న సమాచారం (డేటా), కంప్యూటర్‌ వ్యవస్థలు (సిస్టమ్స్‌), హార్డ్‌ వేర్, సాఫ్ట్‌ వేర్‌ (అప్లికేషన్లు), నెట్‌వర్క్స్‌ మొదలైన వాటన్నింటిని ఇతరుల చేతికి అందకుండా పటిష్టమైన భద్రతా వలయాన్ని ఏర్పరచడమే సైబర్‌ సెక్యూరిటీ లక్ష్యం. 

చాలామంది ‘విలువైన సమాచారమేమీ నా దగ్గర లేదు, నన్నెవరు టార్గెట్‌ చేస్తారు? నా డివైజెస్‌ని ఎవరు హ్యాక్‌ చేస్తారు? అసలు నేను ఇంటర్నెట్‌కే కనెక్ట్‌ అవ్వను. నన్నెవరు హ్యాక్‌ చెయ్యగలరు?’ అనుకుంటారు. ఇవన్నీ అపోహలే! 

ఉదాహరణకు  ‘మీరు లాటరీలో లక్కీ విన్నర్, కోటి రూపాయలు గెలుచుకున్నారు, ఒక్క పది వేలు కడితే మీకు ఐదు లక్షలు గిఫ్ట్‌గా వస్తాయి’, ‘ఫ్రీ కూపన్లు గెలుచుకున్నారు’ .. ఇలా ఆశలు కల్పిస్తూ మనకు రోజూ ఏదో ఒక మెసేజ్, కాల్, ఈ-మెయిల్‌  వస్తూనే ఉంటాయి. దీన్ని ఫిషింగ్‌ అంటారు. అంటే ప్రజలకు ఒక ఆశ చూపి నమ్మేలా చేసి ఏం కావాలో అది చేయించడం. ఇలా రకరకాల టెక్నిక్స్‌ వాడి నష్టపోయేలా చేస్తుంటారు. ఇవన్నీ ఇప్పుడిప్పుడే వచ్చినవి కాదు. చాలా కాలం నుంచే ఉన్నాయి. 

హాలీ డే బోనస్‌ అనగానే... 

‘గో డాడీ’ అనే ఒక కంపెనీ డిసెంబర్‌ 2020లో తమ ఉద్యోగులు ఎంత అప్రమత్తంగా ఉన్నారో పరీక్షించడానికి క్రిస్మస్, కొత్త సంవత్సరం సందర్భంగా అందరికీ ‘హాలీడే బోనస్‌’ ఇస్తున్నట్లు ఒక ఫిషింగ్‌ ఈ-మెయిల్‌ను పంపించింది. ఈ-మెయిల్‌లోని లింక్‌ని 500 మందికి పైగా ఉద్యోగులు క్లిక్‌ చేసి తమ వివరాలన్నీ ఇచ్చేశారు. ఇలా వివిధ సంస్థలు తమ ఉద్యోగులకు సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించడానికీ, పరీక్షించడానికీ వివిధ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాయి.

సైబర్‌ నేరగాళ్లు ఫిషింగ్‌ ద్వారా కంప్యూటర్‌లోకి ప్రవేశించాక వేర్వేరు మార్గాల్లో దాడులు చేస్తారు. మీకో ఈ-మెయిల్‌ వచ్చింది. దానిలో ‘మీరు కోటి రూపాయలు గెలుచుకున్నారు, వివరాలకు కింది లింక్‌ క్లిక్‌ చేయండి’ అని ఉంటుంది. దానిపై క్లిక్‌ చేయగానే ఒక వైరస్‌ కంప్యూటర్‌లోకి ప్రవేశించి, మీ ఫైల్స్‌ అన్నింటినీ లాక్‌ చేస్తుంది. ఒకవేళ ఆ ఫైల్స్‌ను తెరవాలనిచూస్తే ఓపెన్‌ కావు. పైగా ఫైల్స్‌ లాక్‌ అయ్యాయనీ, కొంత డబ్బు కడితేనే అవి అన్‌లాక్‌ అయి ఓపెన్‌ అవుతాయనీ, వీలైనంత త్వరగా డబ్బు కట్టకపోతే ఫైల్స్‌ అన్నీ ఎరేజ్‌ అవుతాయనీ ఓ మెసేజ్‌ కంప్యూటర్‌ తెరపై ప్రత్యక్షమవుతుంది. ఆ మెసేజ్‌లో కనిపించిన మొత్తాన్ని చెల్లించాల్సి వస్తుంది. అది నేరుగా హ్యాకర్ల ఖాతాలోకి చేరుతుంది. ఈ తరహా వైరస్‌ను ‘ర్యాన్‌సమ్‌వేర్‌’ అంటారు. అంటే డేటాను తస్కరించే మాల్‌వేర్‌. 

ఇంతే కాకుండా కార్లను, డ్రోన్‌లను, అంతెందుకు- గుండె దగ్గర పెట్టుకునే పేస్‌ మేకర్‌ని కూడా హ్యాక్‌ చేసిన ఉదాహరణలు చాలానే ఉన్నాయి. దీనివల్ల మన ప్రాణానికి కూడా హాని ఉంది. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా మన పరికరాలు, అప్లికేషన్, నెట్‌ వర్క్‌లను చాలా సురక్షితంగా ఉంచడం ఎంతో అవసరం.

ఈఫిల్‌ టవర్‌నే అమ్మేసిన వ్యక్తి 

1920 సంవత్సరంలో మొదటి ప్రపంచ యుద్ధం పూర్తయ్యాక విక్టర్‌ లస్టిగ్‌ అనే అతడు స్క్రాప్‌ మెటల్‌ డీలర్లకు తానో ప్రభుత్వ అధికారినంటూ పరిచయం చేసుకున్నాడు. యుద్ధం వల్ల ప్రభుత్వం చాలా అప్పుల్లో ఉంది, డబ్బులవసరం అనీ చెప్పాడు.  ‘ప్రఖ్యాత కట్టడం ఈఫిల్‌ టవర్‌ను నేలమట్టం చేస్తున్నారు, ఆ ఇనుమును అమ్మేసి వచ్చిన డబ్బుతో దేశాన్ని కాపాడుకోవాలనుకుంటున్నారు’అని నమ్మించి ఈఫిల్‌ టవర్‌ని ఒక్కసారి కాదు, ఏకంగా రెండు సార్లు అమ్మేశాడు.

డిజిటల్‌ ప్రపంచంలో ఫిషింగ్‌ ద్వారా ఇలా చాలామందిని మభ్యపెట్టడం సాధారణం. ప్రస్తుత గణాంకాల ప్రకారం ఇప్పుడు జరుగుతున్న సైబర్‌ దాడుల్లో 90 శాతం ఫిషింగ్‌ వల్లనే జరుగుతున్నాయి. 92 శాతం మాల్‌వేర్‌ (అంటే చెడు చేయడానికి తయారుచేసే ఒక సాఫ్ట్‌వేర్‌) ఇలా ఫిషింగ్‌ ఈ-మెయిల్‌ ద్వారానే వ్యాప్తి చెందుతోంది.  

‘సైబర్‌ క్రైమ్‌ అనేది ప్రపంచంలో ఉన్న ప్రతి కంపెనీకీ అతిపెద్ద ముప్పు’ అంటారు ఐబీఎం కంపెనీ మాజీ సీఈఓ గిన్ని రొమెట్టి. దేశదేశాల్లో సుమారుగా రోజుకు 30,000 వెబ్‌సైట్లు హ్యాక్‌ అవుతున్నాయి. ఒక డేటా ఉల్లంఘనను గుర్తించి ఆపడానికి సుమారు 280 రోజులు పడుతుంది. 2018 నుంచి 2020 మధ్యలో సైబర్‌ నేరాల వల్ల నష్టపోయిన మొత్తం- 73 లక్షల కోట్ల రూపాయలు!    

భారతీయుల ముందంజ

గత 5 సంవత్సరాల నుంచి ప్రపంచవ్యాప్తంగా హ్యాకర్ల సంఖ్యలో భారత్‌ ముందుంది. అలాగే ఫేస్‌బుక్‌ బగ్‌ బౌంటీస్‌లో ఏటా 125+ దేశాలు పాల్గొనగా ఎక్కువ సంఖ్యలో పరిశోధకులతో, బౌంటీస్‌లో కూడా భారత్‌ టాప్‌ 3 దేశాల స్థానం సంపాదించింది. 2016లో మన దేశం నుంచి 205 సెక్యూరిటీ పరిశోధకులు పాల్గొని సుమారు 4 కోట్ల బౌంటీస్‌ గెలుపొందారు.  

ఇదీ మార్గం

సైబర్‌ సెక్యూరిటీని కెరియర్‌గా మలచుకోవాలంటే ఒక ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌లో నైపుణ్యం ఉండటం చాలా ముఖ్యం. డేటాబేస్, సెర్చ్‌ ఇంజిన్స్‌ అండ్‌ సర్వర్స్‌ పనిచేసే విధానం, కొన్ని ముఖ్యమైన హ్యాకింగ్‌ టూల్స్, ఒక స్క్రిప్టింగ్‌ లాంగ్వేజ్‌ ప్రధానంగా పైథాన్, లినక్స్, విండోస్‌ లాంటి వివిధ రకాల ఆపరేటింగ్‌ సిస్టంల అంతర్గత నిర్మాణం తెలుసుకోవాలి. నెట్‌వర్కింగ్‌ నైపుణ్యాలు.. అంటే ఉదాహరణకి కంప్యూటర్‌ ఎలా కనెక్ట్‌ అవుతుంది అనేది తెలిసుంటే మంచిది.

ఎన్నో అవకాశాలున్న ఈ సైబర్‌ సెక్యూరిటీలో విద్యార్థులు పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా తమ నైపుణ్యాన్ని పెంచుకోవడం చాలా అవసరం. యుడెమి, కోర్స్‌ ఎరా లాంటి వాటిలో సైబర్‌ సెక్యూరిటీ నైపుణ్యాలను నేర్చుకోవచ్చు. ఇంకా ఇతర సంస్థలెన్నో దీనిలో శిక్షణను అందిస్తున్నాయి. ఐబీ హబ్స్, నెక్స్ట్‌ వేవ్‌ వారు సీసీబీపీ ప్రోగ్రామ్స్‌ ద్వారా సైబర్‌ సెక్యూరిటీలో, ఇతర 4.0 టెక్నాలజీల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తూ వారిని పరిశ్రమకు సిద్ధం చేస్తున్నారు. వివరాలు  https://www.ccbp.in/ వెబ్‌సైట్ చూడవచ్చు.  

Posted Date: 09-03-2021


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌