• facebook
  • whatsapp
  • telegram

మేటి కళాశాలల్లో ఫార్మసీ పీజీ!

జీప్యాట్‌-2021 ప్రకటన విడుదల

బీ ఫార్మసీ విద్యార్థులకు ఉన్నత విద్య నిమిత్తం జాతీయస్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్ష.. జీప్యాట్‌ (గ్రాడ్యుయేట్‌ ఫార్మసీ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌). దీని ప్రకటన ఇటీవల విడుదలైంది. ఇందులో మంచి ర్యాంకు పొందినవారు దేశంలోని ప్రముఖ ఫార్మసీ కళాశాలల్లో నచ్చిన స్పెషలైజేషన్‌లో ఫార్మసీ పీజీ (ఎంఫార్మసీ) చదువుకోవచ్చు. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహించే జీప్యాట్‌-2021 పూర్తి వివరాలు తెలుసుకుందామా?

దేశంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన సుమారు 850 ఫార్మసీ కళాశాలల్లో ఎంఫార్మసీలో ప్రవేశానికి జీప్యాట్‌ స్కోరు ఉపయోగపడుతుంది. దీంతో జామియా హమ్‌ దార్డ్, పంజాబ్, బాంబే ఫార్మసీ కాలేజీ, బిట్స్‌ పిలానీ లాంటి ఉత్తమ విద్యా సంస్థల్లో ఎం.ఫార్మసీ సీటు సాధించుకోవచ్చు. దేశంలో ఫార్మా విద్యారంగంలో మేటి సంస్థగా పేరొందిన నైపర్‌ల్లో ఎం.ఎస్‌. సీటు పొందాలంటే నైపర్‌ నిర్వహించే పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్ష రాయటానికి జీప్యాట్‌లో అర్హత తప్పనిసరి. నైపర్‌లో పీజీ చేసినవారికి అన్ని ఫార్మా కంపెనీలూ పెద్దపీట వేస్తుంటాయి. 

జీప్యాట్‌లో అర్హులై, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఫార్మసీ కాలేజీలో ఎం.ఫార్మసీ చదివే ప్రతి విద్యార్థికీ ప్రభుత్వం రెండేళ్లపాటు ప్రతి నెలా రూ. 12400 ఉపకార వేతనం చెల్లిస్తుంది. ఎం.ఫార్మసీ తర్వాత పి.హెచ్‌.డి.లో చేరటానికి కూడా ఈ స్కోరు ఉపయోగపడుతుంది. జీప్యాట్‌లో అర్హత సాధించినవారు పి.హెచ్‌.డి. ప్రవేశపరీక్షకూ హాజరు కానవసరం లేదు. ప్రభుత్వరంగ పరిశోధనా సంస్థలు జీప్యాట్‌ స్కోరు ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేసి ఉపకారవేతనం అందిస్తాయి. అనేక బహుళజాతి ఫార్మా సంస్థలు, ప్రముఖ దేశీయ ఫార్మా సంస్థలు ఉద్యోగాల నిమిత్తం జీప్యాట్‌ స్కోరును పరిగణనలోకి తీసుకుంటున్నాయి. 

పరీక్ష ఇలా  
జీప్యాట్‌ బహుళైచ్ఛిక (మల్టిపుల్‌చాయిస్‌) పద్ధతిలో కంప్యూటర్‌ ఆధారిత ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. మొత్తం 125 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకూ 4 మార్కుల చొప్పున గరిష్ఠంగా 500 మార్కులకు ఈ పరీక్ష జరుగుతుంది. ప్రతి సరైన సమాధానానికీ 4 మార్కులు ఇస్తారు. ప్రతి తప్పు సమాధానానికీ ఒక మార్కు చొప్పున తగ్గిస్తారు. విభాగాలవారీగా చూస్తే... ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీలో - 38, ఫార్మాస్యూటిక్స్‌లో - 38, ఫార్మకాగ్నసీలో - 10, ఫార్మకాలజీలో - 28, ఇతర సబ్జెక్టుల్లో- 11 చొప్పున ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 3 గంటలు. 

మెరుగైన స్కోరు కోసం...

బి.ఫార్మసీ పాఠ్యపుస్తకాలను శ్రద్ధగా చదవాలి. వీటిలో ఫార్మాస్యూటిక్స్, ఫార్మాస్యూటికల్‌ అనాలిసిస్, ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, బయోఫార్మాస్యూటిక్స్, ఫార్మకాగ్నసీ ముఖ్యమైనవి. వీటిపై ప్రత్యేక దృష్టి వహించాలి. 

ఫార్మాస్యూటిక్స్‌లోని ఇతర అంశాలతోపాటు ఫిజికల్‌ ఫార్మసీ, డిస్పెన్సింగ్, మైక్రోబయాలజీ, కమ్యూనిటీ ఫార్మసీ, హాస్పిటల్‌ ఫార్మసీలకు సంబంధించిన పాఠ్యాంశాలు క్షుణ్ణంగా చదవాలి. 

ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీకి సంబంధించి ఆర్గానిక్, ఇన్‌ఆర్గానిక్, మెడిసినల్, బయో, ఫిజికల్‌ కెమిస్ట్రీల్లోని ముఖ్యాంశాలపై శ్రద్ధ చూపించాలి. 

‣ ఫార్మాస్యూటికల్‌ అనాలిసిస్‌లో ముఖ్యమైన వివిధ అంశాలతోపాటు ఆధునిక అనలిటికల్‌ విధానాలు, పరికరాలపై పరిజ్ఞానం పెంచుకోవాలి. ఫార్మాకాలజీలో జనరల్‌ ఫార్మకాలజీతోపాటు, పాథో ఫిజియాలజీ, టాక్సికాలజీ, సెంట్రల్‌ నర్వస్‌ సిస్టంలపై దృష్టి కేంద్రీకరించాలి. 

ఫార్మకాగ్నసీకి సంబంధించి క్రూడ్‌ డ్రగ్స్, వాటి నాణ్యత విశ్లేషణ, పిండి పదార్థాలు, వాలటైల్‌ ఆయిల్స్, లిపిడ్స్‌లపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తే విజయానికి మార్గం సుగమం అవుతుంది. పాత ప్రశ్నపత్రాలు అధ్యయనం చేయాలి. సన్నద్ధత పూర్తయిన తర్వాత వీలైనన్ని నమూనా ప్రశ్నపత్రాలు సాధన చేయాలి. 

ఎవరు అర్హులు? 

అర్హత: బీఫార్మసీ ఉత్తీర్ణత. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. 

దరఖాస్తు ఫీజు: జనరల్‌ పురుష అభ్యర్థులకు రూ. 2000, మిగిలిన అందరికీ రూ. 1000. 

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 22.01.2021. 

పరీక్ష తేదీలు: 2021 ఫిబ్రవరి 22, 27. ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో పరీక్షలు నిర్వహిస్తారు. 

పరీక్ష కేంద్రాలు: 

ఆంధ్రప్రదేశ్‌: విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, నెల్లూరు, తిరుపతి, కర్నూలు. 

తెలంగాణ: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌. 

వెబ్‌సైట్‌: https://gpat.nta.nic.in
 

Posted Date: 29-12-2020


 

ప్రవేశ పరీక్షలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌