• facebook
  • whatsapp
  • telegram

వరుసగా ఆరోసారి!

విశ్వవిద్యాలయాల్లో ఐఐఎస్సీదే అగ్రస్థానం

 

 

సైన్స్‌ కోర్సులు, పరిశోధనల్లో దేశంలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్, బెంగళూరు ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇటీవల వెలువడిన ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకులే ఇందుకు నిదర్శనం. విశ్వవిద్యాలయాల కేటగిరీలో ఈ సంస్థ మళ్లీ ప్రథమ స్థానంలో నిలిచి తన స్థాయి, ప్రమాణాలు చెక్కుచెదరలేదని నిరూపించింది. ఈ నేపథ్యంలో ఐఐఎస్సీ అందించే వివిధ కోర్సులు, ప్రవేశ మార్గాల వివరాలు తెలుసుకుందాం...

 

విశ్వవిద్యాలయాల విభాగంలో 2016 నుంచి 2021 వరకు అంటే వరుసగా ఆరో ఏడాదీ దేశంలో మేటి విద్యాసంస్థగా ఐఐఎస్సీ నిలిచింది. అన్ని విభాగాల్లోనూ అత్యున్నత ప్రమాణాలు ఆచరించడమే ఇందుకు కారణం. ఇక్కడి కోర్సుల్లో చేరుతున్న విద్యార్థుల ప్రతిభ, ఫ్యాకల్టీ సభ్యుల నైపుణ్యాలు, ప్రయోగశాలలు, పరిశోధనలు, వసతులు, వనరులు...ఇవన్నీ ఐఐఎస్సీని అగ్రస్థానంలో నిలబెట్టాయి. బోధన, అభ్యసన వనరులు, పరిశోధనలు, ప్రవేశం పొందుతున్న విద్యార్థుల్లో వైవిధ్యం, పట్టాలు పుచ్చుకుంటున్నవారు, విద్యా నిపుణులు, పరిశ్రమ వర్గాలు వ్యక్తం చేసిన అభిప్రాయం...తదితర అంశాలను ప్రామాణికంగా చేసుకుని ఈ ర్యాంకులు కేటాయించారు.  
ఐఐఎస్సీ సంస్థలో బీఎస్‌ రిసెర్చ్, ఎంటెక్, ఎంఆర్క్, ఎం డిజైన్, మేనేజ్‌మెంట్, ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ, పీహెచ్‌డీ కోర్సులు ఉన్నాయి. 

 

బీఎస్‌ రిసెర్చ్‌: నాలుగేళ్ల వ్యవధితో బయాలజీ, కెమిస్ట్రీ, ఎర్త్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్, మెటీరియల్స్, మ్యాథమేటిక్స్, ఫిజిక్స్‌ కోర్సులను ఐఐఎస్సీ అందిస్తోంది. వీటిలో ప్రవేశానికి వివిధ మార్గాలు ఉన్నాయి. కేవీపీవై, ఐఐటీ-జేఈఈ, నీట్‌ల్లో చూపిన ప్రతిభతో కోర్సుల్లో చేరవచ్చు. నాలుగేళ్ల చదువులు పూర్తిచేసుకున్నవారికి బీఎస్‌ రిసెర్చ్‌ డిగ్రీ ప్రదానం చేస్తారు. మరో ఏడాది ఇదే సంస్థలో కొనసాగితే ఎమ్మెస్సీ పట్టా చేతికందిస్తారు. పరిశోధనల్లో పాలు పంచుకోవాలని ఆశించే ఇంటర్‌ సైన్స్, మ్యాథ్స్‌ గ్రూపుల విద్యార్థులకు బీఎస్‌ రిసెర్చ్‌ కోర్సులు ఉపయోగపడతాయి. ప్రతి నెల స్టైపెండ్‌ చెల్లిస్తారు. 

ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ: బీఎస్సీ తర్వాత నేరుగా పీజీ, పీహెచ్‌డీ రెండూ కలిపి అయిదేళ్లకే పూర్తిచేసుకునే అవకాశం ఈ సంస్థ అందించే ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీలతో లభిస్తుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీల్లో ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ పీహెచ్‌డీ కోర్సులను ఐఐఎస్సీ అందిస్తోంది. ఐఐఎస్సీ, ఐఐటీలు కలిసి నిర్వహిస్తున్న జాయింట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ ఫర్‌ మాస్టర్స్‌ (జామ్‌), జాయింట్‌ ఎంట్రన్స్‌ స్క్రీనింగ్‌ టెస్టు (జస్ట్‌)... ఎందులో మెరిసినా వీటిలో చేరిపోవచ్చు. ప్రతి నెలా స్టైపెండ్‌ చెల్లిస్తారు.

ఎంటెక్‌: బీటెక్, బీఆర్క్, బీడిజైన్‌ కోర్సులు చదివిన విద్యార్థులు ఐఐఎస్సీలో తమకు నచ్చిన బ్రాంచీలో ఎంటెక్, ఎంటెక్‌ రిసెర్చ్, ఎంఆర్క్, ఎం డిజైన్‌ చదువుకునే అవకాశం ఉంది. గేట్, జస్ట్, సీడ్‌ పరీక్షల్లో చూపిన ప్రతిభతో సంబంధిత కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. ఈ కోర్సుల్లో చేరినవారికి స్టైపెండ్‌ చెల్లిస్తారు. ఇంజినీరింగ్‌/ టెక్నాలజీల్లో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తిచేసుకున్న విద్యార్థులు ఇక్కడి మేనేజ్‌మెంట్‌ పీజీ (ఎంబీఏ) కోర్సులో చేరవచ్చు. గేట్‌/ క్యాట్‌/ జీమ్యాట్‌ స్కోర్‌తో అవకాశం లభిస్తుంది. 

పీహెచ్‌డీ: ఈ సంస్థ సైన్స్, ఇంజినీరింగ్, టెక్నాలజీ విభాగాల్లో పీహెచ్‌డీలు అందిస్తోంది. పీజీ కోర్సులు పూర్తిచేసుకున్నవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. నెట్, గేట్, ఇన్‌స్పైర్‌... వీటిలో ఎందులోనైనా మెరిస్తే ఐఐఎస్సీలో పరిశోధనలు చేసుకుంటూ ప్రతి నెలా స్టైపెండ్‌ పొందవచ్చు. పరిశోధన, అభివృద్ధి ప్రయోగశాలలు, పరిశ్రమలు, బోధన రంగాల్లో పనిచేస్తున్న నిపుణుల కోసం ఈ సంస్థ ఎక్స్‌టర్నల్‌ పీహెచ్‌డీ కోర్సులనూ అందిస్తోంది. ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభతో వీరికి అవకాశం ఉంటుంది. 

 

టాప్‌ టెన్‌ విద్యాసంస్థలు 

1. ఐఐఎస్సీ- బెంగళూరు 

2. జేఎన్‌యూ- న్యూదిల్లీ

3. బీహెచ్‌యూ- వారణాశి 

4. కలకత్తా యూనివర్సిటీ 

5. అమృతా విశ్వ విద్యాపీఠం- కోయంబత్తూర్‌

6. జామియా మిల్లియా ఇస్లామియా- న్యూదిల్లీ 

7. మణిపాల్‌ అకాడెమీ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌

8. జాదవ్‌పూర్‌ యూనివర్సిటీ- కోల్‌కతా

9. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం

10. అలీఘర్‌ ముస్లిం యూనివర్సిటీ 

 

తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు ఏ ర్యాంకులు? 

యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ 9 

ఆంధ్రా యూనివర్సిటీ 24 

ఉస్మానియా విశ్వవిద్యాలయం 32 

కేఎల్‌ యూనివర్సిటీ 35 

శ్రీ వెంకటేశ్వర 54 

గీతం యూనివర్సిటీ 67 

ఐఐఐటీ హైదరాబాద్‌ 83 

విజ్ఞాన్‌- గుంటూరు 97 స్థానాల్లో నిలిచాయి.

Posted Date: 15-09-2021


 

ప్ర‌ఖ్యాత సంస్థ‌లు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌